బాలికలలో అక్షరాస్యత శాతాన్ని పెంచి విద్యావంతులుగా మార్చి వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగేలా చేసి మహిళల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సమాజ పురోగతి సాధ్యమవుతుంది. నగరాలలో చూసినపుడు మాత్రమే బాలికా విద్య అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పల్లెటూళ్ళు, గ్రామాల్లో ఇప్పటికి బాలికా విద్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. విద్యను అభ్యసిస్తే బాల్య వివాహాల శాతం తక్కువవుతుంది. కుటుంబంలో కూడా బాలికలు శ్రమ దోపిడీకి గురౌతున్నారు. మగపిల్లలతో పాటు సమానమైన చదువులు, జీతాలు రెండు లేవు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను వారికి తెలియచేసేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. విద్యపోషణ, వైద్య సంరక్షణ, రక్షణ, చట్టపరమైన హక్కులు, గృహసింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి ఎన్నో రకాల అసమానతలను బాలికలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో సరియైన మరుగుదొడ్లు లేక ఎన్నో సమస్యల పాలవుతున్నారు. సహజ రుతుస్రావ సమయాల్లో ఎలాంటి పరిశుబ్రత పాటించాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపబడుతోంది. మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం పోరాటం చేసిన “ఎలానార్ రూజ్వెల్ట్ “ పుట్టిన రోజైన అక్టోబరు పదకొండో తేదిని అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపటానికి ఐక్యరాజ్య సమితి గుర్తించింది 2012 సం:: అక్టోబర్ 11న తొలిసారిగా ఈ బాలికా దినోత్సవం జరపబడింది తొలిసారిగా 192 దేశాలు దీనిపై సంతకం చేశాయి. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్ వెల్ట్ ఈ మనవ హక్కుల ప్రకటనలో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతి బింబించేలా మ్యాన్ అన్నా పదాన్ని పీపుల్ గా మార్చింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, వివక్షత పై అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. బాలికలు, యువతులు వారి వారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన ప్రగతి అభివృద్ధిని పెంపొందించేలా ఈ బాలికా దినోత్సవ వేడుకలు జరుగుతాయి. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయడమే గాకుండా, ఆ సమస్యలు పరిష్కరింపబడితే వచ్చే ఫలాల గురించి కూడా అవగాహన కలిగించడం ఈ దినోత్సవ ఉద్దేశ్యం.
ప్రపంచ అభివృధికి చెందిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడం లేదు. వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన “ బికాజ్ ఐ యామ్ ఎ గర్ల్ “ అనే ప్రచార కార్యక్రమం నుండి బాలికల దినోత్సవం నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ప్లాన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహించే ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను సంరక్షించే ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతుంది అన్ని దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితిని పాల్గొన మనడంతో ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశం అధికారికంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాణ్ని ప్రకటించింది. 20.వ సం:: డిసెంబర్ 19 వ తేదిన ఈ తీర్మానం అధికారికంగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ఒక నినాదం పెట్టుకొని ఆ దిశగా కార్యక్రమాలు చేపడతారు.
1) 2012 – బాల్యవివాహాన్ని రూపుమాపడం.
2) 2013 – బాలికల విద్య కోసం నూతనత్వం.
3) 2014 – కౌమార బాలికలను సాధికార పరచడం, హింసను రూపుమాపడం.
4) 2015 – కౌమార బాలికల శక్తి, విజన్ ఫర్ 2030.
5) 2016 – బాలికల పురోగతి.
6) 2017- సాధికారిక బాలికలు.
7) 2018 – ఆమెతో ఒక నైపుణ్య బాలికల బృందం.
ప్రతి సంవత్సరం ఒక నినాదం ద్వారా ముందుకు పోతూ మహిళల స్థితి గతులపై కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 పైగా కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి.
ఆసియా ఖండం లోని దేశాలలో ఒక్క భారతదేశం లోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన బాలికలున్నారు. ఈనాటికి మహిళల జనాభాలో అక్షరాస్యులైన మహిళలు నలబై శాతం కన్నా తక్కువగానే ఉన్నారు. అంటే నేటికి భారతదేశంలో కనీసం 20 కోట్ల మంది నిరక్షరాస్యులే ఉన్నారు. ఈ నిరక్షరాస్యత అనేది కేవలం వారి జీవితం పైనే కాదు వారి కుటుంబ జీవితం పైన కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నిరక్షరాస్యులైన మహిళలే ప్రసవ సమయాల్లో ఎక్కువగా మరణిస్తునట్లుగా అనేక అధ్యయనాల బట్టి తెలుస్తున్నది. పోషకాహారం తక్కువగా తీసుకోవటం, రక్తహినతకు గురవటం తత్పలితంగా ప్రసవ మరణాలు సంభవించటం చూస్తున్నాం. ఇవే కాక వారి పిల్లల పెంపకం మీద తల్లుల అక్షరాస్యతా శాతం ప్రభావం చూపిస్తున్నది. తల్లీ చదువుకున్నదయితే పిల్లల ఆరోగ్యం, పెంపకం టీకాల విషయంలో జాగ్రత్త పడుతుంది. పిల్లలకు మంచి విలువలు బోధించటంలో తల్లీ ప్రధాన పాత్రా పోషిస్తుంది. బాలికలకు కనీసం ప్రాధమిక విద్యను బోధించేలా విద్యా సంస్కరణలను చేపట్టి ఆదిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నిరక్షరాస్యత జనాభా వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటు పడుతుంది. విద్య పరంగా వెనకపడిన గ్రామాల్లో కస్తురిబా గాంధీ బాలికల విద్యాలయాల ఏర్పాటు చేయబడ్డాయి. పసికందుల మరణాలకు తల్లీ ఆక్షరాస్యత కూ సంబంధం ఉందని అంతర్జాతీయ పిల్లల వైద్య నిపుణుల సమావేశాల్లో తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల రక్షణ చెప్పే సూత్రాలను, పద్దతులను అర్థం చేసుకోవాలంటే ప్రాధమిక విద్య అవసరం.
మంచి వాతావరణం నుంచీ వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితినైన విజయవంతంగా అధిగమించగలరు. కుటుంబం, పాఠశాల, సమాజం వాతావరణాలలో కలిసి మెలసి బతకాలంటే మంచి ప్రవర్తన అవసరం మంచి వాతావరణంలో పెరగని వారు నేర ప్రవృత్తి కలిగి ఉంటారని చాల అధ్యయనాల్ల్లో తెలిసింది. పిల్లల్ని ప్రతిభావంతులుగా మలిచే విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రధాన పాత్రా వహిస్తారు.
బాలికలు ఆరోగ్యంగా పెరిగినట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. 18 సం:: వలందుగా పెళ్లి చేయకుండా అంటే బాల్య వివాహాలు జరగకుండా చూడటం కూడా సమాజం బాద్యత. సమాజంలో బాలికల పెంపకంతో కట్నాలు వంటి దురాచారాల వలన తల్లీదండ్రులు ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వడ్లగింజ గొంతులో వేసి చంపేయడం, ఏ ముళ్ళ పొదల్లోనో పారేయడం వంటి అమానవత్వ సంఘటనలకు పాల్పడుతున్నారు. ఇంకా వైద్య శాస్త్రంలోని టెక్నాలజీనీ వాడుకొని కడుపులో ఉన్నా బిడ్డ అడా మగా అని తెలుసుకోని అడబిడ్డల్ని చంపేసే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఫలితం జీవ సమతుల్యతలో ఆడపిల్లలు తగ్గిపోయే కేవలం మగ పిల్లలు మాత్రమే ఉంటె భవిష్య సమాజంలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి. ఆడపిల్లల పెంపకలు భారం కావటం వల్లనే తల్లిదండ్రులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం లేకపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఆడపిల్లల్ని పెంచుతారు.
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ చేసిన సర్వేలో బాలల్లో ముఖ్యంగా 6 – 12 సంవత్సరాల మధ్య వయసు వారు లైంగిక అత్యాచారాలకు హింసకు గురవుతున్నారని తెలిపింది. 21% బాలికలు త్రివమైన లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రతి ముగ్గురి బాలికల్లో ఇద్దరూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 88% బాలలు తమ తల్లిదండ్రుల ద్వారానే శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 50% లైంగిక అత్యాచారాలు పిల్లలకు బాగా నమ్మకమున్నవారు, కుటుంబంలోని బంధువుల వలననే జరుగుతున్నాయి. అస్సాం, బీహార్, డిల్లీ మరియు తెలుగు రాష్ట్రాలలోని బాలికలు ఎక్కువ శాతం లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు. చాల వరకు తల్లిదండ్రులే బాలికలను వివక్షతో చూస్తారు. మానసిక వేధింపులు విషయంలో బాల బాలికల మధ్య తేడా ఉండడం లేదు. బాలలైతే చాలు వేధింపులు అనుభవిస్తున్నారు.
దోపిడీ వివక్ష వంటి వాటిలో బాల కార్మికులు ముందుంటున్నారు. ఈనాడు ఇటుక బట్టిల్లో, క్వారీల్లో కర్మాగారాల్లో కంటికి కనిపించే బాల కార్మికులంటే రెసిడెన్సియల్ స్కూళ్ళు, హాస్టళ్ళలో పైకి చదువుకుంటూ కనిపించే బాలకార్మికులుంటారు. వారికి సరియైన నిద్ర, వ్యాయామం, మనసికోల్లాసం లేకుండా జైళ్ళలాంటి స్కూళ్ళలో వత్తిడికి గురవుతున్నారు. పెద్ద జీతాల కోసం ఆశపడుతూ పిల్లల సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకోకుండా పెద్ద చదువుల కోసం పోటీ పడమని తల్లీదండ్రులు హాస్టళ్ళలో తోస్తున్నారు. మంచి చెడు వ్యత్యాసాలు చెప్పేవారు లేక ఏది చేసినా మందలించేవారు లేక హాస్టళ్ళలో వింత ప్రవర్తనలు నేర్చుకుంటున్నారు. పిల్లల హక్కులను తల్లిదండ్రులు పరిరక్షించాలి. స్వేచ్చా వాతవరణంలో పిల్లలు పెరిగేల చూడాలి.