ప్రముఖ కథ ,నవలా రచయిత్రి అయిన వీరు 1929 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని ఐన విజయనగరంలో జన్మించారు.
వీరి విద్యాభ్యాసం కూడా అక్కడే కొనసాగింది . తెలుగు , హిందీ ,ఆంగ్ల భాషల్లో పట్టు సాధించి అనేక కథలు, కవితలు, వ్యాసాలు ,రేడియో నాటకాలు ,13 నవలలు, 3 కథా సంపుటాలు రచించి, తన పుస్తకాల హక్కులను విశాఖపట్నంలోని ద్వారకా నగర్ పౌర గ్రంథాలయానికి వ్రాసి ఇచ్చారు. రేడియో నాటకాలు రచించి ఆకాశవాణి శ్రోతలను కూడా అలరించారు. ఆంధ్ర , వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు వీరి రచనలపై పరిశోధనలు చేసి ఎం. ఫిల్. , పిహెచ్డీలు పొందారు.
అమెరిక, కెనడా, ఇంగ్లాండ్, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించి తమ సాహిత్య వాణి వినిపించారు.
1960వ దశకంలో వీరు రచించిన ‘వారధి’ నవల ‘రెండు కుటుంబాల కథ ‘గా వెండితెరపై తళుక్కున మెరిసి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారిచే 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించబడింది .1974 సంవత్సరంలో విడుదలైన ‘వస్తాడే మా బావ ‘చిత్రానికి మాటలు వ్రాసి చలనచిత్ర రంగంలోనూ తమ సత్తా చాటుకున్నారు.
వైకుంఠపాళి, వారధి , మారిన విలువలు, గ్రహణం విడిచింది , గోమతి , ఎక్కవలసిన రైలు , హరివిల్లు , జారుడుమెట్లు, ఎంత దూరమీ పయనం, కల కానిది , కొవ్వొత్తి, పరిహారం , రేపటి వెలుగు వంటి నవలలు, భావ బంధం , విశాలాక్షి కథలు అనే కథా సంపుటులు , మలేషియా నాడు – నేడు అనే వ్యాస సంపుటి రచించారు.
వీరి ప్రతిభకుగాను వీరిని వరించిన పురస్కారాలు:
ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో వైకుంఠపాళిన నవలకు మొదటి బహుమతి – 1965
గృహలక్ష్మి స్వర్ణకంకణం – 1966
అడవి బాపిరాజు అవార్డు -1997
తెలుగు విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ పట్టా – 1998
రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు – 1999
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జ్యేష్ట సాహితీ అవార్డు
ఢిల్లీ తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారం
మానవ జీవితంలోని పలు పార్శ్వాలను, ఎగుడు దిగుళ్లను తమ రచనల్లో పొందుపరచడమే కాకుండా వాటికి అంతర్లీనంగా పరిష్కారాలను కూడా అందించి పుస్తక ప్రియుల హృదయాల్లో చక్కని రచయిత్రిగా చెరగని పీఠం వేసుకున్న వీరు తమ 85వ ఏట హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2014 నవంబర్ 7వ తేదీన విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు.