శార్దూలము….
శాంతమ్మే మన సాధనమ్ము యనుచున్ స్వాతంత్ర్య పోరాటమున్
సాంతమ్మున్ బహు ధైర్యశాలి యగుచున్ సారధ్యతా బాధ్యతన్
సంతోషమ్ముగ స్వీకరించె కరుణా సౌశీల్యతన్ నవ్యమౌ
పంతమ్మున్గొని యాంగ్లపాలకులనే పంపించె ప్రావీణ్యతన్
శార్దూలము..
హింసావాదమమాను షమ్ము ధరలో హీనత్వమీయోచనల్
సంసిద్ధంబగుమింక జాతి కాంతి యశముల్ సౌభాగ్యమై సాగగా
ధ్వంసంబొందగ జేయుమంచు కరుణా వాత్సల్యముల్గల్గగా
మాంసాదుల్ భుజియింపనేల యనుచున్ మాన్పింప వాంఛించెగా
శార్దూలము…
గీతావాదమె గీతమార్చునని సంక్లిష్టంబులౌ ఘట్టముల్
ఘాతంబుల్దలకొన్న యోర్పు నేర్పు బల మేఘంబుల్ సువర్షంబులై
చైతన్యంబుల జిమ్మె భారతమునన్ సేవాధృతీ సద్గతిన్
ప్రీతిన్ జాగృతి గోరెనీ నరులు విశ్వంబంత కీర్తించగా
ఉత్పలమాల..
మానవ సేవయే తనకు మాధవసేవను నిశ్చయంబుతో
కానడు శత్రుభావనము కల్మషముల్ తమసమ్ము ద్వేషముల్
పూనె సహాయ సంస్క్రతులు పుష్కలమౌ తన మానవత్వమున్
సాననుబెట్ట వజ్రములు చక్కున దీప్తులజిమ్ము శైలిగన్
చంపకమాల..
సహనమహింస సత్యములు శాంతము సైన్యముగాగ దీక్షగా
నహరహమున్ శ్రమించి ఫలమందకయున్నను కర్మయోగియై
సుహిత సుదీర్ఘ యత్నములు శోభిల యాంగ్లుల పాలనంబునే
దహనము జేసె నూత్నపు విధానములన్ జగమెల్ల మెచ్చగా