జెట్టి ఈశ్వరీబాయి

జెట్టి ఈశ్వరీబాయి

ఉపాధ్యాయురాలు, బహుభాషా వేత్త, శాసన సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షురాలైన ఈమె డిసెంబర్ 1,1918న చిలకలగూడ ,హైదరాబాదులో జన్మించారు. రాములమ్మ, బలరామస్వామి గార్లు వీరి తల్లిదండ్రులు. విద్యాభ్యాసం ఎస్పీజీ మిషన్ స్కూల్ లోను, కీస్ హైస్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. తదనంతరం పూణేకి చెందిన సంపన్న కుటుంబపు దంత వైద్యలు, డాక్టర్. జెట్టి .లక్ష్మీనారాయణ గారితో వివాహం , ఒక కుమార్తె కలిగాక భాగస్వామి మరణంతో పాపను తీసుకుని హైదరాబాదులో పుట్టింటికి చేరుకుని స్వయంకృషితో ఎదిగి ,సాంఘిక సంక్షేమ అభ్యుదయ కాంక్షతో సమాజ సేవలో మమేకమయ్యారు. స్కూల్ టీచరుగా జీవితం ప్రారంభించి ఈమె బహు బాషవేత్త. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ ,ఇంగ్లీష్ భాషల్లో దిట్ట. ఆమె సామాజిక సేవకు భాషా పాండిత్యం ఎంతోలబ్దిని చేకూర్చింది. గీతాప్రైమరీ, మిడిల్ స్కూల్స్ ప్రారంభించారు.
1951లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరపాలక సంఘం ప్రజాస్వామ్య పద్ధతిన మొదటిసారి ఎన్నికలు నిర్వహించగా అంబేద్కర్ భావజాలంతో ప్రేరేపితులైన వీరు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జీవన పోరాటంలో సహోదరులు శ్రీ కిషన్ గారి సహాయ సహకారాలు ఎల్లవేళల లభ్యమయ్యాయి. ఈమె ఎదుగుదలను చూసి ఎంతో మంది భౌతిక దాడులకు దిగినా వెరవక సామాజిక సేవలో విలీనమయ్యారు. మునుసిపల్ కౌన్సిలర్గా మురికివాడాల్లో మంచినీరు, వీధి దీపాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. అనేక కమిటీల్లో సభ్యురాలైన కారణం చేత ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి .కౌన్సిలర్ గా రెండు పర్యాయాలు గెలిచి .నగరాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశారు.
1950లో అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడిన ‘షెడ్యూల్ కులాల ఫెడరేషన్’ (యస్. సి. యఫ్.)అనే కొత్త కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. యస్. సి.య ఫ్ 1958లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా( ఆర్. పి .యఫ్. )గా మార్చబడింది.1962 లో అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వుడ్ స్థానమైన’ ఎల్లారెడ్డి’ నుండి పోటీ చేసినా టీఎస్ సదాలక్ష్మి గారి చేతిలో ఓటమి చవిచూసి, తిరిగి 1967 లో అదే స్థానం నుండి సదా లక్ష్మీ గారిపై గెలుపొందారు. 1969 లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పుడే ‘సెపరేట్ తెలంగాణ పోరాట సమితి (యస్ టి. పి. యస్.) ఏర్పాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ నంది ఎల్లయ్య గారిపై గెలిచి, రెండవసారి శాసనసభలో అడుగుపెట్టారు .నాటి శాసనసభలో ప్రతిపక్ష నేతలతో సమానంగా ముఖ్య పాత్ర పోషించారు. 1978లో జుక్కల్ నియోజకవర్గం నుంచి సౌదాగర్ గంగారాం చేతిలో ఓటమి చవి చూశారు. ‘మహిళా శిశు సంక్షేమ బోర్డు ‘అధ్యక్షురాలిగా పనిచేసి మహిళాభ్యుదయానికి విశేష కృషి చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలు ప్రజాసేవలో నిమగ్నమై దళిత ,వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. పెత్తందారీ వ్యవస్థపై ధిక్కారస్వరం వినిపించిన ధీశాలి. వీరి జ్ఞాపకార్థం ట్రస్ట్ ,నర్సింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారు.వీరి కుమార్తె గీతారెడ్డి కాంగ్రెస్ మంత్రిగా మనందరికీ పరిచయస్తులే. ఈశ్వరీబాయి గారు క్యాన్సర్ వ్యాధి బారిన పడి 1991 ఫిబ్రవరి 24 న హైదరాబాదులో స్వర్గస్తులైనారు. వీరి గౌరవార్థం తెలంగాణ రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈశ్వరి బాయి జయంతి ,వర్ధంతి వేడుకలు నిర్వహించబడుతున్నాయి సమాజసేవే జీవన పరమార్థంగా భావించి విశేష కృషి సల్పిన ధీరవనితకు కృతజ్ఞతాపూర్వకపు అక్షరాంజలి.

రాధికా సూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్యంలో చిరుధాన్యాలు జొన్నలు

థాంక్యూ