ఇంటికి చేరుకున్న తర్వాత ఆరోజు ఉదయం ఎవరు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల అందరికీ కడుపులో ఆకలి వేగం పెరిగింది.
నీలాంబరి వంటింట్లోకి వెళ్లి చిన్న గిన్నెలలో అందరికీ పొద్దున నైవేద్యం పెట్టిన పొంగలి ప్రసాదం పెట్టింది ఆకలి మీద ఉన్న అందరూ ఆవు రావమని ప్రసాదం తిన్నారు…
మధ్యాహ్నం భోజనం కోసం వంట ప్రయత్నం మొదలుపెట్టిన నీలాంబరికి ఒక్క క్షణం నెల క్రితం తన జీవితం గుర్తొచ్చింది… ఆకలి వేయడం అంటూ ఎప్పుడన్నా జరిగిందా అసలు అన్ని అమర్చి కళ్ళ ముందుకి రావడమే! ఆకలి విలువ ఎక్కడ తెలిసింది! ఆకలేస్తే కదా అన్నం రుచి తెలిసేది.. చిన్నగా నవ్వుకొని పంట చేయడం ప్రారంభించింది నీలాంబరి.
భోజనాల సమయంలో నీలాంబరి కూతురికి చెప్పింది” అలేఖ్య! భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలమ్మా! ఎక్కువ కారంగా ఉన్నవి మసాలా భోజనం చేయకూడదు బయట నుంచి తెప్పించుకున్నవి అసలే తినకూడదు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. దీనికి మార్గం భగవన్నామ స్మరణనే అదే దివ్య ఔషధం ఎవరికైనా కూడా! అలాగని కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని స్మరించుకోకూడదు నిరంతరం మనసులో ధ్యానం చేసుకుంటూనే ఉండాలి ఉదయం కాసేపు కూర్చొని చిన్నచిన్న యోగ ఆసనాలు వేసుకొని ధ్యానం చేసుకో ధ్యానం అంటే ఏదో తపస్సు లాంటిది కాదు కళ్ళు మూసుకుని ఇతర శబ్దాలు ఏవి వినకుండా ఏకాగ్రతగా మనసును ఇష్టదైవంపై ఉంచడం మాత్రమే… తర్వాత నువ్వు చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్లి వారి సలహాలు పాటించడం అవసరంm. గర్భవతి అనగానే పనులు చేసుకోకూడదని విశ్రాంతి అవసరం అని చాలామంది అనుకుంటారు కానీ అలా కాదమ్మా అన్ని పనులు చేసుకుంటూ మరీ ఎక్కువ భారం కాకుండా చూసుకోవాలి… ఇలా ఇవన్నీ చెప్తున్నాను కానీ నాకు ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్లాలని లేదమ్మా !దగ్గరుండి నేను చూసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ వెళ్లాలి తప్పదు” అన్నది నీలాంబరి.
” పర్వాలేదు అత్తయ్య నేను అలేఖ్యను జాగ్రత్తగా చూసుకుంటాను వీలైనంత సహాయం చేస్తాను మీరు ఏం ఇబ్బంది పడకండి నాకు చక్కని వంట చేయడం వచ్చు పోయినసారి అమ్మ వచ్చినప్పుడు నాకు చాలా వంటలు నేర్పించింది అలాగే అలేఖ్య కూడా నేర్చుకుంది అనుకోండి… మీరు బాధపడకండి” అని చెప్పాడు సుధీర్.
” అవునమ్మా సుధీర్ చాలా బాగా వంట చేస్తాడు ఎన్నోసార్లు అతని వంట తిన్నాను ..నాకు ఒంట్లో బాగా లేనప్పుడు నెలసరి వచ్చినప్పుడు అతనే చేస్తాడు” అని నవ్వుతూ చెప్పింది అలేఖ్య.
భూపతి అందరి మాటలు వింటూ భోజనం చేస్తున్నాడు..
” అవును నీలా ఇంత బాగా వంట చేస్తున్నావ్ కదా మరి మన దివాణంకు వెళ్ళినాక నువ్వే వంట చేస్తావా? మళ్ళీ వంట మనిషి భోజనమేనా? ” అన్నాడు భూపతి.
” నా వంట బాగుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేస్తాను అయితే నేను వంటలు చేయడంలో ఆరితేరాను అన్నమాట” అని నవ్వింది నీలాంబరి.