కలలే  లేని కళ్ళు! 

కథ

పద్మావతి నీలం రాజు

 “లేగెహ్! లెగు ! కాసీంబి ! లెగూ !తెల్లారగట్ల ఏటా నిద్దర !”అంటూ గట్టిగ ఆవులించి అటు తిరిగిపడుకోంది  బూబమ్మ. అప్పుడే వేగు చుక్క పొడిచింది. మంచు పోర లీలగా కనిపిస్తూనే ఉన్నది. గుడిసెల్లో ఉన్న కోళ్లు ఒక్కొక్కటే కూయటం మొదలెట్టాయి. గుడిసెల ఆవల ఉన్న చింత చెట్ల మీదున్న కాకులు అరవటం మొదలెట్టాయి. ఆకాశం లో గుంపుగా ఎగురుతున్న కొంగల బారు ఒకటి వెల్లకిలా పడుకొన్న కాసింబి కి కనిపించాయి. వెంటనే “కొంగ కొంగ గోళ్ళు నాచేతి గోళ్లు” అంటూ బడి పక్కనే ఉన్న పార్క్ దగ్గర బడి పిల్లలు అరుస్తూ గెంతటం గుర్తుకొచ్చింది కాసింబీకి. అదే పాటను మనసులోనే గొణుక్కుంటూ  చాప మీదనుంచి లేచి, ఆ చాప ను చుట్టి పక్కకు తోసింది. 

“ఏటా గొణుగుడు ! ఇంకా కలవరిస్తున్నావేటి! లెగు! కళ్ళాపి వేళకు పోయి నీళ్లు సల్లకుంటే వాళ్ళకి కోపాలొస్తాయి. లెగు  ! లెగు ! బేగి పో!”అంటూ మడతమంచం మీద నుంచి లేవకుండనే కాసింబి ని గదమాయించింది సవతి తల్లి బూబమ్మ. 

“నువ్వా కూనని కూసింతసేపు కూడా కునుకు తీయనియ్యవు గందా!”అంటూ  సాయిబు గట్టిగ మూలిగాడు. 

 కాసీంబి కి నాలుగో వయసు నుండే తల్లి లేదు. తండ్రి సాయిబు బూబమ్మని  రెండో నిఖా చేసు కొన్నాడు తల్లి పోయిన కొద్దిరోజులకే. ఆ పసి కూన చేత చీపిరి పట్టించింది బూబమ్మ. రెక్కాడితే గని డొక్కాడని వాళ్ళం నిన్నే ల మేపెది . నువ్వు కూడా పని సెయ్యాల్సిందే అంటూ పాచి పనులకు తన వెంట తీసుకెళ్లేది. ఆ పిల్ల చేత చిమ్మించడము, గిన్నెలు కడగడము లాంటి పనులు చేయించేది. అలా ఆరేడు ఏళ్ళు వచ్చేసరికి కాసింబి ఆ పనులను చక్కగా చేయడం నేర్చుకుంది. 

 పసిపిల్ల కదా ఏమన్నా పరవాలేదు, ఎంతపనైనా చేయించుకోవచ్చు అన్న దురాసతో చాలా మంది “బూబీ! నువొచ్చినా, రాక పోయిన ఆ పిల్లను మాత్రం పంపుతూ ఉండు! నీ డబ్బులు నీ కిస్తాం !”అంటూ బూబి ని ప్రలోభ పెట్టారు. అదే తాను కావాలని అనుకోవడం తో బూబమ్మ నాగా  లు చేస్తుంటుంది. కానీ కాసింబీని మాత్రం ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండనీయదు.

 కాసీంబి లేవగానే పక్కనే తాడు మీద వేసున్న చింకి లంగా, అతుకుల జాకెట్టు వేసుకొని ఒక పాత  చీర  ని మడిచి నెత్తిమీద కప్పుకొని , అక్కడే పెట్టి ఉన్న సత్తు టిఫిన్ డబ్బా చేత బట్టుకొని రెండు రకాల ఒకే సైజు రబ్బరు చెప్పులు వేసుకొని పనికి బయలు దేరింది. 

 “అమ్మీ ! అబ్బా!  పనికి పోతుండా !”అంటూ ఆగ కుండా నడక సాగించింది కాసింబి. 

గుడిసెలు దాటగానే రోడ్డు మొదలవుతుంది. ఇంకా చీకటిగానే ఉంది. అక్కడక్కడా ఉన్న కుక్కలు రాత్రంతా అరుస్తూ ఉండడంతో ఆ సమయానికి రోడ్డు పక్కన ముడుక్కొని పడుకొని ఉన్నాయి. కొంచం చలిగా ఉంది అందుకే మడిచి నెత్తిన పెట్టు కొన్న చీరను లాగి బుజాలచుట్టూ కప్పుకుంటూ నడుస్తున్నది కాసింబి . ఒక కుక్క కా సింబి ని చూస్తూనే ‘భౌ భౌ,  మని అరిచింది. కాసింబి కి కొంచం భయమనిపించిన తమాయించుకొని నడవ సాగింది. కొంత దూరం నడిచాక తన వెనకేదో నల్లటి ఆకారం ఒకటి నడుస్తున్నట్లని పించి వెన్ను జలదరించింది కాసింబి కి. రాత్రి తన స్నేహితులు ఖాసీం వాళ్ళు చెప్పిన ‘దయ్యలా దీవి’ కధ గుర్తొచ్చి కా సింబి వంటి మీద వెంట్రుకల నిలుచున్నాయి. మనిషి సాంతం వెనక్కి తిరగ కుండానే కళ్ళ చివరనుంచి చూసీచూడనట్లు వెనక్కి తిరిగి చూసింది. ఎవరు లేరు. స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి. అయినా కాసింబి భయంతో పరుగు తీసింది. 

వెండి గజ్జల చప్పుడు గాని, బంగారు గాజుల సవ్వడిగాని రాదు ఆ పిల పరిగెడితే. అడుగుల సవ్వడి కూడా వినిపించదు. సత్తు టిఫిన్ డబ్బాలో వేసుకొన్న చిన్న గిన్నె మోత తప్ప.అందుకే ఆ పిల్ల పరుగును ఖాతరు చేయలేదు అప్పుడే లేచిన కొందరు. 

ఒక్క ఉరుకులో ఆచారి గారింటి ముందుకు వచ్చి పడింది. అప్పుడే ఆచారి గారి  గోడ గడియారం 5:00 గంటలు చూపిస్తున్నది. ఆచారి గారు లేచినట్లున్నారు, పళ్ళుతోము పుల్లనములుతూ బయట వాకిలి మెట్ల మీద కూర్చొని ఉన్నారు. లలితాంబ గారు మాత్రం వంటఇంట్లో అంట్లు సద్ది బయట బావి దగ్గర పడేసి, వంటగది  కడగటానికి బావి నీళ్లు చే దుతున్నారు. కా సింబి  ని చూస్తూనే “ఏమే పిల్ల! ఇంత ఆలస్యం గానా  రావడం. అసలే పర్వడి రోజులు. వాకిట్లో ముగ్గు వేయక పోతే ఎలా? ఏకాదశి కూడా ఉపోషం ఉండి దేవాలయానికి పోయిరావాలి. త్వరగా కానీ. ముందు చిన్న గిన్నె తోమి ఇటుపెట్టు ముందు. కాఫీ నీళ్లు గొంతులో పడక పోతే తెల్లారదు !”అంటూ పక్కపక్కకు  జరుగుతూ ఎక్కడ కా సింబి తగులుతుందో , తన మైలపడిపోతుందేమోన్నట్లు దూరంగా జరిగి లోపలి కి వెళ్లి పోయింది.ఇంతలో “ముగ్గు, నీళ్లు ఇటు పట్టుకు రావే కాసింబి”అని అరిచారు ఆచారిగారు. “ఒసేయ్ కా సింబి  ఆ పొయ్యి బాగుచేసి వెనక వాకిలి దగ్గరకూడా నీళ్లు చల్లి ముగ్గేయి తొరగా!”అంటూ మరో పని పురమాయించింది ఆమె. ఆ పనులన్నీ పూర్తి చేసి బయట పడేసరికి 6 గంటలు  అయింది. 

అంతే అదిరిపోయి చేతిలోఉన్న టిఫిన్ డబ్బాను ఊపుకుంటూ పరుగు పరుగున పక్క వీధిలో ఉన్న టీచరమ్మ గారింటి కొచ్చింది.

“ఛీ, ఛీ! ఈ పనివాళ్ళింతే ! టైముకి రారు. ఆయనకి  కాఫీ ఇచ్చేవరకు మంచం దిగరు. కాఫీ గిన్నె తోముకోవాలంటే చల్లగా ఉన్నాయ్ నీళ్లు. ఏంటో! ఈ కాసింబిని మాన్పించేయాలి.” అనుకొంటున్నది టీచరగ చేస్తున్న  అనసూయ. 

కా సింబి  పదేళ్ల పిల్ల , తన పొడవుకు  మించిన చింకి లంగాని నీళ్ల కు తడవకుండా బాగా పై కీ దోపుకొని పని మొదలు పెటింది. నీళ్లలో నాని ఉన్నందున కాళ్ళు తెల్లగా పాసినట్లు కనిపిస్తున్నాయి. నీళ్లు చల్లగా ఉండడం చేత గట్టిగపట్టు కొని తోమడం కష్టమవుతున్నది. చేతిలో గిన్నె జారీ పడింది. “ఏంటే  కాసింబి ! గిన్నెలు పగలుకొడుతున్నావ్? అస్సలు జాగర్తేలేదు ఈ పిల్లకి. ఎప్పుడు నేర్చుకుంటుందో. గట్టిగ పట్టుకొని తోము” అంటూ మంచం మీద పడుకొనే అరిచింది టీచర్ అనసూయ.

“అమ్మా! అంట్లు తోమేసాను. కాసిని చాయ్ పోస్తావా?”అదిగింది కాసీంబి. 

ఇంకా పాల పాకెట్ రాలేదు రేపు పోస్తాలే ,”  అని మొహం చూపించకుండానే  అరిచి చెప్పింది.

“అదేంటే అమ్మ ఇప్పుడే కదా పాలబ్బాయి పాకెట్ పడేసిపోయాడు. లేవని చెబుతావేంటి. పాపం కాసింబీ!”అమాయకంగ అడిగింది ఆరేళ్ళ  రాహిత్య, టీచరు గారి అమ్మాయి. 

“నువ్వు నోర్ముసుకొని ఇంట్లోకి రా. అది విని చస్తుంది. చాయ్ పోసేదాకా ఇంక కదలదు.” అంటూ కసిరింది అనసూయ. అది విన్న కాసింబీ మాత్రం నిరాశగా అక్కడ నుంచి మరో ఇంటివైపుకి వెళ్ళింది. 

అక్కడ ఒక్క చుక్క టీ  నీళ్లు దొరక లేదు కాసింబికి.

“వెధవ సంత! ఎప్పుడు కళ్ళు మన మీదనే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏమి పెడతారా అని. మనమేం తింటున్నామా అని,” విసుకున్నది మరో ఇంటామె. కాసింబికి ఏడుపొచ్చింది. ఏమి చేయలేని నిస్సత్తువ. 

అప్పటికి 9 గంటలు అవుతున్నది. భానుమూర్తి గారి పిల్లలు స్కూలికి బయలు దేరారు. వాళ్ళమ్మ వెంటబడి మరి వాళ్ళ చేత పాలు తాగిస్తున్నది. వాళ్ళు వెళ్ళగానే ఆమె రాత్రి మిగిలిన రెండు చపాతీలు తెచ్చి  కా సింబబి కి ఇచ్చి పోయింది. “ఆకలి గ ఉండడం తో గబా గబా తినబోయింది. ఒ సేయ!, కాసేపాగి తిందువుగాని. ముందా పని పూర్తి చేయి. నీళ్లు కొట్టి తొట్టి నింపు. లేక పోతే నీళ్ళాగి పోతాయ్,”అంటూ పని పురమాయించింది. 

ఆ పన్నంతా   అయ్యే సరికి 10 గంటలు దాటింది. అప్పుడు తినాలని చూస్తే చపాతీలు ఎండలో ఉండడం వలన గట్టిగ అయిపోయి తిన బుద్ధి  కాలేదు కాసీంబికి. కుళాయి నీళ్ల తోనే పొట్ట నింపుకొని,”అమ్మగారు! కాసిని చాయ్ పోస్తారా,”అని అడిగింది. చేయితీరిక  లేదే పిల్ల.   నేనిప్పుడు నీకోసం చాయ్ పెట్టలెను”, అని అన్నది ఖరాకండిగా. 

అ లా అన్ని పనులు ముగించుకొని ఇంటికెళ్లే  టప్పుడు దారిలో ఉన్న స్కూలు దగ్గర కాసేపు ఆగుతుంది కాసింబి. అప్పుడు అది ఇంటర్వెల్ టైం పిల్లలందరికీ. కొందరు  ఆడుకొంటుంటారు, మరికొందరు లంచ్ బాక్స్ లు తెరిచి తింటుంటారు. రోజు చూసేదే అయినా కా సింబి కి అలా  గేటు బయట నుంచొని చూడటం చాలా  ఇష్టం . ఆ క్షణంలో తన ఆకలి అలసట అన్ని మరిచి పోయి చూస్తుంటుంది. 

“బేటీ! ఆలా చూస్తుంటే కడుపు నిండదు!”అంటూ ఒక పొట్లం పల్లీలు కా సింబి  చేతి కిస్తుంటాడు మస్తాను తాత. రోజు తినటానికి దొరికేవి అవి మాత్రమే. బెల్ కొట్టగానే పిల్లలందరూ గోల గోల గ వాళ్ళ తరగతి గదులలోకి చేరి పోయారు. స్కూల్ ఆవరణం మొత్తం నిశబ్దం గ అయిపొయింది. సంతోషంగ కాసీంబి గెంతుకుంటూ ఇల్లు చేరు కుంది.

“ఇంత ఆలస్యంగ వస్తే గుడిసెవరు ఊడుస్తారు. బేగి చెయ్,”అంటూ గుడ్లురిమింది సవతి తల్లి బూబీ. ఎదురుమాట్లాడకుండా ఆమె చెప్పిన పని చేసిన తరువాత,”ఏటా చచ్చు పని. కుండలో బువ్వున్నది ఎల్లి తిను,”అంటూ బయటికి వెళ్లి పోయింది బూబీ.  

గబా గబా తినేసి తన సత్తు పళ్లెం కడిగి పెట్టేసి ఆడుకోవటానికి ఖాసీం వాళ్ళ గుడిసె వైపు పరిగెత్తింది  కాసింబి . ఖాసీం కూడా పొద్దుకాడే లేచి చెత్త ఏరడానికి పోతాడు. మద్దానం వేళకు  ఇల్లు చేరతాడు.  ఖాసీం, మజ్ను, నజరీన్, హసీనా ఇలా ఆ గుడిసెలో ఉన్న పిల్ల లందరు ఏకమై కాసేపు ఆ మట్టి లోనే ఆడుకోవటమో లేక ఆ గుడిసెల ముందే కబుర్లు చెప్పుకోవటం జరుగుతుంటుంది. వాళ్లందరికీ అదే సమయం ఆడుకోటానికి. 

ఒక రోజు ఎడ్యుకేషనల్ సర్వే అంటూ కొందరు యూనివర్సిటీ విద్యార్థులు ఆ వాడ కొచ్చారు. రమేష్, సోషియాలజీ స్కాలర్ , వీళ్లని చూసి దగ్గరి కొచ్చాడు. 

“అరే  ! మీరంతా ఇక్కడే ఉన్నారా. ఈ రోజు మీకు స్కూలు లేదా ఏంటి ?”

ఖాసీం తోటే అందరు కిస్సుక్కు న్న నవ్వారు.  “అలా నవుతారేంటి” అన్నాడు కాస్త కోపంగానే. “మాకు స్కూల్ లేదన్న! మేము బడికి పోము” అన్నది హసీనా. “అదేంటి?” వింతగా అడిగాడు రమేష్. 

“అదేంటన్న ఏమి తెలియనట్లు అడుగుతున్నావు. మేము స్కూలుకి ఎలా వెళతాము. పొద్దున్న లేచినకాడ నుండి పనికి పోవాలాయే,”అన్నాడు ఆ పిల్లలో కాస్త పెద్ద పిల్లాడు  ఖాసీం.

“అవునా . మరి మీకు మధ్యాహ్నం నుండి స్కూలు పెడితే వెళ్లి చదువుకుంటారా ?”

“ఏమో అన్న! తెలవదు”. అన్నాడు అమాయకంగా. 

 ఒసేయ్ కాసీంబి “ఎక్కడ చచ్చావే! పనికి పోనక్కరల! ఆ డాక్టరమ్మ గారు ఎదురు చూస్తుంటారు ఆసుపత్రికి పోవడానికి. నువ్వు వెళ్ళి ఆళ్ల బిడ్డను సూసుకోవాలి గంద !”అంటూ పొలికేక పెట్టింది. రెండేళ్లు కూడా నిండని పాప డాక్టర్ గారి కూతురు.  కాసీంబి లగేత్తుకుంటూ వెళ్లి పోయింది. మేము పోవాలన్నా పనికి అంటూ ఖాసీం కూడా వెళ్లి పోయాడు.

పోతూ పోతూ “అన్న! మా కోసం ఇక్కడకు ఒక బడీని తీసుకురా. అప్పుడు సూస్తాం!”అంటూ వెళ్ళాడు. కానీ రమేష్ కి అనిపించింది వాడు తన కొక సవాల్ విసిరాడని. 

రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు  చేరింది కాసింబి. నిద్దర రాక పోతే ఉన్న నాలుగు పీచులను దువ్వి పెద్ద రిబ్బన్ పెట్టి జడేస్తుంది. నాలుగు రకాల పిన్నులు ఒక్కొకటి పెట్టు కోని నవ్వుకుంటుంది.  దానికి ఎవరు ఎలాంటివి ఇచ్చిన సంతోషమే. అల్ప సంతోషి. కళ్ళ నిండుగా కాటుక పెట్టి అద్దం  లో చూసి  మురిసిపోతుంది కానీ ఆ చిన్నపిల్లకి ఆశలు లేవు .  కళ్ళ కి ఎప్పుడు కలలే లేవు.  పసితనం. ఏమి తెలియదు. ఎవరిమీద కోపం ఉండదు. నేను పోకపోతే అమ్మగార్లు ఇబ్బందిపడిపోతారని అనుకుంటుందే  తప్ప , తన వయసుకు మించిన పని దాని చేత చేయిస్తున్నారని దానికి తెలియదు. 

                                                ************

 రోజు మాదిరిగానే ఆ రోజు కూడా కాసింబి పనికి బయలుదేరింది. మసక చీకటి. రోడ్డు మీద మనుష్య సంచారం లేదు. యదాలాపంగా ఉన్న కాసీంబి చూసుకోలేదు, కరెంటు పోల్స్ కోసం తీసిన గుంటలో పడిపోయింది. చెయ్యి కల్లుకు మన్నది. చాలా నొప్పిగా ఉన్నది. ఏమి చేయాలో తోచలేదు. అందుకని నిదానంగా లేచి పనికి పోకుండా ఇల్లు చేరింది. వెంటనే పనికి పోకుండా ఇంటివైపుకి వస్తున్న కాసింబి ని చూస్తూనే కోపంతో ఊగిపోతూ  ఆ పిల్ల రెక్క పుచ్చుకొని ఈడ్చుకొచ్చి గుడిసేముందు పడేసి తిట్టటం మొదలెట్టింది. అలా లాగడం తో కాసీంబి కి ప్రాణం పోయినంత పనే అయింది. దాని మాటలేమి వినట్లేదు బూబీ ఆవేశంలో.  సాయిబు లేచి పిల్ల వాలకం చూసి ,వెంటనే రిక్షా లో వేసుకొని దవాఖాన కు తోలుకు పోయాడు. చాలా సేపటి కి గా ని కాసింబి కి వైద్యం దొరక లేదు. చేతికి తెల్లటి సిమెంట్ కట్టు వేసాడు డాక్టరు. కనీసం రెండు నెలలదాకా ఆ కట్టు తీయొద్దన్నాడు. ఇక కాసీంబి పని చేయ లేదు. 

బూబమ్మ అయిష్టంగా నైనా ఇళ్ల పనులు పోతాయని తాను చేయడం మొదలు పెట్టింది. కానీ కూడా కాసీంబిని కూడా తీసుకెళ్లేది. ఒంటి చేత్తో అది చేయగలిగినంత పని దాని చేత  చేయిస్తుండేది. 

“అమ్మీ! లంగాని జర పైకి కట్టు,  జారిపోతన్నది ,” అని అడిగింది కా సింబి  అమాయకంగా. 

“దాన్నెందుకు కూడా తెస్తావు. అది చేయలేదు. నిన్ను చేయ నివ్వదు. దానికి సేవలు చేస్తావా? లేక మాపనులేమన్న కాస్త చేస్తావా ?”అంటూ నిష్టూరంగ మాట్లాడింది అనసూయ.

ఏమి చెప్పాలో తెలియక కళ్లప్పగించి ఆమెనే చూస్తుండిపోయింది. లంగా నెలా కట్టుకోవలో  అర్ధం కాలేదు కాసింబికి . తన కొక బాల్యం ఉన్నదని, ఆడుతూ పాడుతూ గడపవలసి ఆ వయసులో తాను తన తిండి కోసమే పని చేయాల్సివస్తున్నదని , తనకి  కూడా కొన్ని హక్కులున్నాయని ఏమీ  తెలియని పసిప్రాణి.  ఆ కళ్ళలో అన్ని ప్రశ్నలే. ఆ చిన్ని కళ్ళకు కలలు ఎలాఉంటాయో తెలియదు … సమాధానం దొరకని ప్రశ్నలు తప్ప.            

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎదహోరు

దొరసాని