పృథ్వీ అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. మన తో పాటు మన చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలని కోరుకునే వారు.
దానికోసం తమ వంతు కృషిగా పృథ్వి అక్షర యజ్ఞం మొదలెట్టాడు.
ఆ అక్షరాన్ని ఆయుధం గా మార్చేందుకు జర్నలిజం ఎంచుకుంది అనూష.
మార్గాలు వేరైనా గమ్యం ఒకటే ఐన వీరిద్దరి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.
ప్రమాదం అంచున
ఒక ఐదు నిమిషాల్లో సర్దుకున్నారు ఛానెల్లో lని అందరూ. అది బాంబు దాడి మాత్రం కాదని వాళ్ళకి అర్థం అయింది. బయటకు వచ్చి చుట్టూ చూశారు. ఆ ప్రాంతం మొత్తం కరెంటు పోయింది.
ఆ పేలుడు శబ్దం ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిందని అర్థమైంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలి. ఈసారి ఎలాగైనా సరే మనం ఇన్వర్టర్ పెట్టుకోవాలి అనూషా. మంచి టైంలో ఇలా జరిగింది ఏంటి? ఇది యాదృచ్ఛికమా లేక..?
ఇంకా శ్రీధర్ మాట పూర్తిగా కాకుండానే ఆ చీకటిలోంచి కొంతమంది ముసుగులు వేసుకున్న మనుషులు అక్కడికి వచ్చారు.
ఎక్కడరా ఆ అమ్మాయి? ఇందాక పెద్ద వీరనారిలాగా వార్తలు చదువుతోంది ఎక్కడ? అంటూ హడావిడి చేస్తూ వస్తున్న వాళ్ళని చూసిన తర్వాత కానీ అర్థం కాలేదు శ్రీధర్ కి అనూషను స్వయంగా న్యూస్ ప్రెసెంట్ చేయమనడం తను చేసిన పెద్ద పొరపాటు అని.
ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళు లోపలికి వెళ్లి అనూషను చూడటం, మెడపై కత్తి పెట్టి బెదిరించి కారులో ఎక్కించేసుకోవడం క్షణాల్లో జరిగిపోయింది.
తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది శ్రీధర్ కి. వెంటనే తన స్నేహితుడు, కాస్త నిజాయితీపరుడుగా పేరున్న ఎస్పీ శంకర్ కి ఫోన్ చేసి జరిగింది వివరించాడు. అదృష్టం కొద్దీ వాళ్ళు అనూషను ఎత్తుకెళ్తున్న కార్ వివరాలు వాళ్ళ ఆఫీసు సెక్యూరిటీ గార్డ్ గమనించాడు.
ఎర్ర రంగు మారుతి స్విఫ్ట్ కారు. 5555 నెంబర్ కలిగి ఉంది అంటూ వివరాలు చెప్పాడు. ఏఎస్పీ శంకర్ కి ఆ వివరాలు ఇవ్వడంతో పాటు శ్రీధర్ గారు వెంటనే చేసిన మరొక పని,తను తన స్టాఫ్ అందరూ సోషల్ మీడియాలో జరిగిన విషయాన్ని పోస్ట్ చేయడం.
మా చానెల్ సివిటాస్ ఈరోజు మంత్రి గారి గురించి బట్టబయలు చేసిన నిజాలను ఎంతమంది చూశారో నాకు తెలియదు. కానీ అది ప్రసారం అవుతూ ఉండగానే మా ఛానెల్ పై దాడి జరిగి, ఆ వివరాలు సేకరించిన మా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనూషను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లడాన్ని బట్టి మీరే ఆలోచించండి .ఆమె చెప్పిన, చూపించిన విషయంలో నిజం లేకపోయి ఉండుంటే మంత్రి గారి అనుచరులు ఈ పని చేయవలసిన అవసరం ఉందా? ఇందులో అనుచరులు మాత్రమేనా, మంత్రి గారి హస్తం కూడా ఉందా? ఇప్పుడు వారు ఏ వైపు వెళ్లారో మాకు తెలియదు. కానీ దయచేసి మీలో ఎవరైనా మీ ప్రాంతంలో ఒక ఎర్ర రంగు మారుతి స్విఫ్ట్ కారు 5555 నెంబర్ తో ఉన్నది చూసినట్లయితే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. అనూష ప్రాణాన్ని కాపాడండి.
రాష్ట్రాన్ని ఇటువంటి అవినీతి రాజకీయ నాయకుల బారి నుంచి కాపాడటం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన అనూష ప్రాణాలు తనకు మాత్రమే కాదు ఓ యువతా! మీకందరికీ కూడా అమూల్యమైనవే. దయచేసి తనని కాపాడండి ఈ సందేశాన్ని మీరంతా మీ మీ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయండి. ప్లీజ్! అంటూ శ్రీధర్ అతని స్టాఫ్ పెట్టిన పోస్ట్ కి బాగానే స్పందన వచ్చింది.
అది వెంటనే వైరల్ అయింది.
నిజానికి అంతకన్నా కాస్త ముందే సివిటాస్ ఛానెల్ లో ప్రసారమైన మంత్రి గారి వీడియో రికార్డు చేసి ఎవరో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడం, అది వేగంగా విస్తరించడం వల్ల, చాలా మంది ఈ వీడియో ని నమ్మి వైరల్ చేశారు.
ఏఎస్ పి శంకర్ కూడా పోలీసు ఫోర్సు మొత్తాన్ని అలర్ట్ చేశాడు. దాంతో ఎక్కడికక్కడ పోలీసులు ఆ కార్ కోసం చెకింగ్ చేయడం, కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరా నెట్వర్క్ మోనిటర్ చేయడం ఇలాంటి అన్ని ప్రయత్నాలు ఆయన పరిధిలో చేయిస్తూ ఉన్నాడు.
కానీ ఆ దుండగులు మెయిన్ రోడ్లలో కాకుండా సాధ్యమైనంత వరకు సందు గొందులలో దూరి ప్రయాణిస్తున్నారు.
అనూష ప్రాణం తీసేయమని మంత్రి గారు చెప్పి ఉంటే వాళ్ళు ఆ పని సులువుగా చేసేసి ఉండేవారు. కానీ ఆమెను ప్రాణాలతో పట్టి తేవాలని ఆయన ఆజ్ఞ.
సోషల్ మీడియా ప్రభావం చూపించింది .యువత అంతా ఆ మెసేజ్ ని వైరల్ చేస్తూ ఆ కార్ ను వెంబడించడం మొదలుపెట్టారు. ఇక ఏమి చేయాలో పాలు పోని ఆ రౌడీలు ఒక టర్నింగ్ లో సడెన్గా స్పీడ్ గా వెళ్తున్న కార్ లోంచి అనూషను తోసేసి చుట్టూ వెంబడిస్తున కుర్రాళ్ళకు ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపు రెట్టించిన వేగంతో వెళ్ళిపోయారు.
పరిగెడుతున్న కారులోంచి కిందకు పడిపోవడం చాలాసార్లు ప్రాణాంతకమే. అందులోనూ అప్పుడు ఆ కార్ వెళుతున్న వేగానికి అది మరింత ప్రమాదకరం.కానీ అదృష్టవశాత్తు వాళ్ళు ప్రధాన రహదారులలో కాక లోపల సందుల నుంచి వెళ్తూ ఉండడం వల్ల, ఆ మలుపు దగ్గర రోడ్డు పక్కన పచ్చిక ఉండడంతో, దానిపై పడింది అనూష. అయినప్పటికీ పడినప్పుడు ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ కుర్రాళ్ళు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. విషయం తెలుస్తూనే శ్రీధర్, అనూష కుటుంబం, పృథ్వి అందరూ పరుగు పరుగున అక్కడికి వచ్చారు.
అనూషకు ఆ దుండగులు వాడిన క్లోరోఫామ్ వల్ల మాత్రమే స్పృహ కోల్పోయిందనీ,ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని, కానీ ఆ వేగంలో పడిపోవడం వల్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని, ఆమె కోలుకునేందుకు రెండు మూడు నెలల సమయం పడుతుంది అని చెప్పారు డాక్టర్.
ప్రాణానికి ప్రమాదం లేదు అన్న డాక్టర్ గారి మాట వల్ల కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న అనూష పేరెంట్స్, వాళ్ళ బిడ్డ ఆ స్థితికి శ్రీధరే కారణం అంటూ అతనిని నిందించారు. పూర్తిగా కాకపోయినా అది కొంతవరకు నిజమే అని భావించి శ్రీధర్ వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆరోజు అనూష తన ఛానెల్లో మంత్రిగారి అవినీతికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యంతో ప్రచారం చేస్తూ ఉండగా ఆ ఛానెల్ మీద దాడి జరగటం, ఆమెని రౌడీలు కిడ్నాప్ చేయడం వంటి పరిణామాల వల్ల సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అవడం అనూషకు,ఆమె పనిచేస్తున్న సివిటాస్ ఛానల్ కి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చి పెట్టింది ప్రజల్లో.
అదేవిధంగా అనూష కోరుకున్నట్లు ప్రజల్లోనూ చైతన్యం వచ్చింది. అవినీతి మంత్రి గారికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటివన్నీ చేశారు.
ముఖ్యమంత్రి గారు వెంటనే అతడిని తన మంత్రివర్గం నుంచే కాక తన పార్టీ నుంచి కూడా భర్తరఫ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అనూష లాంటి జర్నలిస్టుల అవసరం సమాజానికి ఎంతైనా ఉందంటూ ఆమెను పొగిడారు. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చును తానే స్వయంగా చెల్లిస్తానని చెప్పారు.
శారీరకంగా చాలా బాధపడుతున్నప్పటికీ ఈ జరిగిన పరిణామాల వల్ల మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంది అనూష. దాంతో ఆమె శరీరం డాక్టర్లు అనుకున్న దానికన్నా ఇంకా త్వరగా కోలుకోగలుగుతోంది
తనకు జరిగిన ప్రమాదంలో తన ఎండి శ్రీధర్ గారి తప్పేమీ లేదని, తను ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడే, తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే ఎప్పటికైనా ఇలాంటివి ఎదురుకోక తప్పదని తనకు తెలుసునని తల్లిదండ్రులతో వాదించి వాళ్లే స్వయంగా శ్రీధర్ గారిని హాస్పిటల్ కి పిలిచేలా, తనను కలుసుకునేలా చేసింది అనూష. ఆయన కూడా రోజు వచ్చి కాసేపు మాట్లాడి వెళుతున్నారు.
హాస్పిటల్లో ఉండగానే తల్లిదండ్రులకి పృథ్విని పరిచయం చేసి, తామిద్దరూ తీసుకొన్న నిర్ణయం గురించి కూడా చెప్పింది అనూష. వాళ్ళు ఇదివరకే పృథ్వి గురించి విని ఉన్నారు. వెంటనే సంతోషంగా అంగీకరించారు. ఇలా జరుగుతున్న సంఘటనలన్నీ ఆనందాన్ని ఇస్తున్నా,
పృథ్వి తనను కలవడానికి రోజూ రాకపోవడం, వచ్చినా ముభావంగా ఉండడం చూసి చాలా బాధ కలిగింది అనూష కి.
అతని ఆ ప్రవర్తన గురించి ప్రశ్నిస్తే కూడా ముక్తసరిగా జవాబు చెప్పడంతో ఏం జరిగిందా అని ఆలోచిస్తోంది అనూష.