ఉదయమే ధరణి సణుక్కుంటూ గుణుక్కుంటూ లేచింది… అంతకుముందే లేచిన బుడ్డోడు ఆటలాడుకోవడానికి ఆత్ర పడుతున్నాడు…
” ఏంట్రా నీకు తొందర ఐదున్నరకి లేచి కూర్చుంటావు కాసేపు పడుకోవచ్చు కదా! ఏదో పని ఉన్నట్లు నువ్వు పడుకోవు నన్ను పడుకోని వ్వవు” అంటూ వాడి వంక చూసి మాట్లాడింది.
వాడి మొహం వాడికేం అర్థమవుతుంది నోరంతా తెరిచి నవ్వుతూ తల్లి ముఖం పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ కింద మీద పడి దొర్లుతూనే ఉన్నాడు..
“ఇక తప్పదు.. పడుకునే సుఖం ఎక్కడుంది! శనివారమైనా ఆదివారమైనా ఇంతే ఆఫీసు లేదు కదా కాసేపు పడుకుందామనుకుంటే వీడు నన్ను ఎక్కడ పడుకోనిస్తాడు…” అని అనుకొని పిల్లోడిని పట్టుకొని లేవబోయే అంతలో…
” అమ్మాయీ! వాడిని నేను ఎత్తుకుంటాలే కాసేపు పడుకో.. రోజు ఆఫీసు పనులతో విశ్రాంతి ఉండదు కదా” అంటూ రేవతి వచ్చి పిల్లాడిని చంకలో వేసుకొని బయటకు తీసుకెళ్లింది.
” హమ్మయ్య ఈఅత్తగార్లు ఉండడం ఓ వెసులుబాటు” అనుకోని సంతోషపడుతూ ముసుగుతన్ని పడుకుంది ధరణి.
ఓఅరగంట పడుకొని వచ్చి బిడ్డడిని తీసుకుంటుంది అనుకున్న రేవతికి గంటైనా కొడుకు కోడలు నిద్రలేచిన జాడ కనపడలేదు. వాడిని అలాగే చంకలో ఎత్తుకొని టీ పెట్టుకుని తాగి బొమ్మలు వేసి ఆడించసాగింది.. వాడు బొమ్మలతో ఎక్కడ ఆడతాడు !ఎప్పుడు కొత్తవి కావాలి కదా! అందుకని వంటింట్లోకి వెళ్లి కొన్ని గిన్నెలు చెంచాలు తెచ్చి ముందర పడేసింది ఇప్పుడు వాడి ఆట ఉధృతంగా ఉంది.. కాసేపు ఆడుతున్నాడు కాసేపు పరుగులు పెడుతూనే ఉన్నాడు” ఈ వయసులో ఏం పరుగులు పెట్టనమ్మా నేను” అనీ కనపడని దేవుడికి మొక్కుకొని అలాగే మనవడిని పట్టుకుంటుంది రేవతి.
అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన రమణమూర్తి రేవతి పడే అవస్థలు గమనించి…
” నేను కాళ్లు కడుక్కొని వచ్చి వాడిని చూసుకుంటాలే నువ్వు వెళ్లి స్నానం చేసుకో మళ్లీ పూజ వంటా పనులన్నీ ఉండనే ఉంటాయి కదా! అందులో ఈరోజు ఆదివారం..కోడలికి కొడుక్కి కొన్ని పనులు చెప్ప వచ్చు కదా!” అన్నాడు.
” వాళ్లు ఎప్పుడు లేవాలి..ఎప్పుడు చేయాలి…నాకు తప్పుతుందా…సరే గానీ మరి జాగ్రత్తగా చూడాలి సుమా! అటు ఇటు పరిగెత్తి కింద పడిపోతాడు వాడి కసలే పరుగులు ఎక్కువ మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటే బాధ అనిపిస్తుంది ..చూస్తారా మీరు సరిగ్గా చూస్తానంటేనే నేను స్నానానికి వెళ్తాను” అన్నది రేవతి…
ఎన్ని పనులున్నా చంటోడి బాధ్యత అంతా తనదే అనుకుంటుంది ..తను లేకుండా గడవదు అని ఆమె ఊహ అలా అని శక్తికి మించిన పనులు తన మీద వేసుకుంటుంది.
” సరేలే నువ్వు మాత్రమే చూడగలవా ఏంటి !నేను జాగ్రత్తగా చూడలేనా! అనుమానం ఏం పెట్టుకోకుండా వెళ్లి స్నానం చేసి రా !నిదానంగానే చేయి గబగబా పరిగెత్తుకొని రాకు ,నేను చూసుకుంటాను వాడిని” అన్నాడు రమణమూర్తి.
మెల్లిగా లేచి స్నానం చేసి వచ్చి తులసి పూజ చేసుకుని.. దీపారాధన చేసుకొని ఇటు పారాయణం నోటితో వల్లిస్తూనే ఒక పక్క స్టవ్ మీద పాలు పెట్టి మరొక పక్క పిల్లలు లేచాక తినాల్సిన టిఫిన్ చేసింది.
అలాగే వంట ప్రయత్నం కూడా మొదలుపెట్టింది నిదానంగా చేద్దాంలే అనుకుంటే ఈ పనులన్నీ అయ్యేవరకు నీరసం వస్తుంది. తొందరగా వంట చేసి పెట్టుకుంటే కనీసం ఒక గంట రెస్ట్ అయినా దొరుకుతుంది అని ఆమె ఆశ.
ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు పెట్టేసి మరోపక్క పల్లీలు, కొబ్బరి కొత్తిమీర వేసి పచ్చడి చేసి పోపు పెట్టే ఇడ్లీలను హాట్ కేసులో పెట్టేసి పూజ పూర్తి చేసుకుంది రేవతి.
అప్పటికే మనవడితో తంటాలు పడుతున్న భర్తను చూసి జాలి వేసింది..
కొడుకు కోడలు గది వైపు ఓసారి చూసింది లేచి వస్తారేమో పిల్లోడిని కాసేపు పట్టుకుంటారని.. వాళ్ళు లేచిన ఛాయలు కనిపించలేదు…
” వాడిని నేను పట్టుకుంటాను కానీ మీరు వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని టిఫిన్ చేయండి మందులు వేసుకోవాలి మీరు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది” అన్నది రేవతి భర్త వైపు చూస్తూ..
ఇక మడి మార్చుకునే సమయం ఎక్కడుంది రేవతికి అలాగే పిల్లాడిని పట్టుకుంది..
పిల్లల గదిలో నుండి కొంచెం శబ్దం వినిపించింది.. కోడలు లేచి వచ్చి సోఫాలో కూర్చుంది…
కనీసం బ్రష్ అయినా చేయలేదు పొద్దుటి నుండి వీళ్ళే చూసుకుంటున్నారు లేచి వచ్చి పిల్లోడు పనులు చూసుకుందాము అనే ధ్యాసే కనిపించలేదు.. కానీ పనులు చేసిన అలవాటు కదా రేవతి మనసు ఊరుకుంటుందా! చంటి పిల్లోడు కోసం మెత్తగా కిచిడీ చేసి గిన్నెలో వేసుకొని మెల్లిగా తినిపించ సాగింది… అదేమీ పట్టనట్లు.. తనకేం సంబంధం లేనట్లు కోడలు కాలు మీద కాలు వేసుకుని పేపర్ అంతా అప్పుడే చదవాలి అన్నంత దీక్షగా చదువుకుంటూ కూర్చుంది..
ఒకపక్క కొంచెం చిరాకు వేసింది రేవతికి… కానీ ఏమీ అనడానికి వీలు లేదు కదా! ఏం అనకున్నా ఇంకా వారిని సరిగ్గా చూస్తూ లేరు అన్నట్లు మొహాలు పెట్టి కోడళ్ల ముందు అత్తలు ఏమంటారు!…
” వాడి మొహం నిండా అంటుకుంటుంది అత్తయ్యా! సరిగ్గా తినిపించండి” అని ఓ ఉచిత సలహా కూడా వేసింది ధరణి..
ధరణి బ్రష్ చేసుకుని వచ్చి ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని చట్నీ వేసుకుంది…
” అత్తయ్యా! మీరు తిన్నారా”? అని అడిగింది.
గుడ్లు వెళ్లడబెట్టడం రేవతి వంతైంది …పొద్దటి నుండి కొంచమైనా తీరిక దొరికిందా ఇంకా చేసుకోవలసిన పారాయణాలన్నీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంది..
” లేదమ్మా! మీ మామయ్యకు పెట్టాక నేను తింటాను ఇంకా సందీప్ లేవలేదా” అని అడిగింది రేవతి.
” లేవలేదు ఆదివారం కదా మెల్లగా లేస్తాడు” అన్నది తనేదో పొద్దున లేచినట్టు.
మెల్లిగా టిఫిన్ తిన్నాక…
” అత్తయ్యా! టీ తాగుతారా లేక కాఫీ పెట్టనా!” అని అడిగింది ధరణి మృదువుగా.
ఆ మాటకే పొద్దుట నుండి పడ్డ కష్టమంతా మర్చిపోయింది రేవతి…
” కాఫీ తాగుతానమ్మ” అన్నది..
రమణమూర్తి పూజ అయ్యాక అతనికి ఇడ్లీలు ప్లేట్లో పెట్టిచ్చి తను పెట్టుకుని తిన్నది రేవతి..
నిద్రలేచిన కొడుక్కి కాఫీ ఇచ్చి తాను సోఫాలో కూర్చుంది అలసటగా..
ఇంతలో ధరణి వచ్చి వంట చేసిన దగ్గర గిన్నెలు సర్దసాగింది.. మెల్లిగా అప్పడాలు వడియాల డబ్బా తీసుకొని వేయించాలని పెట్టుకుంది..
ఇంతలో రేవతి చటుక్కున లేచి..
” అయ్యో! తల్లి నీకెందుకమ్మ శ్రమా! నేను వేయిస్తాను నువ్వు వెళ్లి టీవీలో క్రికెట్ వస్తుంది వాడితోపాటు వెళ్లి చూడు రోజంతా ఆఫీస్ పని ఉండనే ఉంటుంది” అంటూ చేతిలో నుండి అప్పడాలు తీసుకుంది.
సంతోషంగా ధరణి వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ చూడసాగింది.
అదంతా చూస్తున్న రమణ మూర్తికి చిర్రేత్తుకొచ్చింది…
” అవస్థలు పడుతూ చేసుకుంటుంది ..కాస్త చిన్న చిన్న పనులు చేస్తానంటే చేయనీయదు.. మళ్లీ అన్నీ నేనొక్కదాన్నే చేసుకోవాలని సనుగులు సాధింపులు చేస్తుంది ..ఈ రేవతి ఏంటో నాకు అర్థం కాదు ..ఆనాడు మా అమ్మ చేతి కింద పనులు చేస్తూ భయపడుతూనే ఉంది ఈనాడు ఇదే తీరు దీనికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందో” అనుకుంటూ జాలిగా రేవతిని చూసి లోపలికి వెళ్ళిపోయాడు…
ఇండియా బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టారని ఆనందంలో కొడుకు కోడలు ఉన్నారు…