మరపు రాని రోజు – Unforgettable Day

తరుణి సంపాదకీయం (23-12- 2023- శనివారం)

Never to be forgotten మరపురానిది ఏమై ఉంటుంది? ప్రతి మనిషికి జీవితంలో ఏవో కొన్ని సందర్భాలు, సంఘటనలు ,జ్ఞాపకాలు అనుభవాలు తప్పకుండా మరపురానివి ఏవో కొన్ని ఉంటాయి.
‘నా జీవితంలో మరపురాని సంఘటన’ ఎవరైనా అనుకోవచ్చు.అనుకుంటుంటారు కూడా! పరీక్షలు రాసే విద్యార్థి తాను శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినప్పుడు, నిరుద్యోగి ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పుడు, ఒక జంట ప్రేమే ఇక జీవితాన్ని గడిపి సంతానాన్ని పొందినప్పుడు, ఒక నాయకుడు విజయాన్ని సాధించినప్పుడు మరపురాని రోజు వారిది అవుతుంది.సభా ప్రాంగణంలో కవులు రచయితలు వారిని గౌరవ సత్కారాలు తో వేదిక మీద ప్రశంసిస్తున్న సందర్భంలో అంటూ ఉంటారు ” ఇది నా జీవితంలో మరపురాని రోజు “అని.

చాలావరకు పుట్టినరోజును గొప్పగా నిర్వహించుకుంటూ ఉంటారు కొందరు. కొంతమందికి పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో ఇష్టమైనప్పుడు పెళ్లిరోజును ‘ఇది నా జీవితంలో ముఖ్యమైన సంఘటన అంటారు’, ఓ చక్కని దృశ్యాన్ని చూసినప్పుడు, ఓ చక్కని చిత్రాన్ని గీసినప్పుడు, అద్భుతమైన ప్రదేశాలను తిలకించినప్పుడు,ఇష్టమైన సంగీతాన్ని విన్నప్పుడు రకరకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి.
అయితే, అన్ని ఆనందానికి సంతోషానికి అద్భుతాలకు సంబంధించిన విషయాలే మరపురానివి ఉండవు. బాధలకు, అన్యాయాలకు విషమ పరిస్థితులకు కూడా మరపురాని సంఘటన, మరపురాని రోజు, మరపురాని విషయము అనే విశేషణాలను వేస్తూ ఉంటారు. అలాంటిదే జీవితము సుఖదుఃఖ సమ్మేళనం.
ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినప్పుడు విద్యార్థులందరూ తమకు నచ్చిన టీచర్ కి చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ చేసి ఇవ్వడము, పూల గుత్తులను తెచ్చి ఇవ్వడము, ఏదో ఒక చిన్న గిఫ్ట్ అంటే – పెన్ ,డైరీ అలాంటివేవైనా చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం చేసినప్పుడు, విద్యార్థి నాయకుడో, నాయకురాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని చెబుతూ నచ్చిన టీచర్ గురించి ఒక నాలుగు మాటలు ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరపురాని రోజే అవుతుంది ఆ గురువుకు. ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నా కూడా ఆ ఉపాధ్యాయుల గుండెల్లో ఆ ప్రత్యేకమైనటువంటి రోజును – ఆ సంవత్సరం అప్పుడే కొత్తగా అటెండ్ అయినట్టు మరపురాని విషయంగా మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది ఒక తాజాతనమన్నమాట ! ఇది సహజ సిద్ధమైన సంతోషానుభూతి అన్నమాట.టీచర్ డెడికేషన్ కి ,టీచర్ హార్డ్ వర్క్ కి నిలువెత్తు నిదర్శనాలు ఇవి .అందుకే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ దినోత్సవం రోజు ను మరపురాని దినోత్సవం గా చెప్పుకుంటూ ఉంటారు.
కొన్ని రోజులు ఎందుకు ప్రత్యేకమైనవో తెలియాలి అంటే వాటికి పేర్లు అనేవి పెట్టుకోవడం అవసరము అనేది మనందరికీ తెలిసిందే.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ యాంటీ టెర్రరిజం దినోత్సవం ఇవి కూడా ఉన్నప్పుడు మంచి చెడు భావనలతో కలిసిన ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు వస్తుంటాయి పోతుంటాయి అప్పటి సందర్భం ఏదైనా ఉంటే హృదయానికి సూటిగా తగిలిన విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మరపురాని రోజుగా చెప్పుకుంటూ ఉంటారు.
” నాటు నాటు …”పాటకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆస్కార్ అవార్డు వచ్చిన రోజు కూడా అటువంటి ఆస్పిసియస్ డే మరపురాని రోజే!
శుభ తిధులు అంటూ పుట్టిన రోజులను ,పెళ్లి రోజులను జరుపుకుంటూ ఉంటారు. అవి కూడా మరపురాని రోజు అంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చేసుకుంటూ కూడా అంటారు ఎందుకంటే, తమ మనసులు మురిసిపోయేలా ఏ చిన్న సంఘటన జరిగినా ఆ జ్ఞాపకాలు చాలాకాలం హృదయంలో నిలిచిపోయి ఉంటాయి. కాలం ఎంతగా మరుపుకు గురిచేసిన మరిచిపోలేనివీ ఉంటాయి. క్షీరసాగర మధనంలో హాలాహలం ,అమృతము రెండూ పుట్టినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ప్రముఖమైన రోజు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించి మకర సంక్రమణం వరకు జరగబోయే మార్గాన్ని ముక్కోటి ఏకాదశికి మొదటి రోజుగా చెప్తూ ఉంటాం. ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు .సూర్యుడు ఉత్తరాయణానికి మారేటప్పుడు వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా చెప్తుంటాం.ముక్కోటి ఏకాదశి విషయాన్ని ప్రస్తావించుకున్నప్పుడు “భగవద్గీత” ను శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన రోజుగా ఈరోజుకు ప్రత్యేకత ఉంది.
మనుషులు అబద్ధాలు ఆడకూడదు, ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చేయవలసిన పనులు చేస్తూ పోవాలి అని చెప్పడానికి ఈ వైకుంఠ ఏకాదశి ఒక నిదర్శనమైన పర్వదినం గా చెప్తూ ఉంటాం. దేహమే దేవాలయంగా నమ్మి ఒక శాస్త్రంగా చెప్పేటువంటి హిందూ సంప్రదాయంలో ప్రముఖమైన రోజు ఈ రోజు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి పవిత్రమైన రోజుగా భావిస్తారు. పూజలు చేస్తున్నా,జాగరణ చేస్తున్నా కనీసం ఈ రోజైనా భగవంతుని నామస్మరణ చేస్తూ భక్తికి దగ్గరగా ఉండడం అనేదే ‘ఉపవాసం’ అని తెలియజేసేరోజు . పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు స్వచ్ఛంగా ఉంచుకోవడమే అని అర్థాన్నిచ్చే ఈరోజు ప్రత్యేకత ఈ విశిష్టతను తెలిపినప్పుడు కొత్త తరం వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకది మరపురాని రోజుగా నిలిచిపోతుంది.
ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీమహావిష్ణువుకు ,” తిరుప్పావై” అనే దివ్య ప్రబంధం లోని పాశురం పఠిస్తూ గోదాదేవి వ్రత ఆచరణ చేయడం ముఖ్యమైన విషయం.30 పాశురాలను రోజు కు ఒకటి చదువుతారు.” శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం” అని శ్రీలక్ష్మికి ప్రతిరూపుగా, దైవంశ సంభూతురాలుగా చెప్పుకోబడే గోదాదేవిని స్తుతించడం చూస్తుంటాం.12 మంది ఆళ్వారు లలో ఆండాల్ గోదాదేవి ఒకరు.
మానవులు సంఘ జీవులు.
మరో ప్రపంచం మనదైన ప్రపంచం వెంట ఉంటుంటాయి. Man is a social animal అంటుంటారు. ఎందుకు? అలా లోతైన ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.
” I am the resurrection and the life “అన్నాడు Jesus అంటే, ” పునరుద్దానమును, జీవమును నేనే” అని. ఇది అన్ ఫర్గెటబుల్ స్టేట్మెంట్ గా చెప్తూ ఉంటారు క్రైస్తవులు.. క్రిస్టియన్లు చాలా శ్రద్ధగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం కూడా ఈ డిసెంబర్ నెలలోనే రావడం కూడా ఒక విశిష్టత. క్రిస్మస్ రోజు ఒక మరపురాని రోజుగా ఒక ఆస్పిసియస్ డే గా నమ్ముతారు, ఆరోజు మంచి మంచి నిర్ణయాలను తీసుకోవాలని ఈ మతం చెప్తుంది. ఇలా,
ఒక ప్రత్యేకమైన రోజు శుభప్రదమైన ఆలోచనలను ఆచరణలను పాటించినప్పుడు అన్ ఫర్గటబుల్ డే గా చెప్పుకోగలిగే నిజమైన, సత్యమైన మంచి రోజు, మరపురాని రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి.
భారతదేశం సర్వమత సంప్రదాయ జీవితాలకు నిలయమైన దేశం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు జాతి ఏదైనా నీతి ఒక్కటే అనే ఏక సూత్రంపై నడిచే గొప్ప దేశం.
స్వర్గ, నరకాలు ఎక్కడున్నాయి? మనిషి ఆలోచనల్లో ఉన్నాయి. దేవతలు,రాక్షసులు అంటే మంచి చెడు కి ఉదాహరణలుగా చెప్పేవి .అమృతము, విషము అనేవి కూడా అంతే,వీటికి,ఈ గుణాలకు ఉపమానాలుగా చెప్పేవి.
మతం ఏదైనా మానవత్వాన్ని మరువకుండా ఉన్నప్పుడే చేసే పూజలకు దానధర్మాలకు అర్థం పరమార్థం ఉన్నట్టు. స్వచ్ఛందంగా మనస్సులో మంచిని స్థాపించుకున్నప్పుడే మరపురాని రోజు అవుతుంది.
రాగపరాగ ఉషోదయాలను చూసినా, శరదృతు వెన్నెల వెన్నెల సోయగాలను చూసినా స్పందించే హృదయాలు ఉంటాయి కదా. ఈ స్పందనలు సుహృద్భావనలై ఉండాలి.మంచుతో కప్పబడి ఉన్నటువంటి హిమాలయాలను సందర్శించినప్పుడు, అద్భుతమైన ఆగాధం బంగాళాఖాతాన్ని చూసినప్పుడు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ఎన్నో వింత వింత అద్భుత కట్టడాలను , అద్భుత దేవాలయ శిల్పాలను , చారిత్రక నిర్మాణాలను కోటలనూ , ప్రాసాదాలను చూడగానే అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. క్లియర్ క్రిస్టల్ థాట్స్ ఉన్నప్పుడే అవి మనసులో పదులపరుచుకున్నటువంటి మరపురాని రోజులు అవుతాయి. నిరుపేదను గురించి, నిర్భాగ్యులను గురించి ఆలోచించి ఒక మంచి పని చేసినప్పుడే మంచి రోజు అవుతుంది. ఇటువంటి మరపురాని రోజులను unforgettable డేస్ ని అందరూ పొందాలని ఆకాంక్షించాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బండారు అచ్చమాంబ

చైత్ర రాగం