నిత్య జీవితంలో మనదైన స్వేచ్ఛ కు, ఆలోచన లకు,భంగం కలిగించడాన్ని నియంత్రణ చేస్తున్నట్టు చెప్తుంటారు. అవసరమైన నిగూఢ త, నియంత్రణ రెండు ఒకటి కాదు. వ్యవస్థలో కొన్ని తడవలు అడ్డంకులను ఏర్పాటు చేశారు. ఉదాహరణ కు కుటుంబ నియంత్రణ, ఆర్థికపరమైన సంపాదన విషయంలో టాక్స్ లను ఏర్పాటు చేయడం , వివాహం సంబంధ విషయాలలో నూ ఇలా కొన్ని తప్పనిసరి నియంత్రణ లు అవసరం అనుకొని ఏర్పరిచారు. అయితే పెళ్లి అనేది ఇద్దరు మనుషుల మధ్యన జరిగే తంతు ఇది క్షణ కాలం కోసం కాదు, జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం. మన భారత దేశంలో వివాహ చట్టం విషయంలో ఈ నియంత్రణ అనే అంశం చాలా జఠిలంగా ఉన్నది. ఇద్దరి మధ్య అవగాహన రాహిత్యం కలిగినప్పుడు కలిసి ఉండలేము అనుకున్నప్పుడు విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ పైన చట్టం చాలా ఆంక్షలని పెట్టింది. నిజమే సంసారం చేసి పిల్లల్ని కని,వాళ్ల బాధ్యత చూడవలసిన అవసరం ఉన్నటువంటి తల్లిదండ్రులు అని చెప్పబడే ఈ జంట విడిపోవడం వలన ఆ పిల్లలు కన్నవాళ్ళ ప్రేమకు దూరమవుతారు. ఇలా ప్రేమ కు దూరమైన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్లకే తెలియని ఒక రకమైన అసహనం ఒక రకమైన ద్వేష భావం వాళ్ళలో చేరుతుంది. వాళ్లే సమాజానికి పెద్ద నష్టం చేకూర్చే ప్రవర్తనతో ఎదుగుతారు. ఇది ఇటువంటి బాధిత వ్యక్తులను చూస్తే బయటికి కనిపించదు, చేతలలో కనిపిస్తుంది.
అసలు ఆ జంట విడిపోవడానికి కారణం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు నియంత్రణ అనేదే పెద్ద పాత్రను పోషిస్తుంది. ఈ నియంత్రణ అనేది చాలా విధాలుగా చాలా ప్రయత్నాలు చేసి వీళ్ళను విడిపోయే జంటగా చేస్తుంది. ఎంతో దగ్గర వాళ్ళయినట్టు ఎంతో ఆప్యాయత కురిపిస్తున్నట్టు ఉండే కుటుంబ సభ్యులే వీరి మధ్యన బేధాభిప్రాయాలు కలిగేలా మాట్లాడి, సందర్భాలను సృష్టించి వాళ్ళలో కలిగిన మనస్పర్ధలకు అగ్నికి ఆజ్యం లా తోడవుతారు. ఇవి ఋజువులు లేని నియంత్రణ లు. ఎప్పటికప్పుడు control system నడుస్తూనే ఉంటుంది. ఇరువైపులా కుటుంబాలు వీటికి ప్రేరణలు. ఇవే కుటుంబాలు సంయమనంతో వ్యవహరిస్తే ఎందరికో ఆదర్శం అవుతారు.
జీవితం ఎవరికి పూల బాట కాదు. అలా అని ముళ్ళబాటా కాదు. కానీ ఏవో కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు కొన్ని బాధలు కొంత దుఃఖము కలగకుండా ఎవరు బ్రతుకును కొనసాగించలేరు. ఇలాంటి ఇబ్బందులలోనే వాళ్ళ వాళ్ళ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించి ఉపాయంగా బయటపడాలి. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం సహజం. పిల్లలను కన్న తర్వాత వారితో పాటు కలిగే పనుల వల్ల వచ్చే ఇబ్బందులు సహజం. కనడం, పెంచడం పెద్ద బాధ్యత .ఇటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయంగా ఉన్నప్పుడే ఆ సంసారం సజావుగా సాగుతుంది. నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడం మొదల పెట్టారంటే ఇది endless discussions కు దారి తీస్తుంది. కనడం చాలా కష్టమైన పని కాబట్టి 9 నెలలు శిశువు బరువును మోస్తూ తన శరీరంలో కలిగే మార్పులను భరిస్తూ ఆరోగ్యాన్ని నియంత్రించుకోలేక సతమతమయ్యే ఆ స్త్రీ తల్లి స్థానానికి చేరేవరకు ఎవరికీ చెప్పుకోలేనన్ని బాధలను అనుభవిస్తుంది.ఆ బాధల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటుంది.ఈ విషయంలో పురుషుడి కంటే ఎక్కువ స్థానం స్త్రీ పొందుతుంది ఇది జగమెరిగిన సత్యం .అయినా కానీ నేను గొప్ప అంటూ వాదప్రతివాదాలకు బీజం వేశారంటే ఈ బీజం విషవృక్షంగా తయారై దుష్ఫలితాలను ఇస్తుంది. అట్లాగే పురుషుడు కూడా తండ్రిగా నేనే గొప్ప అని వాదించాడంటే కూడా కనిపించని విషాన్ని గుమ్మరించినట్టే! ఇక్కడే మొదలవుతుంది అహమహమిక భావన . అంటే నీ కంటే నేను గొప్ప అనే భావమన్నమాట. వీటితోటే చిక్కులు మొదలవుతాయి. ఇదే సమయంలో చాలా వైపుల నుండి నియంత్రణలు చెలరేగుతాయి.’ అత్త’,’మామ’ అనే పదాలు ఎంతో గౌరవం గా నిలవాల్సినవి. రెండు వైపుల నుండి ఈ అత్తగారు మామగారు నియంత్రణ అనే చట్రంలో తామే అన్ని చక్రాలై, చట్టాల వలలో ఈ జంట చిక్కుకునేదాకా తెస్తున్నారు. అందుకే ఎవరి మీద ఎవరి నియంత్రణ లేనప్పుడే అందరూ స్వేచ్ఛగా ఉండగలుగుతారు.
నియంత్రణ చాలా రకాలు. తల్లిదండ్రులు పిల్లలను నియంత్రిస్తుంటారు, ఉద్యోగిని అధికారి నియంత్రించడం,సహద్యోగులతో ఇదే భావనతో ఉండడం, తమ క్రింది వారిని వీరు నియంత్రించడం చూస్తుంటాం.ఇలాంటివి మరెన్నో! ఇవి ఎవరికి ఎక్కడ ఎప్పుడు లాభం చేకూర్చేవి కావు. అయినా సరే మనసు నియంత్రించుకోలేని మనుషులు కదా ఈ control కు బానిస అవుతుంటారు. కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలపై నియంత్రణ చాలా కష్టమైన పని. దీన్ని బట్టి చూస్తే నియంత్రణ కంట్రోల్ అనేది రెండు రకాల ఫలితాలను ఇస్తుంది అని అర్థమవుతుంది పైన చెప్పుకున్నదంతా చెడులు ప్రేరేపించేది ఈ అరిషడ్ వర్గాలను నియంత్రించుకోవాల్సిన ఈ నియంత్రణ ,కంట్రోల్ చాలా మంచిది అనీ తెలుస్తుంది. అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు . ఈ ఆరు శత్రువులు అంతఃశత్రువులు .ఇవి మనిషి లోపల గూడు కట్టుకొని ఉంటాయి. మనిషి లోపలి త్రికరణాలపై రాజ్యం చేస్తుంటాయి. వీటిపై నియంత్రణ control చాలా అవసరం.