అమ్మను నేనైతే -నా ప్రతీక నీవు!
నాది పిలుపు -నీది పలుకు!
నీదు పలుకు – నాది భావం !
నీది గెలుపు – నాది మురుపు ( మురిపెం)
నీ పెదవి తడిమిన వేళ- నా స్తన్యం ఊటబావి!
వేలు నాది- నడకనీది!
నాది నిర్దేశం – నీది గమ్యం !
లక్ష్యం నాది- గెలుపు నీది!
చెమరించిన నీ కంటికి – చేతి రుమాలు నేను !
తప్పులు దొరలిన రెండో బాల్యం నాదైతే..
తప్పక మన్నించే గుణం నీది !
పాత జ్ఞాపకాలు పరచిన నేను!
పాఠాలు చెప్పే అమ్మవి నీవు!
గమ్యస్థానపు పయనం నాది !
గతుకు లేకుండా సాగించే దిక్సూచి నీవు!
పండుబారిన దేహం నాది!
పలవరిస్తూ తపన చెందేవు నీవు!
కాల చక్ర భ్రమణంలోబిడ్డే తల్లై; తల్లే బిడ్డై!
చకచక దొర్లిపోయే తరాలెన్నో!