అమ్మ ఫొటో

పుస్తక సమీక్ష

తెలుగు పాఠకులకు హాస్య రచయిత్రి అనగానే గుర్తుకు వచ్చే పేరు శ్రీమతి. పొత్తూరి విజయలక్ష్మిగారు. హాస్యం చాలా మందే రాస్తారు కానీ వీరి హాస్య రచనలల్లో చేసే పదప్రయోగం విలక్షణంగా ఉంటుంది. మామూలుగా మాట్లాడుకునే పదాలే భలే గమ్మత్తుగా వాడేస్తారు. “బోలెడు సరదాపడ్డాడు,” “సరదా వేసింది,” “సరదాగా ఉంది” అని ఒక్క సరదా అనే పదాన్నే తిప్పితిప్పిసరదాగా  రాసి మనలను సరదాలో పడేస్తారు. అసలు ఆ పదాల అమరికతోనే హాస్యం అలవోకగా పండించేస్తారు. వీరి రచనలు చక్కని కథా వస్తువు, సునిశిత హాస్యం, కొన్ని సార్లు మోతాదు మించని కొంత వ్యంగ్యంతో కూడిన రచనా శైలితో పాఠకులను ఏకబిగిన కథలను చదివిస్తాయి. దాదాపుగా అన్నీ కుటుంబం, కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతుంటాయి.

విజయలక్ష్మిగారు  దాదాపు 200 కథలు, 14 నవలలు, 200 పైగా వ్యాసాలు, వివిధ పత్రికలలో కాలమ్స్ వ్రాసారు. అందులో 3 సినిమాలు, 2 టీవీ సీరియల్స్ గా రూపొందించారు. విజయలక్ష్మిగారి రచనలు రేడియోలో నాటికలుగా ప్రసారమయ్యాయి. వీరు రాసిన హాస్య కథలు ‘పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు’, ‘ మా ఇంటి రామాయణం’, ‘చంద్ర హారం’, ‘అందమె ఆనందం,’ ‘సన్మానం,”కొంచం ఇష్టం కొంచం కష్టం,’ ‘స్క్రిప్ట్ సిద్దంగా ఉంది సినిమా తీయండి!,’ ‘పూర్వి,”జీవన జ్యోతి,”జ్ఞాపకాల జావళి,’ ‘nostalgia’,‘ఆ 21 రోజులు కాసిని కథలు కాసిని కబుర్లు’, ‘అమ్మ ఫొటో‘అనే హాస్యకథా సంపుటాలుగా వెలువడ్డాయి. అంతే కాదు ఇంకా అవధానాలలో అప్రస్తుత ప్రసంగం కూడా చేస్తారండోయ్.

పొత్తూరి విజయలక్ష్మి

విజయలక్ష్మిగారు వారి రచనలకు పురస్కారాలు, అవార్డ్ లు, సాహితీ శిరోమణి, హాస్య కళాపూర్ణ బిరుదులు చాలా అందుకున్నారు. వారు స్వయముగా అందుకోవటమే కాకుండా, వారి తల్లిగారు శ్రీమతి.వల్లూరి సత్యవాణిగారి పేరిట “మాతృదేవోభవ” పురస్కారం సహరచయతలు ఇచ్చి సన్మానించారు. లేఖిని సాహిత్య సమూహములో అధ్యక్షురాలిగా సాహితీ సేవలను అందిస్తున్నారు. వ్యక్తిగతంగా చాలా స్నేహశీలి.

“మళ్ళీ మీ ముందుకు వచ్చాను” అంటూ ‘అమ్మ ఫొటో‘ కథల సంపుటితో వచ్చారు పొత్తూరి విజయలక్ష్మిగారు. ఇది వారి పదిహేడవ పుస్తకం. ఇందులో పదమూడు కథలు, సహరి అంతర్జాల వార పత్రికలో వీరు రాసిన ‘ఖట్టా.. మీఠా’ కాలం ఉన్నాయి. ఈ కథలన్నీ ప్రింట్ మరియు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడినవి. ఈ పుస్తకమును రచయిత్రి స్వహస్తాలతో, సంతకము చేసి నాకు ఇచ్చారు. విజయలక్ష్మిగారూ మీ అభిమానం కు ధన్యవాదాలండి.

ఈ కథా సంపుటిలో నన్ను కదిలించిన రెండు కథలను క్లుప్తంగా పరిచయం చేస్తాను.

తండ్రి మొదటి సంతానంకు ఇష్టంగా సీత అని పేరు పెట్టుకుంటాడు. తల్లి సీత అని పేరు పెడితే కష్టాలు వాస్తాయిరా అంటే పుట్టుకతో అవకరం ఇంకేం వస్తాయిలే అనేసాడు.సీతకు పుట్టుకతోనే గూని ఉంది. సీతకు ఏడాది వయసు వచ్చేసరికి ‘గూని ‘ అని పేరుకు ముందు వచ్చి చేరింది. సీతకు ఒక తమ్ముడు, చెల్లెలు పుట్టారు. వాళ్ళు బాగానే ఉన్నారు. మామూలు రెక్కాడితే కాని డొక్కాడని పల్లెటూరిలోని సంసారాలు వాళ్ళవి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. తమ్ముడు, చెల్లెలు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి సంసారం వాళ్ళు బతుకుతున్నారు. తల్లికి, తండ్రికి సీత గురించి దిగులు. ఏదైనా సంబధం చూసి పెళ్ళి చేస్తామంటే, తోడేమో కాని మరిన్ని సమస్యలు వస్తాయని సీత ఒప్పుకోదు. తల్లి చనిపోయాక తండ్రి తమ్ముడి దగ్గరకు వెళుతాడు. సీతను కూడా రమ్మంటారు కానీ సీత వెళ్ళదు. ఏదో ఒక పని చేసుకుంటానని బరువు పనులు చేయలేదు కాబట్టి ఓ పలహారాల బండి దగ్గర పనికి చేరుతుంది. అక్కడ పరిచయం అయిన సత్యారావు సీత కు లోయర్ టాంక్ బండ్ దగ్గర ఉన్న భారత్ సేవాశ్రమం లో పని ఇప్పిస్తాడు. సేవాశ్రమంలో ప్రతిరోజూ శ్రాద్దకర్మలు జరుగుతుంటాయి. అక్కడ రోజంతా ఏదో ఒక పని ఉంటుంది.నెలకు పదిహేను వందలు జీతముంటుంది. అది కాక అక్కడ రోజూ బోలెడన్ని ఆహారపదార్ధాలు మిగిలిపోతుంటాయి. అవన్నీ పని వాళ్ళకు పంచేస్తారు. సీత లోయర్ టాంక్ బండ్ పక్కనే ఉన్న ఒక చిన్న బస్తీలో ఒక గది అద్దెకు తీసుకొని ఉంటుంది. అక్కడ ఉండేవారంతా ఆటో డ్రైవర్ లు, ఆయాలు మొదలైన పనులు చేసుకొని బ్రతికే బడుగుజీవులు. ఒకరికి ఒకరు సహాయం గా ఉంటుంటారు. సీత తను తెచ్చిన ఆహారపదార్ధాలు అక్కడివారికి పంచుతుంటుంది. అట్లా తన మంచితనంతో అందరితో కలిసిపోయి ఉంటుంది సీత.

పొత్తూరి విజయలక్ష్మిగారితో సమీక్షకురాలు మాలాకుమార్

తనకు ఉన్న అవకరంతో బాధపడిపోతూ తమ్ముడు, చెల్లెలి మీద ఆధారపడి, వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసుకుంటూ పడి ఉండకుండా  ఆత్మవిశ్వాసంతో తన బ్రతుకు తను బతకటము చాలా గొప్పగా ఆ పాత్రను మలిచారు రచయిత్రి. అంతే కాదు అమ్మాయి వంటరిగా ఉంటే మగవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొవటము, బస్తీలల్లోని వారిని చెడుగా చూపటము వంటివి లేకుండా ఒక పాజిటివ్ వేవ్ తో, చక్కని సందేశాత్మకంగా ఉందీ కథ.

నా మనసును కలిచివేసిన, నన్ను వెంటాడుతున్న మరో కథ, ఏ బంధమూ వద్దనుకొని కొన్ని కారణాల వల్ల తల్లితండ్రులకు దూరంగా, పద్మ అనే అమ్మాయితో సహజీవనంసాగిస్తున్న శ్రీను కథ “బంధం.” అసలు ఇది శ్రీను కథ కాదు కౌసల్య కథ. ఒకరికి ఒకరుగా జీవిస్తున్న దంపతులలో ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే, దూరమైన జీవన సహచరుడు లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక, నమ్మలేక ఉన్న ఓ ఇల్లాలి కథ ఇది.

విజయలక్ష్మిగారూ మీరు నవ్వించటమే కాదు. ఇంతలా ఏడిపిస్తారు కూడాని నేను అనుకోలేదండి.

బంధంలో పిచ్చితల్లి కౌసల్య మనసు మెలిపెట్టేస్తోంది.

కళ్లలో నీళ్లు ఆగటం లేదు.

ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను నేను.

“గజల్” కథలో హాయిగా ఉన్న శ్రావణిని అలా ఇబ్బంది పెట్టటం న్యాయమా?

‘ చిఠ్ఠీ న కోయి సందేష్,

నా జానె ఓ కౌన్ స దేశ్ జహా తుమ్ చలే గయే.’

ఇవి కొన్ని కథల గురించి మాత్రమే! ఇవి కాక పొత్తూరివారి మార్క్ హాస్యకథలు, చక్కటి ఖట్టా.. మీఠా కబుర్లు కూడా ఉన్నాయి. అవన్నీ చదువరికే చదవని వదిలేస్తున్నాను.

ఈ పుస్తకం కాపీలు కొన్నే ఉన్నాయట. మరి త్వరపడి కొనేసుకొని చదివేయండి.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంటింటి కళ

గజల్ చతురస్ర గతి