1933 ,డిసెంబర్ 15 న గుంటూరు జిల్లా చేబ్రోలులో వాసిరెడ్డి రాఘవయ్య – రంగనాయకమ్మ దంపతుల కుమార్తెగా జన్మించారు. ఐదవ తరగతితోనే చదువు ఆగిపోయినప్పటికీ పట్టుదలతో ప్రైవేట్ గా ‘హిందీ ప్రచార ‘ , ‘ప్రవీణ ‘ , ‘సాహిత్య రత్న ‘ మరియు నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. , ఎం. ఏ పట్టాలను పొందారు.
1950 లో ‘జీవితం అంటే’ అనే తొలి నవల ,1952లో ‘సాంబయ్య పెళ్లి ‘తొలి కథగా ప్రారంభమైన వీరి రచనా వ్యాసంగం 39 నవలలు , 100కు పైగా కథలతో జైత్రయాత్రను కొనసాగించింది.
1982లో నక్సలిజంపై వీరు రచించిన ‘మరీచిక ‘ నవలను వివాదాలకు తెరతీస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఆరుద్ర వంటి మరికొంతమంది సాహిత్యకారుల అభిప్రాయాలకు స్పందించిన హైకోర్టు కేసును కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది.
వీరు రచించిన ‘మట్టి మనిషి’ నవల 14 భాషలలోకి అనువదించబడింది. వీరి రచనల్లో కొన్ని తెలుగు చలనచిత్రాలుగా, మరికొన్ని బుల్లితెర సీరియళ్లు గా రూపొందాయి. వీరి సమత అనే నవల ‘ప్రజా నాయకుడు’ అనే చిత్రంగా , ప్రతీకారం ‘మనస్సాక్షి’ గా , మానినీ మనసు ‘ఆమె కథ’ గా మృగతృష్ణ అదే పేరుతో చలనచిత్రాలుగా రూపొందించబడ్డాయి.
విషకన్య , తిరస్కృతి, మరీచిక, అడవి మల్లె, రాబందులు రామచిలుకలు,రాక్షస నీడ, వెన్నెల మండుతోంది వంటి వైవిద్య భరితమైన రచనలెన్నో వీరి కలం నుండి ఫిరంగి గుండ్లై వెలుపడ్డాయి. శివ సాగర్ మిశ్ర రచించిన ‘అక్షత్’ అనే హిందీ నవలను 1988లో ‘మృత్యుంజయుడు ‘అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
జవహర్ బాల భవన్ డైరెక్టర్ గా మరియు 1985 – 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా సేవలందించారు. 1988 సంవత్సరంలో వీరి సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. 1989 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ మరియు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్, తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1996లో జీవితకాల సాఫల్య పురస్కారం మరియు ఇదే విశ్వవిద్యాలయం నుండి 1994లో సాహిత్యంలో విశిష్ట పురస్కారం పొందారు. ‘ఆంధ్రపెర్ల్ బుక్’ అని బిరుదుని పొందారు.
ఐదవ తరగతితో ఆగిపోయిన చదువుని మొక్కవోని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో పూర్తి చేయడమే కాకుండా ఉన్నత పదవులెన్నిటినో సమర్ధవంతంగా నిర్వహించడం , వివాదాలకు వెరవని దృఢ సంకల్పంతో రచనావ్యాసంగాన్ని దిగ్విజయంగా కొనసాగించి ‘ఆంధ్రపెర్ల్ బుక్ ‘బిరుదును పొందిన వీరు వర్తమాన రచయిత్రులందరికీ స్ఫూర్తి ప్రదాతలు.