స్వప్నా, ఇదంతా నిజమేనా? నేటికి మన పెళ్ళై పది సంవత్సరాలు పూర్తయింది .మనకు ఇద్దరు రత్నాల లాంటి పిల్లలు. మన కుటుంబం ఇంత సంతోషంగా ఉంది .ముఖ్యంగా నీ పేరెంట్స్, మా పేరెంట్స్ అందరూ మనకు ఇంత సపోర్టు ఇవ్వడం, ఇదంతా తలుచుకుంటే ఇప్పటికీ నాకు కలలాగే అనిపిస్తుంది. నీకు థాంక్స్ ఎలా చెప్పగలను?”ఉద్విగ్నంగా మాట్లాడుతున్నాడు రాజీవ్.
“నిజమే రాజీవ్ ,నాకు కూడా ఒక్కోసారి ఇది కలా నిజమా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ అప్పుడు నేను పెళ్లి ప్రపోజల్ పెట్టినప్పుడు నువ్వు ఎంత వ్యతిరేకించావో గుర్తుందా? అతి కష్టం మీద నిన్ను ఒప్పించి, ఆ తర్వాత నా పేరెంట్స్ ని ఒప్పించ లేక ,వాళ్ళని వదిలేసి నీకోసం వచ్చేసిన ఆ తరుణం నాకు ఇంకా జ్ఞాపకమే,” అంటూనే గతంలోకి జారుకుంది స్వప్న.
“అమ్మా, నేను రాజీవ్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను,” ఒక సాయంకాలం డిన్నర్ టేబుల్ దగ్గర కుటుంబం అంతా కూర్చుని ఉండగా చెప్పింది స్వప్న.
“ఏంటే? మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? ఆ అవిటి వాడిని పెళ్లి చేసుకోవడమేంటి?” తారాజువ్వలా పైకి లేచాడు తండ్రి.
“నాన్నా నేను రాజీవ్ శరీరాన్ని ప్రేమించలేదు, అతని మనసుని ప్రేమించాను. మనుషుల పట్ల అతనికి ఉండే ప్రేమని ప్రేమించాను,” స్థిరంగా చెప్పింది స్వప్న.
“నోర్ముయ్, జీవితం అంటే ఏమైనా సినిమా అనుకున్నావా? ఈ ఆదర్శాలు సినిమాల్లో చూసేందుకు బానే ఉంటాయి. ఆచరించడానికి పనికిరావు ,అర్థం అవుతుందా? అయినా నీ పెళ్లి గురించి ఆల్రెడీ మా ఫ్రెండ్ అరవింద్ తో మాట్లాడాను అని చెప్పాను కదా ?” కోపంగా అరిచాడు అన్న.
“మీరు ఎన్నైనా చెప్పండి, నేను రాజీనే పెళ్లి చేసుకుంటాను. మీ పర్మిషన్ అడగటంలేదు నేను. నా నిర్ణయం చెప్తున్నా,” అంతే ముందుగా సమాధానం ఇచ్చింది.
“అయితే ఇంకేం? నువ్వే నిర్ణయాలు తీసేసుకుంటే ఇక మా అవసరం ఏముంది? అతనితోనే వెళ్తావో, ఏట్లోకి వెళ్తావో నీ ఇష్టం, ఇప్పుడే మా ఇంట్లో నుంచి బయటికి నేడు,” హూంకరించాడు నాన్న.
“అది కాదు తల్లీ, అతను చూస్తే కాళ్లు చేతులు లేని టార్సో, అతనితో నీ జీవితం ఊహించుకోడానికే భయం వేస్తుంది రా. పుట్టబోయే పిల్లలు కూడా అలాగే పుడితే నువ్వు భరించగలవా? పెద్దవాళ్ళం ఎందుకు చెప్తున్నామో ఆలోచించు,” బ్రతిమాలే ధోరణిలో మాట్లాడింది తల్లి.
“అమ్మా, అతని శారీరక వైకల్యం గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారు, కానీ మళ్లీ చెప్తున్నాను నేను ఇష్టపడింది అతని హృదయాన్ని. తను స్వయంగా అలా ఉన్నప్పటికీ ఏ పనికీ ఇతరులు పై ఆధారపడని అతని ఆత్మ విశ్వాసాన్ని. ఆ ఆత్మవిశ్వాసం బాధల్లో ఉన్న ఇతరులకి కలిగించి జీవితం పట్ల ప్రేమ నింపాలనే ఆలోచనతో మోటివేషన్ స్పీకర్ గా మారి, ప్రతి చిన్న కష్టానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న నేటి యువతకి తన జీవితాన్నే ఉదాహరణగా చూపిస్తూ, బ్రతుకు పట్ల ఆశను, ప్రేమను కలుగజేస్తున్న అతడిని చూస్తే నాకు అంతులేని అనురాగం. మీరే అర్థం చేసుకోండి. దయచేసి నా నిర్ణయానికి అడ్డు రాకండి,” తల్లితో చెప్పింది స్వప్న.
అటు తన తండ్రికి, అన్నకు ఇటు తనకి సర్ది చెప్పలేక ప్రేక్షక పాత్ర వహిస్తున్న తల్లికి బై చెప్పి ఆ రాత్రి తన రాజీవ్ దగ్గరికి వచ్చేయడం, మరసటి ఉదయం గుడిలో పెళ్లి చేసుకోవటం, అన్నీ సినిమాలా కళ్ళ ముందు తిరిగాయి.
తన బలవంతం మీద పెళ్లికి ఒప్పుకున్నా, మనకు పిల్లలు వద్దు అని చాలా కాలం వాదించాడు రాజీవ్ .తనది జన్యుపరమైన లోపం కాదని, తను తల్లి గర్భంలో ఉండగా జరిగిన రాంగ్ మెడికేషన్ వల్ల ఇలా ఉన్నాడని తెలిసినా, ఏదో తెలియని భయం.
తామొకటి తెలిస్తే దైవం మరొకటి తలచినట్లుగా, ఆక్సిడెంటల్ గా తను గర్భం దాల్చిన తర్వాత, తనకు పండంటి కొడుకు పుట్టడంతో తమ జీవితం సఫలమైనట్లుగా భావించారు తామిద్దరూ .బాబుని చూసిన క్షణం, రాజీవ్ కళ్ళలో కనిపించిన వెలుగులు తను ఎప్పటికీ మర్చిపోలేదు. తమ జీవితాల్లో సంతోషాన్ని నింపిన బాబుకి “హర్ష “అని పేరు పెట్టుకున్నారు. వాడంటే అంతులేని ప్రేమ ఇద్దరికీ. మరి వాడు వచ్చాకే కదా తన తల్లిదండ్రులు కూడా మళ్లీ తమ జీవితంలోకి ప్రవేశించింది.
బాబుకు రెండేళ్లు నిండిన తర్వాత,” నీలాంటి బంగారు పాప కావాలి,”అని రాజీవ్ కోరడం, అతను కోరినట్లుగానే తమ కలల పంట “హేమ” పుట్టడం.
తను ఆరోజు ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈరోజు ఇంత అందమైన జీవితం తనకు లభించేదా? ఆలోచనలో మునిగిపోయింది స్వప్న.
“హలో !దేవి గారు ఎక్కడికో వెళ్లిపోయారు? ఈరోజు మన పెళ్లిరోజు, మరి నాకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేది ఉందా? కొంటెగా కన్నుగీటాడు రాజీవ్.
“ఛీ ,పో! సిగ్గు లేదు నీకు,”అంటూనే రాజీవ్ కౌగిలిలో ప్రేమగా ఒదిగిపోయింది స్వప్న.