దొరసాని

ధారావాహికం – 5వ భాగం

లక్ష్మీమదన్

పడక గదిలోకి వెళ్లిన అలేఖ్యకు నీలాంబరిని చూసి హృదయం ద్రవించి పోయింది. ఎప్పుడూ. అన్ని గంటలు ప్రయాణం చేయని నీలాంబరికి 18 గంటల ప్రయాణంలో కాళ్లు మొత్తం వాచిపోయి ఉన్నాయి అలా దిండుమీద కాళ్లు పెట్టుకొని నీరసంగా వాలిపోయి ఉంది నీలంబరి…

” అమ్మా! నీ కాళ్లు ఇంతలా వాచి పోయాయి ఏంటమ్మా! ” అనీ అడిగి.. ఇంట్లో ఉన్న ఒక లోషన్ తెచ్చి కాళ్లకి మర్దన చేసింది అలేఖ్య.

” అయ్యో వద్దమ్మా ప్రయాణం అలవాటు లేకపోవడం వల్ల అలా జరిగింది పరవాలేదు ఒకటి రెండు రోజుల్లో సర్దుకుంటుంది” అని చెప్పి కూతురునీ దగ్గరికి తీసుకుంది.

అలేఖ్య కూడా తల్లి దగ్గరే పడుకుని తన చిన్నప్పటి కబుర్లన్నీచెప్పించుకుని వినసాగింది…. అలేఖ్య కూడా నీలాంబరిలాగా అందంగానే ఉంటుంది కానీ నీలాంబరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అందంతోపాటు ఆమె ముఖంలో ఉన్న హుందాతనం ఆమెకి మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.

అలా వారం రోజులు గడిచింది రోజు ఉదయాన్నే కూతురు అల్లుడు ఆఫీస్ కి వెళ్ళిపోతారు చేయడానికి ఏమీ ఉండదు మాట్లాడే మనిషి దొరకడు అసలు ఎంతకని ఇంట్లో కూర్చోవడం చాలా విసుగ్గా అనిపించ సాగింది…

మెల్లగా తనకి ఇష్టమైన పెయింటింగ్ చేసుకో సాగింది అలా రోజూ మూడు నాలుగు పెయింటింగ్స్ వేసేది అన్ని చిత్రాల్లోనూ పల్లెటూరు సంబంధించిన థీమ్ ఎక్కువగా కనపడేది… ఆడవాళ్లు పిల్లలను ఎత్తుకొని కష్టపడి పనిచేయడం ఎండలో పిల్లలు కూడా ఉండడం వానకు తడవడము ఇవన్నీ తన చిత్రాల్లో చూపించేది.. ఎక్కువగా ఆమె వేసేవి స్త్రీల చిత్రాలు అవన్నీ కళ్ళకు కట్టినట్లుగా వారి జీవితాన్ని ఆవిష్కరించేది…

ఒక వీకెండ్ అలేఖ్య సుధీర్ల ఫ్రెండ్స్ అందరూ వచ్చారు… అక్కడి పద్ధతి ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటం వండుకొని వస్తారు ఏఇంటికి వస్తారో ఆ ఇంట్లోవాళ్ళు కొన్ని ఐటమ్స్ చేసి పెడతారు… అలా దాదాపు 25 మంది వచ్చారు…

నీలాంబరి తను బాగా చేయగలిగే పులిహోర, చక్కెర పొంగలి చేసింది… అలేఖ్య ఈ కాలం వంటలు కొన్ని మంచూరియా, బాసుంది చేసింది.. వచ్చిన వాళ్లు కూడా చక్కని పదార్థములు చేసుకొని తీసుకొని వచ్చారు… వాళ్లు రాగానే అందరికీ నీలాంబరిని పరిచయం చేసింది అలేఖ్య..

” హలో ఫ్రెండ్స్ మా అమ్మ నీలాంబరి గారు” అని చెప్పింది.

అందరూ నీలాంబరి వంక చూసి నమస్కారం చేయడం కూడా మర్చిపోయారు..”.అలేఖ్య అమ్మగారాఇంత అందంగా ఉన్నారు.. రాణివాసపు ఛాయలు కనిపిస్తున్నాయి” అని అనుకుని ఒక్కసారి చేరుకొని” నమస్తే ఆంటీ అన్నారు” అందరినీ చిరునవ్వుతో పలకరించింది నీలాంబరి. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు.. వచ్చిన వాళ్ళందరికీ నీలాంబరిచేసిన పులిహోర చక్కెర పొంగలి చాలా నచ్చింది.

” చాలా బాగుంది ఆంటీ చాలా రోజులైంది ఇలాంటి రుచికరమైన భోజనం చేసి అందులో మన వంటలు” అంటూ అందరూ తృప్తిగా భోజనం చేశారు…

అప్పుడే అలేఖ్య నీలాంబరి వేసిన పెయింటింగ్స్ అన్ని అందరికీ చూపించింది…

మరింత ఆశ్చర్య పోవడం వాళ్ళ వంతు అయ్యింది..

“రియల్లీ! ఇవన్నీ మీరు వేశారా? ఎంత అద్భుతంగా ఉన్నాయి? అసలు ప్రతీ చిత్రం జీవం ఉట్టిపడేలాగా ఉన్నాయి” అన్నారు అందరూ.

” అమ్మకు తన చిన్నప్పటినుండి ఇలా పెయింటింగ్స్ వేయడం అలవాటు ..ఎక్కడా నేర్చుకోలేదు ఏది చూస్తే అది వేసేది అది గుర్తించిన మా నాన్న తనని ఇంకా ప్రోత్సహించారు మా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా అమ్మ పెయింటిగ్స్ ఉంటాయి” అని గర్వంగా చెప్పింది అలేఖ్య.

అందులో కొంతమంది..

” మీరేమనుకోకపోతే మాకు ఆదివారాలు పెయింటింగ్ నేర్పిస్తారా” అని అడిగారు..

” దాందేముందమ్మా నేర్పిస్తాను నాకు ఒక వ్యాపకం లాగా ఉంటుంది” అని చెప్పింది.

అందరూ ఎంతో సంతోషంగా గడిపారు… వచ్చిన ఫ్రెండ్స్ అందరూ భోజనాలు అయిన తర్వాత తలా ఒక పని చేసి ఇల్లును ఎప్పటిలా శుభ్రంగా పెట్టి మిగిలిన పదార్థాలు అన్నిటిని అందరూ షేర్ చేసుకొని వాటిని ప్యాక్ చేసుకొని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.

సాయంత్రాలు నీలాంబరి బయటకు వాకింగ్ కోసం వెళ్లేది అలా వెళ్ళినప్పుడు తన వయసు వారు కొంతమంది పరిచయమయ్యారు…

అందరూ వాళ్ళ పిల్లల కోసం డెలివరీల కోసమో లేదా పిల్లలను చూసుకోవడం కోసము వచ్చినవాళ్లే… కొంతమంది భార్యాభర్తలుగా వస్తే కొంతమంది ఒంటరిగా వచ్చారు మరి కొంతమంది వీళ్ళతో పాటు ఇక్కడే ఉండడానికి వచ్చారు ఎలా వచ్చినా అందరి సమస్య ఒక్కటే…

అమెరికాలో జీవనం గురించి వాళ్లు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు కొన్ని రోజుల తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వారి సాధక బాధకాలు చెప్పుకున్నారు..

పిల్లల కోసం వాళ్లు ఇల్లు..పనులు అన్నీ వదులుకొని వస్తారు… ఉద్యోగాల్లో వాళ్ళ పిల్లలంతా బిజీగా ఉంటారు భారతదేశంలో లాగా పని వాళ్లు ఉండరు.. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు వారికి పనివాళ్లుగా మారాల్సిందే.. అందరి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు కానీ చాలామంది పరిస్థితి ఇంచుమించు ఇంతే… మన దగ్గర లాగా ఎవరితోనైనా కబుర్లు చెప్పుకోవడానికి మనుషులు కనపడరు ఎవరి ఇంటికి వెళ్లాలన్నా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాలి అది కూడా ఎప్పుడో సాయంత్రాలు వెళ్లి ఏ రాత్రికో తిరిగి రావడం.. స్వేచ్ఛగా ఎక్కడికి పోలేము ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లే మనుషులు కూడా మరల్లా బతకాల్సిందే… కొంతమంది వారి ఇంటి పరిస్థితి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు…

వారి పిల్లలు కొంచెం తీరిక తీసుకొని వీళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడరు పొద్దున వెళ్ళిపోతే సాయంత్రాలకు కానీ తిరిగిరారు ఇంట్లో వీళ్ళు యంత్రాల పని చేయాల్సిందే… పాత్రలు కడగడం బట్టలు వాషింగ్ మిషన్ లో వేసుకుని వచ్చి సర్దుకోవడం వంట పని చేసుకోవడము ఇవన్నీ భారమైన పనులే.. తర్వాత ఇంకా ఎక్కువ భారమైనది పిల్లలను చూసుకోవడం… భార్యాభర్తలుగా వచ్చిన వాళ్ళు కొంచెం ఒకరికి ఒకరు తోడుంటారు. ఒంటరిగా వచ్చిన వారు మాత్రం నరకమే చూస్తున్నారు ఎడారిలో ఉన్న భావనే కలుగుతుంది… ఇలా అందరి కష్టాలను విని నీలాంబరి చాలా బాధపడింది… అమెరికా చదువులు అంటూ ఒకప్పుడు గొప్పగా పంపించి “మా పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.. డబ్బులు పంపిస్తున్నారు.. ఇదిగో వచ్చే నెలలో మేము కూడా అక్కడికే వెళ్లిపోతున్నాము ఆరు నెలలు అక్కడే ఉంటాను” అని మొదట్లో సంతోషపడి రెండవసారి వచ్చే వారికి గుండెల్లో గుబులే… అమెరికాకి వచ్చేటప్పుడు ఊరికే వస్తారా… పచ్చళ్ళు పొడులు పిండి వంటలు బట్టలు ఇంకా అమెరికాలో ఎక్కువ ధర ఉన్న వస్తువులు ఇండియాలో కొనుక్కొని మోత బరువు మోసుకొని వెళ్లాలి ..అవన్నీ ఖర్చులు వీళ్ళే భరించాలి… అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఏముంది గూటి పక్షులే వెళితే ఒకసారి ఏవో టూర్ లంటూ వెళ్లడం ఆ తర్వాత ఇదే తీరు..

నీలాంబరి అదే ఆలోచించుకుంటూ ఇంటి వైపు నడక సాగింది “మేము ఇలాగే చేసాము కదా విదేశీ సంబంధం అని అమ్మాయిని ఇక్కడికి ఇచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదు పిల్లలకు దూరంగా ఎలా ఉండడం అనేది.. అందులో కొడుకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు” ఇలా ఆలోచించుకుంటూ ఇంట్లోకి వచ్చింది..

ఇంట్లోకి రాగానే అలేఖ్య” అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్” అని చెప్పింది.

” ఏంటమ్మా! అది ” అని అడిగింది నీలాంబరి.

” ఇక్కడ సొసైటీలో ఎగ్జైబిషన్ పెడుతున్నారు అందులోనీ పెయింటింగ్స్ పెట్టడానికి నేను పర్మిషన్ అడిగాను… వాళ్ళు నువ్వు వేసిన చిత్రాలను చూసి చాలా ఆశ్చర్యపోయారు అవి అందులో లో పెట్టడానికి ఒప్పుకున్నారు అంతే కాకుండా అవి అమ్మే ఏర్పాటు చేస్తారు నీకు తెలియకుండా ఇలాంటి పని చేశాను కోపం ఏం రాలేదు కదా అమ్మ” అని అన్నది .

ఆశ్చర్యపోయింది నీలాంబరి…” పరవాలేదు ఎగ్జిబిషన్లో పెట్టే వరకు బాగానే ఉంది ఇంతవరకు నేను వేసిన చిత్రాలు ఏవి అమ్మ లేదు డబ్బుకు మనకి ఏం కొదవ” అని అన్నది.

” అమ్మా! చిత్రాలు అమ్మితే తప్పేం లేదు.. వాటితో వచ్చిన డబ్బు సొంతంగా వాడుకోకు.. ఏదైనా కార్యక్రమానికి ఉపయోగించుకో నీ మనసులో ఏదైనా చేయాలని ఉంటే దానికి వాడుకో” అని సలహా ఇచ్చింది అలేఖ్య.

” ఈ ఆలోచన బాగానే ఉంది సరే అలాగే చేద్దాం మీ నాన్నకు కూడా ఒకసారి ఈ మాట చెప్పు” అని చెప్పింది నీలాంబరి.

” ఇదంతా నాన్నకు చెప్పే చేశాను అమ్మ నాన్న చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు” అని చెప్పింది అలేఖ్య.

” అవునా తండ్రి కూతుర్ల పనా ఇది” అని నవ్వింది నీలాంబరి.

అలా అనుకున్నట్లుగానే ఆమె చిత్రంలోని ఎగ్జిబిషన్లో పెట్టారు.. నీలాంబరి వేసిన చిత్రాలన్నీ ఎక్కువ రేటుకు అమ్ముడుపోయాయి దాదాపు రెండు కోట్ల వరకు ఆదాయం వచ్చింది…

నమ్మలేకపోయింది నీలాంబరి “తన చిత్రాలకు ఇంత ఆదరణ ఉందా” అని అనుకున్నది…

ఎగ్జిబిషన్ ముగిసే రోజు నీలాంబరి గారు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు ఆమె ఇంకేదైనా పర్ఫామెన్స్ కూడా చేయవచ్చు అని చెప్పారు…

నీలాంబరి ఒక రోజంతా ఆలోచించుకుంది స్టేజి మీద ఏం చేయాలి తాను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలి తన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ ఆలోచించుకొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది…

అనుకున్న రోజు రానే వచ్చింది.. ఎన్నో దేశాల వాళ్లు పాల్గొంటున్న సమావేశం అది…

అందరి కరతాల ధ్వనుల మధ్య ” నీలాంబరి గారు మీరు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము” అని చెప్పారు.

వేదికకు వెనుక వైపు ఉన్న ద్వారం నుండి వేదిక మీదికి వచ్చిన నీలాంబరిని చూసి ఆశ్చర్యపోయారు ఆసీనులై ఉన్న ప్రముఖులందరూ…..😊

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కలలే  లేని కళ్ళు! 

నుడిక్రీడ -4