దేవదానవులు సముద్ర మథనము చేసిరానాడు!
కవ్వపు రాపిడిలో ఎన్నిటితో పాటూ విషమూ పుట్టె!
జనులాహాకారములే మిన్ను ముట్టె!
ఆదిదంపతులను అమితముగా వేడికొనిరి!
అంబ మనసు తల్లడిల్లె- ఆర్తితో కాపాడ సమకట్టి విషము తినమని పోరుపెట్టి
మానవాళిని రక్షించమని సర్వమంగళ కోరె!
మాహేశ్వరీ! పానీయము కాదది! పాషాణమనె! పరమేశ్వరుడు.
పరాకున మాటాడితివా?బుసబుసమని పొంగు విషము! కసకసమని తినగ కర్జూరము కాదనె! కాలకాలుడు!
లోకాలను కాల్చివేయు కాలకూటమది!
తెల్లని దొరా! తండ్రిగ రక్షింప తగుదువు నీవే!
మాంగల్యము మది నమ్మితి! మింగుము విషము! వినుసిగ దేవర! నిను వినా దిక్కెవ్వరు మన బిడ్డలకు?
భద్రకాళీ! భద్రముగనుంచ మన బిడ్డలపై మమత లెస్స చూపితివి! లేదు సాటిలలోన తల్లి ప్రేమ సృష్టిలోన !
నీ మాటను జవదాటను నారాయణీ!
పట్టితి పిప్పలమరచేతిలోన – ప్రజాహితముకోరి!
ప్రాణేశ్వరీ! పాపల రక్షించుట నా కర్తవ్యము!
ప్రవహించు విషము తీసి పిసికి ముద్దచేసి భుజించె అరక్షణములో అర్ధనిమీలిత నేత్రుడై ముక్కంటి!
భగభగ మండెను! కంఠము- కాలకూట విషముచే
నా గళము కమరెను మింగిననేమగునో? అని తలచెను!
ఆది దేవుడుకే ఆనపెట్టెనపుడు అంబ!
కంఠము కిందకు జార్చకు! ప్రాణికోటికి కీడుచేయకుమనె!
ఆర్యాణి ఆజ్ఞతో గరళము మింగక కంఠమున నిలిపి గరళకంఠుడాయెను!
కంటి పాపల గాచు అప్ప – క్షేమరచు అమ్మ
అర్ధనారీశ్వరులై – ఆపదలెన్నో కాతురు !
ఆనందముతో ఆనంద భైరవి- నటరాజులానంద నాట్యమే చేయ! మంగళమని పాడిరి దేవతలంతా!