కొండ కోనల్లో పూచేటి తంగేడు పూలల్ల..
కొండకూతురుని కొలిచే కొండంత పండగ!
చల్లని గంగమ్మలో గౌరమ్మను ఓలడించి
గంగా -గౌరిల చెలిమి పెంపొందించు పర్వము!
ఆ ఇద్దరి చలచల్లని దీవెనలు పొందేటివేళ! ఆనందమది వర్ణింప నలవి కాని శోభ!
ఆత్మభవుడికి అచలాత్మజతో కల్యాణమే జరిపించి,
అర్పణలు, పలు హారతులిచ్చి ఆశీస్సులెన్నో ఆశించి,
అర్ధనారీశ్వరులనుతలచి,
బతుకమ్మగ కొలచి – నిలుపుకొను వేడుక!
ఏడాదికోసారి వచ్చేటి అపురూప
వాణి.. విజయ.. విష్ణువల్లభల
వినుతించు వైభవము !
ఊరంతా ఏకమై ఆడి-పాడి ఏకతా భావమే వెలుబుచ్చు లక్ష్యమే సాధించు పరంపర కొనసాగించు ఉత్సవ సంబరము!
ఉన్నదానితో సంతృప్తి పొందమని
ఊరకే ఉన్న దాంట్లో ఇచ్చి పుచ్చుకొను ఆచారమే బోధించి,
ఉన్నత సంస్కారాల నేర్పించు
ఉపకారమెంతో చేయు ఉద్దవము!
వెలదులకెంతో ఆనందమే కల్పించి,
ఉచిత రీతి గౌరవించుకొని పదినాళ్ళ పండుగలో బంధాలు
నిలుపుకొని-పార్వతిని కొలిచి నిలుపుకొని, భద్రంగా నిలిచేటి పర్వణి!
ఆహా ! దార్శనికులెంతో సహృదయత చాటించి,
ఆటపాటలలో మూర్తిమత్వమే బోధించు ఈరీతి కొలువులో ఆనందమేకాదు! ఐశ్వర్యమే హెచ్చు!
పదివేల నూరువేల ఏండ్లు మనుగాక ఈ పర్వము!
మంగళమ్ములు చాల మగువలకు- పిల్లలకు!
మంగళాశాసనములెన్నో మగవారికెపుడునూ!