కన్పించటం లేదు,
అవును,నిజమే!కళ్ళు
పత్తికాయల్లా చేసుకుని,
కాగడా వేసి వెతికినా ఎక్కడా కన్పించటం లేదండీ!ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుందేమో,అక్కడ లేకపోతే మరోచోట ఉంటుందేమో అని చాలా చోట్ల వెతికాను. అయినా కన్పించలేదు. ఇంతకీ అదేమిటో చెప్పమంటారా? ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం తల్లులు ఆడపిల్లలకు ఉగ్గుపాలతో నేర్పినదీ, వాళ్ళ బుగ్గల్లో మొగ్గలు వేసినదీ, వాళ్ల కాళ్ళ బొటనవేళ్ళతో నేలపై ముగ్గులు వేయించినదీ, వాళ్ళ ముఖాలకు నిగ్గు తెచ్చినదీ… తెలిసిందా మరి, ఏమిటో? అదే సిగ్గు !
ఒకప్పుడు అమ్మాయిలు ఆకు
చాటు పిందెల్లా,
తల్లిదండ్రులు, అన్నదమ్ముల చాటున ఒద్దికగా పెరిగారు. వాళ్ల అనుమతితోనే చదువుకోవటానికి బయటకు వచ్చేవారు. క్రమక్రమంగా కాలం మారింది.ఆడపిల్లలు కూడా పెద్ద చదువులు చదవడం,
ఉన్నతోద్యోగాలు సంపాదించుకోవటం,
అనేక రంగాలలో ప్రవేశించి,పురుషుల కన్నా అధికంగా తమ సత్తా నిరూపించుకోవడం జరిగింది. ఈనాడు స్త్రీలు అడుగుపెట్టని,
రాణించని రంగమంటూ లేదు. అంతేకాదు,
తమకు జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా ఎదుర్కుంటున్నారు. ఈ తరం ఆడపిల్ల
శక్తి సామర్థ్యాలకు, ధైర్య సాహసాలకు ప్రతీక. తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోగల శిల్పి.
మరి ఇలాంటి కాలంలో సిగ్గు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాననే కదా మీ సందేహం ?
సిగ్గుపడటం అనేది ఒక అందమైన భావ ప్రకటన.పూర్వం ఆడపిల్లలు చాలా అందంగా సిగ్గుపడేవారు.ఎలాంటి
అమ్మాయికైనా సిగ్గు ఒక కొత్త అందాన్ని తెచ్చి పెట్టేది.
అందుకే “స్త్రీకి సిగ్గే సింగారం” అన్న మాట వచ్చిందేమో!
ప్రబంధాల్లో కవులు, నాయిక సిగ్గుపడే ఘట్టాలను ఎంతో మనోజ్ఞంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. నవలలు,కథలలోనూ
‘ఆమె సిగ్గుల మొగ్గ అయింది, బుగ్గల్లో గులాబీలు పూసాయి’..
ఇలాంటి వర్ణనలు కనిపిస్తాయి.
సినిమాల్లో కూడా దర్శకులు నాయికల చేత సిగ్గును అందంగా అభినయింప చేసారు.
మచ్చుకు ఈ ఒక్క పాట అయినా గుర్తు చేసుకోండి.
” కనులు పలుకరించెను, పెదవులు పులకించెను,బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను”
‘ఆడబ్రతుకు’ సినిమాలోని ఈ
పాటలో దేవిక ముగ్ధ మనోహరంగా సిగ్గును ప్రదర్శించిన తీరు అమోఘం.
అసలు ఎప్పుడు ఎక్కడ,ఎందుకు సిగ్గు పడాలి? అనే విషయం పరిశీలిస్తే…
పెళ్ళిచూపుల్లో సిగ్గు పడవచ్చు(అయితే చాలా చోట్ల ఇదివరకులా పాత పద్ధతి ప్రకారం పెళ్లిచూపులు జరగటం లేదు).పోనీ.. పెళ్ళిపీటల మీద సిగ్గుపడవచ్చు.
(అబ్బే,అది అసలు ఎక్కడా లేనేలేదు)సరే, ఎవరైనా తమ అందాన్ని పొగిడినప్పుడు,తాము చేసిన మంచి పనిని మెచ్చుకున్నప్పుడు కొద్దిగా సిగ్గుపడవచ్చు.
ఇంక ఎలా సిగ్గుపడాలి?
అన్న విషయానికి వస్తే.. చీర కొంగు వేలికొసలకు చుట్టుకుంటూనో, కాలి వేలుతో నేల మీద ముగ్గులు వేస్తూనో,
బుగ్గల్లో మందారాలు పూయిస్తూనో,ముఖం చేతుల్లో దాచుకుని పరుగెత్తి లోపలకి వెళ్ళిపోతూనో …
ఇలా చాలా పద్ధతులు
ఉన్నాయని మనకు పాత సినిమాలు చూస్తే అర్థమవుతుంది.
అయితే అవే అనుసరించమని కాదు, ఎవరికి తోచిన విధంగా వారు సిగ్గుపడవచ్చు.
ఏం ఆడవాళ్లే సిగ్గుపడాలా?మగవాళ్లు సిగ్గుపడనక్కర్లేదా? అంటే, ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. సందర్భం వచ్చినప్పుడు మగవాళ్ళైనా సిగ్గుపడకుండా సిగ్గుపడవచ్చు.
ఈ అంతర్జాల ఆధారిత కాలంలో, ఉరుకులు పరుగుల జీవితంలో,ఈ అంతరిక్ష యుగంలో నింగిలోకి కూడా దూసుకుపోయే మాకు సిగ్గుపడే తీరిక,అవసరం లేవు అంటారా? కాని సిగ్గుపడటం ప్రతి స్త్రీ జన్మహక్కు! అది ఆడపిల్లకు మాత్రమే సొంతమైన ఒక మధుర భావన! వాడుకలో లేకపోవడం వల్ల తెలుగు భాషలో నుండి ఎన్నో మంచి పదాలు మాయమైపోతున్నాయి. అలాగే జీవితాన్ని రసమయం చేసే సిగ్గు లాంటి భావనలు కూడా కనుమరుగయి పోతాయేమో అనే తపన నా చేత ఈ వ్యాసం వ్రాయించింది.
నిజమే,ఈనాటి
తరుణి స్వయంసిద్ధ!అందులో సందేహం లేదు.పురుష పుంగవులతో సమాన హక్కులను పొందిన ధీర. అంత
మాత్రాన తన సహజ గుణాలు వదులుకోనక్కర్లేదు. సందర్భోచితంగా ఆ తరుణి బుగ్గలు అరుణిమను పులుముకుంటే రమణీయంగా ఉంటుంది.
ఆ సొగసైన సిగ్గు
ఎక్కడైనా,ఎప్పుడైనా ఏ పిల్ల బుగ్గలలో అయినా మెరుపులా తళుక్కుమంటుందేమో
చూద్దామని ఆశపడుతూ
నలు దిశలా వెతుకుతున్నాను.
అబ్బే, ఎక్కడా కనపడదే!
దాని జాడ ఏమైనా మీకు తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకుందురూ!