మానవత….

కథ

   అరుణ ధూళిపాళ

అద్భుతమైన బంగ్లా అది..
చూపరులను అక్కడే కట్టిపడేస్తుంది. మొత్తం విద్యుద్దీపాలతో అలంకరించబడి ఆరోజు ఇంకా అందంగా కనిపిస్తోంది.. ఆ వెలుగులు చుట్టుపక్కల అంతా పాకి పున్నమి వెన్నెల విరబూసినట్టుగా ఉంది. ప్రత్యేకంగా తయారు చేయబడిన కళా నైపుణ్యంతో భవనం నిండా ఎటు చూసినా ఐశ్వర్యం తొణికిసలాడుతున్నది. మామిడి తోరణాలు, పూల దండలు, దీప శిఖలు అడుగడుగునా దర్శనమిస్తూ భక్తిభావాన్ని గుబాళిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలి పర్యవేక్షణ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది అన్ని చోట్లా….అవును శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి మరి !
ఇంటి యజమాని విద్యాధర్ అమితమైన భక్తి కలవాడు. వాళ్ళ నాన్నగారు రాజారావు హయాం నుండి ఈ ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దానిలో ఎటువంటి లోపం లేకుండా ప్రతీ సంవత్సరం అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఆ ఉత్సవాలను చూడడానికి జనాలు ఉవ్విళ్లూరుతారంటే అతిశయోక్తి కాదు. మొదటినుండీ బాగా ఆస్తిపరులు కావడం మూలంగా విద్యాధర్ ఎలాంటి లోటు లేకుండా గారాబంగా పెరిగినప్పటికీ దానికి ఏమాత్రం తీసిపోకుండా వస్త్రవ్యాపారంలో పెట్టుబడి పెట్టి తమ ఆస్తిని రెండింతలు పెంచాడు.
విద్యాధర్ కి ఇద్దరు కొడుకులు..తండ్రి క్రమశిక్షణలో ఆరితేరి ఆయన వ్యాపారంలో భాగస్వాములై తండ్రికి తగ్గ తనయులు అనిపించారు. పెద్ద కొడుకు వినయ్ కి గత ఏడాది వివాహం జరిగింది.చిన్న కొడుకు వినోద్ కి మేనరికం ఉంది. ఆ అమ్మాయి ఎమ్ బిఎ లో చేరడం వల్ల అది పూర్తయ్యాక వివాహం అనుకున్నారు. ఇక కోడలు వచ్చాక జరుగుతున్న మొదటి నవరాత్రులు కాబట్టి చుట్టపక్కాలకు, స్నేహితులకు ఆత్మీయులందరికీ ఆహ్వానం పలికాడు. ఎవరి వీలును బట్టి వాళ్ళను రావాల్సిందిగా ఫోన్లు చేసి మరీ చెప్పాడు. ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు, ప్రసాదాలు పంచడం, ఆ తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు…తిరిగి సాయంకాలం ప్రదోష పూజలు, భజనలు, ప్రసాదాలు, అల్పాహార విందు. ఈ రకంగా ప్రణాళిక సిద్ధం చేయబడింది..దీంతో పాటు ప్రతినిత్యం పేదవారికి చేసే అన్నదానం మరీ ప్రత్యేకం. వస్ట్రవ్యాపారి కావడం వల్ల వస్త్రదానం కూడా ఇంకో ప్రత్యేకత. ఈ విషయంలో కొడుకులిద్దరూ ఎటువంటి అడ్డు చెప్పరు. పైగా ఎంతో శ్రద్ధగా, నియమంగా పూజల్లో పాల్గొంటారు.
విద్యాధర్ ఇంటి పక్కన దాదాపు అర ఎకరం ఖాళీ జాగా ఉంటుంది. ప్రత్యేకంగా నవరాత్రుల కోసమే దాన్ని ఖాళీగా ఉంచుతారు. ఆ రోజు ఉదయం వేదోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇంకో వైపు హోమాలు జరుగుతున్నాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు. భక్తి ప్రపత్తులతో సంబరాలు జరుగుతున్నాయి. విద్యాధర్ భార్య శ్రీవాణి భర్తకు తగ్గ ఇల్లాలు. చక్కని చీరకట్టు, నుదుట ఎర్రని కుంకుమబొట్టు, కంటి చివరలను కలుపుతూ సన్నని కాటుక రేఖ, పెదవులపై చెరగని చిరునవ్వు, వయసు తేడాలు లేకుండా అందరితో ఆత్మీయ పలకరింపు, హుందాతనం ఆమెకు పెట్టని ఆభరణాలు. పరోపకారం ఆమెకు ప్రాణం. మానవతకు నిలువెత్తు నిదర్శనం అన్నట్టుంటుంది. ఆమెను చూస్తే ఎవరికైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. విద్యతో పాటు వినయం ఆమె సొత్తు. భర్తకున్న భక్తిలో ఆమెకు ఒక పాలు ఎక్కువే అని చెప్పాలి. అందుకే పనులు చేసేవాళ్ళు ఎంతమంది వున్నా అన్ని విషయాలను దగ్గరుండి స్వయంగా చూసుకుంటుంది.

******

వంటశాలలో విరామం లేకుండా నైవేద్యాలు, ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. ఆ ఇంటి వంట మనిషి మల్లి
అన్యమనస్కంగా, అసహనంగా పని చేస్తోంది ఆరోజు. మనసు మనసులో లేదు ఆమెకు. కాలుగాలిన పిల్లిలా వంటశాలనుండి హాలులోకి ఇటూ అటూ తిరుగుతోంది. రోజూ ఇంట్లో ఉండే పనివాళ్లు నలుగురు, మల్లితో పాటు వుండే మరో వంట మనిషి కాకుండా మరో నలుగురు వంటవాళ్లను, నలుగురు పనివాళ్లను ఈ పదిరోజుల కోసం పిలిపించారు. ఇంత హడావిడిలో మల్లి ధ్యాసంతా ఇంటి మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జనారణ్యంలోంచి బయటపడతానా అన్నట్టు తొందరగా టైం గడిస్తే బాగుండు అనుకుంటూ మధ్యమధ్యలో గోడ మీదున్న వాచీ కేసి చూస్తోంది. తొందరగా కదలని ముల్లు మీద విసుక్కుంటోంది కూడా. గత కొద్దిరోజులుగా తన ఇంటి వ్యవహారం ఆమెను కుదురుగా ఉండనీయడం లేదు.
మల్లి భర్త చంద్రం. వ్యవసాయ పనుల్లో కూలీగా వెళ్తుంటాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లల తర్వాత
ఆపరేషన్ చేయించుకుంటానంటే వారసుడుగా ఒక మగ నలుసు కావాలని చంద్రం తల్లి భీష్మించుకుంది. తల్లి నోటికి భయపడి చంద్రం ఏమీ చేయలేక “ఎట్లా పోషిస్తామన్న” మల్లిని సముదాయించాడు. మూడవసారి కూడా ఆడపిల్ల పుట్టడం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బిడ్డ పుట్టిన కొన్నాళ్ళకే తల్లి మరణించింది. ముగ్గురూ చిన్నపిల్లలు కావడం వల్ల వారి ఆలనా పాలనా వీళ్ళకు చాలా కష్టమయ్యేది. పెద్దపిల్ల పుట్టిన ఆరు నెలలకు విద్యాధర్ ఇంట్లో వంటకు కుదిరింది మల్లి. సహజంగా నెమ్మదస్తురాలు, ఒళ్ళు దాచుకోని తత్వం గల మల్లి వాళ్ళింట్లో మనిషిగా మెలగసాగింది. విద్యాధర్ కుటుంబమంతా మల్లి పట్ల ఎంతో ఆత్మీయత కనబరిచేవారు. తరువాతి రెండు కాన్పుల సమయంలో కొంతకాలం పనికి వెళ్ళకున్నా శ్రీవాణి ఆదరణతో జీతం అందుకుంది మల్లి. మూడో కాన్పు వద్దని, ఆడపిల్లయినా, మగ పిల్లవాడు అయినా ఈ రోజుల్లో ఒకటేనని శ్రీవాణి ఎంతో నచ్చచెప్పింది. అయినా వినక ముసలావిడ పంతం నెగ్గించుకుంది.

*****
చంద్రానికి పదిహేను రోజుల క్రితం జ్వరం తగులుకొంది. దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రం నుండి ఏవో మాత్రలు తీసుకువచ్చి వాడడంతో కొంత నెమ్మదించింది. వెంటనే చిన్నదానికి జ్వరం అంటుకొంది. మందులు వేస్తుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. నిన్నంతా పిల్ల ఏమీ తినలేదు. పెద్ద డాక్టరుకు చూపిద్దామంటే డబ్బు లేదు. అమ్మగారిని అడిగితే ఇస్తుంది. కానీ ఇప్పటికే ఆమెకు తన కుటుంబం చాలా ఋణపడి ఉంది. ఇంకా కూడా అడగడానికి తనకు నోరు రావట్లేదు. “గోరు చుట్టుపై రోకలి పోటు” అన్నట్టు చాలా రోజుల తర్వాత పనికి వెళ్లిన చంద్రం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడని
కొంతకాలం యజమాని పనికి రావద్దన్నాడని పక్కింటి కనకయ్య ఇంటికి తీసుకొచ్చాడు. పనికి వెళ్లలేదు కాబట్టి కూలీ డబ్బులు లేవు. మల్లికి ఏమీ పాలుపోవడం లేదు. ఇక్కడి నుండి ఆహారం ఏదో ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు పెట్టగలుగుతుంది కానీ వైద్యం ఎలా చేయించగలుగుతుంది? ఇక్కడున్న పరిస్థితిలో వారం నుండి ఇంటికి తొందరగా పోవడం కూడా అవడం లేదు.. ఇవాళ తెల్లవారుజామున వచ్చినప్పటినుండీ పని తెమలలేదు. వచ్చే ముందు చంటిది వద్దని మారాం చేయడం, వదిలించుకుని వస్తుంటే దీనంగా చూడడం కళ్ళల్లో కదలాడుతోంది. చంద్రం చూసుకుంటాడనుకుంటే అతని ఆరోగ్యం కూడా బాగా లేదాయె!! పోనీ ఇంతమంది పనివాళ్లు వున్నారు కాబట్టి విషయం చెప్పి కాస్త ముందు వెళ్లిపోతానని అమ్మగారికి చెప్పాలన్నా అటు పూజలు, ఇటు అతిథులతో శ్రీవాణి ఒక క్షణం కూడా తీరికగా ఉన్నట్టు అనిపించలేదు.
అమ్మవారి నామస్మరణతో, భజనలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. నిస్సహాయంగా చూస్తూ ఉంది మల్లి. రాత్రి తొమ్మిది గంటలు దాటింది.. జనం పలుచబడ్డారు. అందరికీ వీడ్కోలు పలికి అలసిన ముఖాలతో ఇంట్లోకి వచ్చారు కుటుంబ సభ్యులు. మెల్లిగా శ్రీవాణితో “అమ్మా! నేను ఇంటికి వెళ్లనా?” అని అడిగింది సందేహంగా మల్లి. “తిని వెళుదువు గానీ” అన్నది శ్రీవాణి. “లేదమ్మా వెళ్ళాలి” అంది ఉబికి వస్తున్న కంటి నీటిని బయట పడకుండా గద్గద స్వరంతో.. “చెప్పేది నీకే..నీవు తిని ఇంట్లో వాళ్లకు కూడా పట్టుకెళ్ళు” అన్నది శ్రీవాణి ఆదేశిస్తూ..చేసేది లేక గుడ్లలో నీరు కుక్కుకుంటూ
ఏదో తిన్నాననిపించి ఇంటికి బయలు దేరింది. ఇల్లు చాలా దగ్గరే. వెళ్లేసరికి చిన్నది నవ్వుతూ తండ్రితో ఆడుతూ కనిపించింది. చంద్రం కూడా ఉత్సాహంగా కనిపించాడు. ఏమీ అర్థం కాలేదు మల్లికి. మల్లిని చూడగానే చంటిదాన్ని పక్కకు దింపి “మల్లీ! శ్రీవాణమ్మ ఒక మనిషిని పంపి డాక్టరును ఇంటికి పిలిపించిందే.. ఆయన మన ఇంట్లనే
నన్ను, పాపను చూసి మందులు రాసిచ్చి ఆయనతో ఏదో చెప్పిండు. ఆయన వెళ్లి మందులు, కొన్ని పండ్లను కూడా తెచ్చి ఇచ్చిండు. అట్లనే అమ్మ ఇచ్చిందని, ఖర్చులకు వాడుకొమ్మని 500 రూపాయలు చేతుల వెట్టిండు. ఆయమ్మను బగవంతుడు సల్లగ సూడాల” అని చెప్పుకుంటూ పైకి చూస్తూ చేతులు జోడించాడు.
అయోమయంగా చూస్తూ జరిగిందేమిటో అర్థం కాక మౌనంగా తలూపి తను తెచ్చింది వాళ్లకు పెట్టింది. ఆ నలుగురూ ఆదమరచి నిద్రపోయారు. ఏం జరిగిందో తెలియక పరిపరి విధాల ఆలోచనలతో మల్లికి రాత్రంతా జాగారమే అయ్యిండి. పొద్దున్నే లేచి పనిలోకి వెళ్లిన మల్లి శ్రీవాణి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె దుఃఖమంతా తీరేదాక మల్లిని పొదివి పట్టుకున్న శ్రీవాణి మల్లికి విషయం అర్థమయ్యేలా చెప్పసాగింది. “మల్లీ! కొద్దిరోజులుగా నీవు బాధలో ఉండడం నేను గమనించాను. చంద్రానికి జ్వరమని చెప్పావు. కానీ ఏదో తెలియని బాధ నీ మనసులో ఉన్నట్టు నాకర్థమైంది. నాకు చెప్పడానికి సందేహిస్తున్న విషయం పసిగట్టాను. ఈ నవరాత్రి బిజీలో అంతగా పట్టించుకోలేదు. కానీ నిన్న అమ్మవారికి నవరాత్రులు మొదలైనా నువ్వు సంతోషంగా లేవు. లేకుంటే మా అందరికంటే ఎక్కువ నువ్వే హడావుడి చేసేదానివి. అందుకే నువ్వు చెప్పకపోయినా మీ ఇంటికి మనిషిని పంపి విషయం తెలుసుకుని డాక్టరును పంపించి మందులు ఇప్పించాను. నువ్వు మా ఇంట్లో దానివి. నీకు కష్టం వస్తే ఊరుకుంటానా చెప్పు? అలా ఊరుకుంటే నేను చేసే పూజలకు అర్థం లేదు. మనిషిని మనిషిగా చూడని పూజను ఆ భగవంతుడు కూడా స్వీకరించడు. ఎన్ని ఆడంబరాలకు పోయినా మానవత్వమే మనిషికి అసలైన అలంకారం. ఇంకెప్పుడూ నా దగ్గర నీకు మొహమాటం ఉండొద్దు” అని చెప్పింది. “ఇంకా చూస్తావేం! నాకో కప్పు కాఫీ ఇచ్చి పని మొదలుపెట్టు” అంటూ నవ్వింది.
‘అలాగే అమ్మా!’ అని శివరాత్రి లాంటి తమ బతుకుల్లో నవరాత్రి ఉత్సవం నింపిన శ్రీవాణిని కళ్ళప్పగించి చూస్తూ ” తల్లీ! వచ్చే జన్మలోనైనా ఈ అమ్మ రుణం తీర్చుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వమంటూ” ఆ అమ్మవారికి నమస్కరించుకుంటూ కొంగును లాగి బొడ్లో దోపి, రెండవరోజు దేవీ నవరాత్రోత్సవ నైవేద్యం చేయడం కోసం ఉద్యుక్తురాలైంది మల్లి కొత్త ఉత్సాహంతో, ప్రశాంత చిత్తంతో….

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొండంత పండుగ

“భావ ప్రకంపనలు”.