జ్ఞాపకాల పొరలు కొన్ని అనుభవాల్ని కప్పేస్తాయేమో..
ఒక్క క్షణం లేదా ఒక్క నిముషం
ఏదో తెలియని ఒక దు:ఖం తన్నుకు వస్తోంది..
బహుశా నాలోపల ఒక మహా సముద్రమే ఉన్నట్లుంది
నేస్తమా! ఎప్పటికప్పుడు సరికొత్తగా జీవన్మరణ సమస్య మొదలవుతోంది.
ఎవ్వరెవ్వరో.. ఎక్కడెక్కడో ఉండి కూడా నవ్వుతారు
ఒకరి దు:ఖం మరొకరికి దాహార్తిని తీర్చేది కదా మరి
ఒకరి ఆవేదన మరొకరికి ఆనంద పరవశుల్ని చేసేదే కదా మరి!
నేను.. నేనూ.. నేనే అనే ‘మూడు’ పదాల సమన్వయం
ఈ మూడిరటి మధ్యే కదా జీవన ప్రయాణం
ఆద్యంతాలు లేని పదాలతో తయారైన మనిషి
శూన్యాన్ని సైతం ఆక్రమించుకునే తత్త్వాల సముదాయం
గుండె,మెదడు,కాలేయం ఇలా ఏ ఒక్కటీ శరీరానికి సమగ్రం కాదు
అత్మీయత, అనురాగం, అభిమానం లాంటివేవీ సమతుల్యం కాదు
అన్నింటిలోనూ వెలితి.. అన్నింటిలోనూ ఏదో తెలియని అసంతృప్తి
చివరికి శూన్యంలో కూడా కనిపించని నిర్వేదం..
ఊపిరి పోతుంటే తగిలే చిన్న గాలి అలల్ని కదిలించినా చాలు
భారమైన హృదయం కాస్త తేలికవుతుంది.
నాలోని ప్రతి భావమూ ఒకేలా ఉంటుంది
సంతోషమైనా, దు:ఖమైనా రెండూ నిర్వికారంగానే ఉంటాయి
విచార రేఖలు, వినోద రేఖలు రెండూ సమాంతరంగానే నడుస్తాయి
అంతమాత్రాన ఇవేవీ జీవిత సమీకరణలు కావు
జన్మజన్మల గాధల కొలమానాలు కాలేవు
ఒక్కోసారి ఒక్కో అనుభవం, అనుభూతిగా మారి
ఆత్మచుట్టూ వలయాలై బలపడుతుంటాయి.
వాటిలోని ఏమీ లేనితనం విస్తరిస్తూంటుంది
నవ్వు ఒక శబ్ధంలానే మిగిలిపోతుంటుంది
దు:ఖం మౌనమై ఒక వారగా చతికిలపడుతుంది
నేస్తమా! ఆ కనిపించే సమాధులను చూడు!
వాటిని మించిన సమాధానం ఏమయినా ఉంటుందా?