”ఎవరావిడ?” హెచ్చెమ్ రూములోకి వెళ్తున్న ఆమెని చూసి కొత్త మొహంలా కనిపించేసరికి రెండు వారాల ట్రైనింగుకి వెళ్ళివచ్చిన అరుంధతి అటుగా వస్తున్న క్లర్కు సరితని అడిగింది.
”అనాధాశ్రమం నడుపుతోందట. ఆ పిల్లల్ని మన స్కూల్లో చేర్చింది. ఫీజు కట్టటానికి వచ్చిందేమో” అంది సరిత.
నల్లపూసల దండ తెల్లని మెడని చుట్టుకొని ప్రత్యేకంగా కన్పిస్తోంది. కనీ కన్పించని సన్నటి చైను కూడా ఉన్నట్లుంది. చేతులనిండా ఎర్రని మట్టి గాజులు. చూడగానే మధ్యతరగతి శోత్రీయ కుటుంబానికి చెందినట్లుగా ఉంది. ఆ స్కూల్లో అగ్రవర్ణాలకు చెందిన పిల్లలు అతి తక్కువ. తొంభై అయిదు శాతం దళిత, మైనారిటీ, వెనుకబడిన కులాలకు చెందిన కార్మిక శ్రామిక పిల్లలే. అందుకే అరుంధతికి ఆమెని చూస్తే సందేహం కలిగింది.
కొత్తగా చేరిన గంగా, శ్యామలా చకచకా లెక్కలు చేస్తూ అరుంధతి మెప్పును పొందుతున్నారు. వాళ్ళు ఆశ్రమం పిల్లలని తెలిసి వారి తెలివితేటలకూ, వారి జీవనస్థితికీ గల వైరుధ్యాన్ని తలచుకొని వారిద్దరి మీద ప్రత్యేకమైన ఆదరణ కలుగుతూ ఉండేది ఆమెకి.
ఆశ్రమానికి చెందిన ఒక పాతికమంది వరకూ పిల్లలు వివిధ తరగతులలో ఉన్నారు. అందరూ బాగా చదువుతారు. బహుశా స్కూలునుండి వెళ్ళాక శ్రద్ధగా చదివిస్తారేమో అనుకునేవారు టీచర్లు.
”గంగా! హాస్టల్లో రోజూ ఎంతసేపు చదివిస్తారు?” అడిగింది ఒకసారి అరుంధతి.
”చదవటానికి ఒక్కొక్కరోజు టైమే ఉండదు టీచర్, అందరికీ పనులు ఉంటాయి. అక్కలు వంట చేస్తారు. గిన్నెలు తోమటం, బట్టలు ఉతుక్కోవటం, రూములు శుభ్రం చేయటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కోపని ఉంటుంది. అన్నీ అయ్యాక రాత్రికి హోమ్ వర్కు చేసుకుంటాం. పరీక్ష ఉన్నరోజు తెల్లవారు జామున లేచి చదువుకుంటాం” అంది గంగ.
”ఆ పనులకి పనివాళ్ళెవ్వరూ లేరా?” అంది ఆశ్చర్యపోతూ.
”వార్డెను మేడం, ఆయా ఉంటారు. వాళ్ళు కూరలు, సరుకులు తెస్తుంటారు” అని శ్యామల అందుకొని చెప్పింది.
”అంత పని చేస్తూకూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారే” మెచ్చుకుంది అరుంధతి.
”పరీక్ష పెట్టి మంచి మార్కులు వస్తేనే మమ్మల్ని హాస్టల్ లో చేర్చుకుంటారు” అమాయకంగా చెప్పింది గంగ.
అరుంధతికి మరింత ఆశ్చర్యం కల్గింది. ‘అనాధాశ్రమంలో చేర్చుకోవటానికి కూడా ఎంట్రన్సు పరీక్ష లేమిటి చెప్మా!’ అని తోటి ఉపాధ్యాయినితో ఈ విషయాలన్నీ చెప్తూ అంది అరుంధతి.
”మరి తెలివైన పిల్లల్ని చేరిస్తేనే కదా వాళ్ళు మంచి మార్కులతో పాసై వీరి సమాజసేవకి గుర్తింపునిస్తారు” అంది వ్యంగ్యంగా మరో ఉపాధ్యాయిని. అరుంధతికి అది కూడా నిజమే అనిపించింది.
ఆశ్రమం పిల్లలంతా వారి వారి తరగతులలో ప్రథమ శ్రేణిలోనే ఉంటున్నారు. పోటీలలో బహుమతులూ సాధిస్తున్నారు.
మరో రెండు మూడేళ్ళకి – రయ్యిమంటూ పెద్ద శబ్దంతో ఖరీదైన స్కూటర్ని గేటుదాటి స్కూలు ఆవరణలోపలివరకూ నడుపుకుంటూ వచ్చిన ఆమెనీ, ఆమె అమర్యాదకరమైన తీరునీ విసుగుకుంటూనే ఆమె కట్టూ బొట్టూ తీరులో మార్పుని గుర్తించి ఆశ్చర్యపోవటం టీచర్ల వంతు అయింది. అక్కడున్న వారెవ్వర్నీ పట్టించుకోకుండా తిన్నగా ఆఫీసు రూములోకి వెళ్ళిపోయింది ఆమె.
ఒకరోజు ఆశ్రమం విద్యార్థి మధ్యాహ్నానికల్లా తీవ్ర జ్వరంతో సోలిపోతుంటే వాణ్ణి ఆశ్రమంలో దింపిరమ్మని ఒక టీచర్ని పంపించారు హెడ్ మిస్ట్రెస్. వెళ్ళి వచ్చిన తర్వాత టీచరు చెప్పిన మాట విని నివ్వెరపోయారు అందరూ.
”జ్వరంతో వున్న పిల్లాడిని తీసుకెళ్తే చాప, దుప్పటి పరిచి పడుకోబెట్టమన్నారు అక్కడి వార్డెన్. ‘జ్వరంతో ఉన్న పిల్లాడిని క్రింద ఎందుకండీ. అక్కడ పరుపులు ఉన్నాయి కదా!’ అన్నాను. ఒక మూల ఫోం పరుపులు ఒక దానిపై ఒక్కటి ఓ ముప్పయి వరకూ ఉండటం గమనించి అన్నాను.
‘తర్వాత వేస్తాం’ అంటూ ఓ మాత్ర తీసుకొచ్చి వాడిచేత మింగించి మీరిక వెళ్ళొచ్చు అన్నట్లు చూసింది.
మరిక ఏమీ అనలేక ‘డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళండి’ అని చెప్పి వచ్చేసాను. ఇంతకు ముందే పదోక్లాసులోని పద్మని అడిగితే ఎవరైనా విఐపీ విజిటర్లు వచ్చినప్పుడే ఆ పరుపులూ, కొత్త దుప్పట్లు వేస్తారని చెప్పింది. ”ఇది చాలా అన్యాయం కదా” అంది ఆ టీచర్.
అందరూ బాధపడ్డారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు.
ఒకసారి ఆ ఆశ్రమం నడిపే సరోజిని ఏర్పాటుచేసిన రాజకీయవేత్త సన్మాన సమావేశం కార్డు చూపించి ”ఎవరికైనా వీలుంటే వెళ్ళి రండమ్మా” అన్నారు హెడ్ మిస్ట్రెస్.
కుతూహలంతో వెళ్ళింది అరుంధతి. సభ యింకా ప్రారంభంకాలేదు. ఆశ్రమం పిల్లలంతా మంచి బట్టలు ధరించి గుంపుగా వచ్చారు. అరుంధతిని చూసి నమస్కారం పెట్టి ఆ పక్క సీట్లలోనే కూచున్నారు.
సభ ప్రారంభమైంది. నగరంలోని ఆర్థికంగా, అధికారికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గుర్తింపు వున్న పెద్దలెందరో వేదిక మీదికి ఆహ్వానింపబడ్డారు. ఆశ్రమ నిర్వాహకురాలు సరోజిని వివిధ రంగాలలో ప్రసిద్ధులకు సత్కారాలు చేసింది.
ఆ కార్యక్రమం జరిగాక ఆశ్రమ పిల్లలందర్నీ వేదిక మీదికి రమ్మని ఆహ్వానించింది. వీళ్ళందరినీ చూసి వేదికమీది పెద్దలందరూ సరోజినికి అనాథలపట్ల గల ఆదరణనీ, అంకిత భావాన్నీ పలు విధాల ప్రస్తుతించారు.
ఆశ్రమం నిర్వహించుతున్న యింటి స్వంత దారుడైన ప్రముఖుడు సరోజిని సేవా నిరతికి ముగ్ధుడై ఆ యింటిని వారికి శాశ్వతంగా ఇవ్వదలుచుకొన్నట్లు వేదికమీదే ప్రకటించాడు.
మరొక అధికారి తన శాఖ తరుపున ఇరవై వేల చెక్కుని బహుమతిగా ఇచ్చాడు.
రాజకీయ వేత్త ఒకడు ప్రభుత్వం తరుపున సామాజిక సేవకు అవార్డును ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ విధంగా సత్కారాలందుకొన్న ప్రముఖులు అందరూ ప్రశంసలతో బాటూ తమ దాతృత్వాన్నీ ప్రకటించుకున్నారు.
పిల్లలందరూ వేదిక దిగి తిరిగి తమతమ స్థానాల్లోకి వచ్చి కూర్చున్నారు.
ఇక అక్కడ ఉండలేక అరుంధతి లేచి బయటికి నడిచింది. బస్టాపులో నిలుచున్నంతసేపూ మనసంతా పచ్చిగా అయిపోయింది. బస్సెంతకూ రాలేదు కానీ అరుంధతి తన ముందునుంచే వెళ్ళిన కారులో సరోజిని ఉండటం గమనించింది.
ఆ ఏడాది చివర్లో ఫీజులు కట్టని వాళ్ళ జాబితాని అరుంధతికి యిచ్చి, ప్రతీ తరగతిలోనూ ప్రకటించి, వసూలుచేసే బాధ్యత అప్పగించారు మేడమ్. చాలావరకూ ఆశ్రమ విద్యార్థులే ఉన్నారు ఆ జాబితాలో. తప్పదు కనుక అన్ని తరగతులలో చెప్పి వచ్చింది.
మరి రెండు రోజుల తర్వాత ఆశ్రమ వార్డెను ఒక చెక్కు తీసుకొని వచ్చి అరుంధతికి యిచ్చి అందరి ఫీజులు కట్టి రసీదులు రాయించమంది. ఆ చెక్కు ఒక కులసంఘం వాళ్ళు యిచ్చినది. ఆ కులానికి చెందినవాళ్ళు కొందరే వున్నారు. మొత్తం ఆశ్రమ విద్యార్థుల ఫీజుకన్నా అందులో సొమ్ము తక్కువగా ఉంది. అదే విషయం ఆమెకి తెలియజేసింది అరుంధతి.
”ఆశ్రమం పిల్లలకి కన్సెషను ఉంటుంది కదా! హెచ్చెమ్ని అడగండి” అంది వార్డెను.
”ఇది ఎయిడెడ్ స్కూలు కనుక ఫీజులు అతి తక్కువగా ఉంటాయి. అందులో యింకా కన్సెషన్ ఏమిటి?” ఖచ్చితంగా చెప్పింది. సభకి వెళ్ళివచ్చాక వాళ్ళమీద కోపం అనుకోకుండానే అరుంధతి గొంతులో ధ్వనించింది.
చెక్కు తీసుకొని హెచ్చెమ్ రూము వైపు నడిచింది అరుంధతి. ఆమెతోపాటే వార్డెను కూడా వస్తోంటే ”ఈ మధ్య సరోజనిగారు రావటం లేదేమి?” ఆరాగా ప్రశ్నించింది అరుంధతి.
”సరోజినిగారు మాదాపూర్ లో యిల్లు కట్టుకుంటున్నారు. ఆ పనిలో బిజీగా వున్నారు. అదీగాక గృహప్రవేశం అయ్యాక కూతురి పురిటికి స్టేట్సు వెళ్ళబోతున్నారు. వీసా పనుల్లో తిరుగుతున్నారు.” అంది ఆమె.
”మరైతే ఆశ్రమాన్ని యిక్కడే ఉంచుతారా? షిఫ్టు చేస్తారా?” అంది అరుంధతి.
”లేదు. మేము చూసుకుంటున్నాం కదా” అంది వార్డెను.
హెచ్చెమ్ తో విషయం చెప్పి చెక్కు ఆవిడకి యిచ్చి అరుంధతి రూము నుండి బయటకి వచ్చింది. అంతలో లాంగ్ బెల్ అయ్యేసరికి స్టాఫ్ రూములో బేగు సర్దుకొని స్కూలు గేటులోంచి బయటకు దారితీసింది.
బస్టాపుకు వెళ్ళే దారిలో ఒక శవయాత్ర ఎదురైంది అరుంధతికి. శవంమీద పేలాలతో పాటు చిల్లర పైసలుకూడా విసుర్తుండగా శవయాత్ర సాగుతోంది. రోడ్డుమీద పేదపిల్లలు నేలమీద పడిన చిల్లర పైసల్ని ఎగబడి ఏరుకుంటున్నారు.
ఆ దృశ్యాన్ని చూస్తూ నడుస్తున్న అరుంధతికి అకస్మాత్తుగా సరోజిని గుర్తుకు వచ్చింది.
(మే, 2015)