“ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా కలలసౌధం” అంది పద్మ సరోజతో.
“మా ఇల్లన్నంత జగ్రత్తగా చూసుకొంటాను. మీరు దిగులు పడకండి” అభయమిచ్చింది సరోజ.
కొత్త రంగుల సువాసనతో, అందంగా, శుభ్రంగా తళతళలాడుతున్న ఇంటిని మరోసారి కలయ చూసి, తప్పనిసరై బయటకు నడిచింది పద్మ. సొంత ఇంటి మీది కోరికతో, “పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళ చదువులు, అవసరాలు ఉంటాయి. పైగా నాది బదిలీలు అయ్యే ఉద్యోగము. ప్రతి మూడేళ్ళకూ ఊరు మారుతుంటాము. ఇప్పుడు అప్పు తీసుకొని ఫ్లాట్ కొనటము అవసరమా?” అన్న ప్రదీప్ మాటలకు, “మనమేమన్నా దానికి డబ్బులు పెట్టాలా? దాని అప్పు దానికొచ్చే అద్దె డబ్బులతో అదే తీర్చుకుంటుంది. మీరు రిటైర్ అయ్యి మనము వచ్చేనాటికి అప్పు తీరిపోతుంది. అప్పుడు ఎక్కడుండాలాని వెతుక్కోకుండా హాయిగా మనింట్లో మనం ఉండవచ్చు” అని ప్రదీప్ ను ఒప్పించి మరీ ఈ టూబెడ్ రూం ఫ్లాట్ కొనిపించింది పద్మ. గృహప్రవేశం చేసుకొని, తెలిసినవారి ద్వారా వచ్చిన సరోజావాళ్ళకు ఫ్లాట్ అద్దెకిచ్చారు. భారమైన మనసుతో వదలలేక వదలలేక ఇంటిని వాళ్ళకు అప్పగించి వారి ఉద్యోగపు ఊరికి వెళ్ళారు.
రెండేళ్ళ తరువాత సరోజావాళ్ళు వేరే చోటికి వెళుతున్నామని చెపితే, ఫ్లాట్ ను తీసుకోవటానికి వచ్చిన పద్మకు దాని పరిస్థితి చూసి కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. ఇల్లు మారేటప్పుడు ఇంటిని శుభ్రం చేయకూడదట చాలా సామానులు అటూఇటూ పడేసి ఉన్నాయి. గోడలకు మేకులు కొట్టారు. బాత్ రూం లల్లో నల్లాలు పాడైపోయాయి. మొహమాటంతో ఏమనలేక ఫ్లాట్ హాండోవర్ చేసుకున్నారు. ఫ్లాట్ ను బాగు చేయించి, తప్పక ఇంకొకరికి, బోలెడు జాగ్రత్తలు చెప్పి అద్దెకు ఇచ్చి వెళ్ళారు. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా అద్దెల వాళ్ళు ఇంట్లో చెత్తాచెదారం తీసుకెళ్ళ కూడదు, శుభ్రం చేసి వెళితే దరిద్రం వెంట బెట్టుకెళ్ళటం అవుతుంది అని అట్లాగే వదిలేసి వెళ్ళేవారు. నానా చెత్తా చెదారంతో కంగాళీ చేసేవారు. ప్రతిసారి ఫ్లాట్ బాగు చేసి మళ్ళీ అద్దెకు ఇవ్వటమూ, వాళ్ళు ఖాళీ చేసినప్పుడు అదే కథ పునరావృత్తం అవుతోంది. ఈ సారి అవుతే పాతచీరలు, కర్టెన్స్, పాత పేపర్లూ, ఎంత పారేయవచ్చో అంత మూలలు కూడా వదలకుండా వెదజల్లేసారు. అంతే కాకుండా బాత్ రూం అద్దం నిండా స్పోటకం మచ్చలలా బొట్టు బిళ్ళలు అంటించారు. వంటింట్లో దేవుడి గూడంతా నల్లగా మసి బారిపోయింది. గోడలన్నీ కమురు పట్టిపోయాయి. ఒక్క నల్లా కూడా సరిగ్గా లేదు. అసలు కమౌట్స్ అంత అసహ్యంగా వాళ్ళైనా ఎట్లా వాడుకున్నారో!
ఆ అద్దెవాళ్ళు వీళ్ళు రావటానికి ఆలశ్యం అవుతుందని తెలిసిన వారిని పంపుతే వారికి తాళాలు ఇచ్చి వెళ్ళారు. తాళం తీసి లోపలికి వస్తూనే ఆ ఇంటి పరిస్థితి చూస్తూనే బోరుమని ఏడుస్తూ హాల్ మధ్యలో కూలబడిపోయింది పద్మ.
ఎంతో ముచ్చటపడి భర్తను ఒప్పించి కొనుకున్న ఇంటిని ఆ విధంగా చూస్తే కన్నీళు ఆగలేదు పద్మకు. ఇదేమిటి? చదువుసంస్కారం ఉన్నవాళ్ళు చేసే పద్దతి ఇదేనా? ఎంత అద్దె ఇంటిని శుభ్రం చేయాకూడదు అనే నమ్మకం ఉన్నంతమాత్రాన ఇంత చెత్త ఈవిధంగా పడేసి, పాడుచేసి వెళ్ళాలా? అప్పటికిక మనసు ఆగక వాళ్ళకు ఫోన్ చేసి “ఇదేమిటమ్మా ఇంత చెత్త పడేసి, ఇల్లు ఇంత అద్వానంగా చేసారు?” అని అడిగింది.
“అయ్యో ఆంటీ, పనమ్మాయికి వందరూపాయలిచ్చి ఇల్లు బాగు చేయమని చెప్పానే! చేయలేదా? ఉండండి కనుక్కుంటాను.” అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా సెల్ ఆఫ్ చేసింది.
దగ్గర ఉండి చూస్తుంటేనే పనివాళ్ళు సక్రమంగా ఊడవరు. ఇక లేకుండా చేయమంటే చేస్తారా? అదీ వందరూపాయలిస్తే. వీళ్ళే అమెరికాలో అద్దె ఇళ్ళు చచ్చినట్టు బాగుచేసి వెళుతారు. అక్కడ ఏమాత్రం పాడైయినా ఓనర్స్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తారట. అక్కడ ఈ నమ్మకాలేమీ పనిచేయవు ఆ విధానం ఇక్కడ కూడా ఉంటే ఎంత బాగుండు. అధ్వానంగా ఉన్న ఇంటిని చూస్తూ కళ్ళల్లో నుంచి కారుతున్న నీటిని కూడా తుడుచుకోకుండా “చెత్త కుండీ కాదు, డంప్ యార్డ్ చేసారు” ఇల్లంతా పారేసి ఉన్న పాత బట్టలూ, కాగితాలూ, తుక్కూ చూస్తూ అంది పద్మ.
“మేస్త్రీ ఇల్లు బాగుచేయటానికి రెండు లక్షలవుతుందన్నాడు. ప్రతిసారీ ఇప్పటికే చాలా పెట్టాము. మనము వచ్చేసరికి ఫ్లాట్ ఏ స్థితిలోఉంటుందో? ఇంకా ఎంత డబ్బు ఖర్చవుతుందో చెప్పలేము. పైగా మూడునెలల అద్దె టాక్స్ కట్టాలి. పిల్లల కాలేజీకి ఫీజులు, కొద్దోగొప్పో వాళ్ళ అవసరాలు ఇలా చాలా ఖర్చులున్నాయి. మనం ఎంత పొదుపుగా ఉన్నా అన్ని సద్దుకోలేము. అమ్మేద్దాము. వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేస్తే మనకూ ఇబ్బంది ఉండదు” నిస్సహాయంగా అన్నాడు ప్రదీప్.
ఇంకేమనగలదు. కంటి ముందు కనిపిస్తుంటే ఇంకేమనగలదు? ఇల్లు కట్టుకున్నవాడికంటే, ఆ ఇంట్లో అద్దెకున్నవాడు తెలివికలవాడు అని అందుకే అంటారు. తన కలలసౌధం తన కళ్ళ ముందే కూలిపోయింది!
విచారంగా కూర్చున్న తల్లితో “బాధపడకమ్మా. నా చదువైపోగానే కాంపస్ సెల్క్షన్స్ లో తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం రాగానే మంచి ఫ్లాట్ కొనుక్కుందాము. కాసేపు యూట్యుబ్ లో ఏదైనా పాత సినిమా చూడు. లేదా నీకిష్టమైన పాత పాటలేమైనా విను” అనునయంగా అని కొడుకు హర్ష లాప్ టాప్ తెచ్చి యూట్యూబ్ తీసిచ్చాడు.
యూట్యూబ్ తీయగానే ఏదో టీ.వీ ఛానల్ లోయాంకర్, అక్కడున్నావిడను “అమ్మా అద్దె ఇల్లు మారేటప్పుడు ఏమేమి వదిలేయాలంటారు?” అని అడుగుతోంది.
అందుకు ఆవిడ “అద్దె ఇంట్లో నుంచి చెత్తాచెదారం అలాంటివి తీసుకెళ్ళకూడదు. తీసుకెళితే దరిద్రం చుట్టుకుంటుంది. ఆ దరిద్రం వదిలేయాలి. మాకలాంటి నమ్మకాలు లేవు అనే వాళ్ళకు నేనేమీ చెప్పలేను. కాకపోతే మరీ ఆవిధంగా వదిలేస్తే ఇంటివాళ్ళు శాపనార్ధాలు పెడుతారు. అందుకని పనిమనిషికి ఓ వందనో, కాదులే ఈ కాలంలో వందకెవరు చేస్తారు కాని ఓ అయిదొందలు ఇచ్చి, మరురోజు బాగు చేయమని చెపితే సరి. ఇంక ఏమేమి వదిలేయాలంటే…”
అది వింటుంటే ఆవేశం ఆపుకోలేక పోయింది పద్మ. అంటే ఇల్లు కష్ఠపడి కట్టుకొని, అవసరానికి అద్దెకిచ్చిన పాపానికి అద్దెకున్నవాళ్ళ దరిద్రం ఓనర్స్ కిచ్చిపోతారన్నమాట. ఘాటుగా అక్కడ కామెంట్ పెడుదామనుకుంది కానీ వాళ్ళు కానీ జవాబిస్తారా? ఇవ్వరు. డిలీట్ చేసినా చేసేస్తారు. అయినా ఊరుకోలేక “నమ్మకం లేని వాళ్ళకు మీరేమి చెప్పక్కరలేదు. ఎవరి నమ్మకాలు వారివి కానీ వారి నమ్మకాలతో ఎదుటివాళ్ళ కు కష్టం, నష్టం కలుగచేయకూడదు. అంతగా తీసుకెళ్ళకూడదు అనుకుంటే ఏ చిన్న కాగితమో ఏదో, ఎక్కడో ఓ మూల పడేసి వెళ్ళమండి. అంతే కానీ మూఢనమ్మకాలను ఇంకాఇంకా ప్రజలలో పెంచిపోషించకండి” అని కామెంట్ పెట్టి, ఎవరి దరిద్రం వదిలింది ఛానల్ తిప్పింది.