‘వేద’మూలంగా మన ఋషులు అందించిన సైన్స్ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని కొన్ని గ్రంథాల నుండి ఆయా గ్రంథాలలో ఏమేమి శాస్త్రాలున్నాయో, వాటి ముఖ్యాంశాలను సేకరించి ప్రతివారం N. ఉమ గారు మనకు అందిస్తారు. మనం తెలుసుకుందాం, నలుగురికి తెలియజేద్దాం – సంపాదకులు.
1. అక్షర లక్ష – వాల్మీకి ఋషి:-
‘ అక్షర లక్ష’ అనేది సర్వశాస్త్ర సంగ్రహం. రామాయణ కర్త వాల్మీకి ఈ గ్రంథాన్ని రచించారు. ఇందులో రేఖా గణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలను రచించాడు.
ఖనిజ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, భూగర్భశాస్త్రం, గాలి ,విద్యుత్తులను కొలిచే ఎన్నో ప్రక్రియలు ఈ గ్రంథంలో వివరించాడు వాల్మీకి.
2. శబ్ద శాస్త్రం-ఖండిక ఋషి :-
సృష్టి లోని అన్ని రకాల ధ్వనులను 5 అధ్యాయాలలో కృత్రిమంగా కూడా ఎలా సృష్టించాలో ఈ గ్రంథంలో వివరించడమే కాకుండా ఆ ధ్వనుల స్థాయి, వాటి వేగం ఎలా కొలవాలో కూడా స్పష్టంగా వివరించాడు ఖండిక ఋషి.
3.శిల్ప శాస్త్రం – కష్యప ఋషి .
ఈ శిల్ప శాస్త్రం లో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ శిల్ప శాస్త్ర గ్రంథం లో 307 రకాల శిల్పాలు,107 రకాల విగ్రహాలు తయారు చేసే విధానం వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించారు.అంతే కాకుండా ఆలయాలు, రాజభవనాలు,చావడీలు మొదలైన అన్ని రకాల నిర్మాణాల విషయాలు 1000 కి పైగా వివరించారు.ఈ విషయం లో మయుడు, విశ్వామిత్రుడు, మారుతి మొదలైన ఋషులు చెప్పిన ఎన్నో అంశాలు ఈ శిల్ప శాస్త్రం లో రచించి మనకందించారు.
( సశేషం)- –