ప్రాచీన కాలం నందలి నీతిని ,రీతిని తెలుసుకొనవలెనన్నచో పండుగలే ఆధారములు. పండుగల వలననే మన దేశము ఆధ్యాత్మికంగా, భౌతికంగా అభివృద్ధి చెందుతున్నదనడంలో సందేహం లేదు. పండగ యొక్క ప్రయోజనం సమస్త మానవాళి ఆనందాన్ని అనుభవించటం కోసం.
మన జాతి యొక్క సంస్కృతికి ప్రతీకలు, స్ఫూర్తిదాయకాలు మన పండుగలు. పండుగ అంటే ప్రత్యేకించిన పిండి వంటలు, వంటలు చేసుకుంటాం. ప్రతి పండుగకు తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తాం. కుటుంబ సభ్యులమంతా ఒకే చోట కలుసుకొని సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకుంటాం. దానితోపాటు ప్రతి పండుగకు ఒక యదార్థ విశేషం ఉంటుంది. దాన్ని కూడా మనం తెలుసుకొని మన పిల్లలకి అంటే ముందు తరాలకి ఆ విశేషాన్ని చేర వేయాలి. అది మన బాధ్యత.
అలాంటి పండుగలలో విశేషమైనది, ప్రముఖమైనది, పవిత్రమైనది సంక్రాంతి పండుగ.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి రోజులలో సంక్రమణ పురుషుడు ప్రతీ యేడు ప్రత్యేక లక్షణాలు కలిగి వుంటాడు.
సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. ఈ పండుగను గొబ్బెమ్మ పండగ అని కూడా అంటాం.. గొబ్బెమ్మ అనగా గోవునకు తల్లి.
పౌష్యలక్ష్మి రైతుఇంటికి వస్తుంది. ఆరుగాలం కష్టపడిన రైతు పంట కోసి ఇంటికి తెచ్చుకుని గాదెలు నింపితే ఆ పంట సమస్త ప్రాణకోటి కడుపునింపి వారిని వృద్దిలోకి తీసుకువచ్చి లోకమంతా శాంతి యుతంగా ఉంచుతుంది.
శాంతి కావాలంటే అందరి కడుపునిండాలి. అలా అందరి కడుపు నింపేది అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణ పౌష్యలక్ష్మి గా రైతు ఇంటికి వస్తుంది. పంట వలన పశువుకు గ్రాసం దొరుకుతుంది. పశువులు కూడా కడుపు నింపుకొని, విశ్రాంతితో పాడిని కుండల నిండా ఇచ్చే సమయం ఇది. వర్ష ఋతువులోనూ, వేసవికాలంలోనూ పాడి తక్కువగానే ఉంటుంది. ఈ ధనుర్మాసంలో పాడి అధికంగా ఉంటుంది.
పక్షికి పరిగె గింజలు దొరుకుతాయి. రైతు విశ్రాంతి తీసుకుని పరమ సంతోషంగా ఉండే రోజులివి.
చెట్లు కూడా పూలతో ,కాయలతో నిండుగా ఉంటాయి.
ఎక్కడ చూసినా పచ్చదనమే కనబడుతుంది.
వాతావరణం కూడా చల్లగా ,హాయిగా ఉంటుంది. ఎంత శ్రమ చేసినా అలసట రాదు. వ్యవసాయపు పనులు పూర్తి అయి పంట ఇంటికి వచ్చి రైతులంతా విశ్రాంతి తీసుకునే సమయమిది. వ్యవసాయం అనేది ప్రధానంగా తీసుకున్న ఎంత చిన్న రైతు అయినా ఇంట్లో సంపద కనపడే రోజు ఈ సంక్రాంతి రోజు. ఆడపిల్లలు తప్పనిసరిగా పుట్టింటికి వెళ్లే పండుగ ఇది. దీన్ని పెద్ద పండుగ అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ సంక్రమణ సమయంలో దానాలు చేయటం వలన చాలా పెద్ద ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. ఈరోజు ముఖ్యంగా కుష్మాండ దానం చేస్తారు. కూష్మాడమంటే గుమ్మడి పండు. ఈ గుమ్మడి పండు సంపూర్ణతకి సంకేతం. గుమ్మడి పండు భూగోళానికి సంకేతం. ఈనాడు బలి చక్రవర్తి విష్ణు మూర్తి అనుమతితో భూలోకానికి వచ్చి భూమి అంతా పరిపాలించే రోజుగా చెప్తుంటారు. కేరళ ప్రాంతంలో బలి చక్రవర్తికి సంబందించిన పండుగగానే చేసుకుంటారు. బలి చక్రవర్తి కి ప్రధాన లక్షణం దానం చేయడం. ఆ దాన గుణం వల్లనే కదా శుక్రాచార్యులు వద్దంటున్నా వినకుండా వామనునికి భూదానం చేశాడు.
అసలు సంక్రాంతి అనగా చేరుట అని అర్థం. మకర సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. సంక్రాంతి ప్రతినెలా జరుగుతుంది. కానీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఈ సంక్రాంతికే ప్రాధాన్యం.. ఎందుకంటే సూర్యుడు ఇప్పటివరకు దక్షిణాభిముఖంగా ప్రయాణం చేస్తున్నవాడల్లా ఈనాటి నుండి ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తాడు. ఉత్తరం అంటే దిక్కు అనే అర్థమే కాకుండా శ్రేష్టం అనే అర్థం కూడా ఉంది. సూర్యుడి యొక్క వెలుగు ఉత్తమంగా ఉంటుంది. సూర్యకాంతి మనననుగ్రహించేటువంటి కాలం. భారతదేశంలో ఉన్న చాలా గొప్ప సంపదలలో ప్రధానమైనటువంటిది సూర్యకాంతి.ఏ దేశంలోను సూర్య కాంతి మనకు ఉన్నంతగా ఉండదు. ఈ కాంతి వలన మనకు అనేక రకాలైన మేలు జరుగుతుంది. మానసికంగా ప్రజ్ఞఉండడం, తెలివితేటలు ఉండటం, పంటలు బాగా పండడం లాంటివి. అనేక రకాలైనటువంటి అంటు వ్యాధులు లేకుండా పోవడం. వీటన్నిటికీ ఈ సూర్యకాంతి కారణం. అందుకే మనం సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. సూర్యుడి వలెనే ప్రాణకోటికిశక్తంతా వస్తుందని మనమంతా ఆధారపడింది సూర్యుడి మీదే అని అనుకుంటాం. దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించింది కదా. అలాంటి సూర్య గమనాన్ని అనుసరించి మనం కొన్ని పండగలు చేసుకుంటాం. దానిలో ప్రత్యేకమైన క్రాంతి కలిగినది సంక్రాంతి.
ప్రధానమైనది మకర సంక్రాంతి. మిగతా సంక్రాంతులలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా ఉండదు. కానీ మకరంలోకి సూర్యుడు ప్రవేశించగానే ప్రకృతిలో మార్పు వస్తుంది. ఇప్పటివరకు దక్షిణాయనంలో వానలు బాగా పడటం, వాతావరణం సరిగా లేకపోవడం, అనేక ఆరోగ్యకరమైన ఇబ్బందులు రావడం వలన కలిగే చిరాకుతో ఉన్న ప్రాణులకు ఈ ఉత్తరాయణం ప్రవేశించగానే నులివెచ్చని చలి నుండి మొదలై తర్వాత మెల్ల మెల్లగా వేడి పెరగటం తర్వాత వానలు పడటానికి అనుకూలమైన వాతావరణం కల్పించబడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరముగా పోవుటయే ఉత్తరాయణం. కానీ మనము ఉత్తరాయణం బదులుగా ఉత్తరాయణ పుణ్యకాలం అనే అంటాం.. మకర సంక్రాంతి అని కూడా అంటాం
జ్యోతిష్య ఆరోగ్య ఆధ్యాత్మిక శాస్త్రములకు సంబంధించిన ఈ సంక్రాంతిలో భోగి, సంక్రాంతి, కనుము. ఈ మూడు పండగలు .వెళ్లిన మర్నాడు ముక్కనుము అని కూడా కొన్ని ప్రాంతాలలో చేసుకుంటారు.
ఇందులో మొదటిదైన భోగి అనగా అనుభవించుట అని అర్థం. భోగినాడు భోగిమంటలకు ప్రాధాన్యం. ఈ భోగి మంటలను ఆవు పేడతో చేసిన పిడకలతో వెలిగించటంలో ఆధ్యాత్మిక భావం అగ్నిస్వరూపంలో మన ముందు ప్రత్యక్షమవుతుంది. మనం తెలిసో తెలియకో చేసిన మనలో ఉన్న పాపాలు తాపాలన్నీ అగ్నిలో వేసి వాటిని దహింపచేసి మనం పవిత్రులం కావడం కోసం. ఆ మంటలు ఆరిపోయిన తర్వాత దానిలో ఉన్న బస్మాన్ని నుదుట రాసుకుంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తుంది.
ఈ పండగను మూడు రోజులు జరుపుకుంటారు.
భోగి పండుగనాడు ఇంద్ర పొంగలిని పాలు అన్నంతో తయారు చేస్తారు.ఇది ఇంద్రుని ఆహ్వానించుటకు. అనగా రాబోవు వేసవి యొక్క తీవ్రతను తగ్గించి త్వరలో తొలకరిని ప్రసాదించమని వేడుకోవడం.
భోగినాడు చిన్న గ్రామమైనచో గ్రామమంతటికి ఒకే భోగిమంట ఉంటుంది. పెద్ద గ్రామమైనచో వాడవాడలకు ఒక భోగిమంట వేస్తారు.
ప్రతి పండగకు తిధి ఉంటుంది. ఈ పండగకు తిధి ఉండదు. పంచాంగంలో తిథిని చెప్పని పండగ అంటే ఇదే. దక్షిణాయనమంత ఉపాసనా కాలం. దక్షణాయనం ఎప్పుడు పూర్తయిపోతే అదే భోగి. అనగా భోగమనుభవించాలి. దీన్ని యథార్థంగా ఆలోచిస్తే కష్టం అనుభవించాకే సుఖం లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. తీపి తినాలంటే ముందు చేదు తినాలి. ఇది ఆరోగ్య సూత్రం. అందుకే ఉగాది నాడు చేదు తింటాం. తర్వాత కాలమంతా రైతు, పశువు కష్టించి చెమటోడ్చి పనిచేసి భోగి పండుగ నాడు పొంగల్ చేసుకొని తీపి పదార్థం తింటాం.
కన్నె పిల్లలతో గొబ్బెమ్మలు చేయిస్తారు. గొబ్బెమ్మ అర్థం గోవు. ఇది లక్ష్మీ ఉపాసన. చిన్నపిల్లలు పెద్ద పెద్ద పూజలు చేయలేరు కాబట్టి ఆవు పేడతో చిన్న చిన్న గొబ్బెమ్మలు చేయించి తల్లి ఆడపిల్లతో ఈ పూజ చేయిస్తుంది. ఎందుచేత ఆవుపేడతో గొబ్బెమ్మలు చేయాలి అంటే అన్ని ప్రాణుల మలమూత్ర విసర్జనాలు దుర్వాసనగా ఉంటాయి ఒక్క గోవు మలమూత్రాలు తప్ప. దానికి కారణం గోవు వెనక భాగం లక్ష్మీ నివాసం. అందుకే వాటిలో అంత పవిత్రత.
గృహాలంకరణ కొరకు గోమయము, గుల్ల ముగ్గు, పసుపును, సున్నమును కలుపగా వచ్చిన పారాణి లేక కుంకుమను వాడతారు. ఆవు పేడ ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైనది. క్రిమిసంహారి. వాయు దోషములను, మశూచి మొదలగు వ్యాధులను రానివ్వదు. దోమల బాధను నివారిస్తుంది. గోవు వలన లభించు ప్రతి వస్తువు ఆరోగ్యకరము, మంగళప్రదమై ఉండును.
ఎందుకు ఆడపిల్లల తోనే ఈ పూజ చేయిస్తారంటే మగ పిల్లవాడు ఒకవైపు వంశాన్ని తరింప చేస్తే ఆడపిల్ల ఇరు వంశాలను తరింప చేయాలి కనుక ఈ సమయం లక్ష్మీ అనుగ్రహం కలిగే సమయం కావున కన్నె పిల్లలకు ఆ శక్తిని అనుగ్రహించాలని భోగి పండగ కంటే ముందే కన్నె పిల్లలతో రకరకాల ముగ్గులు వేయించి, అందులో గొబ్బెమ్మలను పెట్టి వాటికి పసుపు, కుంకుమ, పువ్వులు, పిండి, బంతి పూలతో అలంకరించి పూజ చేయించి పులగం వండి నైవేద్యం పెట్టిస్తారు తల్లులు. ఇంకా కొంతమంది అటుకులు, శనగపప్పు, బెల్లం,, కొబ్బరికాయలు, అరటి పళ్ళు నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ చేసి ఆ తీపి ప్రసాదాన్ని తిని ఆడపిల్ల సమాజంలో చక్కగా వృధ్ధిలోకి రావాలని తల్లుల కోరిక .
ఎండిపోయిన గొబ్బెమ్మలను భోగిమంటల్లో వేస్తారు. దాని పరమార్థం మంచి ఆలోచనలు, ధార్మికమైన అభివృద్ధిని ఇచ్చేది అగ్నిహోత్రుడే. ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు వృద్ధిలోకి వచ్చి అందరూ సుభిక్షంగా ఉండాలని మనసారా వేడుకునే పండుగ ఇది.
ఇంటి ముందు రంగవల్లుల పండగ. వంట ఇంట్లో ఘమగఘమల పండగ. చిన్నపిల్లల గాలిపటాల పండగ. హరిదాసుల ఆటపాటల పండుగ. ఇవన్నీ కలిపితే సంక్రాంతి పండగ.
మలినాడు పెద్ద పండుగ లేక సంక్రాంతి. ఈరోజు సూర్య పొంగలిని తయారు చేసి సూర్యుని ఆహ్వానిస్తూ, ‘దక్షిణాయనము నుండి ఉత్తరాయణంనకు మారిన ఓ లోకబాంధవా ఆరోగ్యవంతంగా ప్రాణులను కాపాడమని’ ప్రార్థిస్తారు.
రెండవ రోజైన సంక్రాంతి నాడు అంతకుముందు రోజు భోగి మంటలలో మనలో ఉన్న చెడునంతా, కోరికలను వేసి బస్మం చేసి మర్నాడు వచ్చేటటువంటి సంక్రాంతి అది కూడా ఉత్తరాయన పుణ్యకాలము అంటే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజు ఆ భోగిమంటల కాంతితో లోకానికి ఒక కొత్త కాంతి కలుగుతుంది.
ఈ పెద్ద పండుగనాడు విభక్త కుటుంబం వారు అనగా ఒకే కుటుంబం నుండి వేరుగా విడిపోయిన వారు ఈరోజు ఉమ్మడిగా వండుకొని ఒకే చోట కలిసిమెలిసి భుజిస్తారు.
ఇది దేవతలకు సంబంధించింది. దక్షిణాయనం భోగితో అయిపోయింది. ఉత్తరాయణ ప్రారంభం. అందుకని దక్షిణాయనమయిపోయి పితృదేవతలందరూ తమ తమ స్థానాలకు వెళ్లిపోతూ ఉంటే చిట్టచివరిగా మనం ఆ పితృదేవతలను ఆరాధించుకునేటటువంటి కాలం ఇది. అందుకని సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఈనాడు పెద్దలకు పెట్టుకుంటారు.
భోగి రోజేమో తలంటు స్నానాలు, పిండి వంటలు భోగి మంటలు. సంక్రాంతి రోజు పితృదేవతల ఆరాధన, తర్పణాలు వదలటం, పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానాలు ఇవ్వటం చేస్తారు. ఈరోజు కూష్మాండం అంటే గుమ్మడి పండు దానం చేస్తారు.ఎందుకంటే బలి చక్రవర్తి భూమిని వామనునికి దానం చేశాడు కదా. గుమ్మడికాయ గుండ్రంగా భూమి ఆకారం గా ఉంటుందని అంటారు. నువ్వులు, బట్టలు కూడా దానాలు చేస్తారు.
చనిపోయిన వాళ్ళని పితృదేవతలంటాం. వాళ్లకి ఉత్తమలోకాలు కలగడానికి ఈ సంక్రాంతి రోజు ఈ లోకంలో ఉన్న వాళ్ల వంశీకులు వాళ్లకి చేయవలసిన పనులన్నీ అంటే తర్పణాలు విడిచి పెట్టడం, బ్రాహ్మణులకు దానాలు చేయటం మొదలైనవి చేస్తూ ఉంటారు. దీనివలన వాళ్లు తరించి వీరిని ఆశీర్వదించడంకోసం వస్తారట. ఈరోజు కూడా కొత్త బట్టలు ధరించి పెద్దలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం పొందుతూ దేవాలయాలకు కూడా వెళ్లి స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఈరోజు కూడా ముగ్గులు వేస్తారు. ధనుర్మాసంలో ముగ్గులు వేయడం మొదలై సంక్రాంతితో ముగుస్తుందిథఐచథ్సై. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఇంటి ముంగిలి లో రథం ముగ్గును వేసి ఆ ముగ్గును ఇరిగింటి పొరుగింటి ముగ్గులతో తాడులా వేస్తూ కలుపుతారు. ఈ కలపటం లో అర్థం అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకరితో ఒకరు మమేకమై ఉండాలని అర్థం. అందుకే ఈ ధనుర్మాసపు ముగ్గులలో ప్రతి ముగ్గులో మన సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
మన సంప్రదాయంలో దేవతలు, పితృదేవతలు, పరివారదేవతలు, పరిసర దేవతలు, వృక్షాలు, పశువులు అన్నింటిని పూజించుకుంటూ వీటన్నింటి యొక్క అనుగ్రహంవలన వాటి యొక్క సహకారంతో వాటితో సహజీవనం చేస్తూ చాలా మహత్తరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాం.
ఇక మూడవ రోజు కనుమ పండగ.ఈ రోజున మాట్టుపొంగలి చేసి పూజ గావించి ఒకటి గోవునకు పెట్టి ఒకటి గోవు మెడలో కట్టుదురు. కూరగాయలు దొరకని మండువేసవిలో నీవు పాలిచ్చి మము కాపాడుమని వేడుకుంటారు.
ఈ పండుగలో నువ్వులు, నెయ్యి ,గొంగళ్ళు బీదలకు దానం చేయదురు. పైవన్నీ ఉష్ణమును కలిగించును. నువ్వులు శరీరంలోని కొవ్వును తగ్గించి ఆరోగ్యమునిచ్చును.
ఈ రోజులలో మానవ చర్యలను యముడు కనిపెట్టుచుండునట. అందువలన దానధర్మములు, పరోపకారం విరివిగా చేస్తారు.
సంక్రాంతికి సంకెళ్ళలో ఉన్న వారికి కూడా విముక్తి ఉంది అని సామెత కూడా కలదు.
కనుమ పండుగ నాడు దేశ సౌభాగ్యమును, శాంతిని కలిగించే 18 జాతుల వారు తమ వృత్తి పనిముట్లను శుభ్రపరచి, వ్యవసాయమునకు తోడ్పడే పశువులను స్వచ్ఛమైన నీటితో కడిగి పసుపు కుంకుమ గంధములు రాసి పువ్వులు పత్రి తో పూజించి ధూప దీపాలిస్తారు.
కొన్నిచోట్లలో ఈ మూడు పండగల తర్వాత ముక్కనుమ పండుగ చేస్తారు. ఈ పండుగలో కోడి పందెములు, గొర్రెపోతుల పందెములు ఆడుతూ పరిసరములందుండడి అమ్మవార్లకు పోతురాజులకు మొక్కుబడులను చెల్లిస్తారు.
పల్లెలకు వెళితే ఈ నెల అంతా పండగల వాతావరణమే ఉంటుంది. కలాపి చల్లటం, ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను పెట్టటం, హరిదాసులు రావడం ఇంకా జంగం దేవరలు, కాశి కావరులు, విప్రవినోదులు ఇలా బిక్షాటన చేసేవాళ్లంతా కూడా ఈ రుతువులో వస్తూ ఉంటారు. వారికి చాటలతో ధాన్యాన్ని రైతులు సంతోషంగా దానం చేస్తారు. వీరంతా ఈ నెల రోజులు బాగా సంపాదించుకుంటారు. ఇక గంగిరెద్దుల వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఇంటి ముందు ముగ్గులో ఉన్న గొబ్బెమ్మను గంగిరెద్దు తొక్కితే శుభమని తలుస్తూ గంగిరెద్దు వాళ్ళు రావటానికి ఇంట్లో వాళ్లంతా ఎదురు చూస్తుంటారు. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, డు డు డు బసవన్న అంటూ గంగిరెద్దుల వాడు దానితో ఇంటింటికి తిరుగుతూ వారికి అన్ని రకాలైన శుభాశీస్సులు అందింపజేస్తాడు.
పంటలు బాగా పండి ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ఎంత లేని వాళ్ల నుండైనా ఈ సమయంలో ‘లేదు’ అనే మాట వినం. ప్రకృతి కూడా సహకరించే సమయం. ఎక్కడ చూసినా కాయలు, పండ్లు, కూరగాయలు ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులతో నిగనిగలాడుతుంటాయి. పంటలకు సహాయం చేసిన పశువులకు కూడా విశ్రాంతి దొరికే సమయమిది.
అందుకే సంక్రాంతి మనకు ఒక కొత్త కాంతిని, మనసుకు ఒక కొత్త శాంతిని ప్రసాదిస్తుంది.
అందుకని సంక్రాంతిని ఎక్కువ రోజులు చేసుకొనే పెద్ద పండగని, పెద్ద ఎత్తున చేసుకుంటామని, పెద్దల కోసం చేస్తామని విశేషంగా చెప్పుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రకృతి పండగ. ప్రకృతి వలన మనకు కలిగిన ప్రసాదానికి కృతజ్ఞతగా మానవుడు ప్రకృతిని ఆరాధిస్తున్న పండగ. అదే మన సంక్రాంతి పండగ.