ఆధునిక భారతదేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి , వక్త. జనవరి 3, 1831 న నైగాన్ లో ప్రస్తుతం సతారా జిల్లా మహారాష్ట్రలో జన్మించారు. ఖండోజి నవ్సే పాటిల్ ,లక్ష్మీబాయి తల్లిదండ్రులు . వీరిది వెనుకబడిన తరగతికి చెందిన రైతు కుటుంబం.
ఈమె కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉంది .ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో వీరి బంధు వర్గం ఉండేవారు.
బాల్య వివాహం అనంతరం భర్త, ప్రముఖ సంఘసంస్కర్తయైన జ్యోతిరావు పూలే తొలి గురువుగా తన చదువుకు శ్రీకారం చుట్టి
అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 ,మే 1న జ్యోతిరావు ఫూలే తో కలిసి బహుజన బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించగా,అగ్రవర్ణాల వారికి విషయం నచ్చక ఆమెపై భౌతిక దాడులకు పాల్పడేవారు. పాఠశాలకువెళ్ళే దారిలో రాళ్ళతో, బురదతో దాడి చేసేవారు.బడికి చేరి బురద దుస్తులు మార్చుకొని తిరిగి అవే దుస్తులతో ఇల్లు చేరేవారట. ఎవరైనా నిలబెట్టి ప్రశ్నించినపుడు,’ నా విధిని నేను నిర్వర్తిస్తున్నానంటూ నిర్భయంగ సమాధానమిచ్చేవారట. వారి కృషి ఫలితంగా ఒక ముస్లిం సోదరుడు తన ఇంటిని పాఠశాలకు ఇచ్చివేయగా ,మోరోవిఠల్ వాల్వేకర్, దియోరావు లాంటి ప్రముఖుల సహకారంతో పాఠశాలను విజయవంతంగా నడిపారు.
సావిత్రిబాయి ఫూలే అమెరికా నల్లజాతి వివక్ష పోరాట నాయకురాలు థామస్ క్లార్క్ జీవిత చరిత్ర చదివి, స్ఫూర్తి పొంది కులమతాలకు అతీతంగా, సమాజసేవే పరమార్ధంగా జీవితం ప్రారంభించారు. ఆధునిక విద్యతోనే స్త్రీలకు సమన్యాయం జరుగుతుందని వీరి భావన.
అణగారిని బ్రతుకుల్లో ఉదయించిన ఓ ఆశా కిరణంలా, పీడిత తాడిత జనోద్ధరణ, మహిళా హక్కులు, స్త్రీ విద్య కై సమరనాదం పూరించిన ఉద్యమకారిణి, సామాజిక చైతన్యమే లక్ష్యంగా అవరోధాలను అధిగమించిన సృజనశీలి. సామాజిక అసమానతలపై తన బలమైన కలాన్ని సంధించారు. అనాధ శిశువుల పాలిట కన్నతల్లిగా ,అగ్రవర్ణాల ఆదిపత్య పోరులో శూద్రుల పక్షపాతిగా, మహిళా చైతన్యం, భ్రూణ హత్యల నిషేధం,వితంతువివాహాల్ని ప్రోత్సహించారు. భార్యను కోల్పోయిన యువకుడితో తన నెచ్చెలి కూతురితో పురోహితుడు లేకుండా చేసిన వివాహం చరిత్రలోనే ప్రధమం. భర్త వెన్నంటి ఉండి అతని ప్రతి పనిలోతోడైన సహనశీలి. వితంతువులకు శిరోమండలం చేయబోమని క్షురకులను చైతన్యపరిచిన ధీరవనిత. ‘సత్యశోధక సమాజం’ ఏర్పాటు చేసారు. దీని ముఖ్య ఉద్దేశం కులాంతర ,వితంతు వివాహాలు ప్రోత్సహించడం.
వీరికి సొంత పిల్లలు లేకున్నా ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు యశ్వంత్ రావును దత్తత చేసుకుని పెంచి పెద్ద చేసి డాక్టర్ని చేశారు. సావిత్రిబాయి ఫూలే మంచి కవయిత్రి, రచయిత్రి కూడా. 1854లో’ ‘కావ్య ఫూలే’ కవితా సంపుటి వెలువరించారు .ఇది చాలా ప్రశస్తి నొందినది. 1892లో ‘బవన్ కాశీ సుభోద్ రరత్నాకర్’ ప్రచురించారు. ‘అభంగా’ నాటి సామాజిక స్థితికి దర్పణంపట్టిన రచన. గొప్ప స్త్రీవాది, మహిళా సాధికారతకై అహరహం కృషి చేసారు. ఫూలే దంపతులు 1853, సెప్టెంబర్ 1న క్రైస్తవ మిషనరీ పత్రిక ‘జ్ఞానోదయ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పష్టం చేశారు: “శిశువుకు తొలి గురువు తల్లి మాత్రమేనని , స్త్రీవిద్య ద్వారానే శిశు వికాసం సాధ్యమనే ప్రధాన ధ్యేయంతో బాలికల పాఠశాలను ప్రారంభించామన్నారు. ఈ విషయం నచ్చని కుల పెద్దలు వ్యతిరేకించిన కారణంతో జ్యోతిరావు ఫూలే తండ్రి తమను ఇంటి నుండి పంపించారని” పేర్కొన్నారు.
ఒక్క పాఠశాలతో మొదలైన వీరి ప్రస్థానం 18 పాఠశాలలుగా విస్తరించింది. ‘బాల హత్య ప్రతిబంధక్’ గృహాన్ని ప్రారంభించి దానికి సహాయ కారులుగా ఉన్నారు .’హోం ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ శిశు హత్య’ అనే మహిళా ఆశ్రమం స్థాపించారు. బ్రాహ్మణ వితంతువుల సురక్షిత ప్రసవం, అభీష్టపు దత్తత స్వీకారం వీటి లక్ష్యాలు.
1890 లో జ్యోతిరావు ఫూలే అంత్యక్రియలో బంధువర్గం, దత్తపుత్రుల మధ్య జరిగిన ఘర్షణతో తానే చితికి నిప్పంటించి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ధీరవనిత.
1897లో నలసోపరా సరిహద్దుల్లో ‘బుబోనిక్ ప్లేగు’ ప్రబలిన కారణంగా వారు తమ సేవాకార్యక్రమంలో భాగంగా దత్త పుత్రునితో కలిసి బాధితులకు సేవ చేస్తూ అదే వ్యాధి బారినపడి మార్చి10,1897న రాత్రి 9.00 గంటల సమయంలో తనువుతాలించారు.
మహిళా సాధికారిత కై చేసిన కృషికి గాను, ఆమె గౌరవార్థం పూణే సిటీలో స్మారక చిహ్నాన్ని ,తపాలా శాఖ 1998లో పోస్టల్ స్టాంప్ వెలువరించాయి. ఆమె జన్మదినాన్ని బాలికల దినోత్సవం గా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వేడుకలు నిర్వహిస్తుంది. 2015లో పూణే విశ్వవిద్యాలయాన్ని సావిత్రిబా ఫూలే విశ్వవిద్యాలంగా పేరు మార్చింది. అణగారిన బ్రతుకులో ఉదయించిన ఆశాకిరణంలా,పీడిత జనోద్ధరణకు చేసిన కృషికి గాను జనవరి 3, 2017న శోధన ఇంజన్ గూగుల్ సావిత్రిబాయి ఫూలే 186వ జన్మదినోత్సవాన్ని గూగుల్ డూడుల్ తో గుర్తించింది.
‘ వెళ్ళండి విద్యను పొందండి’ అంటూ తన కవిత ద్వారా మహిళాచైతన్యం కలిగించి, మహిళాశిశు అభ్యున్నతే ఊపిరిగా జీవనం సాగించిన చైతన్య మూర్తిని స్మరిస్తూ అక్షర నీరాజనం సమర్పించడం ఒక బాధ్యతగా భావిస్తూ….