కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న తపన ఉంటే వయసు అనేది సమస్యనే కాదు అంటారు ఇందిరారావు. మస్కాట్ లో ఒమన్ రాయల్ ఫ్లైట్ సంస్థలో ఎగ్జిక్యూటీవ్ సెక్రటరీగా పనిచేయడంతో పాటు సాహిత్య కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. పుట్టింట అలవడిన సాహిత్యాభిలాష
మెట్టినింటి గౌరవాన్ని రెట్టింపు చేసేలా మామగారి జీవితచరిత్రను “షబ్నవిస్ జీవితం – సాహిత్యం” రచించారు. మరుగున పడిన చరిత్రను పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. ఒక పరాయి దేశంలో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం, కాక్‌పీట్‌లో ప్రయాణాలు, తెలుగు కళాసమితి తరుపున దేశ ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం, ఇలా అనేక సంతోషాన్ని కలిగించే మరచిపోలేని సంఘటనలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమె సాహిత్య ప్రయాణం తరుణి పాఠకుల కోసం…
తరుణి : మీ గురించి చెప్పండి
ఇందిరా రావు : నా పేరు ఇందిరా రావు షబ్నవీస్. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లో. నాన్నగారు డి. వి. రాఘవేంద్ర రావు గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా పనిచేసారు. కొన్నాళ్ళు రవీంద్ర భారతి director గా డెప్యూటేషన్ మీద వున్నారు. అందువల్ల అనేక అద్భుతమైన ప్రోగ్రాములు చూసే అవకాశం కలిగింది. అమ్మ పద్మావతి… మంచి, మర్యాద, మన్నన అమ్మ వల్లే నేర్చుకున్నాము. B. Com రెండో సంవత్సరం చదువుతుండగా పెళ్లి జరిగింది. నా ఫైనల్ ఎగ్జామ్స్ నాడే పెళ్లి. నేను, మా వారు (షబ్నవీస్ వెంకట్ రావు గారు) చదివిన మాడపాటి హనుమంతరావు స్కూల్ లోనే మా పెళ్లి జరిగింది. ఆ స్కూల్ లో జరిగిన మొదటి/ఆఖరి పెళ్లి మాదేనేమో. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి అమెరికాలోని డల్లాస్ నగరంలో, అమ్మాయి మాకు దగ్గరగా ఉంటారు. అబ్బాయికి ఒక బాబు, పాప, అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు. సుమారు నా 57వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (Masters in Communication & Journalism) చేసాను.
అదే తెలుగు యూనివర్సిటీ లో నిఘంటు నిర్మాణం అనే డిప్లొమా కోర్స్ చేస్తున్నాను ఇప్పుడు..
తరుణి : మీరు మస్కట్ ఎయిర్ లైన్స్ లో పనిచేశారని విన్నాను. మీ ఉద్యోగ అనుభవాలు
ఇందిరా రావు : ఉద్యోగ విషయానికొస్తే ఇక్కడ ఉండగా ఆంద్రా బ్యాంకు చిక్కడపల్లి బ్రాంచ్ లో కొన్నాళ్ళు , ఒక Pvt. Co. లో కొన్నాళ్ళు చేసి మస్కట్ సుమారు 1988 లో వెళ్ళిపోయాము. అక్కడ Royal Flight Of Oman ( His Majesty Sultan Qaboos గారి personal airlines ) & Oman Air లలో సుమారుగా పది సంవత్సరాలు పని చేశాను. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని అవడం వల్ల అనేక కొత్త కొత్త సంస్థలలో పని చేయడం జరిగింది. Airlines, మెడికల్ కాలేజీ (మెడిసిటి హాస్పిటల్ & కాలేజీ) , C3i అనే కంపెనీ ద్వారా artificial intelligence, due diligence, trade mark & copy rights, patent rights, real estate, ఇలా వివిధ రంగాలలో పనిచేయడం జరిగింది. అందులో airlines experience మరిచిపోలేనిది. నేను Director for technical & flight operations కి సెక్రటరీ ని అవడం వాళ్ళ pilot roster కూడా మేమే చేసే వాళ్ళం. అందుకని వాళ్ళతో కూడా అనుబంధం ఉండేది.
Airlines లో work చెయ్యడం వల్ల ఎక్కడికి వెళ్లినా డిస్కౌంట్ అందులో 10% of the ticket pay చేస్తే చాలు మేము. కానీ అది subject to availability అంటే flight కొంచెం ఖాళీగా ఉంటేనే మాకు అవకాశం దొరుకుతుంది. కానీ pilots తో మాకు వుండే అనుబంధం వల్ల వాళ్ళు అనుమతిస్తే cockpit లో jump seat (పైలట్ వెనుక సీట్) లో కూర్చొని ప్రయాణం చేయవచ్చు. అలా చాల సార్లు ప్రయాణం చేశాను. Take-off & landings అద్భుతంగా వుంటాయి. ఒక మాములు మధ్య తరగతి లో పుట్టి ఏలాంటి technical experience లేకపోయినా ఇలాంటి అవకాశాలు రావడం భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను. మా అబ్బాయి కూడా అలాగే చాలా సార్లు ప్రయాణం చేసేడు. Pilots వాడికి అందులోని టక్నాలజీ వాడికి (ఇంజనీరింగ్ స్టూడెంట్ అప్పుడు) వివరించేవారు. చాల exciting ఉండేది వాడికి.
కంప్యూటర్స్ ఇంకా బాగా ప్రచారం / పాపులర్ కాని రోజుల్లో నేను Flight operations Manual మొత్తం computerise చేశాను. Ansett Australia team నుండి నాకు ప్రశంసా పత్రం లభించింది.
ఇలా దేశం కాని దేశం లో వేరే దేశం వాళ్ళ ప్రశంసా పత్రం పొందడం నాకు గర్వకారణం. అలాగే ఇండియా లో ఒక కంపెనీ లో పని చేసినప్పుడు నా కృషితో ఢిల్లీ లో పూర్తిగా patent rights కంపెనీ స్థాపించబడింది, అదే కంపెనీ లో అమెరికాలో జరిగిన సెమినార్ నా కృషి ఫలితం గా సక్సెస్ అవడం, వాళ్ళు board meeting లో నాకు standing ovation ఇవ్వడం నేను మరిచిపోలేని సంఘటనలు. నా professional life లో నాకు ఇవన్నీ గుర్తు చేసుకుంటే చాలా సంతోషం కలిగిస్తుంది.
మా ఉమ్మడి కుటుంబం, పుట్టినింటా మెట్టినింటా కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆనందాలని, సుఖసంతోషాలని అందరం కలిసి పంచుకుంటున్నాము.
తరుణి : మస్కట్ లో మీరు నిర్వహించిన తెలుగు సాహిత్య కార్యక్రమాలు
ఇందిరా రావు : మస్కట్‌లో చాలా మంది తెలుగువారు ఉండేవారు. అందులో మేము తెలుగు కార్యక్రమాలలో, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల అందరితోటి మంచి సత్సంబంధాలు ఉండేవి. అంతే కాకుండా మస్కట్ లో మా వారు తెలుగు కళా సమితి అధ్యక్షుడు గా కొంత కాలం చెయ్యడం వల్ల అనేకమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధం ఉండేది.. శ్రీ S P బాలసుబ్రమణ్యం గారు మా ఇంటికి రెండుసార్లు వచ్చారు..వారి చెల్లెలు శ్రీమతి SP Sailaja, బాలమురళి కృష్ణ గారు,P Suseela గారు, నాగేశ్వరావు గారు, ఇలా ఎంతో మంది ప్రముఖులని ముఖాముఖీ కలిసి మాట్లాడ్డం జరిగింది.
తరుణి : సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది, మీకు స్ఫూర్తి కలిగించిన సాహిత్య వేత్తలు?
ఇందిరా రావు : సాహిత్యాభిమానానికి బీజం పడింది నాన్నగారి వల్లే. ఇంట్లో అమ్మ నాన్న కూడా పుస్తకాలు చదివేవారు. మమ్మల్ని చదవడానికి ప్రోత్రహించేవారు.. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వుండటం వల్ల ప్రముఖులంతా తరుచు వచ్చి నాన్నగారిని కలిసేవాళ్ళు. నటరాజ రామకృష్ణ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, Dr G V. సుబ్రహ్మణ్యం గారు, నేరెళ్ల వేణుమాధవ్ గారు , పరిమళ సోమేశ్వర్ గారు ఇలా ఎందరో పేరున్న ప్రముఖులతో మా ఇల్లు ఎప్పుడు కళకళ లాడుతూ ఉండేది. వీళ్ళ రచనలన్నీ మా ఇంట్లో ఉండేవి. నటరాజ రామకృష్ణ గారి ఆంధ్ర నాట్యం, జంధ్యాల గారి కవితలు, పరిమళ సోమేశ్వర్ గారి నవలలు, ఇల్లంతా ఒక చిన్న లైబ్రరీ లాగ ఉండేది. నాన్నగారికి పౌరాణిక నాటకాలంటే చాలా ఇష్టం. పీసపాటి, ఈలపాట రఘురామయ్య లాంటి ప్రముఖు నాటకాలకి నన్ను తీసుకెళ్ళేవారు. చాలా వరకు ఆ పద్యాలు నాకు కంఠస్థం వచ్చేవి. తెలుగు సాహిత్యం మీద అభిమానానికి కారణం ఆయనే. మొదటి రచన ఇంటర్‌మీడియట్‌లో వనితా కాలేజిలో చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరంలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి కవితా సంపుటి గురించి నాలుగు పేజీల సమీక్ష కాలేజి మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. రెండవ సంవత్సరంలో ఒక చిన్న సరదా కథ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ ప్రచురించబడింది.అక్కడ చిన్న చిన్న నాటికలు రాసి మన తెలుగు వారితో వేయించేవాళ్ళం. 2000 సం॥లో ఇండియా వచ్చాక కొన్ని కథలు, వ్యాసాలు, పరిచయాలు ఆంధ్రభూమి,పత్రిక, ప్రభ, జ్యోతి, భూమిడైలిపేపర్ లాంటి పత్రికలోను ప్రచురించబడ్డాయి
నా మొదటి కథకి 150 రూపాయలు పారితోషికం అందుకున్నప్పుడు నా సంతోషం వర్ణనాతీతం. సుమారుగా 2003 సం॥ లో కీ॥ శే॥ పోతుకూచి సాంబశివరావు గారు ‘‘ఒక పేజీ’’ కథ పోటీలు నిర్వహించారు. అందులో నా కథ ‘‘భరతమాత ముద్దుబిడ్డ’’ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. అంతా తెలంగాణ మాండలీకంలో రాశాను. జడ్జీగా వచ్చిన శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు “నేను కథ రాస్తే ఎలా ఉంటుందో అలా రాశావమ్మ” అని మెచ్చుకున్నారు. అంత పెద్ద రచయిత నుండి అలాంటి కాంప్లిమెంట్లు రావడం చాలా సంతోషంగా అనిపించింది.
తరుణి : ఇప్పటి వరకు మీరు ఎన్ని కథలు రాశారు.
ఇందిరా రావు : ఇలా ఇన్ని కథలు రాశాను అని నెంబర్ చెప్పలేను. నేను రాసిన కథలు, మళ్ళీ వచ్చిన వసంతం, పాంచాలి, వసంత కోకిల అలా న్యూస్, పేపర్ లో చూసిన, చదివిన నిజ గాధలే. దాన్ని కథగా మలిచి జీవిత పోరాటం లో ఎలా గెలుపొందారు అన్నది చూపించడానికి ప్రయత్నం చేశాను. నేను రాసిన కథలు కొన్ని భూమి, పత్రిక, ప్రభ లలో ప్రచురితమయ్యాయి. అప్పట్లో “హిమబిందు” పేరుతో ఎక్కువగా కథలు రాసాను. హైదరాబాద్, మస్కట్ అటు ఇటు తిరగడం లో కథలు భద్రపరుచుకోలేకపోయాను. దాచినవి మస్కట్ నుండి వచ్చేసరికి చెదలు పట్టి పాడైపోయాయి. చాల వరకు ఏదయినా వార్త చదివినా, విన్నా అది నన్ను కదిలిస్తే దాన్ని కథ గా ఒక పరిష్కారం చూపుతూ రాయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు రాసిన కథల సంకలనం పుస్తకం గా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను.
తరుణి : మీకు బాగా నచ్చిన వారి సాహిత్యం గురించి చెప్పండి?
ఇందిరా రావు : డా॥ శ్రీదేవి గారి ‘కాలాతీత వ్యక్తులు’’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’’, శీలా వీరాజు గారి మైనా, సోమరాజు సుశీల గారి ‘‘ఇల్లేరమ్మ కథలు’’, ఇంకా ఇంద్రగంటి జానకీ బాల గారు, పొత్తూరి విజయక్ష్మి, డి.కామేశ్వరి, మంథ భానుమతి గారు ఇలా వీళ్ళందరి రచనలు చాలా బాగుంటాయి. ఇలా అవలీలగా అన్నేసి కథలు ఎలా రాస్తుంటారో అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కథ, కథనం, శైలి అన్ని ఒకదానిని మించి ఒకటి ఉంటాయి.
తరుణి : రాసిన కథలు, ప్రచురించిన పుస్తకాలు?
ఇందిరా రావు : 1. వసంత కోకిల నా పుట్టింటి పేరుతో రాశాను (దువ్వూరి ఇందిర)
“షబ్నవిస్ జీవితం – సాహిత్యం”
గత మూడు / నాలుగేళ్ళ నుండి వంశీ వారి కొత్త కథలు పుస్తక ప్రచురణ లో నా కథ కూడా చోటు చేసుకుంటోంది.. అంతే కాకుండా వారి నాగేశ్వరావు గారు, చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ వంటి సినీ ప్రముఖుల సినీ జీవిత విశేషాల పుస్తకాలలో కూడా నేను రాసింది చోటు చేసుకుంది.
కథకేళి, క్షీర సాగరం లో కొత్త కెరటాలు, భావుక వంటి కథ సంకలనాలు కూడా నా కథ లు వున్నాయి.
అలాగే ఇంతవరకు అనేక మార్లు All india Radio – Hyderabad లో నా కథలు, వ్యాసాలు చదివాను..
నమస్తే తెలంగాణా, విహాంగ వంటి daily & web పత్రిక లో నా ఇంటర్వ్యూ వచ్చింది..
జూన్ 2023 లో దూరదర్శన్ లో నా ఇంటర్వ్యూ ప్రసారమైనది.
తరుణి : “షబ్నవిస్ జీవితం – సాహిత్యం” పుస్తకం గురించి వివరిస్తారా
ఇందిరా రావు : తెలంగాణ సాధించాక అనేకమంది తేజోమూర్తుల జీవితాలు నెమ్మదిగా వెలుగులోకి రావడం మొదలైంది. నిజాం పరిపాలనలో ఉర్దూ భాషా ప్రయోగం తప్ప, అన్య భాషకు ప్రాధాన్యత లేని రోజులో పత్రికా సంపాదకీయం, ప్రచురణ ఆనాటి కష్టతర పరిస్థితులలో పూనుకోవడం చాలా గొప్ప విషయం. అచ్చు వేయడం అచ్చిరాదని అనేకమంది హెచ్చరించినా వినకుండా పట్టుదలతోను, శ్రమతోను, అనేక కష్ట నష్టాలకు ఓర్చి మా మామగారైన శ్రీ షబ్నవీస్ లక్ష్మీనరసింహారావుగారు నీలగిరి పత్రికను స్థాపించారు. పత్రిక ప్రారంభమైన రోజే వారి మొదటి భార్య శ్రీమతి జానకీబాయి మరణించారు. అంతటి దు:ఖాన్ని, బాధని దిగమింగి ప్రజలకు, నల్గొండ వాసులకు ఒక మంచి పత్రికని, సమాచారాన్ని అందివ్వడానికి ఒక రకంగా తన జీవితాన్ని పణంగా పెట్టారు. ఏ స్వతంత్ర సమరయోధునికి తీసిపోని వారు.నిజాం రాష్ట్రంలోని ఆంధ్రులను చైతన్యవంతం చేయటం కోసమే, ఆగస్ట్ 24`1922 నాడు నల్లగొండలో, శ్రీ షబ్నవీసు రామనరసింహారావుగారు “నీలగిరి” వారపత్రికను ప్రారంభించారు. ఆనాటి నిజాం పాలనాకాలంలోని నిర్భందాన్ని అధిగమించి ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి, దాని ద్వారా సంస్కారిణి గ్రంధము ద్వారా ప్రతి నెల ఒక మంచి పుస్తకాన్ని పాఠకులకు అందించి, ఆనాడు సాహితీసేవ చేసిన శ్రీ షబ్నవీసు రామనరసింహారావు గారు. మరుగుపడిన వారి చరిత్ర మళ్ళీ తెలంగాణా వారికి, మా కుటుంబంలో కూడా ఈ తరం వారికి, ముందుతరాల వారు, మర్చిపోకుండా వుండలానే ఉద్ధేశ్యంతో వీలయినంత వారి గురించిన విషయసేకరణ చేసి పుస్తకరూపంలో అచ్చువేయడం జరిగింది. మరుగుపడిన మాణిక్యం షబ్నవీస్ లక్ష్మీనరసింహారావు గారు. వారి జీవిత చరిత్రలో, సాటి పత్రికారంగపు ప్రతినిధి అయిన వద్దిరాజు సోదరులకు (వీరి పత్రికకు పోటి అయిన పత్రిక) ‘‘తెనుగు పత్రిక’’ ని నడపడానికి షబ్నవీస్ వారు సాయపడటం గురించిన విషయ వివరాలు వున్నాయి. దీన్నిబట్టి వారు ఎంత ఉన్నత మనస్కులో అర్థమవుతుంది. సాధారణంగా తమ పోటీదారులకి సహాయపడటం అరుదుగా జరిగే విషయం.
నాకు మావారు (మా అత్తగారి కుటుంబం) చాలా దగ్గర బంధువు. మా ఇంట్లో ఉండే వీరి అమ్మమ్మగారు నల్గొండ వివరాలు చెప్తుండేవారు. కాని మా మామగారైన శ్రీ వెంకటరామ నరసింహారావు గారి పత్రిక గురించిన వివరాల ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. సుమారుగా 2012లో ‘‘మిసిమి’’ అనే మాసపత్రికలో శ్రీ కుర్రా జితేందర్ బాబు గారు షబ్నవీస్ వారి గురించిన వ్యాసం చదవటం జరిగి మొదటిసారిగా వారి గురించిన అనేక విషయాలు తెలిసినాయి. కాని తర్వాత కుటుంబ బాధ్యతలో దాని గురించిన విస్తృతమైన పరిశోధన చేసే అవకాశం కలగలేదు. తరువాత 2015లో తెలుగు యూనివర్సిటీలో Post-Graduation in Communication and Journalism చేసేటప్పుడు దాదాపు అన్ని సబ్జెక్ట్సులోనూ పత్రికా రంగం / మీడియా విషయ సమాచారాలో వీరి గురించిన సమాచారం ఉంది. క్లాసులో వారి కోడలిని నేను అని లేచి నిలబడి చెప్పుకోవడం నాకొక గొప్ప అనుభూతి. 2017లో రేడియోలో మాట్లాడే అవకాశం అయినంపూడి శ్రీక్ష్మి గారి ద్వారా వచ్చినప్పుడు, షబ్నవీస్ గారి గురించి నేను మాట్లాడాను. ఒక రకంగా ఆల్ ఇండియా రేడియో వారు, శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మిగారు ఈ పుస్తకానికి నాంది పలికారు. తర్వాత అది ప్రచారం కావడం, అలాగే తెలంగాణా తేజోమూర్తులు పుస్తకంలో ప్రచురణ కావడం జరిగింది. ఆ రేడియో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నల్గొండ వాస్తవ్యులతో (వారు అదే కార్యక్రమంలో ప్రసంగించడానికి వచ్చారు పరిచయం, వారి ద్వారా అనేకమంది నల్గొండ పెద్దలతోనూ, కురువృద్ధులైన శ్రీ కూరెళ్ళ విఠలాచార్య లాంటి వారితో పరిచయం కలగటం సంభవించింది. అది ఒక క్రొత్త ప్రపంచానికి తెర తీసింది. జ్ఞానవృద్ధులు, సరస్వతీ మూర్తులనేకులతో పరిచయాలు, గ్రంథాలయ సంపద ఇవన్నీ లభించాయి. అలా కూరెళ్ళగారి సరస్వతీ కుటీరంలో అనేక తెలంగాణ ప్రముఖుల జీవిత చరిత్రలు, సంఘటనతో కూడిన పుస్తకాలు లభించినప్పుడు ఇవన్నీ సంకలనం చేసి మరుగుపడిన లక్ష్మీనరసింహారావుగారి జీవిత చరిత్రను మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావాలనే కోరికతో అనేక గ్రంథాలయాలకు, బుక్ షాపు తిరిగి, పాతతరం ప్రముఖుని కలుసుకొని, వీయినంత సమాచార సేకరణ, ఒక పుస్తకరూపం దాల్చడానికి వీలయినంత పరిశోధన చేయడం జరిగింది.
జ్యోతివలభోజుగారితో పరిచయం, ఒకసారి ఆవిడను కలవడం జరిగింది. ప్రింటింగ్ విషయమై ఆవిడకిస్తే బాగుంటుందనిపించి జ్యోతితో మాట్లాడిన వెంటనే తను ఒప్పుకోవడం, 15 రోజులలో పుస్తకం చక్కటి రూపుదిద్దుకుంది. జ్యోతి గారు అన్ని విధాల పుస్తకం ప్రింట్ అవడానికి తన సహాయ సహకారాన్ని, అవసరమయిన సహాయాన్ని అందించారు. త్యాగరాయ గానసభలో ఆగస్ట్ 10, 2017 లో శ్రీ నందిని సిద్దారెడ్డి, సాగి కమలాకర శర్మగారు, టి. గౌరీశంకర్ లాంటి ప్రముఖుతో నా షబ్నవీస్ జీవితం`సాహిత్యం ఆవిష్కరణ జరిగింది. షబ్నవీస్ లక్ష్మీనరసింహా రావు గారి నీలగిరి పత్రిక మొదటిసారిగా 1922, ఆగస్ట్ లోనే మొదవడం, వారి గురించిన నా పుస్తకం షబ్నవీస్ జీవితం`సాహిత్యం అదే ఆగస్టు నెలలో ఆవిష్కరణ జరగడం యాదృశ్చికం.
శ్రీ సంగిసెట్టి శ్రీనివాస్ గారి షబ్బనీస్ పుస్తకం నుంచి, శ్రీ కుర్రా జితేందర్ బాబు గారి నిజాం రాష్ట్రాంధ్ర ఉద్యమం లాంటి అనేక పుస్తకాల సంకలనాల నుండి, ఇతర తెలంగాణ రచయిత పుస్తకాల నుంచి విషయసేకరణ జరిగింది.
1925 వరకు నీలగిరి పత్రికను అత్యంత సమర్థతతో షబ్నవీసు రామనరసింహారావు నడిపారు. ఆనాటి ప్రముఖ నాయకులైన మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, పులిజాల రంగారావు తదితరులు వివిధ విషయాలపై ఈ పత్రికలో ఎన్నో కవితలు, వ్యాసాలు రాసేవారు. ఆ రోజులో గుడిపాటి వెంకటాచం రాసిన ఒక సంచలనాత్మకమైన కథను పత్రికలు ప్రచురించడానికి నిరాకరించాయి. అప్పుడు షబ్నవీసువారు నీలగిరి పత్రికలో ఆ కథను ప్రచురించి సంచలనం సృష్టించారు.
తరుణి : మీరు అందుకున్న బహుమతులు?
ఇందిరా రావు : వసుధ ఎన్విరో వారి సౌజన్యం తో ఉగాది 2018 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో నా కథ “అమ్మకి తోడూ “ కు ప్రత్యేక బహుమతి.
“వసంత కోకిల” American Association – New Jersey వారి దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. సినీవాలి లో “పాంచాలి”(తెలంగాణ మాండలికంలో రాశాను) మాండలిక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది. అలాగే కొన్ని వెబ్ మాగజైన్ల లో నా కథలకి బహుమతులు పొందడం జరిగింది.
తరుణి : కథలు, కవిత్వం తో పాటు మీరు రాస్తున్న మరో సాహిత్య ప్రక్రియ ?
ఇందిరా రావు : ఇంతవరకు నవల రాయలేదు.. ఈ సంవత్సరం అయినా ఆ ప్రయత్నం చేద్దామని ఉంది.. మొదలుపెట్టాను..
తరుణి : పర్యాటక రంగం లో మీ అనుభవాలు, మీరు చూసిన ప్రదేశాలు, అనుభవాలు?
ఇందిరా రావు : మస్కట్ airlines లో ఉండగా free టికెట్ అవడం వల్ల Europe లో చాలా ప్రదేశాలు చూడగలిగాము..
Amsterdam, Paris, London, Germany, Austria, Rome, Florence, Switzerland ఇలా కొన్ని చూసాము. అలాగే ఇండియా వచ్చాక Singapore, Malaysia, Thailand లాంటి ప్రదేశాలు చూసి వచ్చాము. అబ్బాయి అమెరికా లో ఇంచుమించు ఒక 20 స్టేట్స్ చూపించాడు…
తరుణి : మీ హాబీస్ ఏంటి?? తీరిక సమయంలో ఎక్కువ గా ఏం చేస్తారు?
ఇందిరా రావు : వంటలు, ఇంటి అలంకరణ, తోట పనులు.. ముఖ్యం గా రకరకాలుగా కొత్త వంటలు చెయ్యడం చాలా ఇష్టం.. అలాగే మస్కట్ నుండి ఇప్పటి వరకు అనేక వంటల పోటీ లలో పాల్గొన్నాను, బహుమతులు పొందాను.. ఇటీవల MasterChef – India (Telugu) ఆడిషన్స్ కి వెళ్ళి నాలుగు ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను…
తరుణి : నేటి తరం రచయితలకు మీరిచ్చే సూచనలు సలహాలు
ఇందిరా రావు : ప్రతీ విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కానీ నా అన్ని విజయాల్లో మా వారి సలహా, సూచనలు, ప్రోత్సాహం ఉంటుంది.. తన వంతు సహకారాన్ని నూటికి నూరు శాతం అందిస్తారు.. నేను కూడా ఇప్పుడే బుడి బుడి నడకలు వేస్తున్న రచయిత్రి ని.. అయితే కొత్త రచయితలకు ఒకటే సూచన.. వీలయినంత వరకు నిజజీవితంలో ఎదురయ్యే సంఘటనలు, చిన్నచిన్న వాక్యాలతో రాసే కథలు ఎక్కువగా పాఠకులను ఆకట్టుకుంటాయి. ఇతర భాష పదాలను తమ కథలలో పరిమితి గా ఉపయోగించడం మంచిది.