బతుకమ్మ విశిష్టత

అత్యంత వైభవోపేతంగా మహిళలందరూ కూడి ఒకేచోట చేసుకునే సంబరం బతుకమ్మ పండుగ. ఈ పండుగను తెలంగాణ ప్రాంతవాసులు నిర్వహిస్తారు. వినాయక చవితి నుండి 15 సం||లోపు ఆడపిల్లలు పేడతో ఇంటిముందు గుండ్రంగా అలికి, ముగ్గు వేసి, ఆవు పేడతో 5 గొబ్బెమ్మలు చేసి, వాటిని గుర్మాసి పూలతో అలంకరించి, పప్పు బెల్లాలతో నైవేద్యం పెట్టి మహాలయ అమావాస్య వరకు ప్రతిరోజు సాయంత్రం బొడ్డెమ్మను ఆడుతారు. తర్వాత ఆ బొడ్డెమ్మను పిడకలుగా గోడకు కొట్టి, ఆడినచోట చీకటి పడేవరకు చెమ్మచెక్క, పుంగిడిబూతలు ఆడుతారు.

ఇక మహాలయ అమావాస్య నుండి పూలబతుకమ్మ ఆరంభం. ఇది 9 రోజులు. ప్రతి మహిళ, పిల్లలు, పెద్దలు అందరూ తమతమ ఇండ్లలో గునుగు, తంగేడు, పోకబంతి, బంతి, చామంతి, పట్టు కుచ్చులు, మందార, నందివర్ధనం, గన్నేరు పూలతో ఒక పళ్లెంలో ఆనపకాయ ఆకును పరచి, గుండ్రంగా బతుకమ్మను పేరుస్తారు. ఒక చిన్న పళ్లెంలో చిన్న బతుకమ్మను కూడా పేర్చి, గౌరవమ్మను పసుపుతో తయారుచేసి, వారి స్థోమతకు తగినట్లుగా నైవేద్యం పెట్టి, మొదట వారింటి ముందర ఆడి, అందరూ కలిసి దేవాలయంలోనో, చెఱువు గట్టుననో ఆడి, చెఱువులో నిమజ్జనం చేస్తారు. గుండ్రంగా పాటలు పాడుతూ చేతులతో తాళం వేస్తూ ఉయ్యాలో వలలో అంటూ సాయంత్రం నుండి చీకటి పడే వేళవరకు ఆడుతారు.

ప్రతిరోజూ ఒకరకమైన ఫలహారములు తయారు చేస్తారు. మురుకులు, చేగోడులు, చకిలాలు, బిళ్లలు, అటుకులు, పల్లీలు, బెల్లం మొ|| అందరూ కలిసి తింటారు. 9వ రోజు 9 రకాల సద్దులు కలుపుతారు. సద్దులు అనగా పులిహోర ఇవి 9 రకాలు చేస్తారు. చింతపండు, నిమ్మ, కొబ్బరి, నువ్వు, పుట్నాలు, పల్లీలు, గడ్డినువ్వులు, అవిశెలు, చింతకాయలతో తయారు చేస్తారు. 9వ రోజు గౌరమ్మను ఓలలాడించి, మళ్లీ రావమ్మా అని సాగనంపుతారు. ఆడిపిల్లలను పండుగలకు పిలుచుకుంటారు. దసరా నవరాత్రులలో దుర్గామాత్రను 9 రోజులు అలంకరించినట్లుగా, బతుకమ్మను కూడా 9 రోజులు పూలతో అలంకరించి, ఆడుతారు. పెద్ద బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసి, చిన్న బతుకమ్మను కూడా తల్లి పక్కనే విడిచి, గౌరమ్మను చిన్నపిల్ల ఒడిలో ఓలలాడిస్తారు.

ఇసుకలో పుట్టే గౌరమ్మా

ఇండ్లలో పెరిగే గౌరమ్మా

పొన్నాగంటి తాళ్ళూ

పోకలగంటి వేళ్ళూ

పోయిరా గౌరమ్మా పోయిరావమ్మా

పోయి మా యింటికే తిరిగి రావమ్మా.. అని పాడుతూ, సత్తు ముద్దను అందరికీ పంచి, వారి పసుపు కుంకుమలను కాపాడుమని వేడుకుంటారు.

ఈ బతుకమ్మకు పురాణాల ఆధారంగా ధర్వాంగద రాజు సంతానంలేక కాళేశ్వరం వెళ్లి పూజించగా, శివుడు ప్రత్యక్షమై పూర్మజన్మలో పామును చంపినందున సంతానం కలుగలేదు. కానీ ప్రార్థించమనగా ఆ రాజు నాకు కొడుకుగా పుట్టుమని కోరగా వారికి జన్మించెను. పరిహారం కోరగా అందమైన స్త్రీలో వివాహం జరిగి సంతానం కల్గునని చెప్పగా, రత్నపురి రాజు కుమార్తె సత్యవతిని మా ఆచారం ప్రకారం ఖడ్గంతో వివాహం అని జరిపిస్తారు. అనంతరం సత్యవతి తన భర్త పాము అని తెల్సుకుని అతడు చెప్పిన విధంగా ఆ పామును పెట్టుకుని అదేరోజు రాత్రి కాళేశ్వరం వెళ్ళి, నదిలో మునిగి తిరిగివచ్చి, శయ్యపై తామరాకుపై పరుండు అని దుప్పటి కప్పుకుని వుంటారు. తెల్లవారిన అనంతరం చూడగా పాము రూపం పోయి చక్కని రూపంతో భర్త కన్పిస్తాడు. ఆవిధంగా బతుకునిచ్చిన సత్యవతి బతుకమ్మ అయిందని ప్రతీతి.

జానపదులలో భూస్వాముల అరాచకత్వానికి గురైన ఒక అబలను ఆ వూరి ప్రజలందరూ బతుకు అమ్మా బతుకమ్మా అని పిలుస్తారు. ఆవిధంగా బతుకమ్మ అయిందని, 7 గురు అన్నల ముద్దుల చెల్లెలు వదినల బాధ భరించలేక చెరువులో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. అన్నలు అహోరాత్రులు తిండిలేక వెతుకుతూ ఒక బావిలో నీరు తాగుచుండగా ఒక తామరాకు వారి వద్దకు వస్తుంది. అప్పుడే వచ్చిన ఆవూరి రాజు ఆ ఆకును తమ కొలనులో వుంచగా అది ఒక అందమైన స్త్రీగా మారింది. తన వారికి బ్రతుకుతెరువు నిచ్చింది. కాన బతుకమ్మ అయింది.

ఈ విధంగా రకరకాల కథలు కలవు. ఈ పండుగ ఒకరకంగా వానలు ముగిసి, చలి ఆరంభమయ్యే కాలంలో వస్తుంది. కాబట్టి అన్ని పూవులు, కాయలు విరివిగా కాస్తాయి. మరింత కాయకష్టం చేసే మహిళలకు ఒక విధంగా ఆటవిడుపు. వంగి చప్పట్లు చరుస్తూ తిరగటం ఒకరకమైన వ్యాయామం. పాటలు కూడా మంచి నీతికి కలిగి, భారత రామాయణ కథలతో ఉంటాయి.

Written by Manjula S

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నియంత్రణ – Control

సంకల్పం