మనం 6వ తరగతి నుంచి ప్రకృతులు, వికృతులు అని వింటూ ఉంటాం. ప్రకృతులు…. వికృతులు అంటే ఏమిటో అర్థం కాకున్నా గురువులు చెప్పినట్లు నేర్చుకుంటాం కదా!
ఇప్పుడు ప్రకృతులు…. వికృతులు అంటే ఏమిటో తెలుసుకుందాం!
ప్రకృతులు:- మూలంలో ఏ మార్పు లేకుండా అవసరమైన చోట తెలుగు ప్రత్యయాలైన డు- ము- వు – లు చేర్చి వాడుకొనే పదాలను ప్రకృతులు…. అంటారు. ప్రకృతులకు మరొక పేరు తత్సమాలు.
ఉదా:- రామః… మూలం
రాముడు.. ప్రకృతి
కృష్ణః…. మూలం
కృష్ణుడు… ప్రకృతి
రమా… మూలం
రమ…. ప్రకృతి
హరీ….. మూలం
హరి…… ప్రకృతి
వికృతులు:- వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణలోప, వర్ణవ్యత్యయాలతో కూడి తెలుగులోకి వచ్చిన పదాలను వికృతులు అంటారు. వికృతులకు మరొక పేరు తద్భవాలు.
వర్ణాగమ అంటే కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:- రథం…. ప్రకృతి
అరథం… వికృతి
ఇక్కడ అ అనేది వర్ణాగం. అంటే కొత్తగా వచ్చి చేరింది
వర్ణాదేశం అంటే ఒక అక్షరాన్ని కొట్టివేసి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:- ఆశ…ప్రకృతి
ఆస… వికృతి
ఇక్కడ శ కారమునకు బదులు స కారము వచ్చింది.
వర్ణలోపం అంటే ఉన్న అక్షరాలలో ఏదో ఒకటి లోపించడం
కాకము…. ప్రకృతి
కాకి. …. వికృతి
ఇక్కడ ము అక్షరం లోపించింది.
వర్ణవ్యత్యయం అంటే అక్షరాలు తారుమారు కావడం లేదు అక్షరాలు పెరగడం లేదా తరగడం జరుగుతుంది.
ఉదా:- ఉపాధ్యాయుడు… ఒజ్జ
శాస్త్రం… చట్టం
ప్రకృతులు…. వికృతుల యొక్క పద స్వరూపం చూద్దాం!
ప్రకృతులు సాధారణంగా సంయుక్తాక్షరాలతో కూడి ఉంటాయి.
వికృతులు సాధారణంగా ద్విత్వాక్షరాలతో కూడి ఉంటాయి.
ప్రకృతులు. వికృతులు
అక్షరం ……. అక్కరం
వర్ణము…… వన్నె
పుస్తకము…. పొత్తము
కుర్కురము…. కుక్క
శాస్త్రము….. చట్టము
పక్షి….. ……. పక్కి
కావ్యము….. కబ్బము
సూచన:- అయితే అతి తక్కువగా కొన్ని చోట్ల వికృతి పదాలు సంయుక్తాక్షరములతో కూడి ఉంటుంది.
సముద్రము…. సంద్రం
కార్యము….. కర్జము
య కారముతో కూడిన పదాలు జ కారంతో
మొదలౌతాయి…
యమున…… జమున
యత్నము….. జతనము
యముడు….. జముడు
యాత్ర….. జాతర
యజ్ఞము…. జన్నము
శ కారం మరియు ష కారం ఉంటే వాటి స్థానంలో
స కారం వస్తుంది
ఆశ….. ఆస
ఆకాశం… ఆకాసం
శయ్య… సజ్జ
విషయము… విసయము
నిముషము….. నిమిసము
వేషము…. వేసము
సంతోషం….. సంతోసం
మహాప్రాణాక్షరాలు ఉంటే అల్పప్రాణాక్షరాలు వస్తాయి.
కథ……. కత
వీధి…. వీది
ఘంట… గంట
అనాధ…. అనద
ఘోరము….గోరము
ణ కు బదులు న కారం వస్తుంది
గుణము….. గొనము
ప్రాణము…. పానము
పుణ్యము… పున్నెము
పదం మొదట య ఒత్తు ఉంటే అది లోపిస్తుంది.
జ్యోతి….. జోతి
జ్యోతిష్యం… జోతిసం
జ్ఞ…. స్థానంలో న గాని న్న గాని వస్తుంది
ఆజ్ఞ… ఆన
విజ్ఞానము… విన్నానం
యజ్ఞము….. జన్నము
పదం మధ్యలో కానీ చివరగాని య ఒత్తు ఉంటే ముందక్షరం ద్విత్వం వస్తుంది.
కన్య….. కన్నె
పుణ్యము.. పున్నెము
విద్య….. విద్దె
మధ్యాహ్నం… మద్దేనం
ఇలా ప్రకృతులు…. వికృతులు తెలుసుకోవాలి. అంతేగాక కొన్ని పదాలకు మన అనుభవం ద్వారా తెలుసుకోవాలి. అన్ని ప్రకృతి పదాలకు వికృతి పదాలు ఉండాలనే నియమం లేదు.
రంగరాజు పద్మజ