తొలి తెలుగు కథా ,స్త్రీ వాద రచయిత్రి. కృష్ణా జిల్లా నందిగామ లోని పెనుగంచిప్రోలు గ్రామంలో, గంగమ్మ, వెంకటప్పయ్య దంపతులకు 1874లో జన్మించారు. తమ ఆరవ యేట తండ్రి మరణానంతరం నల్గొండ జిల్లా దేవరకొండలో నివసించే తమ సవతి సోదరులు కొమర్రాజు శంకర్రావు గారి వద్ద పెరిగారు. మొట్టమొదటి ‘తెలుగు విజ్ఞాన సర్వసం’ సృష్టికర్త కొమర్రాజు వెేంకటలక్ష్మణ రావు వీరి సోదరులు. మేనమామ బండారు మాధవ రావుతో వివాహానంతరం ఉద్యోగరీత్యా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో నివాసం ఉన్నారు. సంప్రదాయ భావాలున్న భర్త ఆమె చదువుకు నిరాకరించిన కారణం చేత తమ్ముడికి చదువు నేర్పే గురువు వద్ద చదువు నేర్చుకున్నారు. తెలుగు ,సంస్కృతం, మరాఠీ, హిందీ, గుజరాతి ,ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ఎన్నో అద్భుత గ్రంథాలు చదివారు. ఓరుగంటి సుందరి రత్నమాంబతో కలిసి 1902 లో మచిలీపట్నంలో ‘బృందావన స్త్రీల సమాజం’ పేరిట మొదటి మహిళా సంఘం ఏర్పాటు చేసి రాష్ట్రమంతా పర్యటించి మహిళా చైతన్యం కలిగించారు. మంచి వక్త , తమ అద్భుత ప్రసంగాలతో మహిళల్లోఎంతో మార్పు తీసుకుని వచ్చారు.
సంగిశెట్టి శ్రీనివాస్ గారు సంకలన పరిచి అచ్చమాంబ’ తొలి తెలుగు కథలు ‘పదింటిని అందుబాటులోకి తెచ్చారు. స్త్రీ చైతన్యం, విద్యాభివృద్ధి, సామాజిక పరివర్తనం, అభ్యుదయంగా కథలల్లిన వీరు గురజాడ గారి కన్నా దశాబ్దం ముందుగా రచనకు శ్రీకారం చుట్టారు. వీరి 10.కథలు :-
1.గుణవతియగు స్త్రీ : తెలుగు జనాన పత్రిక ,1901 మే న ప్రచురితమైంది ‘దశకుమార చరిత్ర’ లోని కథకు ఆధునిక రూపం. పొదుపుతో కూడిన సంసారం కథాంశం.
2. లలితా శారదులు: తెలుగు జనాన 1901 లో ప్రచురితం. భిన్న మనస్తత్వాలు గల ఇద్దరు స్నేహితురాళ్ళ కథ. సద్గుణ సంపన్నురాలైన శారద, లలితలో మార్పు కోసం ప్రయత్నించడం.
3. జానకమ్మ : తెలుగు జనాన పత్రిక 1902 లో ప్రచురితం .స్త్రీ విద్యా ప్రాముఖ్యత ,ఆర్థిక అసమానతలు, సామాజిక ఇబ్బందులు ఉండవని తెలిపే కథ .
4.దంపతుల ప్రథమ కలహం: హిందూ సుందరి 1902 లో ప్రచురితం.అన్యోన్య దాంపత్యంపై సంభాషణా ధోరణిలో సాగుతుంది.
5. సత్పాత్ర దానము :హిందూ సుందరి 1902 లో ప్రచురితం.అంతా తెలంగాణ యాసలో సాగే కథ .భూస్వామ్య విధానం – కౌలుదారీవ్యవస్థ ఇతివృత్తం.
6 .స్త్రీ విద్య:
చదువు లేని మహిళ అజ్ఞానాంధకారాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని ఓ పురుష పాత్ర ద్వారా చెప్పించడం ఇతివృత్తం.
7.ధన త్రయోదశి: హిందూ సుందరి 1902 లో ప్రచురితం. శాస్త్రాల్లో స్త్రీ విద్యానిషేధాన్ని ఖండిస్తూ రాసిన కథ. ఉదాత్త గుణాలున్న దంపతులు స్వయం కృషితో ఎదిగినద వైనం వివరణ.
8. భార్యాభర్తల సంవాదము: హిందూ సుందరి 1903లో ప్రచురితం. దంపతుల సంవాద రూపంలో సాగే కథ. ఆభరణాల కన్నా సచ్చీలతే ప్రధానమని తెలిపడం. 9.అద్దమును,సత్యవతియు :హిందూ సుందరి 1903 లో ప్రచురితం.సత్యవతి అనే మూడేండ్ల చలాకి చిన్నారి పాత్ర .తన సరస సంభాషణ ద్వారా అద్దం లో ప్రతిబింబంగా జగత్తును చూపించడం.
10. బీద కుటుంబం :సావిత్రి 1904 లో ప్రచురితం. స్వయంకృషితో దారిద్ర్యాన్ని ఎలా జయించాలో ఉత్తమ పురుషలో సాగిన కథ.
వీరి కథల్లో గ్రాంథిక పదాలున్నా,జటిల పదాలుండవు. సామాజిక ,ఆర్థిక, వ్యక్తిత్వ వికాస ధోరణిలో, నైతికవిలువలతో కూడిన రచనలు వీరి సొంతం.
తెలంగాణలో పెరిగి మహారాష్ట్రలో జీవనయానం చేశారు . ‘అబలాసచ్చరిత్రరత్నమాల’ పుస్తకంలో 1000 సంవత్సరాల మధ్య గల స్ఫూర్తి ప్రదాతలైన స్త్రీల జీవిత చరిత్రల్ని లిఖితం చేశారు. మూడు సంపుటాలుగా వెలువరించాలనుకున్నా, మొదటిది అబలాసచ్చరిత్ర రత్నమాల రాసి వినుతికెక్కారు. వీర, ధీరవనిత లపై వ్యాస సమాహారమిది. ఈ రచనతో ఎంతమంది ప్రేరణ పొందారు. వేద, పురాణాల్లోని మహిళాఔన్నత్యంపై రెండవ, ఇతర దేశాల్లోని మహిళపై మూడవ సంపుటి వెలువరించాలనుకుని, ఎంతో శోధన చేసి, విశ్లేషించి రాయాలని తలచినా, అనారోగ్యం కారణం చేత కుదరలేదు. స్త్రీ జనోద్ధరణ , చైతన్యం రచనాధ్యేయాలుగా సాగిన వీరు
సామాజిక సేవలో భాగంగా ప్లేగు వ్యాధిగ్రస్తుల సేవ చేస్తూ అదే వ్యాధిబారినపడి మధ్యప్రదేశ్లోని బిలాస్పూర్ లో 1905 జనవరి 18న స్వర్గస్తులైనారు. అచ్చమాంబ గారు ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు వరాహ మిహిరుని భార్య ‘ఖణ ‘యొక్క ప్రతిభకు సరైన గుర్తింపు దొరకలేదని భావించి, ఆధారాల్ని
సేకరించి ఆమె జీవితాన్ని వెలుగులోనికి తెచ్చారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల్తో లిఖించబడ్డ వీరిని స్మరించుకోవడం తెలుగువారి ముఖ్య కర్తవ్యం.