సమయస్ఫూర్తి

సమయస్ఫూర్తి
____________
తరుణి పత్రిక సంపాదకీయం
– డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకురాలు

మనుషులు ఎంతో అవకాశవాదులు . ఉదయించే సూర్యుడు కావాలి పడిలేచే కెరటం కావాలి. పిల్లగాలీ పల్లె వెలుగులూ అన్నీ తన కోసమే ఉండాలనుకోవడం చూస్తాం.
ఇవన్నీ కోరుకోవడం, బతుకును బాగుపరచుకోవడం తప్పుకాదు. కానీ, ఎవరో తోడు రావాలనో, ఏదైనా మేలు చేయాలనో ఎదురుచూడటమే పెద్ద తప్పు.

మానవ ప్రయత్నం చేసినా ఫలితం రానప్పుడు ఏదో చిన్న సాయాన్ని ఆశించడం లో తప్పు లేదు. అలాని సాయం అందకుంటే, ఎవరినో నిందించడం తప్పు!

ఆరోగ్యానికి పండ్లు కూరగాయలు మంచివని తెలుసు. అయినా చెట్ల గురించి మొక్కల గురించి కొంచెం కూడా ఆలోచన చేయరెవరు. రైతు కష్టానికి ఆసరాగా నిలబడి ఏ సాయమైనా చేస్తారా? చేయరు. పైగా వాటిని కొనుగోలు చేసేటప్పుడు ధరల పెరుగుదల గురించి, నాణ్యత గురించి ఉపన్యాసాలే ఇస్తారు. కాయకష్టం చేసి బలైపోయిన రైతు లు తమ పంటను కొనుక్కునే మానవ లోకాన్ని నిందించరు.
ఈ విషయాలు తెలియాలంటే కాస్తంత సమయస్ఫూర్తి అవసరం. బుద్ధి అంతశ్చేతన ను కదిలించాలి. భావ చైతన్యం రగల్చాలి. మూట విలువలనే చూస్తున్నారు తప్ప మాట విలువను చూడటం లేదు.
అందుకే కొరగాని కొడుకులు కూతుళ్ళు గానే అవుతున్నారు . తల్లిదండ్రులు తమ స్వార్థానికి పిల్లలను కంటున్నారా ? లేదు! అలా అయితే పిల్లలనూ కొనుక్కోగలరు. కానీ, వాళ్ళ ప్రేమానురాగాల చిహ్నం గా తమకు ప్రతిరూపం గా చూసుకొని మురిసి మురిసి పోయేందుకు కంటారు. పెద్దయ్యాక ముసలితనం లో తోడూ నీడ గా ఉండాలనే ఉద్దేశంతో నే కనరు. అండ దండ లో ప్రేమలో కోరుకోవడం లో తప్పు లేదు. ఇవన్నీ నిలిచి ఉండేందుకు అడుగులు వేస్తున్నారా పిల్లలైనా, తల్లిదండ్రులైనా? లేదు! దీనికీ కావలసింది సమయస్ఫూర్తే!!
బళ్ళల్లో ఉపాధ్యాయులు పాఠం చెప్పటం అనేది వాళ్ళ జీవన భృతి కోసం మాత్రమే కాదు . సమాజ సేవ కూడా!పాఠ్యపుస్తకాలు వ్యావహారిక జీవన శైలి కి అన్వయించి బోధించగలిగేది కేవలం ఉపాధ్యాయులే చేయగలరు.అటు విజ్ఞానమూ ఇటు వివేకము అందిస్తారు. మనసు కు ఎక్కించుకొని బాగుపడాల్సింది విద్యార్థులే . అర్థం చేసుకునే ప్రయత్నం చేయక చదివినంత కాలం పైపై చదువులు చదివి, బయటి ఆకర్షణ లకు లోనై పరీక్ష లలో ఉత్తీర్ణులు కావడం లేదు. తప్పినా, మంచి గుణాలు, అంటే మంచి మార్కులు తెచ్చుకోకపోయినా పొరపాటు ఉపాధ్యాయులది కాదు. ఎప్పటికప్పుడు పాఠశాల పైననో, టీచరు పైననో నిందలేస్తు తప్పులు చేస్తుంటారు. సంపాదన కోసం ఉద్యోగం చేసినా ఉపాధ్యాయుల నుండి జ్ఞానాన్ని పిండుకొని వివేకవంతులవ్వాల్సిన బాధ్యత విద్యార్ధుల దే! చదువు బుర్రకు ఎక్కకపోతే తప్పు చదువుకునేవాళ్ళదే అవుతుంది. కాని నిందపడేది టీచర్ల పైనే, స్కూల్ లపైనే. విద్య తన అభివృద్ధి కి అనే నిజం తెలుసుకుని ప్రయత్నం చేయడమే సమయస్ఫూర్తి.

ఆరోగ్యం మహాభాగ్యం అని అందరికీ తెలుసు. అయినా నిర్లక్ష్యంగా ఉంటారు మనుషులు . కాలం మీద నేరాన్ని వేసి తప్పించుకుంటారు కొందరు . కానీ మిత భోజనం మంచిదన్న విషయం పక్కన పెట్టి అతి గా తినేసి అనారోగ్యం పాలయ్యేది మనుషులే. జిహ్వ చాపల్యాన్ని తగ్గించుకోకుండా, వేళకు తినాలన్న నియమాన్ని పాటించక ఏదో కారణం వెతికేస్తుంటారు కొందరు. ఎన్నో పనులు ఎన్నో ప్రమాణాలు,ఎన్నో రకాల విషయాలు మన నిత్య జీవితంలో గమనిస్తుంటాం.
చదువుకాగానే సంపాదన వేటలో ఉద్యోగాలు చేయడం తప్పు కాదు. నిజాయితీ నిబద్ధత లేకుండా ఉద్యోగం చేయడం తప్పు.
ఇలాంటి వి తెలిసిన విజ్ఞులు చెబితే అది వినాలనే వివేకమూ కావాలి కదా! గుడి కావాలి బడి కావాలి, కూడూ కావాలి గుడ్డా కావాలి, మంచి గాలి మంచి నీళ్ళు కావాలి , గొప్ప సంపాదన కావాలి చక్కని సంసారం కావాలి … కాని వీటి వెనుకున్న వనరులూ , ప్రకృతి, ప్రజల కాయకష్టమూ, అయినవారి మానసిక ఉద్వేగాలు వద్దంటే ఎలా?
ఆలోచించండి!!
_____****____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మా ఏకాదశి ఉపవాస దీక్ష