ముద్దుగున్న పిల్ల! ఆ రాచబిడ్డ,
గారబంగ సాదిన పొల్ల!
చీనీచీనాంబరాలల్ల సుట్టిన మూట పట్టుకొని, యాడకు పోతాందో?
యేమోనవ్వ ! యెవలకు తెలుసు? అనుకోబట్టే కాలం!
అడుగుదీసి అడుగేస్తాంటే
ఎఱ్ఱ మందారాలు కనపడతన్నయ్!
గుడ్ల నీళ్ళు సుడితిరుగుతున్నయ్!
ఏడుపాపినా.. ఏక్కిళ్ళాగుత లేవు!
కంటి పాపలు మంకెన పూలాయే!
దానిమ్మ మొగ్గస్వంటి ముక్కు ఎగబీల్చి ఎగబీల్చి… దానిమ్మ గింజలోలె ఎఱ్ఱగాయే!
మనసుకు సోకం పెట్టి- పట్టు గుడ్డల మూటల చంటి పోరగాణ్ణి ఎత్తి- ఇగ గంగల వదిలెనా?
ఏమైందవ్వా? పొల్లకు? ఏం చేటుకాలమొచ్చె?
అని గంగగట్టుకు బాధతో ఒరుసుకుంట పారే!
అరెరె! ఏమైందంటే ఏం సెప్తం?
మరేందవ్వా? గాపిల్లకు రంధి లేదనుకున్నవా?
ఆమె మున్నీటంత లోతుగల పిల్ల!
గందుకే కన్నీటి కడవలను మింగింది!
చెప్పాలంటే చిన్నాచితకా మతలబా?
లగ్గమై పెనిమిటి సరసమాడితేనే
ఎవలకు చెప్పుకోరాయె!
మనసు పడినోడితో యవ్వారం ఎవరికి చెప్తరు?
ఉడుకు నెత్తురాయె! ఉప్పలి తెలియదాయె!
మనువు కాకముందు మరులుకొనుడంటే?
చెంగున అంగారం కట్టుకున్నట్టేనాయె!
మొగోడ్నైతే రసికుడంటరు!
ఆడదైతే బరితెగించిందంటరు!
తప్పులో ఆడా-మగా సమానమేనాయె!
పాడులోకం- పక్షపాతమే చూపే!
ఆడదానికెందుకో మచ్చ?
మొగోడికి నలుపంటదా?
తెల్వని తనంలో మంచి- చెడేమెరుక?
కన్నె- కన్నతల్లాయె!
మాయమాటలు చెప్పి- మస్రపతి మిన్నుచేరె!
అపవాదుకు- బెక్కున బెంగటిల్లె!
భీరిపోయి కడుపుతీపికి- కక్కసపడె!
కార్జాలు కాలిపోతుంటే- పానం లెక్కసేయక
రామసక్కదనపు-పిల్లగాణ్ణి పసిడి డిబ్బీలపెట్టె!
బురుగు దాయ – జన్కుకుంట గంగ పాలుచేసె!
పైకిసూడ తెగింపనిపించె!
పిడికెడు గుండెలోన- కడివెడు నిప్పులాయె!
అరెరె ! ఏమైందంటే? ఇంకేం కావాలే?
ఎదగని పిల్ల తల్లాయే.. పాడులోకమాయె!
గప్పుడేమైయ్యిందీ?
పరేషాన్ గావట్టే- గా రాజుబిడ్డ!
ఏం జేయాలని మనసున పడ్తలేదు!
జీవిడ్షి పెడుడామంటే దైర్నం లేకపాయె!
పేగు పాశం దెంపుకొను రగస్యమేమో ?
ఊడల మఱ్ఱి కొమ్మల్ల శిల్క పానమోలె శిక్కిపాయే!
కడుపుల కిటుకు- కాలుతొక్కించుకుంటే గుటుక్కమంటదని;
అయ్య దెచ్చిన అల్లునికి ఆలి ఆయె!
ఇగ చూస్కోండ్రి! ఇన్ని- అన్ని కష్టాలు కాదాయె!
ఏం పొల్లనో? కష్టాలకు తెగతెంపు లేకపాయె!
ఇంటాయనకు జడదారి శాపం పెట్టంగ
సంతులేదని పెనిమిటి అటమట పడబట్టె!
దేవుండ్లకు మొక్కి ముగ్గురు పొల్లగాండ్ల తల్లాయె!
సీతమ్మ సెరలోలె ! ఏం సెప్పుదు? ఆమె కట్టం!
పెనిమిటి పాణాలొదిలె!
సౌతి పిల్లల బారం తనమీద బడి సాది, సవరించే,
అప్పుడేమైయ్యిందంటే-ఏం చెప్దు?
మొగని దొరతనం- బావతానుండె!
కొడుకుల దొరలు సేయ – పనిగొనె ఆ పడతి!
ఏందవ్వో? గదేమన్నా శిన్నా శితకా పనా?
దొరతనమొచ్చుడంటే? శింతపిక్కలాటనా?
మరేంసోచాయిందవ్వా ఆ సకియ ?
సంబళం చేసుకోని బతుకీడ్వ దొరల పని కాదాయె,
దొరలు కావాలంటే విద్దెలెన్నో నేర్వాలి!
విద్దెలేడ నేర్వాలి? రాచవీడు చేరాలి!
వామ్మో ! ఎంత కష్టమెంత కష్టమొచ్చె?
ఆడుదానికదంత అల్కనైన పనికాదు!
ఈ పిల్లలు మొగని అసలైన సంతుకాదు!
ఏమని చెప్పి ఒప్పింతునని?గుండె వల్గే!
మనువు కాకముందు మగసంతును కన్న సంగతి, తల్స్క- తల్స్క గుండెలోన కుములించె!
అదిసరే! అప్పడేమైయ్యిందీ అదిసెప్పు!
లోతుగల నాతి గద్దరై, నిలకడతో సంతుతోని
బుద్ధులెన్నో చెప్పి చెప్పి- రాచవీడు తోవబట్టె!
అట్టిగ అయ్యే పనికాదది!
ఇక మతులెన్నో చెప్పి- ఇల్లు జొచ్చె!
పాలోండ్లను పల్లెత్తు మాటనక – ఇగరంతో,
పన్నుగడతోనే- కాలమెళ్ళబుచ్చే!
అప్పుడేమైయ్యిందో? జర ఇనుకుందురూ
******
పరేషాన్= మనసు కకావికలం కావడం
జీవి= ప్రాణి
దమ్ము= ధైర్యం
రగస్యం= రహస్యం
కిటుకు = రహస్యం
కాలు తొక్కించుకోవడం= పెళ్ళి చేసుకోవడం.
జడదారి= ముని
దొరతనం = రాజ్యం
సంబళం = కూలీనాలీ
అల్కన = తేలిక
గద్దరి = ధైర్యం
అటమట:: దుఃఖం