నీ స్నేహమే…

కథ

అరుణ ధూళిపాళ

నల్లని తారు రోడ్డుపై ఒకే దిశగా కారు వింటి నుండి వదిలిన బాణంలా దూసుకుపోతోంది. నేషనల్ హైవే కావడం, చేరాల్సిన
గమ్యం చాలా దూరంలో ఉండడం వల్ల కూడా వేగం పుంజుకుంది.
కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఎఫ్ ఎమ్ రేడియో పాటలు వింటూ కబుర్లతో మైమరచిపోతున్నారు.

వెనుక సీటులో కూర్చున్న అరణ్య తన వెంట తెచ్చుకున్న డైరీలో ఏదో కవిత రాసుకుంటూ, మధ్య మధ్య వాళ్ళ మాటలను వింటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ అందమైన పదాలను వెతుక్కుంటోంది. పిల్లలకు తెలుసు ఆ లోకంలో ఉంటే అరణ్య బయటకు రాదని. అందుకే ఇబ్బంది పెట్టకుండా ఆమె ప్రపంచంలో ఆమెను వదిలేస్తారు. అలాగని ఒంటరిగా వదిలేస్తారనుకోవడం పొరపాటు. ఆమెకు నచ్చిన పనిలో ఆమె బిజీగా ఉండడమే వాళ్లకు కావలిసింది. అందుకే అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళ సరదాల్లో వాళ్ళు మునిగారు.

ఉన్నట్టుండి “ఈ రోజు స్నేహితుల దినోత్సవ సందర్భంగా మీ కోసం డా.సి. నారాయణ రెడ్డి గారు రాసిన అద్భుతమైన ఈ పాట… విని ఎంజాయ్ చేయండి” అంటూ హస్కీ గొంతు అనౌన్స్ చేసింది.

“గున్న మామిడీ కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామ చిలకుంది. ఒక గూటిలోన… కోయిలుందీ”…
పాట మొదలవగానే అరణ్య చేతిలోని పెన్ను ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. పిల్లలకు కనిపించ కూడదని ముఖం విండో వైపు తిప్పి కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది. ఎందుకిలా జరిగింది? మనసు ప్రశ్నించింది? చేసింది నిజంగానే అంత పెద్ద తప్పా? అవుననడానికి అంతరాత్మ అంగీకరించలేదు. దీనికి ఇంత శిక్ష ఎందుకు? మళ్లీ సమాధానం లేని ప్రశ్న…. ఆలోచనలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. అలాగే సీటు వెనక్కి వాలి, ఆ ఆలోచనలతో తానూ నాలుగు దశాబ్దాలు వెనక్కి పరుగెత్తింది.

అరణ్య వాళ్ళ నాన్నగారు చిన్నతనంలో మరణించడం, ఆయన టీచరు కాబట్టి ఆ ఉద్యోగం వాళ్ళ అన్నయ్యకు రావడం జరిగింది. ప్రమోషన్ మీద ఇంకో టౌన్ కు మారాల్సి వచ్చింది. ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుని ఇక్కడికి మొత్తం కుటుంబం వచ్చారు. అప్పుడు అరణ్య 8వ తరగతి చదువుతోంది. అక్కడే తనకు వినోదతో పరిచయం ఏర్పడింది. వీళ్ళు అద్దెకు దిగిన ఇంటి యజమాని కూతురు వాళ్ళింటికి దగ్గరలో ఉన్న వినోద వాళ్ళింటికి తీసుకెళ్లి అరణ్యను పరిచయం చేసింది. వినోద చదివే గర్ల్స్ కాలేజీ లోనే అరణ్య జాయిన్ అవడం, విచిత్రంగా ఇద్దరిదీ ఒకే క్లాసు, ఒకే సెక్షన్ అవడం ఆ పరిచయానికి బలాన్ని పెంచింది.

వీళ్ళు ఉండే కాలనీకి, స్కూల్ చాలా దూరం ఉండేది. అందునా అది షిఫ్టు సిస్టమ్ లో ఉండేది. ఉదయం హైస్కూలు తరగతులు, మధ్యాహ్నం జూనియర్ కళాశాల తరగతులు నడుస్తుండేవి. సౌకర్యాలు ఏవీ లేక తప్పనిసరిగా నడకే శరణ్యం కావడం వలన మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. మెల్లమెల్లగా వీరి బంధం బలపడసాగింది. కాలనీలో ఇళ్లు పెరిగి చదువుకునే వారి సంఖ్య పెరిగినా వీరి మధ్య దూరడానికి సూది మొనంత సందు కూడా ఉండేది కాదు. ఎంతమందిలోనైనా వీరిద్దరి లోకమే వేరు. రోజంతా కలిసే ఉన్నా సాయంకాలం ఇంటికి దగ్గర్లో ఉన్న శివాలయం వెనక్కు వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. ఎంత మాట్లాడుకున్నా ఊటలా ఊరుతూనే ఉండేవి. తెల్లవారగానే మళ్లీ ముచ్చట్లకు ఎదురు చూపులు. ఆలస్యమవుతున్న కొద్దీ ఎంత దిగులో???

చూస్తుండగా రోజులు గడిచిపోయాయి. అదే కాలేజీలో
ఇంటర్మీడియట్ లో చేరారు. అయితే అరణ్య ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే, వినోద సైన్స్ గ్రూప్ తీసుకుంది. అయినా తేడా ఏమీ లేదు. తెలుగు సార్ అన్నా, హిస్టరీ మేడం అన్నా చాలా అభిమానం వీళ్లకు. హిస్టరీ మేడం కొత్తగా జాయిన్ అయింది ఆ కాలేజీలో. వాళ్ళిల్లు మధ్యలో ఉండడం వల్ల కలిసి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అందరూ కలిసి సాయంత్రం టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు. అరణ్య టేబుల్ టెన్నిస్ లో విజేతగా నిలిచింది. పాటలు, వక్తృత్వ, వ్యాస రచనల పోటీలలో చురుగ్గా పాల్గొనేది. కళాశాల ఎన్నికల్లో వినోద కల్చరల్ సెక్రటరీగా ఎన్నికయింది. తెలుగు సార్ వాళ్ళిల్లు కూడా వీళ్ళ కాలనీలోనే కాబట్టి అడపా దడపా ఇంటికి వెళ్ళేవాళ్ళు.

వీళ్ళు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే వీళ్ళ ఇంటికి దగ్గర్లో ఒక కుటుంబం దిగారు. అందులో ఒక అమ్మాయి అంకిత. ఆమె కూడా అదే కాలేజీలో చేరింది. అనుకోకుండా ఆమె వీళ్ళ స్నేహంలో కాలు మోపింది. అంతకుముందు ఎంతోమంది వీళ్ళిద్దరితో కలవడానికి ప్రయత్నించారో, విడదీయడానికి ప్రయత్నించారో లెక్కలేదు. కానీ దైవవశాత్తు ఈ అమ్మాయి వీళ్ళలో కలిసి లతలాగా అల్లుకుంది. అరణ్య, వినోద ఆ అమ్మాయిని ఆత్మీయంగా స్వాగతించి
వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఇచ్చారు. మూడు రేకులుగా విచ్చుకున్న స్నేహం ఆనందమయమై ఎన్నో మధుర జ్ఞాపకాలను
పొదవుకుంది. బఠాణీలు, జామకాయలు, చాక్లెట్లు వాళ్ళ నడకతో పాటు నడిచాయి. ఇతరులను అనుకరిస్తూ కామెంట్ చేస్తూ నవ్వుకోవడాలు, సినిమాలు స్నేహంలో భాగమయ్యాయి. ఎక్కడ చూసినా చిరునవ్వుల చిత్రాలుగా కనిపిస్తూ అందరు ఈర్ష్యపడే స్నేహాన్ని సొంతం చేసుకున్నారు ముగ్గురూ.

కాలానికి సంకెళ్లు లేవు కదా! పరుగు తీయడమే దాని పని.
ఆ మార్పులకు తగినట్టు ముగ్గురికీ వివాహాలు అయినాయి. అరణ్య, వినోదలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ముగ్గురికీ లభించిన భర్తలు వీళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకున్నవారు కావడం వల్ల వీరు మాట్లాడుకోవడానికి, కుదిరినప్పుడు కలుసుకోవడానికి అభ్యంతరం ఉండేది కాదు. అయినా ముగ్గురిలో ఏదో వెలితి. వివాహం ఎందుకు చేసుకున్నామని గమ్మత్తైన ఆలోచన. ఆ ఆలోచనకు మళ్లీ నవ్వుకునేవారు. కాలం ఇంకా ముందుకు పరుగెత్తి వినోదను, అంకితను విదేశీ తీరానికి చేర్చింది. ఇద్దరిలోనూ చదువులో మెరుగ్గా ఉండే అరణ్య ప్రయివేట్ జాబ్ కి పరిమితమైంది.

అయితేనేం? అవధులు లేనిదే స్నేహం కదా! కాబట్టి నాగరికతా చిహ్నమైన సెల్ ఫోనులు వాళ్లను మరీ దగ్గరికి చేర్చాయి. ప్రత్యక్షంగా చూసుకోవడంతో పాటు ఎన్ని గంటలైనా మాట్లాడుకునే అవకాశం ఉండడంతో నాలుగు దశాబ్దాలుగా స్నేహ లతలు ఎగబాకుతూ పరిమళాలను వెదజల్లుతున్నాయి.

ఎవ్వరూ విడదీయలేని స్నేహాన్ని చూసి విధికే కన్నుకుట్టిందేమో? అకస్మాత్తుగా ఒక సన్నని పొర అరణ్యకు, వినోదకు మధ్య నిలిచింది. వారి స్నేహ తటాకంలో గులక రాయిని విసిరి కల్లోలాన్ని సృష్టించింది. కళ్ళు మూసుకొని ఆలోచనల్లో నిమగ్నమై దుఃఖభారాన్ని అదిమి పడుతున్న అరణ్యకు తన వేదన అరణ్య రోదనే అనిపించింది. ఎందుకిలా జరిగింది?? పదే పదే ఆ ప్రశ్న మనసును అతలాకుతలం చేస్తోంది. ఆలోచనలు ఇంకా ముందుకు వేగంగా కదిలాయి.

జరిగిందంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. వినోదకు రక్త సంబంధీకుడు గిరీశ్. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా మాటలు లేవు. చిన్నప్పటి నుండీ వినోద వాళ్ళ కుటుంబంలో అరణ్యకు అందరూ బాగా దగ్గరైన వాళ్లే. సాంకేతికత పెరిగిన కారణంగా, అరణ్యకు కవిత్వం అంటే ఉన్న ఇష్టం వల్ల తనకు తెలియకుండానే గిరీశ్ ఉన్న ఒక సాహితీ సమూహంలో ఇంకెవరి ద్వారానో సభ్యురాలిగా చేర్చబడింది. ఈ విషయం వినోదతో కూడా చెప్పింది అరణ్య. నాకు అతని విషయాలు ఏమీ చెప్పవద్దని అతని మీద తన కోపాన్ని వ్యక్తం చేసింది వినోద. ఈ సమయంలోనే గిరీశ్ “తాను ఒక నవల రాశానని దానికి అరణ్యను ప్రూఫ్ చూడమని” అడిగాడు. స్వతహాగా ఇలాంటి విషయాలు తనకు ఎంతో ఇష్టం కాబట్టి సరేనని ఒప్పుకొని ప్రూఫ్ చూసి పెట్టింది. “పుస్తకావిష్కరణకు ప్రముఖ కవిని పిలుస్తున్నానని, నవల ఆసాంతం చదివి, తప్పులు దిద్దిన నీవు వేదిక పైన పుస్తకాన్ని గురించి మాట్లాడవలసిందిగా” అరణ్యను కోరాడు. సాహిత్యంపై తనకున్న ఆసక్తి, వేదికపై ప్రముఖుల మధ్య మాట్లాడే అవకాశం, వీటన్నింటి కంటే సమూహంలో అందరి ముందు అడిగినదానికి కాదనలేక, వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పలేక అంగీకరించింది. తనకు అతని గురించి ఏమీ చెప్పొద్దన్న వినోదకు ఈ విషయం చెప్పే సాహసం చేయలేకపోయింది అరణ్య.

అక్కడే మొదలయింది అసలు సమస్య. ఈ విషయం తెలిసిన వినోద అగ్గిమీద గుగ్గిలం అయింది. “నలభై ఏళ్ల స్నేహానికి ద్రోహం చేశావని, వెన్నుపోటు పొడిచావని, నాకు పనికిరానివాడు, నేనంటే లెక్కలేనివాడు నీకు ఆత్మీయుడయ్యాడా” అని నిలదీసింది. తన బాధలో న్యాయం ఉంది. ఇన్నిరోజులు వాళ్ళ మధ్య ఉన్న దూరం వల్ల కలిగిన ఆవేదన ఉంది. దాన్ని తాను అర్థం చేసుకోగలదు. అందుకే జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకుంది అరణ్య. ఎన్నో విధాలుగా నచ్చచెప్పింది. అయినా వినోద కరగలేదు. మాట్లాడడం మానేసింది. ఎన్నిసార్లు మెసేజ్ లు పంపినా సమాధానాలు లేవు. చివరికి అరణ్య పుట్టినరోజుకు విషెస్ కూడా చెప్పనంత కోపాన్ని పెంచుకుంది.

అరణ్య బాధ తీరనిదయ్యింది. ఏం చేస్తే నెచ్చెలి తిరిగి దగ్గరవుతుందో అర్థం కావట్లేదు. స్నేహం అంటే ఇదేనా?? ఎల్లలు లేనిది, క్షమించేదీ, పొరపాట్లను సరిదిద్దేది, ప్రతీకార వాంఛ లేనిది, ప్రత్యుపకారం కోరనిదీ, వర్గ వర్ణ విభేదాలు లేనిదీ అంటారు కదా?? దీనికి ఇంత పెద్ద శిక్ష ఏంటో తనకు తెలియడం లేదు. ఈ జీవితానికి ఈ స్నేహం ఇక్కడితోనే ఆగిపోతుందా? ఆ ఊహ తనను కుదురుగా ఉండనివ్వడం లేదు. వినోద ఇంత పట్టుదల చూపించడం నచ్చడం లేదు. కోపాన్ని చూపించడానికి స్నేహితులపైన అధికారం కూడా ఉంటుంది కదా! ఏమీ లేకుండా మౌనం ఏమిటి? ఏదైనా అద్భుతంతో కాలం వెనక్కి జరిగి ఇప్పటిదాకా జరిగిన కల్లోలం లేకుండా పూర్వపు స్నేహం తిరిగొస్తే బాగుండు.

కంటిలోంచి నీళ్లు చెక్కిళ్ళ మీదకు జారాయి. ఏదో స్పర్శకు కళ్ళు తెరిచి చూసింది. “వినోద ఆంటీ గుర్తొచ్చిందా?”లాలనగా అడుగుతున్న కూతురిని చూసి తల పంకించి పేలవంగా నవ్వింది.
సమస్యను సృష్టించిన కాలమే పరిష్కారం చూపాలి అనుకుంది బాధగా నిట్టూరుస్తూ…
మరో నెలరోజులు భారంగా గడిచాయి. ‘హాయ్ అరణ్యా!’
వినోద నుండి మెసేజ్. ఆనంద హరిణమై గంతులేసింది అరణ్య మనసు. స్నేహమెప్పుడూ శాశ్వతమే అనుకుంది హాయిగా.. రిప్లై ఇవ్వడానికి రెడీ అవుతూ..

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కార్తీక మాసపు విశిష్టత

వంటింటి కళ