వాట్సాప్ నోటిఫికేషన్ సౌండ్ విని ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి అయిదు నిమిషాల క్రితం కోపంగా దిండు వైపు విసిరిన ఫోన్ అందుకుంది త్రివేణి. ‘సారీ…బంగారం’ అవినాశ్ నుండి
వచ్చిన మెసేజ్ చూడగానే కళ్ళు విచ్చుకున్నాయి. అయినా ఉదయం నుండీ నిరీక్షణ వల్ల వచ్చిన కోపం, అలకల వల్ల కొంచెం బింకాన్ని ప్రదర్శించింది…
“నీ బిగించిన పెదవుల అరవిచ్చిన లోనగవు, చీకటి కమ్మిన ఈ వేళ నాలో ఉషోదయపు కాంతులను నింపుతోంది…” అటు నుండి మరో మెసేజ్… ఇక ఉండబట్టలేక, అప్పటివరకూ అలకల కొలికిగా మంకు చూపెట్టిన త్రివేణి ఫోన్ చేసింది. ఒక్క రింగుకే మొబైల్ చెవికి ఆనించుకున్న అవినాశ్ “వలపు కురిసిన నీ మోమును చేతలారగ పట్టి మురిపాల మధువును అందుకోవాలని ఉంది ప్రియా!” అంటూ మొదలు పెట్టడంతో సిగ్గుల మొగ్గలా ఎర్రగా కందిపోయి “చాల్లే! కవిత్వం…నా కోపాన్ని తగ్గించడం ఎలాగో బాగా నేర్చావు. పొద్దున్నుంచీ కాల్ చేయకపోతే ఎంత భయపడ్డానో నీకేం చెబితే అర్థమవుతుంది ?” అంది నిష్టూరంగా.
“ఇక ఆపుతావా తల్లీ! తప్పయిందని చెప్పాను కదా!
ఆఫీసులో ఫుల్ వర్క్.. మా బాస్ ఒక పట్టాన వదల్లేదు. కొత్త ప్రాజెక్ట్ అంటూ అర్జంట్ మీటింగ్ పెట్టాడు. ఎలా ఫోన్ చేయను.. నీవే చెప్పు?
అన్నాడు అవినాశ్. “సరేలే! అర్థం చేసుకున్నా.. కానీ ఒక్క విషయం చెప్పనా అవినాశ్ ! నాకున్న పరిస్థితికి నీవు ఎక్కడ దూరమవుతావోనని ఎంత భయంగా ఉంటుంది తెలుసా!! ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నా జీవితానికి నీ ఆసరా ఒక్కటే ఓదార్పు ..నాకు దేవుడు ఇచ్చిన ఏకైక వరం నీవు” ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను నేను” అంది గద్గదికంగా…. “ఛ ఛ ఊరుకో ఈ అవినాశ్ నీకు జీవితాంతం తోడుగా వుంటాడు ఓకే నా..ఏదీ నవ్వు ఒకసారి..” అంటుంటే హాయిగా నవ్వేసింది..
ఇంతలో “ఏయ్ త్రివేణీ! పిలిస్తే పలకవేమే? మహారాణికి గదిలోకి పంపించాలేమో! ఈయన గారికి చెబితే అర్థమయిందా? ఈ దరిద్రాన్ని ఎక్కడో అనాథాశ్రమంలో పడేయమంటే ఇంట్లో పెట్టుకు కూర్చున్నాడు. దీనికి సేవ చేయలేక నేను చచ్చిపోతున్నా” అని అరుస్తున్న కమలమ్మ గొంతు విని గాభరా పడుతూ “అవినాశ్! పిన్ని
డిన్నర్ కు పిలుస్తోంది. రేపు కాల్ చేస్తా” అంటూ ఫోన్ కట్ చేసి, ‘వస్తున్నా పిన్నీ!’ అంటూ మంచానికి ఆనించి ఉన్న చేతి కర్రను పట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ డైనింగ్ హాల్ కి వచ్చింది.
“నాలుగుసార్లు పిలిస్తే గానీ రాదు మహాతల్లి” అంటూ విసుగ్గా డైనింగ్ టేబుల్ మీద పళ్ళెంలో అన్నం వడ్డిస్తున్న సవతితల్లిని చూసి రోజూ అలవాటే కాబట్టి మౌనంగా ఉండిపోయింది త్రివేణి. మరో కుర్చీలో కూర్చున్న తండ్రి వైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. “నన్ను క్షమించమ్మా!” అన్న నిస్సహాయతతో కూడిన అర్థింపు ఆ కళ్ళల్లో..పరవాలేదన్నట్లు చిన్నగా నవ్వింది. భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది… అవినాశ్ ఆలోచనలు చుట్టుముట్టాయి. అతనితో జీవితం ఊహకే అద్భుతంగా అనిపించింది. కానీ తనకున్న సమస్య వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్న సందేహంతో ప్రతీరోజూ సతమతమవుతూనే ఉంది. అలా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయింది.
*****
త్రివేణి పుట్టడమే పోలియో వ్యాధి బారిన పడింది. దాంతో కుడికాలు నడవడం సమస్యగా మారింది..చిన్నపుడు తల్లిదండ్రుల చేయి, తర్వాత చేతికర్ర ఆమెకు ఊతమయ్యాయి. మధ్య తరగతి కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. తండ్రి పరశురాం గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం కావడం వల్ల జీతం అక్కడికక్కడే సరిపోయేది. తల్లి సామాన్య గృహిణి. కూతురును అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చదువే ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్కూల్ లో చేర్పించారు. త్రివేణికి భగవంతుడు వైకల్యాన్ని శరీరానికి మాత్రమే ఇచ్చాడు కానీ బుద్ధికి ఇవ్వలేదు. చదువులో అందరికన్నా ముందుండేది. అయినా సమాజం వెక్కిరింపులకు లోనవుతూ ఉండేది. గాయపడిన మనసుకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులు. తాను పదవతరగతిలో ఉన్నప్పుడు తల్లికి కామెర్ల వ్యాధి సోకి వైద్యుల ప్రయత్నాలు ఫలించక మరణించింది. విధి త్రివేణిని మరోమారు వంచించింది.
బంధుమిత్రులు ఎంత చెప్పినా మరో వివాహానికి మొదట పరశురాం ఒప్పుకోలేదు. తన కూతురికి ఉన్న సమస్య వల్ల తప్పలేదు. వచ్చే ఆవిడ తనకు భార్యగా కాక కూతురుకు తల్లిగా ఉంటే చాలనుకున్నాడు. అంతా వ్యతిరేకంగా జరిగిపోయింది. ఇంటికి వచ్చిన రెండవరోజు నుండే త్రివేణిని ద్వేషించడం మొదలుపెట్టింది కమలమ్మ. ఆమెకు నోరు జాస్తి. అందువల్ల పరశురాం
మిన్నకుండేవాడు. వారికి మరో సంతానం కలగలేదు. అది కమలమ్మను మరీ బాధించేది. త్రివేణి దురదృష్టం ఇంటికంతా చుట్టుకున్నదని శోకాలు తీసేది. పరశురాం ఎంత బాగా చూసుకున్నా జరగరాని అన్యాయం తనకేదో జరిగిందని విలవిలలాడేది. ఆ కసి అంతా త్రివేణి మీద చూపేది. త్రివేణి వల్ల ఆమెకు కలిగిన నష్టమేంటో
తండ్రీ కూతుళ్లకు అర్థమయ్యేది కాదు..అలా కాలం ముందుకు పరుగెడుతూనే ఉంది. ఇన్ని బాధల్లోనూ త్రివేణి డిగ్రీ పూర్తి చేసి పీజీ కాలేజీలో చేరింది. పెళ్లి చేసి పంపమని, ఆమె చదువుకు ఎంతో డబ్బు ఖర్చవుతున్నదని కమలమ్మ మొత్తుకున్నా ఈ ఒక్క విషయంలో పరశురాం ఎన్ని మాటలైనా భరించాడు కానీ అంగీకరించలేదు.
కాలం తన పనిలో వేగాన్ని పెంచింది.
** ** ***
త్రివేణికి చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టం..ఎవ్వరితో మాట్లాడకుండా బొమ్మలు గీస్తూ ఉండేది.. బహుమతులు పొందిన సందర్భాలు కూడా అనేకం. డిగ్రీ నుండి చదువు ఒత్తిడిలో ఆ అలవాటు కాస్త వెనుకబడింది. డిగ్రీ సెకండ్ ఇయర్ చివరి దశలో ఇంటి బాధల నుండి కొంత విముక్తి అయినా కలుగుతుందని తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఫేస్ బుక్ లో ఒకసారి అవినాశ్ కవిత్వాన్ని చూసింది. కవిత్వం ఆరవ ప్రాణం అతనికి. అప్పటికే జాబ్ లో చేరాడు. అయినా కవిత్వం రాయడం వదల్లేదు. ఎంతోమంది కవిత్వాన్ని చదివిన త్రివేణి అవినాశ్ కవిత్వంలోని ఆర్ద్రతను, గుండె లయను అర్థం చేసుకుంది. ఆమెకు
గమ్మత్తైన ఆలోచన వచ్చింది. “ఆ భావానికి అనుగుణంగా బొమ్మలు వేస్తే”…వెంటనే ఆచరణలో పెట్టింది. బొమ్మలు గీసి అవినాశ్ కి పంపింది. ఆమెలోని చిత్రకళ అతన్ని అబ్బురపరిచింది. “తన కవిత్వాన్ని చిత్రరూపంలోఎంత బాగా విశ్లేషించింది?” అని త్రివేణికి ఫోన్ చేసి ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేకాదు తన కవితలన్నింటికీ బొమ్మలు వేయమని అభ్యర్థించాడు. ఉబ్బితబ్బిబ్బు అయింది త్రివేణి. అతనికి అంత బాగా నచ్చుతాయని అనుకోలేదు. తనకెంతో ఇష్టమైన పని కాబట్టి అతని కోరికను కాదనలేకపోయింది.
ఇలా చిత్ర, కవిత్వాలు ఎల్లలు లేని స్నేహంతో రెండేళ్లు కొనసాగాయి. ఒకరోజు అవినాశ్ మాట్లాడుతూ “నా కవిత్వ విశ్లేషణకు నీ జీవిత చిత్రం తోడయితే.. అనుబంధం వెల్లివిరిసే భవిష్యత్తు మనదవుతుంది ప్రియా!” అని కవిత్వ ధోరణిలో తనకు ఆమెపై గల ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. మ్రాన్పడిపోయింది త్రివేణి. సమాధానం తోచలేదు. కాల్ కట్ చేసింది. “అందులో ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదు. ఇన్నాళ్లుగా చూస్తున్న అవినాశ్ లో కాదనడానికి కారణాలు ఏమీ లేవు. కానీ తన పరిస్థితి అతనికి తెలియదు. ఎప్పుడూ వారి మధ్య అటువంటి ప్రస్తావన రాలేదు. ఇంత ఇష్టపడ్డానని చెప్తున్నవాడు తన స్థితి తెలిస్తే ఒప్పుకుంటాడా? ఏ మగవాడు తెలిసి ఒక పోలియోగ్రస్తురాలైన అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు? అతనిలో ఇంకా ఆశలు పెరగక ముందే దీన్ని తుంచి వేయాలి”..అని దృఢంగా అనుకొని రెండు రోజులు బాగా ఆలోచించి అవినాశ్ కి ఫోన్ చేసింది.
“అవినాశ్! నాకు తెలియకుండా నీలో ఆశలు కలిగిస్తే నన్ను క్షమించు. నేను పెళ్లికి అర్హురాలిని కాను. అందుకే నన్నిలా వదిలేయి. ఇది జరగకపోయినా మన స్నేహం కొనసాగడానికి నాకు ఏ అభ్యంతరం లేదు” అని తన జీవితాన్ని గురించి పూస గుచ్చినట్టు చెప్పింది. అంతా విన్న అవినాశ్ నింపాదిగా “నేను నీ బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడలేదు. నన్ను నన్నుగా అర్థం చేసుకున్న ఒక చిత్రాన్ని నీలో చూసాను. నాకెటువంటి ఆశలూ లేవు. అప్సరస లాంటి స్త్రీ నా జీవిత భాగస్వామి కావాలని ఎప్పుడూ కలలు కనలేదు. ఉదాత్తమైన వ్యక్తిత్వం గల స్త్రీని నీలో చూశాను. అది చాలు నీతో నేను హాయిగా గడపడానికి. ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా నా నిర్ణయం మారదు” అన్నాడు.
త్రివేణి నిజంగానే ప్రేమ, ఆశ్చర్యం, అనుభూతులు కలిసిన సంగమవేణి అయ్యింది. అప్పటినుండీ ఆమెలో అతని మీద
చెప్పలేని ఇష్టాన్ని పెంచుకుంది. పెళ్లి విషయంలో పెద్దల అంగీకారమే ప్రధానమని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇరుపక్షాలతో మాట్లాడడం తన బాధ్యతే అని, ఈ విషయంలో త్రివేణి ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని ధైర్యం చెప్పాడు. అయితే వచ్చే ఏడాదితో త్రివేణి పీజీ పూర్తి అవుతుంది కాబట్టి ఆ తర్వాతే పెళ్ళి ప్రస్తావన చేయాలనుకున్నారు.
*****
ఎనిమిది నెలల కాలం గతంలోకి జారిపోయింది.. ఇద్దరి మధ్య ప్రేమ అపరిమితం కాసాగింది…అందుకే అవినాశ్ కాల్ చేయకపోయినా, కాల్ రిసీవ్ చేసుకోకపోయినా తన భవిష్యత్ స్వప్నం ఎక్కడ కలగా మిగిలిపోతుందోనన్న భయం ఆమెకు. ఇన్నిరోజులు గడుస్తున్నా, ఎన్నో సార్లు కలుసుకున్నా వాళ్ళ సంస్కారయుతమైన వ్యక్తిత్వం వాళ్ళను హద్దులు దాటనివ్వలేదు.. అవినాశ్ మాట్లాడతానన్నాడు కాబట్టి తండ్రితో చూచాయగా కూడా ఏమీ చెప్పలేదు త్రివేణి.
ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున్నే అవినాశ్ నుండి ఫోన్..సాయంత్రం 5 గంటలకు చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి రమ్మని, అక్కడి నుండి ఒక ముఖ్యమైన చోటుకు తీసుకువెళ్తానని. ఇలాంటి సరదాలు, సస్పెన్సులూ త్రివేణికి అలవాటై పోయాయి. అందుకే తనలో తను నవ్వుకుని సరేనంది. పార్క్ దగ్గరికి వెళ్ళేటప్పటికే అవినాశ్ ఎదురుచూస్తున్నాడు. ఒక పావుగంటలో “సుజన రంజని”
ఆడిటోరియం దగ్గర ఆపి దిగమన్నాడు.
ఆడిటోరియం ముందు వర్ధమాన కవి అవినాశ్ రచించిన “చైత్ర రాగం” కవితా సంపుటి ఆవిష్కరణ. అని అందమైన అక్షరాలు ప్రింట్ చేసి ఉన్న పెద్ద ఫ్లెక్సీ. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి దానికింద “పుస్తకావిష్కర్త…వర్ధమాన చిత్రకారిణి త్రివేణి” అని ఉండడం… అయోమయంగా చూస్తుంటే బండి పక్కకు పార్క్ చేసి వచ్చిన అవినాశ్ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ‘పద లోపలికి’ అన్నాడు ప్రేమగా చూస్తూ. అసంకల్పితంగా అడుగులు వేసింది అతనితో పాటు…
ఎవరెవరో వచ్చి నమస్కరిస్తున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. అభినందనలు తెల్పుతున్నారు. అన్నింటికీ చిరునవ్వు సమాధానంగా ముందుకు అచేతనంగా నడుస్తోంది త్రివేణి.
ఆహ్వానం మేరకు సుప్రసిద్ధ కవి వసంత కృష్ణ గారు వచ్చారు. దగ్గరుండి త్రివేణి చేత పుస్తకావిష్కరణ చేయించారు. ఆయన ఉపన్యాసమిస్తూ అవినాశ్ కవితలలో సమాజాభివృద్ధి కాంక్ష, భావుకత, భాషాశైలిని మెచ్చుకుంటూ, భావయుక్తంగా ఆ కవితలకు త్రివేణి కూర్చిన చిత్రాలు అపురూపమని ప్రశంసించారు. పుస్తకావిష్కర్త త్రివేణిని మాట్లాడమని కోరగా “తన ఎడారి జీవితంలో అవినాశ్ పరిచయం వసంతాన్ని పూయించిందని, ఏమిచ్చినా అతని ఋణం తీర్చుకోలేనని” ఆనందవర్షంలో తడుస్తూ వణుకుతున్న గొంతుతో ఆ రెండు వాక్యాలు చెప్పి చేతులు జోడించింది. సభలో ఉన్నవారిని ఎవరినీ కళ్ళెత్తి చూడలేకపోయింది.
చివరగా అవినాశ్ ,వసంతకృష్ణ గారికి , సభికులకు ధన్యవాదాలు తెల్పి , తన తల్లిదండ్రులను, త్రివేణి తల్లిదండ్రులను వేదికమీదకు ఆహ్వానించాడు. ఒక్కసారిగా ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకున్నట్టు అనిపించింది త్రివేణికి. సభలో వెనుకవైపు పక్కపక్కనే కూర్చున్న ఇద్దరి తల్లిదండ్రులు నవ్వుతూ వేదిక మీదకు వచ్చారు. తండ్రి తనవైపు గర్వంగా చూస్తుండడం గమనించి కొంత ఊరట చెందింది. పిన్నిలో అంతటి ప్రశాంతత అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇక అవినాశ్ తల్లిదండ్రులను చూడడం ఇదే మొదటిసారి. అప్రయత్నంగా వారిని చూసి నమస్కరించింది.
అవినాశ్ మైకు తీసుకొని ” నా కవిత్వ చైత్రానికి పరిమళాలు అద్దిన త్రివేణిని మీ అందరి సమక్షంలో నా జీవన చైత్రంలో కూడా రాగాలు ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను” అనగానే సభ అంతా చప్పట్లతో మారుమోగింది. త్రివేణి వాళ్ళ నాన్నగారు ఒక్క నిముషం మాట్లాడడానికి అనుమతి నిమ్మని కోరి “నెలరోజుల క్రితం త్రివేణి లేని సమయంలో తమ ఇంటికి వచ్చిన అవినాశ్, వారిద్దరి పరిచయాన్ని తెలిపి, తాను త్రివేణిని వివాహం చేసుకుంటానని, ఆమెకు తెలియకుండా పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేశానని అక్కడే అందరి ముందు ఈ విషయాన్ని ప్రకటిస్తానని, తన తల్లిదండ్రులు కూడా ఆమె గురించి చెప్పినపుడు సహృదయంతో అంగీకరించారని చెప్పాడు..అప్పుడనిపించింది నాకు సమాజంలో ‘మంచి’ ఇంకా ఇలాంటి వాళ్ళ రూపంలో బతుకుతోందని ..వాళ్ళిద్దర్నీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను” అన్నాడు ఆనందభాష్పాలతో. వారి వివాహానికి అంగీకరించిన అవినాశ్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెల్పాడు..
కమలమ్మ సందేహిస్తూ త్రివేణి వద్దకు వచ్చి అమాంతం కౌగిలించుకొని కంటి నీరు ధారాపాతమవుతుంటే “నన్ను క్షమించవూ” అని త్రివేణికి మాత్రమే వినిపించేటట్టు అంది. చిన్నగా నవ్వుతూ ఆమెను మరింత పొదివి పట్టుకుని, అనుభూతి పారవశ్యంలో మునిగింది త్రివేణి..