నెమలి ఈకలు

వ్యాసం

         జ్యోత్స

ప్రొద్దున్నే కోడికూతతో పాటు ‘లేవండర్రా ఇంక, ప్రొద్దెక్కే దాకా పడుకోకూడదు’ అంటూ మేనత్తల మేలుకొలుపులు,
ఉదయాన్నే వాకిట్లో కళ్ళాపు చల్లి ముగ్గులేసే పిన్నమ్మలు,’వీటితో
తోముకుంటే పళ్ళకు చాలా మంచిది, ఈ నాలుగు రోజులైనా
బ్రష్ లు పక్కన పడేసి వీటితో తోముకోండి’ అంటూ వేపపుల్లలు విరిచి ఇచ్చే బాబయ్యలు,
దొడ్లో పొయ్యి దగ్గర కూర్చుని ఎవరి నీళ్ళు వాళ్ళు కాచుకుని వరుసలో నిలబడి (పూర్వం వేసవి సెలవులకు తాతగారింటికి వెళితే మనవలూ,మనవరాళ్ళే పాతికమంది ఉండేవారు)తాటాకు దడితో కట్టిన బాత్ రూముల్లో స్నానాలు,
తొమ్మిదింటికల్లా పెరట్లో చెట్టు నుండి కోసి తెచ్చిన బాదం ఆకుల్లో వేడి వేడి ఉప్మా,
మధ్యాహ్నం ఐస్ ఫ్రూట్ బండి దగ్గర మ్యాంగో,ఆరెంజ్,ద్రాక్ష ఐస్ ల కోసం పోటీలు,
ఇంటి అరుగుల మీద చింతపిక్కలు, వైకుంఠ పాళీ,అష్టాచెమ్మాలు,
మధ్య మధ్యలో గిల్లికజ్జాలు,
నేల-బండ,నాలుగు స్తంభాలాట, ఏడు రాళ్ళాట,దాగుడుమూతలు .. ఇలా ఎన్నెన్నో ఆటలు,
ఇంటి అల్లుళ్ళు – బావమరుదుల పేకాటలు,
సాయంత్రం నాలుగయ్యేసరికల్లా పొలాల్లో బోరింగుల దగ్గర స్నానాలు,
చెరువుల్లో ఈతలు,
రాత్రి ఏడుగంటలు అయ్యేసరికి
పెరట్లో గచ్చునేలపై వరుసగా కూర్చుని వెన్నెల్లో అరిటాకుల్లో
వేడి వేడి అన్నం,కందిపొడుం,
కొత్త ఆవకాయ ఘుమఘుమలు,
పిల్లల కోసం చేసిన బంగాళాదుంప వేపుడు, పల్లెల్లో మాత్రమే దొరికే గడ్డపెరుగుతో భోజనం…
(స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుండేది కాదూ?)
రాత్రి ఆరుబయట వెన్నెల్లో పక్కలు వేసుకుని,చుక్కలు లెక్కపెడుతూ
రెక్కల గుర్రాలు,
రాకుమారుల కథలు, అమ్మమ్మ తాతయ్యల కబుర్లు వింటూ నిద్రలోకి జారుకోవటం,
గోదావరి బ్రిడ్జి మీద రైలు ప్రయాణం, నదిలో రాగినాణేలు వేసి దణ్ణం పెట్టుకోవడం,రైలు పరుగెడుతుంటే,వెనక్కి వెళ్ళిపోయే చెట్లను, కరెంటు స్తంభాలను లెక్కపెట్టడం,
అమ్మమ్మగారింటికి వెళ్ళినపుడు అత్తయ్యలు … ఆడపడుచులు వచ్చారని వెళ్ళేటప్పుడు ఒళ్ళో పెట్టడానికి చలిమిడి చేసి స్టీలుకేన్ లో దాచిపెడితే.. మధ్యాహ్నం పెద్దవాళ్ళు పడుకున్నప్పుడు పిల్లలంతా కొంచెం కొంచెంగా ఆ చలిమిడి తినేయటం,పక్కవాళ్ళింటి జామచెట్టెక్కి కిందపడి కాలు విరగ్గొట్టుకోవడం,
ఆ అల్లరీ,
ఆనందమూ
రోజులు నిముషాల్లా గడిచిపోవటం,
ఒకళ్ళనొకళ్ళు వదలలేక మళ్ళీ ఏడాది కలుసుకుందామంటూ బరువెక్కిన హృదయాలతో వీడుకోళ్ళు,
జూన్ లో మళ్లీ బడి మొదలవ్వగానే కొత్తపుస్తకాల వాసనలు పీల్చుకుంటూ అట్టలు వేసుకుని లేబుల్స్ అంటించుకోవటం,కొత్త స్నేహాలు,కొత్త టీచర్లు, కొత్త పాఠాలు ..
వేమన,సుమతి,కృష్ణ శతకాల్లో పద్యాల పోటీలు, ఇంట్లో నాన్నగారు రాగయుక్తంగా పాడే భాగవత పద్యాలు..
మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసి బడికి వెళుతూ, చెరువుకు అవతల గట్టున ఉన్న టూరింగు టాకీసులో నుండి మ్యాట్నీ షో ప్రారంభానికి సూచనగా ‘దినకరా,శుభకరా.., వాతాపి గణపతిం భజే, నమోవేంకటేశా…’
అంటూ ఘంటసాల గారి గొంతు నీటి అలలపై తేలివస్తుంటే వింటూ ఆనందపడిపోవటం,
వానాకాలం రాగానే.. ఈరోజైనా బాగా వాన పడాలి దేవుడా అని దణ్ణం పెట్టుకుంటూ స్కూలుకెళ్ళటం,
మన అదృష్టం బాగుండి వాన బాగా పడి స్కూలు కంటిన్యూ చేసి,ఒంటిగంటకి వదిలేస్తే గంతులు వేసుకుంటూ ఇంటికెళ్ళడం,వాన నీటిలో కాగితపు పడవలు చేసి వేయడం,వానా వానా వల్లప్ప పాటలు, ఒప్పులకుప్ప తిరగటం,
మైక్ లో కొత్తగా వచ్చిన సినిమా గురించి అడ్వర్టైజ్ చేస్తుంటే వీధిలో సినిమా బండి వచ్చిందని దాని వెనకాల పరుగెత్తుతూ వాళ్ళిచ్చే కాగితాలు అందుకోవటం,
సినిమా చూడడం, అయిపోయాక వచ్చేటప్పుడు ఆ సినిమా పుస్తకాలు కొనుక్కోవటం,
మర్నాడు ఆ పుస్తకాలు చూపిస్తూ ఫ్రెండ్స్ కి సినిమా కథ చెప్పేయటం,

ఇంక శ్రావణమాసం పట్టు పరికిణీలు,పేరంటాల హడావుడి,
వానచినుకుల చిటపటలు..

వినాయకచవితికి ముందురోజు రాత్రే పాలవెల్లికి పసుపు రాసి రకరకాల పళ్ళు,
మొక్కజొన్న
పొత్తులు,
కలువపూలు ,మామిడి ఆకులు కట్టడం, పత్రి శుభ్రం చేసి వాటి పేర్లు నాన్నగారు చెపుతుంటే విని తెలుసుకుంటూ,దేనికది వేరు చేసి పెట్టడం,కొత్త పుస్తకాలు వినాయకుడి దగ్గర పెట్టి, బుద్ధిగా పూజ చేయటం….

దసరా పండుగ పదిరోజులు సరదా సరదాగా ఎలా గడిచిపోయాయో తెలియకుండా గడిపివేయటం,పల్లెల్లో దసరా పద్యాలు పాడుతూ తిరిగే పిల్లల్ని చూడటం
పగటివేషగాళ్ళు సీతారామలక్ష్మణులు,హనుమంతుడు,రావణుడు , అమ్మవారు,
మహిషాసురుడు మొదలైన వేషాల్లో అభినయం చేస్తూ బండ్ల మీద వెళుతుంటే ఆసక్తిగా చూడడం,బొమ్మల కొలువుల పేరంటాలకు వెళ్ళడం,ఎవరైనా పాడతావా అని అడుగటం ఆలస్యం వచ్చీరాని పాటలు పాడేయటం, మామయ్య జెయింట్ వీల్ ఎక్కిస్తే,అది గిర్రున తిరుగుతూ కిందకి వచ్చేటప్పుడు భయంతో కెవ్వు కెవ్వున కేకలు వేయటం…
దీపావళికి పదిరోజుల ముందు నుంచే బాణసంచా కొనుక్కోవాలి అన్న ఆరాటం,కొనుక్కున్న వాటన్నింటిని నలుగురు పిల్లలం దీపావళికి, నాగుల చవితికి, క్షీరాబ్ధి
ద్వాదశికి, కార్తీక పౌర్ణమికి కాల్చాలని సమానంగా పంపకాలు చేసుకుని, వేరు, వేరు అట్టపెట్టెల్లో సర్దుకోవడం, నిమ్ముకుంటే కాలవు అని దీపావళి రోజు దాకా ఎండబెట్టుకోవడం, దివిటీలు కొట్టటం,రాత్రి 12 గంటల దాకా కాల్చడం…

సంక్రాంతికి నెల ముందు నుండీ పోటీపడి ముగ్గులు పెట్టడం,ఎవరైనా మంచి ముగ్గులు పెట్టేసారేమోనని పక్కనున్న రెండు మూడు వీధులు తిరిగి ముగ్గులన్నీపరిశీలించి నేర్చేసుకోవటం,
గొబ్బిళ్ళ పేరంటాలు,
గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం….

ఉగాది రోజు ప్రొద్దున్నే లేచి తలంటు పోసుకుని,కొత్త బట్టలు కట్టుకుని, నాన్నగారి చేతిమీదుగా ఉగాది పచ్చడి తినటం,ఇక శ్రీరామనవమి పందిళ్ళలో సందళ్ళు..
రామకోటి పందిరిలో హరికథలు,
బుర్రకథలు,కూచిపూడి నృత్యరూపకాల ప్రదర్శనలు..

మధ్యాహ్నం రేడియో లో నాటికలు వినటం, సిలోన్ లో పాటలు వింటూ దాంతో పోటీపడుతూ వేగంగా సాహిత్యం వ్రాసుకోవటం,
ఆదివారం బాలానందం కార్యక్రమాలు వినటం..
మళ్ళీ వేసవి సెలవుల కోసం ఎదురుచూపులు….

ఇలా ఎన్నెన్నో … “పుస్తకాల్లో దాచుకున్న నెమలి ఈకల్లాంటి జ్ఞాపకాలు”
చీకూ చింతా లేని బంగారు బాల్యం ..
మన తరం అనుభవించిన మానసిక ఒత్తిడిలేని బాల్యం..సంస్కృతి,
సంప్రదాయం,నైతిక,మానవతా విలువలు, లోకం పోకడ,పెద్దలంటే భయభక్తులు చిన్నతనం నుండే నేర్పిన చదువులు,ఆటలు పాటలు….
ఇవన్నీ నేటి తరానికి అందించడంలో మనం విఫలమవుతున్నామా ?…
ఒక్కసారి ఆలోచించండి…
మీకు దొరికిన ఈ తీరిక సమయంలో…

మీ మధురమైన బాల్యపు “జ్ఞాపకాల నెమలిఈకల” పరిమళాలను మీ తరువాతి తరాల చేత ఆఘ్రాణింప చేయండి.

Written by Jyotsna Tatiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంధి అంటే?

కోటి విద్యలు కూటి కొరకే