`విశ్లేషణా ధోరణి లేనివాడు రచయితే కాదు’

రచయిత ఎస్వీకె. సంహితా నాయుడుగారితో తరుణి ముఖాముఖి

సాహిత్యం లో యువత ను ప్రోత్సాహించేలా భారత ప్రధాని ‘‘శ్రీ నరేంద్ర మోదీ” యువ రచయితల కోసం తలపెట్టిన ‘ప్రధానమంత్రి యువ-2.0’ పోటీలో ‘తెలుగుభాష’ నుంచి తుది దశకి చేరుకొని జాతీయ స్థాయిలో ఇంటర్వ్యూకి హాజరైన యువ రచయిత ఎస్వీకె. సంహితా నాయుడు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సాహిత్య పోటీల్లో విజేతగా నిలుస్తూ, ఎన్నో అవార్డులు అందుకుంటున్న సంహితా గారి తో ‘తరుణి’ ముఖాముఖి

తరుణి : అభినందనలు. ‘ప్రధానమంత్రి యువ-2.0’ పోటీలో ఫైనల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.. మీ పరిచయం, సొంత ఊరు, తల్లిదండ్రులు, చదువు, హాబీల గురించి చెప్పండి..
సంహిత: నా పూర్తి పేరు… ‘సుద్దపల్లి వెంకట కృష్ణ సంహితా నాయుడు.’ నేను పుట్టిందీ, పెరిగిందీ, చదువుకుంటున్నదీ… హైదరాబాద్‌ లోనే. అమ్మ పేరు ‘ఎస్వీ.కృష్ణజయంతి’, నాన్న పేరు ‘యస్వీకృష్ణ.’ నారాయణగూడ లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. పుస్తక పఠనం, రచనావ్యాసంగం, పాటలు పాడటం నా హాబీలు

తరుణి : సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది? మీకు స్ఫూర్తి కలిగించిన సాహితీవేత్తలు?
సంహిత: మా అమ్మానాన్న తెలుగులో పేరున్న రచయితలు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేశారు. వారి వృత్తీ, ప్రవృత్తీ రచనావ్యాసంగమే. తెలుగులోని గుర్తింపు పొందిన ప్రచురణ సంస్థల్లో ఒకటైన ‘జయంతి పబ్లికేషన్స్‌’ మాదే.
ఆ విధంగా అమ్మానాన్నల రచనలూ, పుస్తకాలే కాక` మా ‘జయంతి’ సంస్థ నుంచి ప్రచురించిన ఇతర రచనలు దాదాపు 435 పుస్తకాల కాపీలతో పాటు తెలుగుసాహిత్యం పట్ల అభిరుచితో వాళ్ళు సేకరించిన రకరకాల పుస్తకాలతో మా ఇల్లంతా పుస్తకాల నిలయంగా ఉండేది. అలా అమ్మానాన్న రచించిన పుస్తకాలు, వాళ్ళు ప్రచురించిన ఇతర రచయితల పుస్తకాలను చూస్తూంటే నాకు తెలియకుండానే పుస్తకాల పట్ల ఆసక్తి కలిగి వాటిని తిరగేయటం, చదవటం చిన్నప్పటినుంచే అలవాటయ్యింది. ఏవైనా అర్థంకాని పదాలూ, వాక్యాలూ, భావాలుంటే… అమ్మానాన్న చక్కగా అర్థమయ్యేట్లు విడమరచి చెప్పేవారు. అలా బాలసాహిత్యంతో మొదలుపెట్టి, కవితలూ, కథలూ, నవలలూ చదివేదాన్ని.
అలా చదవటం మొదలుపెట్టిన నేను` ఐదో తరగతి నుంచే చిట్టిపొట్టి కవితలూ, కథలూ రాయటం ప్రారంభించాను.
ఇక- నాకు స్ఫూర్తి కలిగించిన సాహితీవేత్తలు మా అమ్మానాన్నే. వాళ్ళు నాకు స్ఫూర్తి మాత్రమే కాదు` ఒక విషయాన్ని ఎలా చూడాలో, మనసులోని ఒక భావాన్ని కాగితం మీదకు ఎలా తేవాలో, ఒక వాక్యం ఎలా రాస్తే ఎంతటి ప్రభావం చూపిస్తుందో… లాంటి టెక్నిక్స్‌ ఎన్నింటినో నాన్న చక్కగా వివరిస్తూండేవారు. ఇప్పటికీ ఇంకా నేర్పిస్తున్నారు.

తరుణి : ఇప్పటివరకు మీరు రాసిన ప్రక్రియలు?
సంహిత: మొదట్లో నేను అంత్యప్రాసలతో వచ్చే రెండు, నాలుగు, ఆరు లైన్లు ఉండే చిన్న చిన్న కవితలు 30దాకా రాశాను, తర్వాత చిన్నపిల్లలకి సులభంగా అర్థమయ్యే చిట్టిపొట్టి కథలు 25దాకా రాశాను. ఆ తర్వాత సినిమా సమీక్షలను ఓ 30దాకా రాశాను. ఆపై మానవ సంబంధాల గురించిన కథలు రాయటం మొదలుపెట్టాను. ఇప్పుడు అవే కథలు రాస్తూ కొనసాగుతున్నాను. అలా రాసిన కథలను ప్రముఖ పత్రికలు నిర్వహించిన పోటీలకి పంపితే కొన్ని కథలు ఎంపికై, ప్రచురితమై, కొన్నింటికి బహుమతులు వచ్చాయి.
నాకు ప్రేరణ… మా నాన్నే. సాహిత్యసృజనలో ఉండే ఆనందం, రచనావ్యాసంగం వల్ల కలిగే సంతృప్తి గురించి నాకు చక్కగా వివరిస్తుంటారు. దాని ద్వారా సాహిత్యం పట్ల నాలో ఉన్న ఆసక్తి మరింత పెరిగి, రచనా వ్యాసంగంతో నాకు దక్కుతున్న గుర్తింపు, కలుగుతున్న తృప్తి తెలుసుకుని ఆ దారిలోనే ముందుకు సాగుతున్నాను.

తరుణి: ప్రచురించిన పుస్తకాలు?
సంహిత: చిన్నపిల్లల కోసం నేను రాసిన చిట్టిపొట్టి కథలు ‘‘సత్యమేవ జయతే” పేరుతో పుస్తక రూపంలో ప్రచురణ కాబోతోంది.

తరుణి : పోటీలకు ఎంపికైన రచనలు, అందుకున్న గౌరవాలు?
సంహిత : ‘‘నమస్తే తెలంగాణ డైలీ- ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీ- 2022’’లో నా ‘ఆలంబన’ కథ ‘ప్రత్యేక బహుమతి’ (రూ.2000/-) పొందింది.
2) ‘‘నది” మాసపత్రిక నిర్వహించిన ‘చిన్నకథల పోటీ’లో నా కథ ‘అత్తగారి కొత్తకోడలు’ ఎంపికై, ప్రచురితమైంది.
3) ‘‘నది” మాసపత్రిక నిర్వహించిన ‘పోస్ట్‌కార్డు కథల పోటీ’లో నేను రాసిన ‘పెళ్లిచూపులు’ కథ ఎంపికై, ప్రచురింపబడినది.
4) 2022 దీపావళి సందర్భంగా ‘‘సాంస్కృతిక వేదిక” నిర్వహించిన ‘ఏకపత్ర కథల పోటీ’లో ‘అద్గదీ సంగతి’ అనే నా కథ ‘ప్రత్యేక బహుమతి’ పొందింది.
5) 2023 జనవరిలో ‘‘విశాలాక్షి” మాసపత్రిక ‘సంక్రాంతి కథల పోటీ’లో నేను రాసిన ‘మబ్బులు తొలగిన ఆకాశం’ అనే కథ ఎంపికై, ప్రచురింపబడిరది.


6) ‘‘అచ్చంగా తెలుగు” బృందం వారి ‘వినాయకచవితి హాస్యకథల పోటీ’లో ‘పి.ఎస్‌.ఎఫ్‌.స్ట్రోక్‌’ కథ ‘తృతీయ బహుమతి’ (రూ.1,016/- నగదు) పొందింది.
7) ‘‘కథామంజరి” మాసపత్రిక ‘దీపావళి కథల పోటీ-2023’లో ‘హాఫ్‌ బౌ’ కథ ఎంపికైంది.
8) తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‘డా॥ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్‌’గారి అధ్యక్షతలో 17-09-2022వ తేదీన హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ సందర్భంగా యూనివర్శిటీ విద్యార్థినీ విద్యార్థులకు ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ మూవ్‌ మెంట్‌ స్ట్రగుల్స్‌ అండ్‌ శాక్రిఫైజెస్‌’ అంశంపై నిర్వహించిన రాష్ట్రవ్యాప్త ‘వక్తృత్వ పోటీ’ లో పాల్గొనడం. గవర్నర్‌గారి చేతుల మీదుగా నగదు బహుమతి (రూ॥ 1,000/`), ప్రశంసాపత్రం అందుకోవడం.
9) ‘నమస్తే తెలంగాణ- ముల్కనూర్‌ సాహితీపీఠం’ కథల పోటీ- 2022’లో బహుమతి సాధించి, 9 జూలై’ 2023వ తేదీన ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం”లో ఘనసత్కారంతో బహుమతి స్వీకరించడం.
10) భారత ప్రధాని ‘‘శ్రీ నరేంద్ర మోదీ” యువ రచయితల కోసం తలపెట్టిన ‘ప్రధానమంత్రి యువ-2.0’ స్కీమ్‌కి ‘నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా’ వారు దేశవ్యాప్తంగా 22 భాషలలోని యువ రచయితలకు నిర్వహించిన పోటీలో ‘తెలుగుభాష’ నుంచి తుది దశకి చేరుకొని జాతీయ జ్యూరీ సభ్యులతో ఇంటర్వ్యూకి ఎంపిక కావడం.

తరుణి : ఇప్పుడు రాస్తున్న పుస్తకాలు?
గత మూడు నెలలుగా వివిధ పత్రికలూ, సాహితీసంస్థలూ వేర్వేరు పండుగల సందర్భంగా కథల పోటీలు నిర్వహించాయి. ఆయా పోటీలకు నేను కథలు రాసి పంపించాను. కొన్నింటి ఫలితాలు వెలువడ్డాయి, చాలా పోటీల ఫలితాలు వెలువడాల్సివుంది. వాటి ఫలితాలు కూడా ప్రకటించబడ్డాక ఈ పోటీలలో నాకు బహుమతి వచ్చిన, ఎంపికైన కథలతో ఓ చక్కటి కథాసంపుటి వెలువరించాలనుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు నేను రాసిన సినిమా సమీక్షలను ఓ పుస్తకంగా తీసుకురావాలని నా ఆలోచన.
సమాజానికి ఉపయోగపడే, భవిష్యత్తు తరానికి మార్గనిర్దేశాన్నిచ్చే పలు రచనలు చేయాలని నా ఉద్దేశం, నా లక్ష్యం.

తరుణి : సాహిత్యంలో యువత పాత్ర?
సంహిత: మిగతా భాషల సంగతి నాకు తెలియదు కానీ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో మాత్రం యువపాఠకులు దాదాపు లేరనే చెప్పవచ్చు. ఇక యువ రచయితల కొరత ఎంత ఉందో ఊహించుకోవచ్చు. ఓ నాలుగైదేళ్ల క్రితం తెలుగులో 30-35 ఏళ్ల లోపు యువ రచయితలు ఎవరున్నారని వెతికినా కనిపించని పరిస్థితి ఉండేది. రాజకీయ, సినీ, విద్య, వైద్య, వ్యాపార తదితర రంగాలలో యువత పాత్ర చాలా బాగా ఉంది. కారణం… ఆయా రంగాలలో సీనియర్లు తమ కుటుంబంలోంచే తమ వారసులను తయారు చేస్తున్నారు. కాని తెలుగుసాహిత్యంలో సీనియర్లుగా కొనసాగుతున్నవారు మాత్రం తమ వారసుల్ని ఎందుకు తయారుచేయడం లేదో చాలా లోతుగా ఆలోచించవలసిందే. రచయితల సంగతి పక్కనపెడితే` తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ… తెలుగుభాష పైనే జీవనోపాధి కొనసాగిస్తున్నవారు సైతం తమ పిల్లలకు తెలుగు రాయటం, చదవటం కూడా నేర్పించకపోగా- ‘‘మా పిల్లలకు తెలుగు రాదండీ!’’ అంటూ గర్వంగా చెప్పుకొనే పరిస్థితి ఉంది… మన తెలుగు సమాజంలో.

తరుణి : మీతరం రచయితలకు మీరిచ్చే సూచనలు, సలహాలు?
సంహిత: నేనే ‘నేటి తరం రచయిత్రి’గా నిలదొక్కుకుంటున్నాను… ఇక నేటి తరం రచయితలకు నేనిచ్చే సందేశాలు ఏముంటాయండీ? ఇతరులకు సూచనలూ, సలహాలూ ఇచ్చేంత అనుభవం, పరిణతి నాకు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అయితే మా నాన్న నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే… “తన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల, జరుగుతున్న సంఘటనల పట్ల, వాటి పరిణామాల పట్ల తనదంటూ ఒక దృక్పథం, ఆలోచనా`విశ్లేషణా ధోరణి లేనివాడు రచయితే కాదు”
అని. అలా నా పరిధిలోకి వచ్చే ప్రతి విషయంపై నాదంటూ ఓ దృష్టికోణం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ కొనసాగుతున్నాను. అలాగే ఏదైనా ఒక అంశంపై మనం రాయాలని పూనుకున్నప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనాలు, పరిణామాల గురించి అన్ని కోణాలలో ముందుగానే ఆలోచించుకోవాలి. అను కున్నది అనుకున్నట్టుగా కాగితం మీద కలం పడి ఒక అక్షరం మొదలైందంటే… దాన్ని పూర్తిచేసే వరకు వదిలిపెట్టకూడదు.

ఎస్. యశోద, ముఖాముఖీ గ్రహీత

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తమసో మా జ్యోతిర్గమయ *

జాతిపిత…గాంధీజీ..