కొత్త చైతన్యం

కథ

విజయశ్రీ

మెడలో వేసిన పూలదండ ,శాలువా, అందుకున్న జ్ఞాపిక, సర్టిఫికెట్ అన్ని టేబుల్ పైన పెట్టి అలసటగా సోఫాలోకి జారి గల పడింది హేమ.
మనసును చుట్టుముట్టిన ఆలోచనలు, అనుభూతులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి .
‌. ‌ఈరోజు ఇన్ని సంవత్సరాలు తను పవిత్రంగా భావించుకున్న, ఉపాధ్యాయ వృత్తి . కర్తవ్య నిర్వహణలో కొన్ని సాధక బాధకాలు ఎదుర్కొన్నా ….అధిక శాతం ఆత్మ సంతృప్తిని పొందిన మధురానుభూతుల, అందమైన ప్రపంచాన్ని వదిలేసి వచ్చినట్లు దిగులుగా అనిపిస్తోంది. మరోవైపు సభలో మోగిన చప్పట్లు .వేదికపై తన గురించి ఎంతో గొప్పగా, ఆత్మీయంగా ఇచ్చిన ప్రసంగాలు, విద్యార్థులు కళ్ళనీళ్ళ పర్యంతంగా ఇచ్చిన వీడ్కోలు . రీలు లాగా కళ్ళముందు తిరుగుతున్నాయి.
ముఖ్య అతిథిగా వచ్చిన ఐ.ఏ .ఎస్ . ఆఫీసర్ ఎంతో వినయంగా, “నమస్తే …మేడమ్ !!” అంటూ దగ్గరకు వచ్చాడు. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా అనిపించింది .
“ఏమిటి !? నన్ను గుర్తుపట్టారా!? టీచర్!”
ముఖంలోకి తేరిపార చూసింది .మీరు….? మీరు….? అన్నది వేలు గడ్డానికి ఆనించుకుంటూ. ‘నేను మీ విద్యార్థి కుమార్ని మేడమ్’ ! అనగానే మనసు ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోయింది హేమకి.

‘ ఏమిటి హేమ !! ఇంకా ఆ మూడ్ నుంచి బయటికి రాలేదా అంటూ ఆనంద రావు గారి పలకరింపుతో లేచింది.
స్నానం చేసి వచ్చింది. ఇద్దరూ హార్లిక్స్ కలుపుకొని తాగారు . చల్లగాలికి బాల్కనీలో కాసేపు పచార్లు చేస్తున్నది. బాల్కనీలో పూల కుంపట్లు, కిందకి చూస్తే గార్డెన్. అన్ని తన చేత్తో ప్రేమగా పెంచుకున్న రకరకాల పూల చెట్లు . గులాబీ మందార మొదలైన ఇంకా ఎన్నో రకాలు. అప్పుడే వేసిన మొగ్గలు కొన్ని . విచ్చుతున్న మొగ్గలు కొన్ని .పూర్తిగా వికసించి గుబాళిస్తున్నవి కొన్ని. తన చేత తీర్చి. దిద్దబడిన విద్యార్థులతో పోల్చుకున్నది హేమ . అంతరంగం ‌‌మళ్లీ గతంలోకి తొంగి చూసుకొన్నది.
ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క అనుభవం. మొదటి రోజు ప్రధానోపాధ్యాయులు పిలిపించి టైం టేబుల్ ఇచ్చారు. ఫస్ట్ పిరియడ్ ఆరవ తరగతి. రిజిస్టర్ తీసుకొని క్లాసులో అడుగుపెట్టగానే పిల్లలు లేచి నిలబడ్డారు. వెనకాల బెంచి వాళ్ళు కదలకుండా నక్కి, కూర్చున్నారు “గుడ్డు…మార్నింగ్ మేడం “. కిస కిసా నవ్వులు .అయ్యో!! తెలుగు కదా !! ఇంగ్లీషులో చెప్తే ఏమి అర్థమవుతుంది ? నమస్కారం ఉపాధ్యాయురాలు గారు! అయ్యో !!కాదు ,కాదు గురువుగారు!!”
వాళ్ల వెటకారానికి, ” వీళ్ళేమి పిల్లలు రా బాబు అనుకున్నది ” మనసులో హేమ.?
” నమస్కారం కూర్చోండి”. అన్నది . మళ్లీ వెకిలిగా నవ్వులు. ఈ స్కూల్లో మొదటి రోజు. కానీ పిల్లలు ,వాళ్ల మనస్తత్వాలు ,భోధనానుభవం కొత్త కాదు హేమకి.
“మాతృభాష తెలుగు అంటే మీ కున్న ప్రేమ నాకు చాలా సంతోషంగా ఉంది” . అన్నది చిరునవ్వుతో.
బదిలీ మీద వచ్చింది. ఇట్లాంటి అనుభవాలు ఎన్ని లేవు! వాళ్లని క్రమశిక్షణలో పెట్టడం పెద్ద విషయమేమి కాదు , అనుకున్నది. మూడు రోజులు వాళ్ళని స్టడీ చేసింది. వాళ్లు వేసే చిలిపి ప్రశ్నలు అన్నింటికి ఓర్పుగా సమాధానాలు చెబుతూ, నవ్వుతూనే , మందలింపు చూపులతోనూ తనవైపు తిప్పుకుననే ప్రయత్నం చేసింది.
కానీ…. ఇక వీళ్ళ అల్లరి అరికట్టాలి.

నాలుగవ రోజు ‘సైలెన్స్ ‘….అంటూ టేబుల్ మీద కొట్టింది .ఒక్కసారిగా నిశ్శబ్దం. ” చూడండి మిమ్మల్ని కొట్టి దండించడం నాకు రాక కాదు .మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళు మంచి పిల్లలైతే మాటతోనే అర్థం చేసుకుంటారు.”
మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇక్కడికి ఎందుకు పంపుతున్నారు ? అనగానే “చదువుకోటానికి టీచర్!”
“ఉపాధ్యాయులను గౌరవించకుండా మీరు ఇట్లా అల్లరి చేస్తుంటే చదువు వస్తుందా “? అన్నది నొసలు చిట్లిస్తూ…ఎవ్వరూ మాట్లాడలేదు . బిక్క ముఖాలు పెట్టారు.
” అల్లరి చెయ్యకుండా కూర్చుంటే మీకు ఒక కథ చెప్తాను .” రామానంద తీర్థ పాఠాన్ని తీసుకొని చెప్పింది. మీరు సరిగ్గా చదువుకోకపోతే మిమ్మల్ని కొట్టను ,నన్ను నేను కొట్టుకుంటాను . మీకు ఇష్టమేనా ?? “అమ్మో వద్దు టీచర్ !మేము ఇకనుంచి బాగా చదువుకుంటాము.” అన్నారు ఏక కంఠంతో
……..
అనూహ్యమైన మార్పు. అన్ని పిరియడ్స్ లోను క్రమశిక్షణ పాటిస్తూ. మంచి.మార్కులుసంపాదించుకుంటున్నారు. అన్ని తరగతుల విద్యార్థులు కూడా అభిమానిస్తున్నారు. హేమ టీచర్ అంటే.
పిల్లల మార్పును గమనించుకుంటున్నారు తల్లిదండ్రులు. ప్రధానోపాధ్యాయులకు కూడా హేమా టీచర్ వచ్చాక పిల్లలలో క్రమశిక్షణ వచ్చిందని సదభిప్రాయం ఏర్పడింది. తోటి టీచర్లతో కూడా హేమ చాలా కలిమిడిగా ఉంటుంది.
మూడు సంవత్సరాలు ఇట్టే గడిచినాయి. ప్రధానోపాధ్యాయులు, ఒకళ్ళిద్దరు డిపార్ట్మెంట్లో పలుకుబడి ఉన్న పేరెంట్స్ ప్రయత్నం తో బదిలీని ఆపి అదే స్కూల్లో వేయించుకున్నారు . వాళ్లలో ఒక ఆయన కొడుకే …ఈ కుమార్ . అప్పటి అల్లరి గ్రూపులో లీడర్ కూడా. తలుచుకుంటే … హేమకి నవ్వొచ్చింది ఎంతో చిత్రంగాను పట్టలేనంత ఆనందంగాను కూడా
ఉంది.
…………
ఉదయాన్నే తూర్పు రేఖలు కొత్త చైతన్యానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రకాశిస్తున్నాయి. కాఫీ కప్పులు పట్టుకొని వచ్చింది హేమ. కాఫీ తాగుతూ. వార్తాపత్రిక చదువుతుండగా మెరుపు లా ఒక ఆలోచన వచ్చింది. ఆనంద రావు గారి తో సంప్రదించింది. భార్య. మంచి ఆలోచనలకు ఆయన ఎన్నడూ అడ్డు చెప్పరు.
హేమ కర్నాటక సంగీతంలో డిప్లొమా చేసింది కనుక , ఉచితంగా సంగీత శిక్షణ శిబిరం, పగలంతా పనులు చేసుకునే వాళ్లకి రాత్రి పాఠశాల ఏర్పాటు చేయటానికి నిర్ణయించుకున్నది .
***. *†**. *****
సర్వేజనా సుఖినోభవంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కార్తీక మాస విశిష్టత

సాహిత్యం సమాజ హితంగా ఉండాలి – వారణాసి నాగలక్ష్మి