పరివర్తన

కథ

కట్టెకోల విద్యుల్లత

 “శ్వేతా ,ఏమిటే ఇంట్లో హడావుడి? ఇవాళ నీ పెళ్లి చూపులా ?అయినా ఈ రోజుల్లో కూడా ఇలా ఇంట్లో పెళ్లిచూపులు ఏవిటి? హాయిగా నువ్వు,ఆ అబ్బాయి ఎక్కడైనా బయట కలుసుకుంటే సరిపోతుంది కదా?”అడిగింది వర్ష చక్కగా ముస్తాబవుతున్న తన స్నేహితురాలిని .

“నువ్వు చెప్పింది నిజమే వర్షా. శరణ్ కూడా అదే అడిగాడు నన్ను ఫోన్లో, ‘ఇప్పుడు మా అమ్మ వాళ్ళూ , నేనూ అందరం కట్టు కట్టుకొని మీ ఇంటికి రావడం అవసరమా’అని. ‘అవసరమే’ అని చెప్పాను నేను,” జవాబు ఇచ్చింది శ్వేత.

 “అదే, ఎందుకు? నువ్వు ఏదైనా బాగా ఆలోచించే చేస్తావనుకో, దీని వెనుక నీ ఆలోచన ఏమిటా అని ,”కుతూహలంగా అడిగింది వర్ష.

“నిజమేనే నువ్వు చెప్పింది. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను మాత్రమే వెళ్లి తనను బయట ఎక్కడైనా కలిస్తే కేవలం అతని భాహ్యరూపాన్ని చూడగలను,ఎందుకంటే ఏ రెస్టారెంట్ లోనే ఉన్నప్పుడు మనం చాలా వరకు,

మీ అలవాట్లు ఏంటి? ఇష్టాలు ఏంటి ?అని మాట్లాడుకున్నా అందులో ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయో తెలియదు. అదే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మొత్తంగా వాళ్ళ కుటుంబం ఆలోచనా విధానం కాస్తైనా మనకు తెలుస్తుంది అనిపించింది.పెళ్లంటే కేవలం ఒక వ్యక్తి కాదు కదా! రెండు కుటుంబాల కలయిక అవ్వాలి కదా!”చెప్పింది శ్వేత.

 “అందుకేనే నువ్వంటే నాకు ఇంత ఇష్టం. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి, దాని మంచి, చెడు విశ్లేషిస్తావు. మంచి నిర్ణయం తీసుకుంటావు,” స్నేహితురాలిని పొగడకుండా ఉండలేకపోయింది వర్ష.

 ” సరే, సరే, నువ్వు భజన ఆపు. వాళ్ళు వచ్చినట్లున్నారు. ఈ అనుభవం నాకూ కొత్తగానే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో,” ఫ్రెండ్ నోటికి తాళం వేసింది శ్వేత.

                    **************

 “రండి, రండి, మీ అమ్మాయీ, అల్లుడూ రాలేదా?” శరణ్ కుటుంబాన్ని ఆహ్వానించారు శ్వేతా తండ్రి దశరథ్.

” లేదండీ ఆదివారమే అయినా మా అమ్మాయికి అసలు తీరికే ఉండదు. వారం మొత్తంలో మిగిలిపోయిన పనులన్నీ ఈ రోజే కదా చేసుకునేది,”సమాధానం ఇచ్చింది శరణ్ తల్లి సంధ్య.

 అందరూ మాట్లాడుకుంటున్నారు. టీలు టిఫిన్లు కార్యక్రమం అంతా సినిమాలో చూపించినట్లు ప్రశాంతంగా గడిచిపోయింది. ఇందులో శ్వేత చెప్పిన ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకోవడం ఎక్కడ ఉంది ?అందరూ నటించేస్తూనే ఉన్నారే, అనుకుంది మనసులో వర్ష.

 శ్వేతా, శరణ్ విడిగా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఇక భోజనాల సమయం అయింది. శ్వేతా వాళ్ళ అమ్మ రవళితో పాటు తనూ వంటగదిలోకి వెళ్లి భోజనాలు ఏర్పాట్లు అన్నీ దశరథ్ గారు కూడా చేస్తుంటే కాస్త ఆశ్చర్యంగా చూశాడు శరణ్.

” వంటలన్నీ చాలా బాగున్నాయి. శ్వేతా నీకు వంట వచ్చా? మా వాడు మంచి భోజనం ప్రియుడు అసలే,” అంది సంధ్య.

 “ఆ, మా శ్వేతకే అన్న మాటేమిటి? మా అబ్బాయి ధీరజ్  కూడా వంట చేయడం బ్రహ్మాండంగా చేస్తాడు. అంతెందుకు దశరథ్ కి కూడా చాలా వంటలు వచ్చు,” చెప్పింది రవళి గర్వంగా.

 “ఏంటి ఇంట్లో మగవాళ్ళందరి చేతా వంట చేయిస్తానని గర్వంగా చెబుతున్నారు? మా ఇంట్లో మగవాళ్ళకి కూర్చున్న చోటికి మంచినీళ్లు కూడా అందించాలి తెలుసా?” అదేదో చాలా గొప్ప విషయం అయినట్లుగా చెప్పింది సంధ్య.

 ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. తేరుకుని నెమ్మదిగా అడిగింది రవళి,”అదేమిటి వదినగారూ? మీరు నాలాగే ఉద్యోగం చేస్తున్నారని విన్నాను?”

 “ఔనండీ,నేను బ్యాంకు మేనేజర్ గా చేస్తున్నాను. అయితే మాత్రం? ఇంటి బాధ్యత అనేది ఆడవారిదే కదా? నేను ఇంటా,బయటా అన్ని పనులు సమర్థవంతంగా చేసుకోగలను. మా అమ్మాయికి కూడా అదే నేర్పించాను. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐనా, ఇంట్లో పనులన్నీ స్వయంగా చేసుకుంటుంది. ఇక మిగిలిపోయిన పనులు వారాంతంలో చేసుకుంటుంది. అయినా,అందుకే కదా మన ఆడవాళ్ళని ‘మల్టీ టాలెంటెడ్ మహారాణి, అని పొగిడేది,” చాలా గర్వంగా జవాబు ఇచ్చింది సంధ్య.

” ఎవరండీ అన్నదా మాట? అయినా అదేమన్నా గొప్ప బిరుదు అనుకుంటున్నారా? ఆ ముళ్ళ కిరీటం మన తలపై పెట్టి మగవాళ్ళు ఎంచక్కా మనల్ని (ఆడవాళ్ళని) వెర్రి వాళ్ళని చేస్తున్నారు. మీలాంటి ఆడవాళ్లంతా దానిని మోస్తూ, ఎన్ని తరాలైనా మార్పు లేకుండా ఆడవాళ్లకు తప్పుడు మార్గదర్శకం చేస్తున్నారు” ఆవేశంగా మాట్లాడుతోంది రవళి.

 “మమ్మీ, ఎందుకంత ఆవేశం?” తల్లిని ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించింది శ్వేత.

” అలా చెప్పమ్మా, మా ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది, మీ అమ్మ అంత కోపంగా సమాధానం చెప్పడానికి?” భార్యకి వత్తాసు పలక పోయాడు శరణ్ తండ్రి వినోద్.

 “ఆవేశం కాదులే బుజ్జీ, ఇది ఆవేదన. రెండు తరాల ముందు వరకు ఆడవాళ్లు ఇంట్లోనే ఉండేవారు. భర్త సంపాదించి తెస్తే ఇంట్లో అన్ని పనులు చూసుకునేవారు. పైగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఇంట్లో ఉండే ఆడవాళ్ళంతా కలిసి పని చేసుకునేవారు. అప్పుడు ఎవరికీ ఎక్కువ శ్రమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు? ఆర్థిక అవసరాల మూలానో సమానత కోసమో ఆడవాళ్లు మగవారితో సమానంగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు, ఇంట్లో పనిని సమానంగా పంచుకోవాలి కదా ఈ మగవాళ్ళు,” అందరికీసి చూసింది రవళి.

 “మీ ఇంట్లో లాగా అందరి ఇళ్లల్లో అలవాటు ఉండదు కదా ఆంటీ?” అడిగాడు శరణ్ .

“ఔను బాబూ,నిజమే. ఏ పనైనా, ఏ అలవాటైనా, ఎక్కడో అక్కడ మొదలవ్వాలి కదా? ఈరోజు అలవాటు లేదు కనుక రేపు చేసుకోను అంటే కుదరదు కదా? మన జీవితంలో చాలా అలవాట్లు వయసుతో పాటు మార్చుకుంటూ ఉంటాం. ఇదీ అలాగే. ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు మొదలుపెట్టాలి కదా!” సర్ది చెప్పబోయాడు దశరథ్

“ఔను శరణ్, నువ్వు చెప్పేది నిజమే. అలాగే అంకుల్ చెప్పేది కూడా నిజమే. అలవాటు ఎక్కడో చోట మొదలుపెట్టాలి కదా! ఇందులో తప్పంతా మగవారిదే అని చెప్పలేను. మీ అమ్మ లాంటి,అక్క లాంటి ఆడవారిలో పరివర్తన రావాలి ముందు. ఆవిడా, నేనూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళమే. కానీ ఈ మల్టీ టాస్కింగ్ అనే భ్రమలో ఉండిపోయి ఆవిడ చూడు నాకన్నా ఓ పది సంవత్సరాలు పెద్దదానిలా ఉన్నారు.బుజ్జి చెప్పింది ఆవిడకి బీపీ, డయాబెటిస్ అన్నీ ఉన్నాయి అని. అవన్నీ ఇంత త్వరగా ఎందుకు వచ్చాయి ?కావలసిన దానికన్నా ఎక్కువ స్ట్రెస్ టెన్షను తీసుకోవడం వల్లనే కదా?మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ విషయం గురించి ఆలోచించారా? మీ అమ్మ ఇంట్లో పని అంతా చేస్తూ ఉంటే మీ నాన్నగారు కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తూ ఉండడం చూస్తూ పెరిగిన మీరు అలాగే తయారై ఉంటారు కదా?”రవళి మాటలకు ఆలోచనలో పడ్డాడు శరణ్.

“ఔనాంటీ మీరు చెప్పింది అక్షరాల నిజం. మా స్నేహితులలో కూడా చాలామంది ఇళ్లల్లో అమ్మలు మాత్రమే వంటగదిలో ఉండి, నాన్నలు ,మిగతా కుటుంబ సభ్యులూ అదీ తమకు సంబంధం లేని అంశంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల అదే సహజం, ధర్మం అని అనుకున్నాను‌ కానీ దీని గురించి ఇంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు. కనీసం మా తరం నుంచి అయినా మగవారిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది అని ఇప్పుడే అర్థం అవుతోంది. ఈరోజు నుంచి మా ఇంట్లో అమ్మకు వంటగదిలో, ఇంటి పనుల్లో తప్పకుండా సాయం చేయడం అలవాటు చేసుకుంటాను. అంతేకాదు, మా బావగారికి కూడా ఈ విషయంలో కాస్త అవగాహన కలిగించి, మా అక్క కూడా మా అమ్మలా త్వరగా అనారోగ్యం కొని తెచ్చుకోకుండా చూస్తాను,”మనస్ఫూర్తిగా చెప్పాడు శరణ్.

“నిజమేరా శరణ్, రవళి గారు చెప్పినట్లు ఇందులో నా తప్పు కూడా చాలా ఉంది. నేనే కాదు నాలాంటి చాలామంది ఆడవాళ్ళలో ముందు పరివర్తన రావాలి. కుటుంబ ఆర్థిక భారాన్ని ఆడవాళ్ళం పంచుకుంటున్నప్పుడు పనిభారాన్ని కూడా అలాగే పంచుకోవాలి. అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి. అలా కనీసం  మా పిల్లలనైనా సిద్ధం చేయకపోతే ముందు ముందు కాలంలో వివాహాలు నిలబడవు. ఈరోజు కాదు,ఈ క్షణం నుంచే నేను మారుతున్నాను. శరణ్ భోజనాలు అయిపోగానే మేము, పెద్దవాళ్ళంతా రెస్ట్ తీసుకుంటాము. టేబుల్ అంతా నీట్ గా సర్దేందుకు శ్వేతకి నువ్వు సాయం చెయ్యి. నాకు కాబోయే కోడల్ని కష్టపెట్టకు అర్థమైందా?” సీరియస్ గా అంటున్న సంధ్యని చూస్తూ సరదాగా నవ్వేసుకున్నారు అందరూ.

 “చాలా బాగుంది శ్వేతా .నువ్వు చెప్పినట్లు ఈ పెళ్లిచూపుల తతంగం వల్ల ఈరోజు నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్,” చెప్పింది వర్ష.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నవ్వు

మనిషి తత్వంగా !!!