వెన్నెల పారిజాతాలు

కథ

జ్యోత్స్న తాతిరాజు

శ్రీనగర్ కాలనీలోని తొమ్మిదవ నెంబరు వీథిలో అరవై మూడవ నెంబరు ఇంటి ముందు ఒక స్కూటీ వచ్చి ఆగింది.
బ్లాక్ జీన్స్, స్కై బ్లూ టీ షర్ట్ వేసుకుని, బాబ్డ్ హెయిర్ తో ఉన్న ఒక అమ్మాయి స్కూటీ దిగి గేటు దగ్గరకు వచ్చింది.
ఆ అమ్మాయి వయస్సు ఇంచుమించుగా ఇరవై ఐదు, ముప్ఫై మధ్యలో ఉండవచ్చు.గేటు మీద చెయ్యి వెయ్యబోతున్న ఆ అమ్మాయి చూపు పక్కనే తెల్లని కాంపౌండ్ వాల్ మీద వైలెట్ రంగులో చెక్కిన “లక్ష్మీనివాసం”అన్న
అక్షరాల మీద పడింది. ముఖం మీద పడుతున్న జట్టును వెనక్కి తోసుకుంటూ ఆమె గేటు తీసుకుని లోపలకి నడిచింది.
గేటు నుండి వరండా వరకు మూడు అడగుల వెడల్పుగల గచ్చునేల ఉంది. ఇరుపక్కలా క్రమ పద్ధతిలో పెంచిన గులాబీ,చేమంతి,మందార మొదలైన పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ఆ రంగురంగుల పూల అందాలను తిలకిస్తూ, నాలుగు అడుగులు ముందుకి వేసి వరండా వైపు వెళ్ళబోతున్న ఆమెకి ‘పుత్రోత్సాహంబు
తండ్రికి …’అన్న పద్యం శ్రావ్యంగా,రాగయుక్తంగా విన్పించటంతో పక్కకు తిరిగి చూసింది.కొంచెం దూరంలో కుడివైపు ఒక షెడ్ కన్పించింది.ఆ కంఠం అక్కడినుంచే విన్పిస్తోందని అర్థమవటంతో షెడ్ దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది.
రమారమి అరవై సంవత్సరాల వయస్సు ఉన్న ఒక స్త్రీ పిల్లల చేత పద్యం వల్లె వేయిస్తోంది. మెరూన్ కలర్ అంచు ఉన్న గంధం రంగు వెంకటగిరి జరీచీరలో మేలిమి వన్నెలో మెరిసిపోతూ, ముడి వేసుకుని హుందాగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ,
“ఎక్స్క్యూజ్ మీ మేడమ్” అని వినయంగా అనుమతి కోరగానే, ఆసక్తిగా నేర్చుకుంటున్న పిల్లలువెనక్కి తిరిగి చూసారు.ఆవిడ కూడా వల్లె వేయించటం ఆపి, “ఓఁ హారికా! నువ్వా?వచ్చి కూర్చో,పది నిమిషాల్లోఅయిపోతుంది” అంటూ బోర్డు మీద పద్యం,భావం వ్రాసి పిల్లల చేత వ్రాయించ సాగింది.
హారిక షెడ్ అంతా పరిశీలనగా చూడసాగింది. షెడ్ పెద్దదే, పైన రేకులతో కాక తాటియాకులతో కప్పి ఉంది. స్కూల్లో క్లాస్ రూమ్ లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా బెంచీలు,బ్లాక్ బోర్డు ఉన్నాయి.నలభై మంది దాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళు వ్రాసుకోవటం పూర్తి చెయ్యటంతో,” ఈ రోజుకి ఇంక చాలు, రేపటికి ఈ పద్యం నేర్చుకుని రండి” అని వాళ్లను వెళ్ళమంది ఆవిడ. “పద్యం ఇప్పుడే వచ్చేసింది, వెళ్లి
వస్తాము అమ్మమ్మా!” ఉత్సాహంగా అంటూ వెళ్లిపోయారు పిల్లలు.ఆ పిలుపు విన్న హారిక ఆశ్చర్యపడి,”వసుమతిగారూ, వాళ్ళకి మీరు..”
అంటూ అర్థోక్తిలో ఆగిపోయింది.”అవును,
అమ్మమ్మనే…” అంటూ నవ్వింది ఆవిడ.
హారిక ఒక జర్నలిస్ట్,ఒక పత్రిక తరఫున వసుమతి వివరాలు సేకరించటం కోసం వచ్చింది.రెండు రోజుల క్రితమే వసుమతికి ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం కలుస్తానని చెప్పింది. “చెప్పు హారికా,ఏం తెలుసుకోవాలి నా గురించి? అంత ఘనకార్యం నేనేమీ చెయ్యలేదే!”నవ్వింది వసుమతి.
“మేడమ్, మీరేదో స్కూలు నడుపుతున్నారని
అది బాగా పాప్యులర్ అవుతోందని విని తెలుసుకుందామని వచ్చాను” అంది హారిక.”స్కూలా? నువ్వు విన్నట్లుగా అలాంటి ఫుల్ టైమ్ స్కూలేమీ నేను స్థాపించలేదు. ఇప్పటివరకు నువ్వు చూసావు కదా, ఆ పిల్లలే నా చిన్ని ప్రపంచం. వాళ్ళకు మంచి విషయాలు నేర్పించటమే నేను చేస్తున్న పని,”
“మీరు పిల్లల దగ్గర డబ్బు ఏమీ తీసుకోరని, ఉచితంగా బోధిస్తారని విన్నాను,నిజమేనా?” హారిక వేసిన ప్రశ్నకి నవ్వింది వసుమతి.”ఇది నాతృప్తి కోసం చేస్తున్న పని కాబట్టి దీనిలో డబ్బు ప్రసక్తి లేదు.కావాలంటే నువ్వు పిల్లల తల్లిదండ్రులను అడగవచ్చు” “అబ్బే, కన్ఫర్మేషన్ కోసం అడిగాను మేడమ్,
అంతే ” అంటూ హారిక కూడా నవ్వేసింది.
“మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది?దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఎవరైనా స్ఫూర్తిని కలిగించిన వారు ఉన్నారా?”
“నేను స్కూల్ టీచర్ గా పని చేశాను.నా ముప్ఫై ఏళ్ల ఉద్యోగానుభవాలే నేను చేస్తున్న ఈ పనికి ప్రేరణ.ఒక ఉపాధ్యాయినిగా తరగతి గదిలో విద్యార్థుల నడవడిని, అలవాట్లను గమనిస్తున్నప్పుడు వాళ్ళ స్వభావంపై కుటుంబం యొక్క ప్రభావం ఎంత ఉంటుందో నాకు బాగా అర్థమయ్యేది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.
కుటుంబంలో ఎవరికి వీలైతే వారు పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకునేవారు.క్రమంగా కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యమై,తల్లి,తండ్రి పిల్లలు మాత్రమే ఉండే వ్యష్టి కుటుంబాలు వచ్చాయి.
తల్లి ఉద్యోగస్థురాలు కాకపోతే, పిల్లల పై శ్రద్ధపెట్టి వాళ్ల
చదువునే కాక, ప్రవర్తనను కూడా ఓ కంట గమనించేది. రానురాను తల్లులు కూడా ఉద్యోగినులై
తమ బాధ్యతల్లో
మునిగిపోవటం,
తాతయ్య,నాయనమ్మ, అమ్మమ్మ వంటి వారు కుటుంబానికి దూరమవ్వటం, కొంతమంది సింగిల్ పేరెంట్ దగ్గరే పెరగటం, దీనికి తోడు పిల్లలపై చదువుల భారం, ర్యాంకుల ఒత్తిడి పెరగటం,కేవలం ఉద్యోగాన్ని తెచ్చిపెట్టేందుకే తప్ప, మానసిక వికాసానికి, బలమైన వ్యక్తిత్వ నిర్మాణానికి ఆ చదువులు దోహదం చెయ్యకపోవటం…
ఇవన్నీ చాలామంది పిల్లల మానసిక స్థైర్యాన్ని,క్రమశిక్షణను దెబ్బతీయటం నేను దగ్గర నుండి చూసాను.
వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్ళ నడవడిని తీర్చిదిద్దే తీరిక తల్లిదండ్రులకు ఉండటం లేదు.దానికి తోడు సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లలపై ఎక్కువ ఉంటోంది.ఆకర్షణలకు లోనై ఏది మంచో,ఏది చెడో నిర్ణయించుకోలేక పోతున్నారు.
అలాంటి పిల్లలకు ఆసరాగా, ఒక పెద్దదిక్కుగా ఉండి వాళ్ళను మంచి మార్గం వైపుకు మళ్ళించాలన్నదే నా తపన”
“అంటే మీ దగ్గరకు అందరూ అలాంటి పిల్లలే వస్తారా?”
“నా దగ్గరకు వచ్చే పిల్లలు భిన్న కుటుంబ
నేపథ్యాలు కలిగిన వాళ్ళు. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులను కలిగి చుట్టుపక్కల కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కొందరైతే, కార్మికులు, ఆటోడ్రైవర్లు,కూలీల పిల్లలు కొందరు,
వీరిలో మా తోటమాలి,పనిమనిషి
పిల్లలు కూడా ఉన్నారు”
ఇలాంటి వాళ్లందరిని ఒకేచోట కూర్చోపెట్టి చదువు నేర్పటంలో మీకేమీ సమస్యలు ఎదురు కాలేదా?
“లేదు, స్కూళ్లలో అందరూ కలిసి చదువుకోవటం లేదా?అలాగే ఇక్కడ కూడా. మనం వాళ్ల మనసుల్లో ఏ భావాలు నాటితే ఆ భావాలతోనే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు.పిల్లలు పూలమొక్కల్లాంటి వారు. సారవంతమైన నేల,తగినంత నీరు, సూర్యరశ్మి లభిస్తే మొక్కలు ఏపుగా దృఢంగా పెరుగుతాయి. ప్రేమ,ఆప్యాయత,
చక్కటి కుటుంబ వాతావరణం, క్రమశిక్షణ ఉన్నచోట పిల్లలు మంచి వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారు. ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత సమాజ నిర్మాణంలో పాలు పంచుకుంటారు.అందుకే అలాంటి మంచి వాతావరణం ఇక్కడ కల్పించటానికి ప్రయత్నిస్తున్నాను.”
ఇక్కడ వాళ్ళకి మీరు ఏమేమి నేర్పిస్తారు? ” నైతిక విలువలు పెంచి,లోకజ్ఞానం కలిగించేందుకు శతకాలలోని పద్యాలు, సుభాషిత శ్లోకాలు వల్లె వేయిస్తాను.రామాయణ, మహాభారత,భాగవత కథలు చెపుతాను.
పంచతంత్ర కథలు చెబుతాను. సమాజానికి,దేశానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల జీవితవిశేషాలు చెబుతాను.నెలకు రెండుసార్లు ఏదైనా ఒక విషయం గురించి పిల్లల చేత మాట్లాడిస్తాను.
పెద్దలను, గౌరవించమని చెప్తాను.మన సంస్కృతీ సంప్రదాయాలలో దాగిన విలువలను తెలియ చెబుతాను.
హారికా! ఒకసారి ఏం జరిగిందో తెలుసా?ఒకరోజు పిల్లలకు తల్లిదండ్రులూ,గురువులు దేవుళ్ళతో సమానమని చెప్పి,లేవగానే తల్లిదండ్రుల పాదాలకు,స్కూలుకు వెళ్ళగానే ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించమని చెప్పాను.పది రోజుల తరువాత ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు.ముఖం చూస్తే పరిచయం ఉన్నట్లు అన్పించింది కానీ అతను ఎవరో,పేరేమిటో గుర్తుకు రాలేదు.”నేనేనమ్మా,
యాదయ్యను.,మిమ్మల్ని రోజూ నా ఆటోలో స్కూలుకు తీసుకుని వెళ్ళేవాడిని” అన్నాడు.
అప్పుడు గుర్తుపట్టాను.మనిషి మంచివాడే కానీ బాగా తాగుతుండేవాడు..భార్య ఎంత బ్రతిమాలినా ఆ అలవాటు మానలేదు.ఆమె కష్టపడి సంపాదించి తెచ్చుకున్న డబ్బులు కూడా పట్టుకుపోయి తాగుడికి తగలేసి అనారోగ్యం పాలయ్యాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు శుభ్రమైన బట్టలలో పద్ధతిగా, ఆరోగ్యంగా ఇలా.. నమ్మలేకపోయాను.అదే అన్నాను అతనితో.
“ఇదంతా,మీచలవేనమ్మా. అమ్మానాన్నలు అంటే దేవుళ్ళని,వాళ్ళ కాళ్ళకి రోజూ దణ్ణం పెట్టాలని మీరు చెప్పారట. మా సుబ్బులు రోజూ నాకు దణ్ణం పెడుతుంటే నాకు చాలా సిగ్గేస్తోందమ్మా.
పిల్లకి కనీసం కడుపు నిండా తిండి, మంచి బట్టలు,చదువు అయినా ఇవ్వలేకపోతున్న నేను, దణ్ణం పెట్టించుకోవడానికి తగినవాడిని కాదనిపించిందమ్మా, అందుకే ఆ దిక్కుమాలిన తాగుడు మానేసాను.పిల్లను కూడా బాగా చదివిద్దామని అనుకుంటున్నానమ్మా” అంటూ దణ్ణం పెట్టాడు.అప్పుడు నాకు కలిగిన తృప్తి
మాటల్లో వర్ణించలేను..”
” గ్రేట్ మేడమ్,మీరు ఇంత చెయ్యగలుగుతున్నారంటే దీని వెనుక తప్పకుండా మీవారి ప్రోత్సాహం ఉండే ఉంటుంది,ఏమంటారు?
“అవును హారికా! ఈవిషయంలో మావారి ప్రోత్సాహం ఎంతో ఉంది. నా ఆలోచనను మెచ్చుకుని,ఈ షెడ్,బెంచీలు,బ్లాక్ బోర్డు అన్నీ సమకూర్చింది ఆయనే.ఆయన కూడా లెక్చరర్ గా చేసి ఉండటం వల్ల టీచింగ్ లో కూడా ఆసక్తి చూపిస్తారు.పిల్లల సందేహాలు తీరుస్తారు.రోజూ సాయంత్రం ఆరింటికల్లా పిల్లలు వచ్చేస్తారు.రాగానే హోంవర్క్ చేయిస్తాను.ఆ రోజు చెప్పిన పాఠాలు చదివిస్తాను.ఇవన్నీ చకచక గంటలో చేసుకుంటారు పిల్లలు.తరువాత రోజుకో పద్యం లేదా శ్లోకం నేర్పిస్తాను.
తరువాత నైతికత, మానవీయ విలువలు, ,లోకజ్ఞానంతో కూడి మానసిక వికాసం కలిగించే ఏదైనా ఒక కథ చెపుతాను.ఇవన్నీ అయ్యేటప్పటికి దాదాపు తొమ్మిది గంటలవుతుంది.శనివారం మాత్రం వాళ్లను దగ్గరలో ఉన్న పార్క్ కి తీసుకెళ్ళి ఆడిస్తాను.అప్పుడు మావారు కూడా వస్తారు. మా అనుభవాలను వాళ్ళతో పంచుకుంటాం.పిల్లలు కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మాతో చెప్పుకుంటారు.
మా పిల్లలిద్దరు ఒకరు అమెరికాలో,మరొకరు ఆస్ట్రేలియాలో ఉంటారు.మా మనవళ్ళు, మనవరాళ్లు దగ్గర లేని లోటును ఈ పిల్లలు తీరుస్తున్నారు.అమ్మమ్మ తాతయ్యల్లాగ ఆప్యాయతను పంచుతూ,పిల్లలకి మంచి వ్యక్తిత్వం కల్పించి ,రేపటి సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా మలచాలని మాకు తోచిన చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మా బడి పేరు చూసావా?ఇలా రా ” అంటూ వసుమతి షెడ్ బయట గోడ మీద వ్రాసిన పేరు చూపించింది.తలెత్తి చూసిన హారికని
“అమ్మమ్మ ఒడి” అనే అక్షరాలు ఆత్మీయంగా పలకరించాయి.
” హ్యాట్సాఫ్ మేడమ్, సమాజంలో నేరాలు,ఘోరాలు పెరిగిపోతున్నాయని తిట్టుకునే వాళ్ళనే చూసాను కానీ మీలా మూలకారణాలు కనుక్కుని పరిష్కార మార్గంచూపించే వాళ్ళని ఇంతవరకు చూడలేదు.ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది,మళ్ళీ కలుద్దాం” అంటూ వసుమతి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయింది హారిక.
మరునాడు ఉదయం”వసూ,నీ గురించి పేపర్లో ఏం వ్రాసారో చూడు” వాకిట్లో నుంచే భార్యను పిలిచాడు సుబ్రహ్మణ్యం.’వస్తున్నానుండండి..’ వంటింటిలో నుంచే సమాధానం చెప్తూ రెండు కాఫీ గ్లాసులతో వరండాలోకి వచ్చి ఒకటి భర్తకి ఇచ్చి,తానొకటి త్రాగుతూ “ఏదీ,ఇలా ఇవ్వండి పేపరు,చూస్తాను” అంటూ పేపరు చేతిలోకి తీసుకుంది.
దానిలో లోపల నాలుగవ పేజీలో “అమ్మమ్మ
ఒడి” అనే శీర్షికతో.. తన చిన్న బడి గురించి, తను చేస్తున్న ప్రయత్నం గురించి ఒక వ్యాసం వ్రాసి ఉంది.

“ఈ అమ్మమ్మ ఒడి
అనుభవాల మడి
ఆనందాల జడి
జీవన విలువలను
బోధించే గుడి
పిల్లల నడవడికి
ఒరవడిని దిద్దే
చదువుల బడి
మీ పిల్లలను పంపడం
మరువకండి మరి!”
అంటూ దానికో అందమైన ముగింపు!

అది చూడగానే వసుమతిలో కొత్త ఉత్తేజమేదో కలిగినట్లు అన్పించింది.

సమయం ఆరవుతోంది.అప్పుడప్పుడే ఆకాశంలో వెలుగురేకలు విచ్చుకుంటున్నాయి.పక్షుల కిలకిలారవాలు వీనులవిందు చేస్తున్నాయి. చల్లటి గాలి వేస్తోంది.
పూలమొక్కలు గాలికి
తలలూపుతున్నాయి.
పరధ్యానంగా ఉన్న వసుమతి చేతిలో నుంచి జారిపోయిన పేపరు గాలికి ఎగురుతూ దూరంగా వెళ్ళసాగింది.
గబగబ వరండా మెట్లు దిగి దాని వెనకాలే పరుగెత్తింది ఆమె. కిందపడిన పేపరు తీసుకోబోతున్న ఆమెకు నేలంతా తెల్లటి తివాచీలా పరుచుకున్న పారిజాతాలు కనిపించాయి.అవి వెదజల్లుతున్న సువాసనలు ఆ ప్రభాత సమయాన్ని ఇంకా మనోజ్ఞంగా మార్చాయి.
‘ఈ పారిజాతాలు నేలంతా పరచుకుని పరిమళం విరజిమ్ముతూ పరిసరాలను ఆహ్లాదభరితం చేసినట్లే, తన దగ్గర చదువుకునే పిల్లలు కూడా భిన్న రంగాలలో వ్యాపించి సద్భావనలు ప్రసరింపచేస్తూ,తమ ఉన్నత వ్యక్తిత్వాలతో సమాజాన్ని,దేశాన్ని ప్రభావితం చేస్తే.. ?’ అబ్బా! ఈ ఊహే ఎంత బావుంది!
ఇకనుండి తన లక్ష్యం అదే కావాలి.
‘అవును,ఈ అమ్మమ్మ ఒడిలో చదువుకునే పిల్లలు పారిజాత పుష్పాలు కావాలి!స్వచ్ఛమైన “వెన్నెలపారిజాతాలు” కావాలి!!’ అనుకుంటుంటే
వసుమతికి ఎంతో తృప్తిగా అన్పించింది.

Written by Jyotsna Tatiraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Family Rules ఒక అద్దం కొన్ని రూపాలు

అమ్మ- కూతురు