అమెరికా దేశంలో అనునిత్యం సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవలో.. చిలుకూరి రాజ్యలక్ష్మి గారితో శాంతారెడ్డి ముఖాముఖి
పేరుకు తగినట్లుగా అమెరికా రాజ్యంలో లక్ష్మి వరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజ్యలక్ష్మి
వృత్తి రీత్యా మెడికల్ కోడింగ్ & బిల్లింగ్ చేసి ప్రస్తుతం బిహేవియర్ హెల్త్ హాస్పిటల్ మెడికల్ కోడర్ గా పని చేస్తున్నారు . తెలుగు రాష్ట్రాల పిల్లలకు అంతర్జాల వేదికగా తెలుగు బోధిస్తూనే సాహిత్య సాంస్కృతిక రంగంలో సేవలు అందిస్తున్నారు.
ఎల్లప్పుడూ ఉల్లాసముగా, ఉత్సాహాంగా, తాను నవ్వుతూ,
అందరిని నవ్విస్తూ …
అందరు బాగుండాలి, అందులో నేనుండాలి అని ప్రగాఢంగా నమ్మే రాజలక్ష్మి చిలుకూరి వృత్తి :వైద్య రంగం; ప్రవృత్తి: సాహిత్య సేవ & సమాజ సేవ.
_మీ పరిచయం, సొంత ఊరు, తల్లి దండ్రులు, చదువు, హాబీలు, ఉద్యోగం, పెండ్లి, పిల్లలు?
బి. ఏ., MKR govt. డిగ్రీ కాలేజీ, దేవరకొండ
ఎం. ఏ., తెలుగు, రెడ్డి ఉమెన్స్ కాలేజీ హైదరాబాద్ లో
టీపీటీ సమగ్ర శిక్షణాకళాశాల హైదరాబాద్ లో చేసాను.
తల్లి దండ్రులు: గాజుల శాంత, బుచ్చయ్య గారు
జన్మ స్థలం: నేను పుట్టింది,పెరిగింది, నా విద్యాభ్యాసమంతా నల్లగొండ జిల్లా, దేవరకొండ లోనే.
పిల్లలు: మా అబ్బాయి _అభినవ్ తేజ
అమ్మాయి_ శ్రీ సాయి సావర్ణి
భర్త : శ్రీనివాస్ చిలుకూరి
నివాసం: ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ నగరం, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటున్నాము.
హాబీలు: నాకు బాల్యం నుండే చదువుతోపాటు ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ , అల్లికలు అన్నింట్లో చాలా చురుకుగా ఉండేదాన్ని.
బాల్యం: క్రమశిక్షణకు మారుపేరు మా నాన్న గారు. అన్ని పద్ధతిగా, సమయానికి జరగాలని అంటుండేవారు.
మా నాన్న గారు ఎప్పుడు ఒక మాట అంటూ వుండే వారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారని. నేను దాన్ని ఇప్పట్టికి, ఎప్పటికి బలంగా విశ్వసిస్తాను.
మా అమ్మ శాంత, పేరుకు తగ్గట్టు శాంత స్వభావురాలు.
నాకు తెలుగు సాహిత్యం పై మక్కువ కలగడానికి ముఖ్య కారణం మా నాన్న గారు, తెలుగు స్కూల్ టీచర్ మాలతి గారు, & నా బాల్య స్నేహితురాళ్ళు అని చెప్పొచ్చు.
నా చిన్నపుడు మా నాన్న గారికి తన ఉద్యోగపరమైన యూనియన్ ఉపాన్యాసాలకు స్క్రిప్ట్ కి సహాయం చేసేదాన్ని. స్కూల్ రోజుల్లోనే స్థానిక లైబ్రరీ నుండి నుండి పుస్తకాలు తెచ్చుకొని (నవలలు, కథలు) బాగా చదివేదాన్ని.
మా స్నేహితురాళ్లందరం ఒక పుస్తకం చదవగానే దాని గురించి చర్చించుకునే వాళ్ళం.
మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాదులో ఎం.ఏ తెలుగు అండ్ తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాత భువనగిరి గ్రామములో, మాధవరెడ్డి జూనియర్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పని చేసాను.
_ రేడియో జాకి, ప్రోగ్రాం అంకరింగ్ మరియు సంగీతం సాహిత్యం పై మీకు ఆసక్తి ఎలా కలిగింది? ఇప్పటివరకు ఎక్కడెక్కడ ( ఆంకరింగ్) ప్రోగ్రాంలు నిర్వహించారు?
మీరు రాసిన కవితలు .. ఎక్కడైనా ప్రింట్ అయ్యాయా ?
అమెరికాలోని డేట్ట్రాయిట్ కి వచ్చిన తర్వాత చుట్టుప్రక్కల్లా తెలుగువారు వుండే వాళ్ళు కాదు. అసలు తెలుగు మాట్లాడడమే మరచిపోతున్న తరుణములో ఒక తెలుగు పత్రిక కి అనువాదము, మరియు ఎడిటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత డేట్ట్రాయిట్ లో నాకు ఒక ఇన్స్టిట్యూట్ లో కొంత మంది పిల్లలకు తెలుగు నేర్పించే అవకాశం కూడా వచ్చింది. అదే విధముగా లాస్ ఏంజెల్స్ మా ఇంట్లో కూడా కొంత మంది పిల్లలకు తెలుగు తరగతులు తీసుకున్నాను.
నాకు తెలుగు భాష పై వున్న పట్టు, వాక్చాతుర్యానికి NATS ముందుగా నాకు ( ఆంకరింగ్) ప్రోగ్రాంలు చేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత నేను వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, వస్తూనే వున్నాయి.
ఇప్పటికి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కి కీలకబాధ్యతలు వహిస్తూ ఉంటాను.
అందులో బాగంగానే మహిళా సంబరాలకు , ఉగాది ఈవెంట్స్ కి, చిల్డ్రన్స్ డే కి, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవానికి, పాటల రచయిత చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డ్స్ కి వచ్చినప్పుడు, తెలంగాణ ప్రజలు జరుపుకొనే బతుకమ్మకి… ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఆ తర్వాతా ఎన్నో ఈవెంట్స్ కి ఆంకరింగ్
చేసాను.
covid సమయములో, ఆ తర్వాత కూడా సంగీతంపై ఆన్లైన్లో వర్కుషాప్స్ నిర్వహించాను.
ఇప్పటికి ఈవెంట్స్ కి ముందు, ఆ తర్వాతా న్యూస్ కి ఆర్టికల్స్ రాయడం చేస్తూ వుంటాను. ఎన్నో లోకల్ & నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ మరియు ఇండియాలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను.
ఇప్పటికి సమయం చిక్కినప్పుడల్లా కవితలు, కథలు, ఆర్టికల్స్ వ్రాస్తూ వుంటాను.
చాలా వరకు అన్ని ప్రచురితం అయ్యాయి.
అదేవిధంగా అనుకోకుండా TORI లో రేడియో జాకీగా చేసే అవకాశం వచ్చింది ఆ విధముగా “రాజీ తో ఈ రోజు ” అనే టైటిల్ తో ఎంతోమంది ప్రముఖులను, సాహితీ వేత్తలను ఇంటర్వ్యూ చేశాను.
_పెళ్ళై పిల్లలతో అమెరికా వచ్చి ఇక్కడ చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు కదా ఇందులో మీ భర్త శ్రీనివాస్ గారి ప్రోత్సాహం ఎలాంటిది? ఉద్యోగం చేస్తూ ఇన్ని పనులు ఇంటా, బయటా ఎలా బ్యాలన్స్ చేయగలుగుతున్నారు.
నా డిక్షనరీలో ఇంపాజిబుల్ అనే పదానికి తావు లేదు.
“కష్టే ఫలే” అన్నారు మన పెద్దలు.
అది బలంగా నమ్మే నేను …ఇది నాకు రాదు, నేను చేయలేను అనేదానికి తావు లేదు. ఏదైనా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే సాధించే వరకు అహర్నిశలు కష్టపడతాను. అదే నా సక్సెస్ కి ముఖ్యకారణం.
జీవితానికి చదువు, సంస్కారం రెండు దిక్సూచులు అయితే సంసారం అనే సాగరంలో నా కుటుంబం నా ఊపిరి.
నా వృత్తితో పాటు ఒక గృహిణిగా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూనే… నా వరకు నేను ఎప్పుడు నిత్య విద్యార్థినినే. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉద్దేశముతో నోటరీ, లోన్ సైనింగ్ ఏజెంట్, లైఫ్ ఇన్సురెన్స్, విల్ & ట్రస్ట్, ఎస్టేట్ ప్లానింగ్, టాక్స్ ప్రెపరింగ్ సర్టిఫికెట్స్ చేసాను.
నా భర్త, నా పిల్లలు నేను చేసే ప్రతి పని లో వారి ప్రోత్సహాం, సహకారం అణువణువునా ఉంటుంది.
మా చుట్టూ ఉన్న కమ్యూనిటీ కి నేను, నా భర్త ఎల్లవేళలా మా పరిధిలో తోచిన సహాయం చేయడములో ముందు వరుసలో ఉంటాము.
మా అమ్మాయి స్కూల్ కి వెళ్తున్న రోజుల్లో గర్ల్ స్కౌట్ లీడర్ గా కూడా నా సేవలు అందించాను. కాలిఫోర్నియా లో లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన తర్వాత మెడికల్ కోడింగ్ & బిల్లింగ్ చేసి, ప్రస్తుతం బిహేవియరల్ హెల్త్ హాస్పిటల్ లో మెడికల్ కోడర్ గా పని చేస్తున్నాను. వారాంతములో నేచర్ క్లినిక్ లో కాన్సర్ పేషెంట్స్ కి నా సేవలు అందిస్తుంటాను.
ఈ ఉరుకుల పరుగుల జీవితములో కూడ మన సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా మన తెలుగువారి పండుగలను అందరం సామూహికంగా జరుపుకుంటాము. అమెరికా లో వున్న మాతృ భూమిపై వున్న మమకారంతో మాతృ భాషకు , మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీఠ వేస్తాము.
నా గురించి తెలుసుకొని శాంత రెడ్డి గారు లాస్ ఏంజెల్స్ కి వచ్చినపుడు నన్ను
కలుసుకొని ఇంటర్వ్యూ తీసుకోవడం , నిజముగా వారి ఆత్మీయతకు నిదర్శనం