కంచం

కథ

ఎన్నెలమ్మ, కెనడా

నేను పది పాసయ్యి రిజల్ట్స్ కోసం వేచి చూస్తూ, సాయంత్రం దాకా వనగంట్లాట, కచ్చకాయలాట, ఉప్పిరి గింజలాట ఆడుకుంటుంటే మా నాన్న ఆఫీస్ నించి వచ్చారు. మా అమ్మ పని ఆపుకుని నాన్నతో మాట్లాడుతూ కూచుంది. అంటే ఏదో విశేషం ఉన్నట్టే. నాన్న AOC లో పని చేసేవారు. మధ్యాహ్నం లంచ్ లో ఒకోసారి ఈస్ట్ మారెడ్ పల్లిలో ఉన్న పెదనాన్న ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కుని వస్తుంటారు. అలా వెళ్ళినప్పుడు అమ్మతో ఆ విషయాలు మాట్లాడుతుంటారు. ఈ సారి తెలిసినది ఏమిటంటే, పెద్దమ్మ ఒక నెల రోజుల కోసం ఊరికి వెళుతోంది కాబట్టి, నేను ప్రస్తుతం బేవార్సు కాబట్టి, అక్కడికి వెళ్లి కాస్త సహాయం చేసేట్టు ఒప్పందం జరిగింది.

పొద్దున్న నేను వచ్చీ రాని వంట వండి పెడితే, అన్నయ్య రాత్రి ఆఫీస్ నించి వచ్చాక, కొద్దిగా కొత్త వెరైటీ లు ట్రయల్స్ వేసేవాడు.
అలా అలా ఎలాగో మొత్తానికి నెల గడిచిపోయింది. పెద్దమ్మ వచ్చే ముందు రోజు పెదనాన్న నన్ను దగ్గరగా కూచోపెట్టుకుని, ” అమ్మా.. మీ పెద్దమ్మకి కొంచెం చాదస్తం ఎక్కువ. ఆవకాయ జాడీలు అవీ ఏదైనా ముట్టుకున్నారా అని అడిగితే ముట్టుకోలేదు అని చెప్పు. మంచి నీళ్ళు ఈ రోజు పొద్దున్నే పట్టాము అని చెప్పు. అన్నిటికంటే ముఖ్యంగా తన కంచంలో ఎవరైనా తింటే తనకి నచ్చదు, కానీ తన కంచం ఏదో నాకు తెలియదు. కాబట్టి తను రాగానే ఆ కంచం ఏదో కనుక్కునే పూచీ నీదే. తను ఏది తనది అంటుందో దానిని మనం వాడలేదు అని చెప్పు లేకపోతే ఉపద్రవాలు ముంచుకొస్తాయి” అని చెప్పారు.

ఆ రాత్రంతా నాకు కంచం ఇంకెవరో వాడినట్టు, పెద్దమ్మ కొప్పడ్డట్టు కలలొచ్చాయి.

పెదనాన్న, అన్నయ్య ఆఫీస్ లకి వెళ్ళాక పెద్దమ్మ ఆటో దిగింది. తన కంచం ఎలా గుర్తు పట్టాలో, అసలు ప్రశ్న ఎలా అడగాలో రిహార్సల్ వేసుకున్నా కానీ ఆందోళనగా ఉంది. పెద్దమ్మ స్నానం చేసి వచ్చి, కాఫీ తాగి, పూజ అయ్యాక వంట మొదలెట్టింది. భోజనానికి కూచునే దాకా కంచం ప్రసక్తి రాలేదు కానీ.. ఆఖరికి మజ్జిగలో పోపు వేస్తూ “కంచాలు పెట్టేయ్” అంది. అలాగే అన్నానే కానీ ఈ కంచం పరీక్ష ఏమిట్రా దేవుడా అని టెన్షన్ పడ్డాను. కంచాల దగ్గరికి వెళ్ళే లోపు” ఊరి నించి అప్పడాలు తెచ్చాను . అవి తెచ్చెయ్. ఈ నిప్పుల మీద కాలిస్తే బాగుంటాయి” అంటూ తాళం చెవి ఇచ్చింది .

పెట్టె తియ్యగానే ముందు నాకు కనిపించినవి తళతళలాడే కంచం గలాస. ఇదేమిటో అనుకుంటూ “పెద్దమ్మా నీ కంచం ఉందిగా మళ్లీ కొన్నావా” అని తెలివి ప్రదర్శించా. ” లేదే, నాకు ఇంట్లో ఎవరి మీదా నమ్మకం లేదు. అందుకే నా కంచం గ్లాసు నాతోనే తీసుకెళ్లా” అంది. హమ్మయ్య అని తీరిగ్గా నెల తర్వాత మంచి భోజనం చేశా

Written by Laxmirayapu

పేరు; లక్ష్మి రాయవరపు
కలం పేరు: ఎన్నెలమ్మ
చదువు, ఉద్యోగం: చిత్ర గుప్తుల వారివి
కలనైనా తలపు: తెలుగుతల్లి కెనడా
పెంపుడు బిడ్డ: గడుగ్గాయి (పిల్లల మాస పత్రిక)
పుస్తకం: ఎన్నెలమ్మ కతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చేయూత

కథలో రాజకుమారి