సాహిత్యం సమాజ హితంగా ఉండాలి – వారణాసి నాగలక్ష్మి

నాగలక్ష్మి వారణాసి గారితో తరుణికి ముఖాముఖి  – యశోద

మీ పరిచయం, సొంత ఊరు, తల్లిదండ్రులు, చదువు?
సొంత ఊరు కృష్ణాజిల్లా లోని నూజివీడు. అమ్మ పేరు పార్వతి. నాన్నగారు రామకృష్ణశాస్త్రి గారు. నేను పుట్టింది అమ్మ పుట్టిల్లైన నర్సాపురంలో.
నూజివీడుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ప్లీడరు గారి తోట’లో మా నివాసం. అక్కడొక రిక్వెస్ట్ స్టాప్ ఉంది. ఆ దారిలో పోయే బస్సులు అక్కడ ఆగుతాయి. ఈ ప్లీడరుగారి తోట మా తాతగారిదే. అది నూజివీడు అనే సుమారైన పట్టణానికీ, మర్సిపూడి అనే చిన్న గ్రామానికీ మధ్యలో ఉండేది. ఇక్కడ సుమారు వందెకరాల పొలంలో ఒకే ఒక్క కుటీరం లాంటి ఇల్లు మా ఇల్లు. నాన్నగారు స్వయంగా కొంతమంది కూలీలతో కలిసి కట్టిన ఇల్లు అది. అందులో వాడినవి మా పొలం సాగుకోసం నూతులు తవ్వినపుడు భూమిలోంచి తీసిన రాళ్లు. అంతవరకూ ఎవరూ సాగుచేయని నేలని, ముళ్లపొదలతో నిండిన ఆ భూమిని సాగుచేసి పంటలు పండించాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మైనింగ్ ఇంజనీర్ అయిన తాతగారు కొనడం, నాన్నగారిని అందుకోసం ప్రత్యేకించి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకునే వరకూ చదివించడం జరిగింది. ఆ తర్వాత అగ్రికల్చరల్ డెమోనిస్ట్రేటర్ గా ఆయన ప్రభుత్వ వ్యవసాయ శాఖలో కొంతకాలం పనిచేయడం, ఈ మెరక పొలం సాగుచేసి పంటలు పండించడం కోసం ప్రభుత్వోద్యోగం వదిలేసి రావడం జరిగాయి. నాకు జ్ఞానం  వచ్చేసరికి అడవిలాంటి ఆ ప్రదేశాన్ని సుక్షేత్రమైన పంటపొలంగా తీర్చిదిద్దారు మా నాన్నగారు. ఆ పొలంలోని మా ఇల్లు తప్ప చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల దూరం వరకూ ఎటు చూసినా మరొక్క ఇల్లు కూడా ఉండేది కాదు.

నాగలక్ష్మి వారణాసి

నా విద్యాభ్యాసం డిగ్రీ వరకు నూజివీడులో జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి వరకూ, శ్రీ ధర్మప్పారావు కళాశాలలో బీఎస్సీ వరకూ చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, తర్వాత ఎం.ఫిల్. చేశాను. ఎరీనా నుంచి మల్టీమీడియాలో సర్టిఫికెట్ కోర్స్ చేశాను.
 కుటుంబంలో మీకు ప్రోత్సాహం, ప్రేరణ?
జ. పిల్లలు వరప్రసాదాలు అనుకునే కుటుంబంలో, ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని భావించే తల్లిదండ్రులకి, ఇద్దరు మగపిల్లల తర్వాత మొదటి ఆడపిల్లగా పుట్టాను. మెరక పొలాల రైతు ఇంట్లో ఉండే ఎన్నో ఆర్ధిక ఇబ్బందుల మధ్యే మమ్మల్ని అపురూపంగా పెంచారు మామ్మా తాతగారూ, అమ్మా నాన్నగారూ. ఇప్పటిలాగా నిరంతరమైన వత్తిడి గానీ, పహారా కానీ, నిర్బంధపు  పోటీ చదువుగానీ ఉండేది కాదు. స్కూలైనా కాలేజీ అయినా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూజివీడులోనే కావడంతో మా నలుగుర్నీ ఆలస్యంగా చదువులో చేర్పించారు. అందువల్ల బోలెడు ఖాళీ సమయం, ప్రకృతి ఒడిలో సహజమైన వికాసానికి అవకాశం దొరికాయి. ఇంట్లోనే తెలుగు లెక్కలూ చెప్పి తిన్నగా ఒకటో తరగతిలో చెల్లినీ, మూడో తరగతిలో నన్నూ, ఐదూ ఆరు  తరగతుల్లో  మా అన్నలిద్దర్నీ బడిలో చేర్పించారు.
చుట్టూ అంతటా పచ్చని పొలాలూ, నీలాకాశం, ఫలవృక్షాలూ, పూలతీగలూ, పక్షులూ కనబడుతూ ఉండటంతో నాకు లలితగీతాలూ, కవిత్వం, చిత్రలేఖనం మీద ఆసక్తి కలిగింది. ఇలాంటి మునివాటికలో మమ్మల్ని పెంచిన మా నాన్నగారే పరోక్షంగా నాకీ అభిరుచి కలగడానికి కారణమని చెప్పచ్చు. ప్రతిభ, కృషి కనిపించే ఏ పని చేసినా నాన్నగారు మురిసిపోయేవారు. ఆయనకున్న ఆర్ధిక వనరులూ, తీరికా తక్కువే అయినా ఉన్నంతలో నా అభిరుచిని ప్రోత్సహించేవారు. పెళ్ళయాక నా భర్త తీరిక దొరకని వైద్యులే అయినా కళారంగంలో నా ప్రయాణానికెపుడూ అడ్డురాలేదు.

సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది? మీకు స్ఫూర్తి కలిగించిన సాహిత్య వేత్తలు?
చిన్నతనంలో ఊరికి దూరంగా ఉన్న మా ఇంటికి వారం వారం ఒకటో రెండో వారపత్రికలూ, ఒక మాస పత్రికా, ప్రతినెలా ఒక చందమామా పోస్ట్ లో వచ్చేవి. ఇంటినిండా ఎప్పుడూ బంధుజనం ఉండేవారు, అందువల్ల మా అమ్మగారికి ఎడతెగని పని ఉండేది. మధ్యలో ఏ కాస్త తీరిక దొరికినా వారపత్రికో నవలో పట్టుకుని చదివేవారు. ఆ పుస్తకాల్లో ఆమె ఆసక్తి ఏమిటా అని నాకు కుతూహలంగా ఉండేది. త్వరగా తెలుగు చదవడం వచ్చేయడంతో అయిదారు తరగతులకు వచ్చేసరికే వారపత్రికలూ, నవలలూ చదవడం మొదలుపెట్టాను. నాకు సహజమైన అభిరుచి వాటిలో ఉందని నాకు తెలిసిన సమయం అది. ఇక దొరికిన పుస్తకమల్లా చదివేసేదాన్ని. పుట్టి బుద్ధెరిగినప్పటినుండి రోజులో కాసేపైనా ఏదో ఒక పుస్తకం చదవని రోజులు చాలా తక్కువ. లలితకళలు లేని జీవితాన్నీ నేనూహించలేను. నా పరిసరాలెపుడూ పరిశుభ్రంగా, కళాత్మకంగా ఉండాలనీ, శాంతిని ప్రసరించాలనీ ప్రయత్నిస్తూంటాను. స్ఫూర్తి కలిగించిన సాహిత్యవేత్తల్లో ముఖ్యులు కొడవటిగంటి కుటుంబరావుగారు, అబ్బూరి ఛాయాదేవి గారు. వారి నిశిత దృష్టి, కనబడీ కనబడని హాస్యం, సరళమైన శైలి ఇష్టం. ఇంకా పి. సత్యవతి గారు, శ్రీరమణగారు, మృణాళిని గారు, పొత్తూరి విజయలక్ష్మి గార్ల రచనలిష్టం.
 ఇప్పటివరకు మీరు రాసిన ప్రక్రియలు, రాయడానికి ప్రేరణ?
ఇప్పటివరకు – కథ, కవిత, పాట, వ్యాసం, నాటకం, గల్పిక, నృత్య నాటిక, రేడియో టాక్ – ఇలా వివిధ ప్రక్రియల్లో రాశాను.
విశ్వనాథ సత్యనారాయణ గారూ, అడవి బాపిరాజుగారూ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లతో తాతగారికి, తద్వారా నాన్నగారికి ప్రత్యక్ష పరిచయం, సాన్నిహిత్యం ఉండేవి. ఇంట్లో ఎవరికీ సాహితీ సృజనలో ప్రవేశం లేకపోయినా, సాహితీ ప్రముఖులంటే గొప్ప గౌరవం, ఉత్తమ సాహిత్యాన్ని ఎన్నగల అభిరుచీ ఉండేవి. నేనేది చదివినా నాన్నగారితో చెప్పేదాన్ని. దానిలోని మంచి చెడ్డలు, ఆయన ఒక ఫ్రెండ్ తో చర్చించినట్టు నాతో చర్చించేవారు. అలా కథలూ, నవలల మీద అనురక్తి ఏర్పడింది. నాన్నగారికి లలితగీతాలన్నా, మంచి సినిమా గీతాలన్నా ఇష్టం. చుట్టూ మనుష్య సంచారంలేని మా పరిసరాల్లో ఏ భయమూ లేకుండా తన కుటుంబానికి తానే రక్షగా నిలిచి, చుట్టుపక్కల రైతులకి సలహా సహాయాలనిందిస్తూ, సానుకూల దృక్పథాన్ని మాలో పెంచిన నాన్నగారు చిన్నప్పటి నుంచి నాదృష్టిలో హీరోగా నిలిచిపోయారు. ఆయన మెచ్చుకునే పని చేయగలగాలని నాకుండేది. పొలాల్లో తిరుగుతూ ఆకాశం, వరి పైరులూ, ఎగిరే కొంగలూ, పంట కాలవలూ, చెట్టు చేమలూ అన్నిటిమీదా పాటలు రాసేదాన్ని. ఆకాశవాణి వారు, నది మాసపత్రిక వారూ అడగ్గా ఎన్నో వ్యాసాలు రాశాను. నేను పనిచేసిన స్కూలు కోసం, ఆకాశవాణిలో ప్రసారం కోసం కొన్ని నాటకాలు రాశాను. డా. భార్గవీ రావు గారి ప్రోత్సాహంతో ఊర్వశి నృత్యనాటిక రాశాను. రేడియో టాక్స్ లో కూడా అపుడపుడు పాల్గొనేదాన్ని. పదేళ్ల వయసులోనే చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికలు చూసి మేం నలుగురు పిల్లలం కలిసి, వజ్రమాల అని ఒక లిఖిత పత్రిక మొదలుపెట్టాం. దాన్లో మాకు తోచినట్టు కథలు రాసి, బొమ్మలూ, కార్టూన్లూ వేసేవాళ్ళం. బడిలో స్నేహితులు ఆ పత్రిక అడిగి తీసుకుని చదివేవారు. అది ఒకరి నుంచి ఒకరికి చేరి టీచర్ల దృష్టిలో పడి మాకొక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఆ వయసు నుంచే లలిత గీతాలు కూడా రాయాలని ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. తర్వాత కాలేజీ మాగజీన్లో, నూజివీడులోని స్థానిక పత్రిక సాహితిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి.
ఆంధ్రప్రభలో నా మొదటి కథ ‘పాపఫలాంత వైభవం’ 1980 లో వచ్చింది. దాదాపు అప్పుడే  వనితలో ‘రచయిత్రి రమాదేవి’, వనితా జ్యోతి లో ‘మూగకు మాటొస్తే’ కథలు వచ్చాయి. తర్వాత ఎమ్మెస్సీ పూర్తై వివాహమయ్యేదాకా కథా రచనలో విరామం వచ్చినా పాటలు మాత్రం కుదిరినప్పుడల్లా రాస్తూ ఒక చోట పొందుపరుస్తూ వచ్చాను. వాటిలో కొన్నిటిని 1987లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల మూర్తి గారు చూసి, ‘లయబద్ధంగా చక్కగా రాశారమ్మా! మీరు తెలుగు ఎమ్మేనా?’ అనడిగారు. కాదంటే ‘మీ భాష అంత బావుం’దని మెచ్చుకుని బాణీ కట్టి పాడి వినిపించారు. గీతరచన విషయంలో నాకు మొదట లభించిన ప్రోత్సాహం అది. తర్వాత LMA వ్యవస్థాపకులు శ్రీ కొమండూరి రామాచారి గారు మా పాపకు లలితసంగీతం నేర్పుతూ, అనుకోకుండా నా రచనలు కంటపడి, ‘ఇంత లయాత్మకమైన పాటలు రాస్తున్నారు.  మీరు వీటిని పుస్తకంగా తీసుకు రావా’లని ప్రోత్సహించారు. ఆ పాటలు పుస్తకంగా వెలువడినపుడు, పుస్తకావిష్కరణ వేదిక మీద తను స్వరపరచిన నా పాటల్ని LMA విద్యార్థుల చేత పాడించారు.
 ప్రచురించిన పుస్తకాలు?
మొదటి పుస్తకం వానచినుకులు లలితగీతమాలిక 2004 లో  వెలువడింది. ఆ పుస్తకానికి ఆ సంవత్సరమే తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారంగా 20,116 రూపాయల నగదు బహుమానం, ఒక జ్ఞాపిక లభించాయి. ఆ ప్రోత్సాహంతో  అప్పటివరకూ రాసిన కథలన్నీ కలిపి 2005లో ఆలంబన కథా సంపుటి ప్రచురించడం జరిగింది. 2010 లో మరో 16 కథలతో ఆసరా కథా సంపుటి, 2014లో ఊర్వశి నృత్య నాటిక, 2015లో వేకువపాట కధాసంపుటి  పుస్తకాలు వెలువడ్డాయి. 2018లో శ్రీమతి శాంతసుందరి రామవరపు నా కథలలో తనకు నచ్చిన 12 కథలను, హిందీలోకి అనువదించగా ఆ కథలతో  బోలతీ తస్వీర్ కథాసంపుటి హిందీలో వెలువడింది. హైదరాబాద్ ఆకాశవాణిలో కథలూ, కవితలూ చదివాను. రేడియో టాక్స్ లో పాల్గొన్నాను. నా లలితగీతాలు ఈ మాసపు పాటలుగానూ, విడిగానూ కూడా రేడియోలోనూ, దూరదర్శన్ లోనూ ప్రసారమయ్యాయి.

                      
 ఇప్పటివరకూ అందుకున్న గుర్తింపులూ, అవార్డులూ?
ఎక్కడ చదువుతున్నా విద్యార్ధినిగా నేనెప్పుడూ ప్రథమ స్థానంలో ఉండేదాన్ని. నాకు లభించినవాటిని ఎప్పుడూ వృధా చేయకూడదనే ఒక భావన నాలో ఉండేది. అది సమయమైనా, పుస్తకమైనా, శిక్షణ అయినా.
ఏడవతరగతిలో మా జిల్లా పరిషత్తులో ఉన్న పాఠశాలలన్నిటిలోనూ ప్రధమురాలిగా ఉత్తీర్ణత పొందడంతో  నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. అప్పట్నుంచి ఎమ్మెస్సీ పూర్తయేవరకు ఆ స్కాలర్షిప్ కొనసాగింది. పదవ తరగతి పరీక్షల్లో కూడా జిల్లా పరిషత్ అంతటికీ ప్రధమ స్థానం నాదే. బీఎస్సీ లో కెమిస్ట్రీ మెయిన్ సబ్జక్టుగా చదివి ఆంధ్రా యూనివర్సిటీ ఫస్ట్ రాంక్  తెచ్చుకుని ప్రొఫెసర్ ఎల్. ఆర్. రావు షష్ట్యబ్దిపూర్తి అవార్డు అందుకున్నాను. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ  ఎంఫిల్ చేశాను. బీఎస్సీ లోనూ, ఎమ్మెస్సీ లోనూ, ఎంఫిల్ లోనూ మూడుసార్లూ నాకు యూనివర్సిటీ ఫస్ట్ రాంక్ లభించింది.  ఎరీనా మల్టీమీడియా కోర్సులో రీజనల్ టాపర్ గా సన్మానం పొందాను.
రచయిత్రిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 2004లో ‘వానచినుకులు’ గ్రంథానికి సాహితీపురస్కారం, నవకథారచయిత్రిగా 2005లో అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారం, 2009లో స్వర్గీయ శ్రీ యమ్వీయల్ సాహిత్య సత్కారం, 2011లో ‘లేఖిని’  సంస్థ నుండి కథా పురస్కారం, షి అవార్డు, ఉగాది పురస్కారం, ఉత్తమ కథా రచనకు 2017లో అమృతలత అపురూప పురస్కారం లభించాయి. చిత్రలేఖనంలో కూడా కొన్ని గుర్తింపులు లభించాయి. కాన్సర్ బాధితుల్లో ఆశావహ దృక్పథం పెంపొందించాలని ఎలీ లిల్లీ వారు నిర్వహించిన ఆంకాలజీ ఆన్ కాన్వాస్ అనే అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీలో నా చిత్రం ‘Blues & Blooms’ ఎంపికై లండన్ లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్’లో ప్రదర్శించబడింది.

    

  

  నా మొదటి పుస్తకం ‘వానచినుకులు’కి డా. సి. నారాయణరెడ్డి గారు ముందుమాట రాశారు. పుస్తకావిష్కర్త కూడా ఆయనే. ఆ సందర్భంగా వారి ఆశీస్సులూ, అభినందనలూ నాకు లభించాయి. నేను రాసిన పాటలకి రామాచారి గారు, పి. వి. సాయిబాబా గారు, స్వరవీణాపాణి గారు, విన్నకోట మురళీ కృష్ణ గారు, కమలారమని గారు, ఎమ్మార్కే ప్రభాకర్ గార్ల వంటి స్వరకర్తల నుంచి ప్రశంసలు లభించాయి. ఢిల్లీ తెలుగు అకాడెమీ, శ్రీ యమ్వీయల్ సాహితీ సమాఖ్య, భారత వికాస్ పరిషత్ వంటి కొన్ని సంస్థలనుంచి లలితగీత రచయిత్రిగా, కథా రచయిత్రిగా సత్కారాలు లభించాయి. కొన్ని కథలకు శ్రీ కాళీపట్నం రామారావు గారు, మునిపల్లె రాజు గారు, వసుంధర, అబ్బూరి ఛాయాదేవిగారు, కాత్యాయనీ విద్మహేగారు, శ్రీధర గారు, విహారి గారు, కిరణ్ ప్రభ గారు, భువనచంద్ర రాజు గార్ల  వంటి లబ్ధప్రతిష్ఠుల ప్రశంసలూ, అభినందనలూ లభించాయి. హిందీలో వచ్చిన బోలతీ తస్వీర్ చదివి శ్రీమతి నీలం కులశ్రేష్ఠ వంటి ప్రసిద్ధ హిందీ రచయితలు కొందరు అభినందించారు.
 ఇప్పుడు రాస్తున్న పుస్తకాలు?
ఆంగ్లంలో ప్రసిద్ధమైన ఒక పుస్తకానికి తెలుగు అనువాదం చేశాను. ఎందువల్లో అదింకా ప్రచురణ కాలేదు. ప్రస్తుతం తెలుగులో నా నాలుగో  కథాసంపుటితో పాటు ఒక  కవితాసంపుటి కూడా వెలువరించే పనిలో ఉన్నాను. నేను రాసిన పాటలతో ఒక లలితగీత విభావరిని ఏర్పాటు చేసి ఈ రెండు పుస్తకాలూ ఆవిష్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాను.
 భవిష్యత్తు రచనలు?
వంద గీతాలని కలిపి కట్టిన లలితగీతమాలిక, నా మొదటి పుస్తకం ‘వాన చినుకులు’. ఆ పుస్తకం  తర్వాత మళ్లీ ఇంకో పాటల పుస్తకం వెలువరించడం కుదరలేదు.
నా రచనలు చదివిన చాలామంది ‘మీ శైలిలో ఒక  నవల రాస్తే చదవాలనుం’దని అడుగుతున్నారు.
ఈ రెండూ సమీప భవిష్యత్తులో రాబోయే నా రచనలు.
సాహిత్యంలో యువత పాత్ర?
‘పౌరులని బట్టి పాలకులూ, పాఠకులని బట్టి రచయితలూ’ అనవచ్చేమో!
మంచి సాహిత్యం సృజించాలంటే రచయిత హృదయంలో ఎంతో మథన జరగాలి. సాహితీ సృజననే ఒక వృత్తిగా తీసుకునే పరిస్థితి తెలుగు సాహిత్యంలో అయితే లేదన్నది అందరికీ తెలిసిందే. ఉదారపోషణార్ధం వేరే ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ మిగిలిన సమయంలో సాహతీ సృజన చేయాలి. దొరికిన కాస్త సమయాన్ని దీనికి వెచ్చించాలంటే దానికి తగిన ప్రోత్సాహం లేనపుడు మంచి సాహిత్యం పుట్టడం కష్టం. మంచి పాఠకులుంటేనే మంచి రచయితలూ రూపొందుతారు.
దృక్పథం విశాలం కావాలన్నా, ఉన్నత వ్యక్తిత్వం అలవడాలన్నా విస్తృతంగా మంచి సాహిత్యాన్ని చదవాలి. సాహిత్యపు పెంపకంలో పెరిగిన వ్యక్తుల వ్యక్తిత్వం ఉన్నతమవుతుంది, ఆ సమాజం భద్రమూ శాంతియుతమూ అవుతుంది. ఏదైనా సమస్య ఎదురైనపుడు, భిన్న దృక్పథాల గురించిన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి స్పందనలో పరిణతి కనిపిస్తుంది. ఇవాళ్టి వస్తు వినిమయ ప్రపంచంలో విలాసాలకు ఎంతైనా వెచ్చిస్తున్నారు జనం. కానీ మంచి పుస్తకానికి తగిన వెల  చెల్లించి కొనాలంటే ముందుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ. యువతరం మంచి సాహిత్యం చదవడంలోనూ, వ్రాయడంలోనూ కూడా ఆసక్తి చూపించడం సమాజానికి ఎంతో మంచి చేస్తుంది.
మీ తరం రచయితలకు మీరిచ్చే సూచనలు సలహాలు?
సమాజ హితమైనదే సాహిత్యం. కొందరు రచయితలు వాస్తవ సంఘటనలకు కథారూపం లేదా కవితారూపం ఇచ్చి వదిలేస్తారు. పిల్లతెమ్మెర పూలమీంచి వీస్తే సుగంధం వ్యాపిస్తుంది. మురికి కాలవ మీంచి వీస్తే దుర్గంధం వ్యాపిస్తుంది. ఆ వీచే గాలిలాగే రచయితలూ చూసినదాన్ని చూసినట్టు కథలా అల్లి అదే సాహిత్యం అంటున్నారు. ఆ రచన ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో పట్టించుకోవడం లేదు. వైషమ్యాలు రగిలేలా రచనలు చేసి ‘సమాజం ఇలాగే ఉంది’ అనడం సరికాదు. రచయిత ఎపుడూ చక్కని సమాజనిర్మాణానికి అవసరమైన భావజాలం పెరిగేలా రచనలు చేయాలి. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే రచనలు చేస్తూనే రాబోయే తరాలకోసం భద్రమైన సమాజం ఏర్పడేలా, సమాజహితమైన నవ్య భావాలు పెంపొందేలా రచనలు చేయాలి.

ఇంటర్వ్యూ గ్రహీత ఎస్. యశోద

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త చైతన్యం

కోటి కిరణాల రాజు