మనిషి తత్వంగా !!!

మనిషికి అతి పెద్ద బలహీనత
మనసు చెప్పినట్టు వినడం..
అతీతులు కారు దీనికెవరు ..
ఆలోచనల్లో మాత్రం దూరం అఖాతమంత…

ఒకరి నిజం మరొకరికి అబద్ధం
ఒక అబద్ధం… ఊరడించే మరొక నిజం
నిజం నిప్పు అయితే,
అవసరం అబద్ధం….
సమయాన్ని బట్టి మారడమే అసలు నిజం
అల్లుకుపోయే బంధాలూ ఇవే…
తెగిపోయే బంధనాలూ ఇవే…

నా ఆలోచనే సరియైనదన్న భ్రమ…
మంచి, చెడుల లెక్కలు లేవు
అందులోనే అసలు పతనం,
అందులోనే ఆఖరి విజయం…
తేల్చుకోవాలి ఏది కావాలో ? ?
సాగుబడి బలం కాకూడదెపుడు
పట్టు విడుపులు అవసరం …

మనసును గాయపరిస్తే
కలిగే దూరాన్ని కొలవలేవు…
గుప్పిట్లో ఇమిడిపోయేది కాదు జీవితం
సంద్రంలో పయనం
ఎదురీదుతూనే ఉండాలి చివరికంటా…

కరిగిపోయిన గతం కాదు..
తెలియని రేపటికోసం కాదు..
కాలం కలిగించే మార్పులను
అంతా మనమంచికే అనుకుంటూ..
అడుగులు వేయాలి …

ఎదుటి మనసుల ఆలోచన పరిశీలనగా…
అర్థం చేసుకునే మనిషి తత్వంగా……..

అరుణధూళిపాళ

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పరివర్తన

ఎదహోరు