సంకల్పం

ధారావాహికం – 7వ భాగం

పృథ్వీ అనూష ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు.  సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేయాలని భావించే వారు. ఐతే దానికి వారిద్దరూ ఎంచుకున్న మార్గాలు మాత్రం భిన్నమైనవి.

కానీ మొదటి కలయిక లోనే ఒకరిపై ఒకరికి సదభిప్రాయం,ప్రేమ కలిగాయి. అది ప్రేమే అని రూఢి చేసుకున్న తర్వాత అనూష కు ప్రపోజ్ చేశాడు పృథ్వి. ఆనందం గా అంగీకరించింది ఆమె.

ఐతే ఇకపై ఆ ప్రేమ నిలబెట్టకోగలరా అనేది చూద్దాం.

              విద్యుల్లత

 

మంత్రా కంత్రా?

ఆరోజు ఉదయం నుంచీ ‘మంత్రి గారి నిజస్వరూపం’

‘ఈయన మంత్రా  కంత్రా?’

‘పట్టణాభివృద్ధా? స్వీయ అభివృద్ధా?’

‘బకాసురుడిని తలదన్నే రీతిలో మన మంత్రి గారు’

ఇలా రకరకాల క్యాప్షన్స్ తో అనూష సేకరించిన సమాచారం చిన్నచిన్న క్లిప్పింగులుగా

‘సివిటాస్ – నవ సమాజం కోసం’  అన్న ఛానెల్ లో వస్తున్న వార్తలకు పెద్దగా స్పందన లభించకపోవడంతో కొంచెం నిరాశకు లోనయ్యారు అనూష శ్రీధర్ ఇద్దరూ.

ఆ నిరాశలోంచి కాస్త సడలింపు,మనసుకు ఊరట, అదీకాక పృథ్వి యొక్క ప్రత్యేకమైన రోజున అతనితో ఉండాలనే ఉద్దేశ్యంతో  అక్కడికి వెళ్ళింది అనూష.

అక్కడ అనుకోకుండా పృథ్వి తనకు ప్రపోజ్ చేయడంతో ‘గాల్లో తేలినట్లుందే..’ అన్నట్టు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళింది.

ప్రైమ్ టైం న్యూస్ తననే ప్రజెంట్ చేయమని ఎండి గారు చెప్పడంతో అందుకు సిద్ధమవసాగింది. ఈలోగా మంత్రిగారి మద్దతుదారులు కొందరి నుంచి ఆఫీస్ కి ఫోన్లు రావడం మొదలు పెట్టాయి.

వాళ్ల నాయకుడి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని బెదిరింపులు. మరో పక్కన కొన్ని పెద్ద చానెల్స్ నుంచి,ఈ వార్తకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తమకు అమ్మేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తామని, తాము ఆ వార్తకు ఎక్కువ ప్రాచుర్యం కల్పించగలం గనుక  ఎక్కువ మందికి అది చేరుతుందని, తద్వారా సమాజానికి మంచి జరుగుతుందని,రకరకాలుగా శ్రీధర్ కి ఎర వేసేందుకు ప్రయత్నాలు.

ఇలా జరగటం అనూష శ్రీధర్లకు బూస్ట్ లాగా పనిచేసింది. ఎంతో కొంత విజయాన్ని తాము సాధించబోతున్నామని అనుకున్నారు.

‘సివిటాస్- నవ సమాజం కోసం’  ఈరోజు ప్రైమ్ న్యూస్ ను మీకు అందిస్తున్నది మా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అనూష అంటూ అనౌన్స్ చేసింది రోజూ  న్యూస్ చదివే న్యూస్ రీడర్ వల్లి.

“నమస్కారం- ‘మన రాష్ట్రం మన నిధులు మన పాలన’

అంటూ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన నగరాన్ని సింగపూర్ లాగానో, స్విట్జర్లాండ్ లాగానో మార్చేస్తామని వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం మరియు మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రంగారావు గారి శాఖ, ఈ మూడు సంవత్సరాల కాలంలో. నగరంలో ఏ మూలనైనా ఏ కాస్తైనా అభివృద్ధి చేసిందా?

దీనికి కారణం ఏమిటి? ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదా ?లేక వచ్చిన నిధులు సరిపోవడం లేదా!

దీని గురించి నేను చేసిన ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలను ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను.

మీరే స్వయంగా చూడండి అంటూ ఒక విజువల్ ని ప్లే చేసింది అనూష.

అందులో మంత్రి రంగారావు గారు అతని పిఏ, కొంతమంది  పారిశ్రామికవేత్తలు  సమావేశమైన క్లిప్పింగ్స్ ఉన్నాయి.

ఒక పారిశ్రామికవేత్త మాట్లాడుతూ,” సార్ మా ప్రాంతంలో  చెత్త డంపింగ్ యార్డ్ ని తొలగించి ఒక రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎన్నికలలో వాగ్దానం చేసాం కదా సార్ మనం? అప్పుడే మూడు సంవత్సరాలు అవుతోంది.మా ఏరియాలో ప్రజలంతా నిలదీస్తున్నారు.టెండర్  ద్వారా ఇప్పుడు ఆ పరిశ్రమకు స్థలం ,డబ్బు కూడా. సాంక్షన్ అయ్యాయి. కానీ ఆ ఫైల్ మీ టేబుల్ పైన ఆగిపోయింది. కారణం ఏంటో చెబితే…..,” నీళ్లు నమిలాడు.

“కారణం ఏంటయ్యా కారణం!నీకు తెలియదా? నా శాఖలో ఏ ఫైల్ కదిలాలన్నా నా వాటా 40% ముందు నా ఖాతాలో జమయ్యాకే సంతకం పెట్టబడుతుందని.

నా పిఏ  మీ వాళ్ళకి ఈ విషయం స్పష్టం చేశాడు కూడా. కానీ వాళ్ళ వైపు నుంచి ఏ ప్రయత్నం లేదు. నేనేం చేయగలను?” దబాయించారు మంత్రిగారు.

“కాదు సార్ ఇది మేము లాభాపేక్ష లేకుండా, ఆ మురికివాడ అభివృద్ధి కోసం చాలా తక్కువ కోట్ చేసి టెండర్ దక్కించుకున్నాం సార్. ఈ పరిశ్రమలో కూడా వీలైనంతవరకు అక్కడి స్థానికులకే ఉద్యోగాలు కల్పించి వాళ్లను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే కాక వాళ్ళ ప్రాంత పరిశుభ్రత బాధ్యత వాళ్లపై కూడా పెట్టినట్టు ఉంటుందని అనుకున్నాం సార్. మీరు అడిగినంత పర్సంటేజ్ ఇస్తే మాకు అసలు ఇదేదీ ఆచరణ సాధ్యం కాదు.” నసుగుతూ చెప్పాడా వ్యక్తి.

“ఏంటయ్యా సమాజం ,అభివృద్ధి? ప్రతివాడికీ ఇదొక పెద్ద గొప్ప అయిపోయింది. ఆ ముఖ్యమంత్రి గారు ఇదే మాట్లాడుతారు. మాకు పెద్ద పెద్ద అవకాశాలు లేకుండా చేస్తున్నారు (స్వాహా చేసేందుకు).

ఇక మీరు కూడా ఇదే మాటలు మాట్లాడితే మేము చిప్పెత్తుకోవాలా? మళ్లీ ఎలక్షన్లలో ఓటుకు 500 పడేసి, ఓ సీసా ఇచ్చేస్తే ఓటేసే ఆ అలాగా జనం గురించి మాకు చెప్తున్నావ్?

నేను చెప్పిన పర్సంటేజ్ ఇస్తేనే ఆ ఫైల్ కదులుతుంది. లేదంటే ఇక నువ్వు కదలొచ్చు,ఓ వచ్చేస్తారు… (చెడ్డ మాట).

“సరే సార్, మీరు చెప్పినట్లు మేము చేయలేం. అలా చేసే వారికే మీరు ఆ టెండర్ ఇచ్చుకోండి. నేను వెళ్ళొస్తా.”

“సరే పో, ఆ…   నీదేంటయ్యా?

“అదే సర్, ఆ……. నగర్ లో ఓవర్ బ్రిడ్జి, చెరువు చుట్టూ పార్క్ వాటి నిర్మాణం కాంట్రాక్టు నాకే ఇప్పిస్తానన్నారు. పర్సంటేజ్ వివరాలన్నీ మీ పీఏతో మాట్లాడేసాను సార్.”

“అవునా. ఏంటి  పి ఏ, ఓకేనా.?”

“ఓకే సార్, మంచి పార్టీ.  ఇలాంటి వాళ్ళకి ఎన్ని కాంట్రాక్టులైనా ఇప్పించొచ్చు.”

“అదీ లెక్క. సరేనయ్యా, నీ పని అయిపోతుంది లే. మనం మనం ఒకటిగా ఉంటే పనులు సులువుగా అయిపోతాయి. అర్థం చేసుకోవాలి‌ సరే నువ్వు వెళ్ళు‌ నీ పని అయిపోతుంది లే.

ఇందాక అతను చెప్పిన ఫ్యాక్టరీ పని కూడా మన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు ఇచ్చేద్దాం. ”

“సరే సార్,మీరు అంతగా చెప్పాలా?నేను చూస్తాను లెండి, వెళ్ళొస్తాను సార్.”

“ఆ సరే,ముందు కొంత అమౌంట్ ఆ అకౌంట్ లోకి పంపించు, మా పి ఏ ని అడిగి. టచ్ లో ఉండు.”

“తప్పకుండా సార్”వంకర నువ్వు నవ్వుతూ బయటికి కదిలాడు  అతను.

“చూశారు కదండీ! ఇదే మా స్టింగ్ ఆపరేషన్ లో బయటపడిన మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారి నిజస్వరూపం.

ముఖ్యమంత్రి గారి దగ్గరా, బయట ప్రజలలో చాలా మంచివాడుగా నటిస్తూ, మన అందరినీ మోసం చేస్తున్న ఈయన లీలలు చూడండి, నిజం తెలుసుకోండి.” ప్రజలారా మీ అందరి సహకారం ఉంటే మా ఛానెల్ మీకోసం ఇలాంటి ఎన్నో నిప్పులాంటి నిజాలు నిర్భయంగా బహిర్గతం చేస్తుంది.మరికొన్ని విశేషాలు బ్రేక్ తర్వాత .

సివిటాస్ -నవ సమాజం కోసం,”

గంభీర స్వరంతో అనూష చెప్తుండగా శ్రీధర్ దానిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఛానెల్లో ని మిగతా వారంతా ఏం జరుగుతుందో అనే ఆసక్తితో కొంత, ఆందోళనలో కొంత ఉన్నారు.

అయితే వీళ్ళ ఛానెల్ లో ఇది ప్రసారం జరుగుతుండగానే,ఆ మంత్రి గారి చెంచాలైన ఇంకొక ఛానెల్ లో ఆ మంత్రి గారు ఈరోజు వరకు చేసిన వివిధ ప్రజా కార్యక్రమాలు, దానాలు, ధర్మాలు, యాగాలు అన్నీ ప్రసారం చేయడం, మంత్రిగారి గొప్ప మనసుని శ్లాఘిస్తుండటం

చూస్తూ నవ్వుకున్నారు శ్రీధర్ అండ్ టీం.

ఇంతలో ‘ఢాం’ అంటూ పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.

మంత్రిగారి కిరాయి మనుషులు బాంబు దాడి చేశారేమోనని అనుకున్నారు అందరూ. ప్రాణ భయంతో అటూ ఇటూ పరిగెత్తారు. కరెంటు పోయింది.చిమ్మ చీకటి. గందరగోళం .ఒక రెండు, మూడు నిమిషాల పాటు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు.

 

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అరెరె ! ఏమైందంటే?

మహిళామణులు