“నువ్వేనా సాధ్య…!? అమాయకంగా పుస్తకాలే ప్రపంచంగా, కాలేజ్, ఇల్లే నీకు తెలిసిన ప్రదేశాలుగా బ్రతికావు. ఎదుటి వారిది తప్పైనా, తలవంచుకుని తప్పుకునే దానివి. ఎం బీ ఏ గోల్డ్ మెడలిస్ట్ వి. చక్కని కుటుంబానికి కోడలుగా వెళ్లావు. అందగాడు, ఆస్తిపరుడు, మంచి ఉద్యోగం ఉన్న విశాల్ తో పెళ్లి జరిగింది. మేమంతా నీవు ఎంత అదృష్టవంతురాలివో అనుకున్నాం. నోట్లో నాలుక లేని దానివి ఇవాళ ఇలా వీధిలో, ఎవరో తెలియని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని, వాడ్నెవడినో కాలర్ పట్టుకుని, చెంపలు వాయించి, చెడా మడా తిట్టేస్తున్నావ్? ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? అసలు నీ అవతారం ఏంటిలా మారింది? ఏసీ కార్లో తిరుగుతుంటావనుకున్నా..? ఇంత సాధారణంగా, ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఈ రోడ్ పై…? ఏంటే ఇదంతా?” ఆపకుండా ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్న పరిమళ వైపు చూసి, చిన్నగా నవ్వి.
” హే….పరీ! నువ్వా? సడెన్ గా ఐదేళ్ల తరువాత నువ్విక్కడ…? వైజాగ్ లో ఉంటున్నావు కదా నువ్వు? విజయవాడ ఎప్పుడొచ్చావ్? పైగా స్కూటీలో. అంటే ఈ ఊరికి షిఫ్ట్ అయ్యారా? మీ వారు గోల్డ్ బిజినెస్ కదా!?” తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ప్రశ్నిస్తున్న సాధ్య వైపు చిరాగ్గా చూస్తూ….
“ముందు నీ విషయం చెప్తావా…?” చిరుకోపంగా అడిగింది పరిమళ.
“హ్మ్…. సరే ముందు మా ఇంటికి పోదాం పదా. ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నా. ఈ పక్కనే డే కేర్ లో నా పాప ఉంది తీసుకుని పోదాం. ” అంటూ…
ఏ భావం చూపకుండా ముందుకు కదిలిన సాధ్యను అనుసరించింది పరిమళ బుర్రనిండా బోలెడు సందేహాలను మోసుకుంటూ….
సాధ్య అందమైన ఇండిపెండెంట్ ఇంట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ తోట లో అక్కడక్కడ పెద్దవారు కూర్చొని ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. సాధ్యను చూడగానే మూడేళ్ళ పాప “మమ్మీ” అంటూ వచ్చి సాధ్య కాళ్ళను చుట్టేసింది. లోపల నుంచి ఒక పెద్దావిడ, ఆవిడ వెనుక ఆయా పాప బాగ్ తో వచ్చారు.
“పరీ మా అత్తగారు, అత్తయ్యా మా ఫ్రెండ్ పరిమళ” అని ఒకరికొకరిని పరిచయం చేసిందీ సాధ్య.
కార్ తెచ్చిన డ్రైవర్ తో “వాసూ నువ్వు ఈ స్కూటీ తీసుకురా” అని సాధ్య డ్రైవింగ్ తీసుకుంది. అంతా ఆశ్చర్యంగా చూస్తూ కార్ ఎక్కింది పరిమళ. ఫ్లాట్ తాళం తీస్తూ రా అని ఆహ్వానించింది సాధ్య. అధునాతనంగా, అందం గా ఉంది ఆ ఫ్లాట్. శ్రావ్య ను తీసుకొని పెద్దావిడ లోపలికి వెళ్ళారు. మంచినీళ్ళు ఇచ్చి ” ఊ చెప్పు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అడిగింది సాధ్య.
“నా సంగతి తరువాత. సస్పెన్స్ తో చంపక నీ సంగతి చెప్పు ముందు” అంది పరిమళ.
“ఏడాది క్రితం సడన్ గా మాసివ్ ఎటాక్ వచ్చిపోయారు. ఆయన బిజినెస్ ఇక్కడే ఉంది. అత్తయ్యగారు కూడా హైదరాబాద్ వచ్చేందుకు ఇష్టపడలేదు. అందుకని మేమిద్దరమూ మా జాబ్స్ రిజైన్ చేసి ఇక్కడకు షిఫ్ట్ అయ్యాము. మామయ్యగారు అనారోగ్యం తో ఎక్కువగా బిజినెస్ ను చూసుకోలేక పోవటము వలన కొన్ని అవకతవకలు జరిగాయి. విశాల్ కు నా సహాయము కూడా అవసరమైంది. మేమిద్దరమూ ఆఫీస్ కు వెళితే అత్తయ్యగారు ఒక్కరే రోజంతా దిగులుగా ఉండేవారు. చాలా ఢీలా పడిపోయారు. వకవైపు మామయ్యగారి మరణం, ఇంకో వైపు సడన్ గా మారిన తన స్టేటస్ ను తట్టుకోవటం కష్టమైంది. నీకు తెలుసుగా మన సమాజంలో పట్టింపులు పోలేదు. పైకి మాత్రం అందరూ మాకేమీ పట్టింపులేదు అంటారు కాని అదంతా పైపై మాటలే. శుభకార్యాలకు ఏడాదిపాటు పిలవకూడదని దగ్గరి బంధువులే పిలవలేదు. ఇంటికి రమ్మని పిలిచినవాళ్ళు నువ్వు నెలలోపలరా, ఫలానా రోజున రా అనిపిలిచేవారు. అప్పటి వరకూ ఆత్మీయంగా ఉన్నవాళ్ళు మాట్లాడటం తగ్గించేసారు. వాళ్ళు మాట్లాడలేదనుకోవటం ఎందుకు ఏ పని లో ఉన్నారో మీరు ఫోన్ చేసి మాట్లాడండి అనేదానిని. ఏం మాట్లాడనమ్మా నాకు మీ మామయ్యగారి మాట తప్ప ఇంకో మాట రావటం లేదు. అదీ మాట్లాడుతుంటే ఏడుపు ఆగటం లేదు. వినే వాళ్ళైనా ఎంతకని వింటారు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి అని ఆవిడా ఎవరితో మాట్లాడకుండా వంటరిగా గదిలోనే గడుపటం మొదలు పెట్టారు. ఓ రోజు నేనింటికి వచ్చేసరికి గదిలో మామయ్యగారి ఫొటో తో మాట్లాడుతూ గట్టిగట్టిగా ఏడుస్తున్నారు. పనమ్మాయి రోజూ అలాగే ఏడుస్తుంటారమ్మా అంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే ఓ సారి మా ఫ్రెండ్ యు.యస్ లో వాళ్ళ అమ్మను సీనియర్ సిటైజెన్ సెంటర్ లో చేర్చానని, అక్కడ ఆవిడ వయసు వాళ్ళు ఉంటారని, చాలా అక్టివిటీస్ ఉంటాయనీ చెప్పింది గుర్తొచ్చింది. అప్పటికే మా ఫ్రెండ్స్ ఇంకొందరు కూడా వారి అమ్మలతోనో, అత్తగార్లతోనో ఈ పరిస్థితిని చూస్తున్నారు. వాళ్ళ తో మాట్లాడి మనమే ఒక పిల్లల డే కేర్ లాగా ఈ పెద్దలకు డేకేర్ ఏర్పాటు చేద్దామా అనుకున్నాను. ఇందాక నువ్వు చూసిన ఇల్లు మాదే. ఇద్దరే అంత పెద్ద ఇంట్లో ఉండలేక మా మామగారు అది అద్దెకిచ్చి ఈ ఫ్లాట్ కొన్నారు. ఆ ఇంట్లోనే లైబ్రరీ, ఇండోర్ గేంస్, విశ్రాంతి గది, ఒక పక్క పిల్లలకి డేకేర్ ఏర్పాటు చేసాము. ఒక ఫామిలీ కౌన్సిలర్, క్లర్క్, ఇద్దరు అటెండర్స్, సూపర్వైజర్, పిల్లలకు ఆయాలను ఏర్పాటు చేసాము. పొద్దున నేను ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు అత్తయ్యగారిని, శ్రావ్యను అక్కడ దింపి వెళుతాను. వచ్చేటప్పుడు వెళ్ళి అక్కడ ఇంకేమైనా కావాలేమో చూసుకొని ఇద్దరినీ తీసుకొని వస్తాను. ఆ పెద్దవాళ్ళందరు ఒకే పడవ ప్రయాణికులు కదా బాగా కలిసిపోయారు. ఇప్పుడు చాలా వరకూ కోలుకున్నారు. ఈ మధ్య అందరూ కలిసి గుడికి, షాపింగ్ కు వెళుతున్నారు” అని ముగించింది సాధ్య.
“చాలా మంచి పని చేసావు సాధ్యా. మరి బజార్ లో బాదుడు సంగతేమిటి?” అడిగింది.
“మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను బస్ స్టాప్ లో దిగి ఆఫీస్ కు వెళ్ళేంత సేపు వెనక ఒకవెధవ పిచ్చివాగుడు వాగుతూ వచ్చేవాడు. ఓరోజు విశాల్ కు చెప్పాను ఇలా నన్నో వెధవ చికాకు పెడుతున్నాడని. ఐతే నన్నేం చేయమంటావు నా ఆఫీస్ వదిలి నీ వెనుక రానా అన్నాడు. మరునాడు వాడు మళ్ళీ పిచ్చి వాగుడు వాగుతూ వస్తుంటే అప్పటికే విశాల్ సపోర్ట్ చేయలేదని కోపంగా ఉక్రోశంగా ఉన్న నేను వెనక్కి తిరిగి నా చేతిలో ఉన్న పర్స్ తో ఫఢేల్ మని ఒక్కటిచ్చాను” ఇంటికెళ్ళాక విశాల్ తో చెప్పాను. ఇదే నేను కావాలన్నది. ఎప్పుడూ అన్నో, నాన్నో, భర్తో, ఓ పొలీసో నీ వెనుక ఉండరు కదా. అవసరమైనప్పుడు కాళికావతారం ఎత్తాలి అన్నాడు. అప్పటి నుంచి నేనూ విశాల్ తో వాకింగ్ కూ, జిం కు వెళుతున్నాను. కార్ కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఈ రోజు బజార్ లో చిన్న పనిఉండి పక్కనే కదాని నడిచి వెళ్ళాను. అక్కడ సీన్ నువ్వు చూసావుగా. ఇక నీ సంగతి చెప్పు” అంది సాధ్య.
“మా మామగారూ పెద్దవారైపోయారు. ఆయన గోల్డ్ బిజినెస్ ఇద్దరు కొడుకులకూ పంచారు. మా బావగారు అక్కడ చూసుకుంటుంటే మేమూ అక్కడే ఎందుకని ఇక్కడ పెడదామని వచ్చాము. చిన్న పని మీద నేను ఇటు వచ్చాను. నువ్వు అనుకోకుండా కలిసావు” అంది పరిమళ.
సాధ్య అత్తగారు ట్రే లో కాఫీ తీసుకొచ్చింది. “అయ్యో మీరు తెచ్చారా అత్తయ్యా లక్ష్మమ్మ లేదా” అని నొచ్చుకుంది సాధ్య.
లక్ష్మమ్మ పకోడీల ప్లేట్ తీసుకొని వచ్చింది. “ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నారు
అలిసిపోయుంటారు తీసుకోండమ్మా” అంది ఆవిడ నవ్వుతూ.
ఎప్పుడూ ధుమధుమలాడుతున్నట్లుగా ఉండే తన అత్తగారు మనస్సులో మెదలగా “మీరెంత మంచివారండీ” అంది అప్రయత్నంగా ఆవిడతో.
“టీ ఇవ్వగానే మంచిదాన్నైపోయానా? అయినా సాధ్య నేను ధుఃఖం లో నుంచి కోలుకునేందుకు ఎంత తపన, ఆరాట పడి, నన్ను అమ్మ లా చూసుకుంది. దానికన్నా ఇదెక్కువ కాదుగా” అందావిడ ఆప్యాయంగా సాధ్య వైపు చూస్తూ.
“అయ్యో నేను చేసిందేమీ లేదత్తయ్యా. మీరే మాకు చాలా సహాయంగా ఉన్నారు. మీ మూలంగానే శ్రావ్య విషయం లో నిశ్చింతగా ఉన్నాను” అంది సాధ్య.
“అత్తాకోడళ్ళుకోడళ్ళు ఒకరినొకరు పొగుడుకోవటం ఆపి కాస్త నాకూ టీ ఇస్తారా?” అంటూ లోపలికి వచ్చాడు విశాల్.
“హలో పరిమళా బాగున్నారా?” పరిమళను పలకరిస్తూ సాధ్య పక్కన కూర్చున్నాడు.
కాసేపు కూర్చొని ఇంక ఆలశ్యం అవుతోందని లేచి ” విశాల్ మీరిద్దరూ ఈ ఆదివారం మా ఇంటికి రండి. ఆంటీ మీరూ రండి” అని ఆహ్వానించి వెళ్ళింది పరిమళ.