సాంప్రదాయాల చట్రంలో బిగించబడి
ఆంక్షలు,కట్టుబాట్లతో కట్టివేయబడి
సమాజపు పక్షపాత ధర్మపన్నాలను
రక్తంలో జీర్ణించుకున్న జీవమున్న మైనమ్ముద్ద!
తల్లిదండ్రుల మాటను శిరసావహించి…
కట్టుకున్నవాడి అడుగులలో గుడికట్టుకుని…
తాను కన్నవారి కనుసన్నల్లో
మెలగుతూ జీవించే పరాధీన!
తన చిన్ని చిన్ని ఆశలు,
కలలు,కోరికలు అణగదొక్కుకుని
కుటుంబానికై తన ఆరోగ్యాన్ని
ఆవిరి చేసుకునే కరిగే కొవ్వొత్తి!
ఇంటికి వెలుగునిచ్చే ఇల్లాలు
దేశప్రగతిలో భాగం పంచుకునే పౌరురాలు
జన్మను ఇచ్చి జాతిని నిలిపే జనని
త్యాగశీలమే తన వ్యక్తిత్వంగా
రూపుదిద్దుకున్న మంచిమనసున్న మానిని!