థాంక్యూ

కథ

               అనుశ్రీ

“శేఖర్ పెళ్ళిలో మన అమ్మాయిని చూశాడట సంబంధం అడుగుతున్నారు..”

సునీల మాటతో ప్రకాష్ కోపంగా చదువుతున్న పేపర్ పక్కన పెట్టేసి

“అమ్మాయి పెళ్లి ఇప్పట్లో వద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మాటిమాటికి వాళ్ళడుగుతున్నారు వీళ్ళడుగుతున్నారు అంటూ నాతో చెప్తున్నావ్ ..!? అమ్మాయి చదువుకోవడం ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా..!? ” అన్నాడు భార్యను చూస్తూ

“అదేంటండీ అలా అంటారు..!? మంచి సంబంధాలు వచ్చినప్పుడు వదులుకొని తర్వాత బాధపడతావా..!?  అంటూ అమ్మవాళ్లు అంటున్నారు. మీరేమో వచ్చిన ప్రతిదీ వద్దంటున్నారు..” అంది సునీల

“అనడానికి ఏముంది ఎన్నైనా అంటారు తర్వాత కష్టమైన నష్టమైనా బాధపడవలసిన ది మనం. ఈ మాత్రం తెలుసుకో లేకపోతే ఎలా..!? “

“శేఖర్  తెలివైన అబ్బాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. ఇంకెంటి అభ్యంతరం అంటున్నారండీ..!? ” సునీల అంది భర్తతో

సరే.. ఆతను మంచివాడు,బుద్ధిమంతుడు సంతోషం. మరి అతనికి ఏదైనా కష్టం వస్తే  మన కూతురు  చూసుకోగలదా..!? ” ప్రశ్నించాడు ప్రకాష్.

“అదేంటండి మన కూతురు చూసుకోవడం ఏమిటీ..!? ” ఆశ్చర్యంగా అడిగింది సునీల.

“ఒక్కసారి ఇలా వచ్చి నా పక్కన కూర్చో” అంటూ భార్యను చెయ్యి పట్టుకుని పక్కన కుర్చీలో కూర్చోబెట్టాడు.

“మన పాప చిన్నతనంలో నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానికి వెళ్ళలేక ఇబ్బంది పడ్డప్పుడు నువ్వు ఎంతగా బాధపడ్డావో మర్చిపోయావా..!? ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాము. నేనేమీ చేయలేకపోతున్నాను అని నువ్వు ఎన్నిసార్లు నాతో అన్నావు..!? ఇలాంటి పరిస్థితి మన పాపకు వస్తే తను ధైర్యంగా నిలబడేలా చేయాలని  ఆరోజే అనుకున్నాం గుర్తుందా..!? కానీ నువ్వు ఈ మధ్య వాళ్ళు వీళ్ళు చెప్పేది వింటూ  పెళ్లి పెళ్లి అంటూ కలవరిస్తున్నావ్.. “

అనగానే..”నిజమేనండి మర్చిపోయాను..” అంది సాలోచనగా..

“ఈసారి ఎవరైనా సంబంధం కోసం అడిగితే. అబ్బాయిని తక్కువ చేయడం కాదు. మా అమ్మాయి సామర్ధ్యం పెరగాలని ఆగుతున్నాం అనిచెప్పాలి సరేనా..” అన్నాడు ప్రకాష్

“సరేనండీ..!! ఒక్కగానొక్క కూతురు సుఖపడాలి. కట్నం ఎంతైనా మంచి సంబంధం చూడాలి అనుకున్నానే గానీ సమస్య వస్తే తగట్టుకునే  శక్తిని కూడా మనం ఇవ్వగలగాలి అనే విషయం మర్చిపోయాను”

అంది బాధగా..

“ఆడపిల్లను కన్న తల్లిదండ్రులుగా అది మన బాధ్యత సునీలా..!.. ఇక ఎప్పుడూ మర్చిపోకు.. ” అంటూ ఉండగానే అవని వచ్చింది లోపలికి స్నేహితురాలితో…

“డాడీ… మమ్మీ.. సుష్మకూ పెళ్లి సెటిల్ అయ్యింది వాళ్ళ బావతో.. ”  అంది

“అవునా..!” అన్నారు ఇద్దరూ..

“అవును ఆంటీ..! వచ్చే నెలలోనే పెళ్లి” అంది సుష్మ..

” అదేంటమ్మా వచ్చే నెలలోనే కదా నీ ఎగ్జామ్స్

ఇప్పుడు పెళ్లి అంటే చదవగలవా..!? ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి పెట్టుకుంటే అయిపోయేది కదా.. ” అన్నాడు ప్రకాష్.

“అంకుల్..!  అవని చాలా అదృష్టవంతురాలు మీలాంటి తల్లిదండ్రులున్నారు కాబట్టి తనని  నిలబెట్టాలని చూస్తున్నారు మాయింట్లో అలా కాదు..” అంది బాధగా..

“అవును పాపం సుష్మా ఎన్నోరకాల ప్రయత్నం చేసినా తప్పట్లేదు..” అంది అవని.

” పోనీలేమ్మా…ఎక్కువగా ఆలోచించకు అని ధైర్యం చెప్పారు.. ప్రకాష్ / సునీల

కాసేపటికి సుష్మా వెళ్ళిపోయింది.

“చేసుకోబోయే అబ్బాయికి తన బాధ చెప్పుకోవచ్చు కదా..?” అన్నాడు ప్రకాష్..

పక్కకూర్చున్న అవనితో

“కన్న  తల్లిదండ్రులు అర్థం చేసుకొనిది

కొత్త వ్యక్తి  ఎలా అర్థం చేసుకుంటాడు.

డాడీ..!! అసలు అతన్ని అడగవలసిన అవసరం ఎందుకు కల్పించాలి..” అంది అవని

“ఒకవేళ ఆతను ఒప్పుకుంటే పై చదువులు చదివి ఉద్యోగం కూడా చేయొచ్చు కదా.. ” అంది సునీలా.

“అమ్మా…!! వాళ్ళు మీలా ఆలోచించలేరు మూర్ఖులు. అలాంటి వాళ్లకు సలహాలు ఇవ్వడం కూడా వృధా. నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది. మమ్మీ త్వరగా కాపీ ఇవ్వు తాగేసి రూంలోకి వెళ్తాను..” అంది అవని  తండ్రి భుజంపై అలసటగా తలవాల్చుతూ..

“ఏవండీ.. మీకు చాలా థాంక్స్.. నా కూతురు దృష్టిలో నేను మూర్ఖురాలిగా

మిగిలిపోకుండా కాపాడారు..”  అనుకుంది సునీల కూతురికి కాఫీ కలుపుతూ..

Written by Anusri Gauroju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జెట్టి ఈశ్వరీబాయి

ద్వివేదుల విశాలాక్షి