” బాబా, తికడె బగ్ తేన భీమా చ ఆహేనా?” ( నాన్నా, అటు చూడు, అతను భీమా నే కదా?) అప్పుడే గుడి మంటపం లోకి ప్రవేశించిన ఒక వ్యక్తిని చూపిస్తూ అడిగింది , క్యూ లైన్ లో నిలుచున్న ఒక యువతి తన తండ్రి యశ్వంతరావ్ ని.
కూతురు చూపించిన వ్యక్తి వైపు పరీక్షగా చూసి, “హో, తసాచ ఆహే,” (అవును, అలానే ఉన్నాడు,) అంటూ అతనినే ఆశ్చర్యంగా చూడసాగాడు.
” హో,తేన భీమా చ, అపల భీమా చ,” (అవునండీ,అతను భీమా నే, మన భీమా నే) అతని భార్య మీరా కూడా అంతే ఆశ్చర్యంగా అన్నది.
వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్న ఆ వ్యక్తికి సుమారు అరవై సంవత్సరాల వయసు ఉంటుంది. తెల్లని పట్టుబట్టలు, నుదుటిన విభూతి రేఖలు చూడగానే నమస్కరించాలి అనిపించేట్టు ఉన్నాడు. పక్కన అతని భార్య ఖరీదైన కంచి పట్టు చీరె, మెడనిండా నగలు, చేతులు నిండుగా గాజులు, నుదుటన ఎర్రని కుంకుమతో సాక్షాత్తు పార్వతీ దేవి లాగా ఉన్నది. వాళ్ళ కూడా కొడుకు, కోడలు,మనవళ్ళు .
వీళ్ళు చూస్తుండగానే , లోపలి నుంచి ప్రధానార్చకులు వచ్చి , క్యూతో సంబంధం లేకుండా వీళ్ళని అంతరాలయం లోకి తీసికెళ్ళారు. అక్కడ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని దర్శించి తర్వాత చుట్టూ కొలువై ఉన్న అష్టలక్ష్ముల దర్శనం చేసుకుని, బయట మంటపంలో ఆదిలక్ష్మీదేవికి సువర్ణ పుష్పాల పూజ చేసే చోటుకి వచ్చి కూర్చున్నారు.
క్యూలైన్ మెల్లగా కదులుతున్నది. యశ్వంత్ రావ్ ఆలోచనలు గతం లోకి వెళ్ళాయి.
* * *
మధ్యాహ్నం లంచ్ టైం కావటంతో కూలీలందరూ పని ఆపేసి లంచ్ బాక్సులు ఓపెన్ చేసారు. వాళ్ళకి కాస్త ఎడంగా ఒక చెట్టు కింద కూర్చుని తను తెచ్చుకున్న రెండు చపాతీలు తినసాగాడు భీమా.
“నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది,”
అతని పక్కనే వచ్చి కూర్చుంటూ అన్నాడు మేస్త్రి నేర్పింది.
” నాకైతే చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది,” సమాధానం చెప్పాడు భీమా.
” ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు. హైదరాబాద్ వెళ్ళవచ్చు కదా!” స్నేహితుడి భుజం మీద చేయివేసి అన్నాడు నర్శింహ.
” నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వేరే ఎక్కడైనా పని చూసుకుంటా,” అన్నాడు భీమా.
ఆ మాటలకు నొచ్చుకుంటూ నర్సింహ, “అంతమాటనకు, నిన్ను ఇలా చూడలేక అన్నాను అంతే,” అన్నాడు.
అప్పుడే అటువచ్చిన బిల్డింగ్ కాంట్ట్రాక్టర్ యశ్వంతరావ్ చెవిలో వీళ్ళ మాటలు పడ్డాయి. అతను మహారాష్ట్రియన్ అయినా తెలుగు అర్ధం అవుతుంది.
” ఏంటి నర్సింహ, భీమా ఎక్కడికో వెళతానంటున్నాడు?” అడిగాడు.
” అదేం లేదు సార్. ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నాం ,”అన్నాడు.
” సరే, తొందరగా తిని పని చూసుకోండి,” అంటూ అక్కడినుంచి వెళ్ళాడు.
అతని భయం అతనిది. ఇప్పటికే ఒక ప్లంబర్ మానేసాడు. పనివాళ్ళు ఒక పట్టాన దొరకటం లేదు. యశ్వంతరావు వేతనాలు బాగానే ఇస్తాడు కానీ, పని రాక్షసుడు. పనివాళ్ళు టైముకి ఐదు నిమిషాలు అటూఇటూ అయినా ఊరుకోడు. ఒక్క నిమిషం ఖాళీగా కనపడ్డా రంకెలేస్తాడు. అందుకే కూలీలు, ఇతర మేస్త్రి లు అతని దగ్గర పనిచేయాలంటే భయపడతారు. కొంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపొతారు. ప్లంబింగ్ పని ఆగిపోయే సరికి, కష్టమర్లకి ఇళ్ళు అనుకున్న సమయానికి ఇవ్వలేనని భయం పట్టుకుంది. అందుకే భీమా నోట వెళ్తాను అనేమాట వినేసరికి ఆందోళన చెందాడు.
తాపీ మేస్త్రి పని అయిపోయింది. ప్లంబింగ్ పని జరుగుతున్నది. భీమా పని తీరు, పని పట్ల అంకితభావం, నిజాయితీ ఇవన్నీ యశ్వంతరావ్ కి భీమా పట్ల అభిమానాన్ని కలుగచేస్తాయి. త్వరలోనే భీమా యశ్వంతరావుకి బాగా నమ్మకస్తుడైనాడు.
అపార్ట్మెంట్ లో అన్ని ఇళ్ళు పూర్తి అయ్యాయి. భీమా పని కూడా అయిపోయింది. నర్సింహకి వేరే అపార్ట్మెంట్ లో పని దొరికింది. అతను పనిచేసే చోట వేరే ప్లంబర్ ఉన్నాడు. యశ్వంతరావుకి కూడా ప్రస్తుతం ఏ కాంట్రాక్టు లేదు.
” అయ్యా, వేరే ఎక్కడైనా పని చూపించండి,” అడిగిన భీమాతో యశ్వంతరావు ,
” ఏం పని చేయగలవు. నీకా ఆ ప్లంబింగ్ పని తప్ప వేరే ఏపనీ రాదు. ఆఫీసులో అంటే నీ చదువు ఐదోతరగతే,” అని కాస్త ఆలోచించి, ” సెక్యూరిటీ గార్డుగా చేస్తావా? ” అడిగాడు.
ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. అలా ఆ అపార్ట్ సెక్యూరిటీ గార్డుగా కుదిర్చారు. మంచి జీతం. త అక్కడ ఏ డ్రైనేజీ, టాప్స్ రిపేరులు వచ్చినా భీమానే చేయాలి.
అప్పటి దాకా నర్సింహ, మరో ఇద్దరితో కలిసి ముంబయి నగరంలో మురికివాడల్లో ఉన్న భీమా మకాం అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు గదికి మారింది.
యశ్వంతరావు కుటుంబం కూడా ఆ అపార్ట్ మెంట్ లోనే ఉంటారు. తనకి అడిగిన వెంటనే ఉద్యోగం చూపించిన యశ్వంతరావ్ అంటే భీమాకి చాలా గౌరవం.
బజారునుంచి సరుకులు, కూరగాయలు, ఇంకా ఏమైనా ఇతర పనులు అన్నీ భీమా యశ్వంతరావు అడగకుండానే చేసి పెడుతుంటాడు.
ఒక రోజు పనమ్మాయి రాలేదని, యశ్వంతరావు భార్య ,మీరా, భీమాని గిన్నెలు తోమి వెళ్ళమంది. తటపటాయిస్తున్న అతనితో ,” ఏమిటి ఆలోచిస్తున్నావు, డబ్బులు ఇస్తాలే,” అంది.
“అదేం కాదమ్మా, ,” అని వెళ్లాడు. ఒక్క గిన్నెలే కాకుండా, ఇల్లు తుడవటం, బాత్రూం కలిగించటం అన్నీ చేయించింది.
అది మొదలు, నెలలో రెండుసార్లు ఈ డ్యూటీ ఉండేది. అన్నట్లు గానే డబ్బులు ఇచ్చేది. యశ్వంతరావు పాతబట్టలు అన్నీ ఇచ్చేది.
మెల్లగా అపార్ట్ మెంట్ లో కొంతమంది భీమాని తమ అవసరాలకి వాడుకొని, తృణమో, పణమో ముట్టచెప్పేవాళ్ళు.
సంవత్సరానికి ఒకసారి పదిహేను రోజులు సెలవు పెట్టి, తన ఊరు వెళ్ళి వచ్చేవాడు.
ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మొదట్లో హిందీలో మాట్లాడేవాడు, ఏడాదయేరికి మరాఠీ కూడా బాగా నేర్చుకున్నాడు.
పన్నెండు సంవత్సరాలు ఎలా గడిచాయో తెలీదు. ఎంతో మంది వాచ్ మెన్ లు మారినా, సెక్యూరిటీ గార్డు మాత్రం భీమానే.
సరిగ్గా పది సంవత్సరాల క్రితం, “మా బాబుకి ఉద్యోగం వచ్చింది సార్. నన్ను ఉద్యోగం మానేయ మంటున్నాడు,” అని వెళ్లి పోయాడు.
అతను వెళుతుంటే యశ్వంతరావు కి కుడిభుజం పోయినట్లు అనిపించింది.
*. *. ”
ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో మళ్లీ భీమాని చూసాడు. పట్టువస్త్రాలు, నుదుటన విభూతిరేఖలు, మెడలో జంధ్యం.
వీళ్ళు మామూలు దర్శనం చేసుకుని, బయట కూర్చున్నారు. భీమా కుటుంబం అదే మంటపంలో ఆదిలక్ష్మి అమ్మవారికి సువర్ణ పుష్పాల పూజ చేయిస్తున్నారు.
అర్చకులు గోత్రనామాలు చదువుతున్నారు. “కౌండిన్యస గోత్రస్య, భీమలింగేశ్వర శర్మ నామధేయస్య,..”
యశ్వంతరావు,అతని కుటుంబ సభ్యులు మొహమొహాలు చూసుకోసాగారు.
వీళ్ళని చూసిన భీమా మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చేయి ఎత్తి విష్ చేసి, పూజకాగానే వస్తాను అని సైగ చేసాడు.
అర్చకులతో పాటు మంత్రపుష్పం శ్రావ్యంగా పంఠించాడు. పూజ అయిపోయింది. తన భార్యా పిల్లలతో యశ్వంతరావు దగ్గరికి వచ్చాడు భీమా.
” ఏం భీమా ఎలా ఉన్నావు?” ఆ పలకరింపులో ఏదో తడబాటు.
” నేను బాగున్నానయ్యా. మీరు ఎలా ఉన్నారు? మేడం, మిమ్మల్ని అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది,” అంటూ ,” ఈమెనాభార్య జానకి, వీడు నా కొడుకు కౌండిన్య, దేవాదాయ శాఖ లో అసిస్టెంట్ కమీషనర్. ఈమె నా కోడలు ప్రణవి, మనవాళ్ళు ,” అంటూ పేరుపేరునా అందరినీ పరిచయం చేసాడు.
అప్రయత్నంగా యశ్వంతరావు కుటుంబ సభ్యులు అందరూ జానకికీ, కౌండిన్య, ప్రణవిలోకి నమస్కారం చేసారు.
” నాన్న కౌండిన్య, నేను ముంబాయిలో ఒక ప్రైవేటు కంపెనీలో చేసానే ఆ కంపెనీ ఓనరు ,” అంటూ పరిచయం చేసి, ” నీవు రాఘవాచార్యులు గారిని పిల్లల జాతకం గురించి అడగాలి అన్నావుగా, అమ్మని తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉండు, నేను సార్ తో మాట్లాడి వస్తా,” అన్నాడు.
వాళ్లు వెళ్ళాక, ” చెప్పండయ్యా, అపార్ట్ మెంట్ లోఅందరూ బాగున్నారా?” అడిగాడు.
” అందరం బానేఉన్నాము. అది సరే కానీ భీమా సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నీవు, ఊహకందని వృత్తి లోకి ఎలా వచ్చావు? చేయకూడని పనులన్నీ నీ చేత చేయించాము. డ్రైనేజీ పనులు చేయిచాము. అపార్ట్ మెంట్ లో వాళ్ళు అడిగితే మటన్, చికెన్ కూడా తెచ్చె వాడివి. సఫాయి పనులు కూడా చేయించాము. ఒక బ్రాహ్మణుడివై ఉండి ఇలాంటి పనులు చేయటానికి నీకు ఏమీ అనిపించలేదా! ఆరోజు ఏమీ చదువుకోలేదు అని అబద్ధం ఎందుకు చెప్పావు,?” యశ్వంతరావు భార్య కంఠంలో అమితమైన బాధ
” సర్, కులవృత్తి, చదివిన చదువు ఎందుకూ కొరగానప్పుడు, కడుపు నింపుకోవడానికి గౌరవంగా ఏ పని చేసినా తప్పు లేదు అని నేను భావించాను. అది కూడా భగవదారాధన లో భాగమే అని అనుకున్నాను. శివాలయంలో స్వామి వారి మాలిన్యం తీసేటప్పుడు ఎంతో శ్రద్ధగా చేసానో, నేను చేసిన ప్రతి పనీ అంతే శ్రధ్ధగా చేసాను.
మాది విజయనగరం. మా నాన్న ఒక చిన్న శివాలయంలో అర్చకుడు. అతి కష్టమ్మీద రెండు పూటలా తినేవాళ్ళం. నాకు ఒక అక్కయ్య.
అక్కని పదో తరగతి తర్వాత చదువు ఆపించి, నన్ను మాత్రం బీ.కామ్. దాకా చదివించారు.
నాడిగ్రీ కాగానే పిలిచి ఆఫీసర్ ఉద్యోగం ఇస్తారని కలలు కనేవాళ్ళు మా అమ్మ నాన్న. అంతటి అమాయకులు. నేను అలాగే అనుకున్నాను.
కానీ, వాస్తవం వేరుగా ఉంది. రిజర్వేషన్ వర్తించే కులం కాకపోవటంతో , రిజర్వేషన్ పోగా మిగిలిన నాలుగైదు పోస్టులకి నాలుగు వేలమందితో పోటీ పడుతూ, ఊళ్లో ఒక బట్టల షాపులో లెక్కలు రాసుకుంటూ, పరీక్షలకు పగలు రాత్రి చదువుతూ కష్టపడ్డా, అన్నీ ఇంటర్వ్యూ లోనో, చివరి రౌండు లోనో పోతుండేవి. పోనీ కులవృత్తి అయిన పౌరోహిత్యం చేద్దామంటే, ఈ క్లర్క్ లని తయారు చేసే చదువు చదువుకోవటం వల్ల , తెలుగు, సంస్కృత భాషల్లో ప్రవేశం అంతంతమాత్రమే. పైగా గంభీరమైన కంఠం కూడా కాదు.
రెండు సంవత్సరాలు,ఏపనీ లేకుండా, గవర్నమెంట్ ఉద్యోగాలకి పరిక్షలు రాసుకుంటూ ప్రయత్నించా. ఈలోగా ఖాళీగా ఉండక, ఒక ప్రైవేటు స్కూల్ లో టీచరుగా చేరాను. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తే వచ్చేది రెండు వందల రూపాయలు.
ఇక లాభం లేదనుకుని హైదరాబాద్ వెళ్లి, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చూసుకుందామనుకునే సమయంలో, నాన్నకి పక్షవాతం వచ్చి, ఆఅర్చకత్వం కాస్తా పోయింది.
ఒక్కసారి పరిస్థితి తిరగబడ్డది. ఒకపక్క పెళ్ళీడు కొచ్చిన అక్క, ఇంకోపక్క నాన్న ఆరోగ్యం, ఉద్యోగం లేని నేను. అప్పటికప్పుడు ఎవరిస్తారు ఉద్యోగం?
అమ్మ మెళ్శోని రెండు తులాల నాంతాడు మార్వాడి షాపుకెళ్ళింది. పాతకాలపు ఇత్తడి గుండిగలు, గంగాళాలకి కాళ్ళోచ్చి పాతసామాన్లు కొనే దుకాణాల్లోకి చేరాయి. ఎలా ఈ పరిస్తితి నుండి బయట పడాలి?
భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఆయనే ఏదో దారి చూపిస్తాడు అనే మా నమ్మకం వమ్ము కాలేదు. నాన్న స్థానంలో శివాలయంలో అర్చకుడిగా వచ్చినతను అక్కని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు.
వేరే ఖర్చులకి, నాన్న వైద్యం కోసం చేసినవి, అప్పులు చాలా ఉన్నాయి. ఉన్న ఒక ఇల్లు అమ్మేసాము.
ఇల్లు గడవాలిగా, నాన్న దగ్గర కేశవనామాలు నేర్చుకొని, చిన్న చిన్న కార్యక్రమాలకి బావగారితో కలిసి వెళ్ళటం మొదలుపెట్టా. కానీ ఎవరినీ మెప్పించలేక పోయాను.
శివయ్యే బావగారి రూపంలో మరోసారి ఆదుకున్నాడు. “అమ్మ, నాన్నలని నేను చూసుకుంటాను. నీవు హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం వెతుక్కో ,”అని, చేతిలో కొంత డబ్బు పెట్టాడు.
హైదరాబాద్లో సొంత మేనత్త ఉన్నది .ఉద్యోగం వచ్చేదాకా ఆమె దగ్గర ఉండవచ్చు అనుకున్నాను. కానీ ఒకరోజు కాగానే, ఎంతవరకు వచ్చినాయి నీ ఉద్యోగం ప్రయత్నాలు ,ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అని ఇన్ డైరెక్ట్ గా అడగటం మొదలుపెట్టారు.
హైదరాబాద్ వెళ్ళినరోజు ,” నీకెందుకురా మీ మామయ్య నీకు మంచి ఉద్యోగం చూసి పెడతాడు,” అన్న మా మేనత్త, కొన్ని రోజులకి నాకు నిజంగానే ఒక ఉద్యోగం చూసి పెట్టింది. అది జీతం భత్యం లేని వాళ్ళ ఇంటి పని మనిషిగా. ఇంట్లో పనులు, బయటి పనులు , ఒకోసారి, వంట అన్ని నేనే చేయాల్సి వచ్చేది. ఆరోగ్యం బాగాలేదని, బయటికి వెళ్తున్నా నాని, ఏదో ఒక వంకతో మొత్తం పని చేయించే వాళ్ళు. కానీ ఉద్యోగం మాత్రం చూడలేదు. వీటికి తోడు సూటిపోటి మాటలు.
తెచ్చుకున్న డబ్బులు అయిపోయింది ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగాను. ఇంగ్లీష్ సరిగా రాలేదని , పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కావాలి అని సమాధానాలే కానీ ఉద్యోగం మాత్రం రాలేదు.
ఇంట్లో వాళ్ళు పెట్టే పాచి అన్నం తినలేక పోయేవాడిని. ఆకలితో హైదరాబాదులో వీధుల్లో సర్టిఫికెట్లు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండగా, దేవుడు లాగా నరసింహ కనపడ్డాడు .నరసింహ నా చిన్ననాటి స్నేహితుడు .ఐదో తరగతి దాకా ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళ నాన్నమేస్త్రీ పని చేసేవాడు. ఐదో తరగతితో చదువు ఆపేసి వాళ్ళ నాన్నతో పనికి వెళ్ళేవాడు. మా ఇంటి పక్కనే గుడిసెలో ఉండేవాడు. వాడు చదువు మానేసినా, నాకు వాడికి స్నేహం మాత్రం చెడలేదు. వాడికి పదిహేనేళ్ల వయస్సులో హైదరాబాద్ వచ్చాడు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వాడిని కలిసా. స్కూటర్ మీద వెళుతున్నవాడు నన్ను చూసి తన ఇంటికి తీసుకెళ్లాడు.
నా వాలకం చూసి, ముందు మంచి హోటల్ కి తీసుకెళ్ళి కడుపునిండా తిండి పెట్టించాడు.
తర్వాత వాడి ఇంటికి వెళ్ళాము.
నా కధంతా విన్న నరసింహ,” నీకు ఉద్యోగం వచ్చే దాక నా దగ్గరే ఉండు ,’అన్నాడు. మా మేనత్త తో కూడా చెప్పకుండా అమ్మానాన్నలకి ఉత్తరం రాసి నేను నరసింహ దగ్గరికి చేరాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ, ఖాళీగా ఉన్నప్పుడు నర్శింహా దగ్గర కూర్చునేవాడిని. వాడి తమ్ముడు ప్లంబింగ్ పని చేసేవాడు. అది చూస్తూ ఉండేవాడిని. ఒకొక్క సారి సరదాగా నేను వాడికి సాయం చేసేవాడిని.
నెల రోజుల తర్వాత నాకు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. చిన్న రూం అద్దెకు తీసుకుని, అమ్మ నాన్నలని నాతో హైదరాబాద్ తీసుకు వచ్చాను . నర్సింహ, బొంబాయిలో పని దొరికింది అని వెళ్ళాడు.
రెండేళ్లకు, నాకు ఇష్టం లేక పోయినా అమ్మా వాళ్ళ బలవంతం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది .కొడుకు పుట్టాడు. జీతంలో పెరుగుదల లేదు కానీ కుటుంబ సభ్యులు పెరిగారు . జీతం సగం నాన్న మందులకే సరిపోయేది. సరైన పోషకాహారం లేక బాబుకు ఎప్పుడూ అనారోగ్యమే.
ఒకరోజు నర్శింహ కలిసాడు. చేతులకి ఉంగరాలు, మెడలో గొలుసు. ముంబైలో అపార్ట్మెంట్లు కడుతున్నారని, అక్కడ మేస్త్రి గా పని చేస్తున్నానని, జీతం కూడా బాగా ఇస్తున్నారు అని చెప్పాడు.
నాలో ఆలోచన మొదలైంది . ఎందుకు పనికిరాని ఈ డిగ్రీ కంటే ఆ కూలి పని చేసుకుని కడుపునిండా తినొచ్చు కదా! నెలంతా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు పనిచేస్తే వచ్చేది మూడొందలు, నా భార్య సాయంకాలం చిన్న పిల్లలకి రెండు గంటలు ట్యూషన్లు చెపితే ఇచ్చేది పది, పదిహేను రూపాయలు. నాకెలాగూ గవర్నమెంట్ ఉద్యోగం అవకాశం లేదు. ప్రైవేటు వాటిలో కూడా నాకు మంచి ఉద్యోగం అంటూ, నా క్వాలిఫికేషన్ కి రాదు. సరదాగా నేర్చుకున్న పనిని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా అనుకున్నాను.
వెంటనే నర్శింహని కలిసి నా ఉద్దేశ్యం చెప్పాను. వాడు ముందు తెల్లబోయాడు, తర్వాత నాకు పిచ్చెక్కింది అన్నాడు. ఎంతో కష్టం మీద వాడినీ ఒప్పించాను.
బొంబాయిలో ఉద్యోగం వచ్చింది అని చెప్పి, నా భార్యని, కొడుకుని అమ్మ నాన్నలని మళ్లీ విజయనగరం పంపించాను. రెండు నెలలు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి, తర్వాత వేరే ఇల్లు అద్దెకు మారారు.
ఆ తర్వాత అంతా మీకు తెలుసు.
ఈ రోజుకి నా భార్యకి ఈ సంగతి తెలియదు. అక్క బావలకి సెక్యూరిటీ గార్డుగా చేసానని తెలుసు. కానీ నా కొడుకు పెద్దవాడయ్యాక, మొదటి చెప్పింది వాడికే.
సర్, ఉపాధి కల్పించని డిగ్రీ ఎందుకు? అందుకే మీకు నేను ఐదో తరగతే చదివాను అని చెప్పాను. మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి అని నా వ్యక్తిగత అభిప్రాయం. అరవై సంవత్సరాల క్రితం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు, నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలా లేరు అంటే ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదనే కదా! అప్పుడు ఎవరినైతే ఉన్నత వర్గాల వాళ్ళు అన్నారో, నేడు వాళ్ళు దయనీయమైన దశలో ఉన్నారు.ఇటు రిజర్వేషన్ , ఓపెన్ కాంపిటీషన్ లో విపరీతమైన పోటీ తట్టుకోలేక, వేరే వృత్తులు చేయటం రాక ,చేయలేక ఎంతోమంది త్రిశంకు స్వర్గం లాంటి పరిస్ధితుల్లో వేలాడు తున్నారు.
అంతేకాదు మన విద్యావ్యవస్థ, ప్రభుత్వ విధానాలు రెండూ మారాలి. ఈ రోజుకీ మనం చదువంటే కేవలం డిగ్రీ, అనుకుంటున్నాము. వాసిలేని ఈ మూస చదువులు ఉండకూడదు. వివిధ వృత్తులు, వివిధ రంగాల పట్ల పిల్లల కి అవగాహన కల్పించాలి. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను, ఇంజనీరింగ్ చదివిన పిల్లాడు, బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ చదివి ఒక ప్రైవేటు స్కూల్ లో టీచరుగా చెస్తున్న వాళ్ళకి, నెలకి మూడు వేలు, నాలుగు వేలు. అదే రోజువారీ కూలీలకు రోజుకు ఐదు వందలు. ఈ చదువులు వల్ల ప్రయోజనం ఏమిటి సార్? జ్ఞానసముపార్జనకి డిగ్రీ లో పనిలేదు. కానీ ఒక డిగ్రీ తీసుకుంటున్నామంటే అది కూడు పెట్టేటట్లు ఉండాలి.
క్షమించండి సార్, ఆవేశంలో ఏదో మాట్లాడాను,” సుదీర్ఘమైన భీమలింగేశ్వరశర్మ మాటలు , యశ్వంతరావు లో ఆలోచనలు రేకెత్తించాయి.
ధన్యవాదాలు