పకృతి ఆరాధన మన మనుగడకు జీవనాడి . ఆ ప్రకృతికి దూరమైన ప్రస్తుత తరం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటోందో మనందరికీ బాగా తెలుసు
మన సంప్రదాయంలో ఒక భాగం ప్రకృతి ఆరాధన . దాన్నే వెనకటికి వేడుకలుగా , పండుగలుగా జరుపుకునే ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి , హోలీ , ఉగాది , వినాయక చవితి ఇవన్నీ ప్రకృతి ఆరాధనలో భాగాలే . ఈ అన్నిటికీ మణిపూస తెలంగాణా ప్రాంతంలో స్త్రీ లందరూ వేడుకగా జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ బతుకమ్మ పండుగ. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ . ఈ నవరాత్రులలో అమ్మవారిని నియమనిష్టలతో కొలుచుకోవడం తరతరాల ఆచారం.
ఇదే దేవి ఆరాధన ప్రకృతి ఆరాధన అనే మరో రూపంతో తెలంగాణలో జానపద సుగంధాలను సంతరించుకుని ఆటపాటలతో అమ్మవారిని కొలిచే బతుకమ్మ పండుగగా రూపు దిద్దుకున్నది .
ప్రకృతి ఆరాధన మనిషి మనుగడకు రాజద్వారం అని మనకన్న మన పెద్దవారికి బాగా తెలుసు.
అందుకే బతుకమ్మ పండుగ ద్వారా ప్రకృతికి పట్టాభిషేకం చేశారు.
ఈ పండుగలో ప్రకృతే దేవత. చిన్న పిల్లల దగ్గరనుంచి , పెద వాళ్ళ దాకా మంచి దుస్తులను ధరించి , బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ , పాటలను పాడుతూ వలయాకారంగా తిరుగుతారు. పోటీలు పడి పెద్ద పెద్ద బతుకమ్మలను సి ద్ధం చేస్తారు. వీటిని తయారు చేయడం కాదు పేర్చడం అంటారు ప్రకృతిలో దొరికే రకరకాల పూలను , ఆకులను తెచ్చి ,అందంగా పేరుస్తారు. తొమిది రోజులు జరిపే ఈ పండుగను పార్వతీ దేవి పుటినింటికి వచ్చినట్లు జరుపుకుంటారు . తొమ్మిదవ నాడు చె రువులోనో ,కొలనులోనో నిమజ్జనం చేస్తారు . పార్వతి పరమ శివుని వద్దకు వెళ్ళినట్లు భావిస్తారు.
అసలు బతుకమ్మను పేర్చడమే ఓ కళ . కళ అని ఎందుకన్నానంటే ఇది బయటి నుంచి చూడడానికి అందముగా ఉంటే సరిపోదు. నీటిలో వదిలినప్పుడు విచ్చిపోకుండా పూల బుట్టలా అలా అలా సాగిపోవాలి .
సాధారణంగా ఇత్తడి , లేకుంటే అల్యూమినియం పళ్ళెంలో మధ్యలో వెడల్పాటి ఆకులు వేసి , వాటి పయి న వరుసలుగా ,గోపురంలా వచ్చేలా పూలను పేరుస్తారు. ఇది రంగుల హరివిల్లులా కనిపిస్తుంది. దీనికి సాధారణంగా గునుగు , గన్నేరు , తంగేడు ,గుమ్మడి , పొద్దుతిరుగుడు ,బీర పూలతో పేరుస్తారు. ఇందులో సీతమ్మ జడ కుచ్చులు అనే ఎరుపు పూలను తప్పక చేరుస్తారు. మధ్యలో ఉండేది పొట్ట. దీనిలో పైన వాడిన పూల కాడలను ఆకులను balance కోసం వేస్తారు.
ఆటపాటలు లేకుంటే బతుకమ్మకు ఆందమేది ? సాధారణంగా ఓ పెద్ద బతుకమ్మను ,దా నితోబాటు ఓ చిన్న బతుకమ్మను కూడా పేరుస్తారు. శిఖరంలో పసుపుగౌరీని ఉంచుతారు. వీట న్నిటినీ ఓ పీటమీద పెట్టి దేవుని వద్ద పెడతారు. దీపాన్ని వెలిగించి ,నైవేద్యం పెడతారు. ఒక్కో రోజు ,ఒక్కో రకం నైవేద్యం .
అక్కడినుంచి వాకిట్లోకి తెచ్చి ,ఇంట్లోని వాళ్ళందరూ పాడుతూ ఆడతారు.ఆ తరువాత విశాలమైన ప్రదేశంలోనో ,గుడి ముందరో ఆందరు కలిసి మరి కాసేపు పాటలు పాడుతూ ఆనందంగా వేడుక చేసుకుంటారు.అక్కడ ఆందరూ కలిసి దగ్గరలోని చెరువో ,నదియో ,కాలవో ,కొనేరో చేరుకుని,ఆంద రు కలిసి మరి కాసేపు ఆడి ,ఆ నీ ళ్ళలో బతుకమ్మలను వదిలి ,నమస్కారం చేసుకుని ,తెచ్చు కున్న నైవేద్యాన్ని ఇతరులతో పంచుకుని , అలసిన శరీరంతో ,మురిసిన మనసులతో ఇల్లు చేరుకుంటారు. కొందరు ఉత్సాహవంతులు ఇంటికొచ్చాక కొలాటాలు కూడా ఆడతారు.
జానపద సంగీతంలో బతుకమ్మ పాటలది ప్రత్యేకస్థానం . ఈ పాటలలో ఒకప్పుడు బాలనాగమ్మ కథ , కాంభోజరాజు కథ ,పాము పాట వినిపించేవి . ఇవి కొందరికే వచ్చినవి. అందరికీ వచ్చేవి రామాయణ ,భారతాలకు సంబంధించిన గాధలు.
70 , 80 దశకాల్లో కుటుంబనియంత్రణ పాటలను కూడా విన్నాను. ఈ పాటలను ఎవరో ఒకరు చెప్తుంటే మిగిలిన వారు అనుకరిస్తూ ,ఉయ్యాలో ఉయ్యాలో అనేదాన్ని ఆ పదానికి జోడించి , గుండ్రంగా తిరుగుతూ ,చప్పట్లు కొడుతూ చేతులను ఓ ప్రత్యేక పద్ధతిలో కదిలిస్తూ ఆడతారు. తరచుగా ఉయ్యాలో అన్నా ,చందమామా ,వలలో, కోల్ కోల్ అనేవి చేరి ,పాడేవారికి,ఆడే వారికి ఒకేసారి ఉత్సాహం కలిగిస్తాయి.
ఏ ఊరో గుర్తు లేదు కానీ చిన్నప్పడు రంజాన్ పండుగ గురించిన పాటలను కూడా విన్నాను. డప్పు వాయిద్యమ్ , చప్పట్లు ఈ పాటలకు చక్కని ఊపు నిస్తాయి. ఇవి తేలికైన పదాలతో ,చక్కటి లయతో మంచి సాహిత్యపు విలువలతో సాగుతాయి . పల్లె ప్రజల ఆశలు ,అనురాగాలు ,కష్ట సుఖాలు అభిమానాలు,ఆప్యాయతలు ,ఆకాంక్షలు వీటికి ముడిసరుకులు. అంత్య ప్రాసలు పె ట్టని సొమ్ములు.
జానపద సంగీతంలో చాలా భాగం పాటలు కర్త తెలీకుండా ప్రాచుర్యం పొందినవే . అలా వలయాకా రంలో తిరుగుతూ ,వచ్చిన పాటలకు మరిన్ని చరణాలను ఆశువుగా చేర్చి నిత్య నూతనంగా మార్చేస్తారు . ఈ పాటలకు కథలెక్కడివి ? అని అడగొద్దు . మన నిత్య జీవితంలో ని కలలు ,,కోరికలు , ఊహలు ,ఆశలు ,ఆకాంక్షలు ,పోరాటాలు ,అనుభూతులు ,అన్నీ జత కలుస్తాయి . ఒకటేమిటి అన్నీ ఇందులోకి సులువుగా దూరిపోతాయి ,ఇలా ఆడుతుంటే దారిన పోయే వాళ్ళు కూడా ఓ రెండు చుట్లు తిరిగి వెళ్దాం అనుకునేలా చేస్తాయి .
ఒకనాడు జనాలు ప్రకృతితో ఎంతగా మమేకం అయి జీవించారో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఎక్కడుంది ?
అసలు బతుకమ్మ వేడుకలను దగ్గరగా గమనిస్తే , ఇవి ప్రాంతీయత హద్దులు దాటి , భారతీయ విలువలకు సంకేతంగా కనిపించడం లేదూ . పండుగలు కేలండర్ గడుల్లో పదాలుగా , సెలవు రోజులకు చిరునామాగా కాక మన జన జీవితాల్లో ఎంతగా చొచ్చుకుపోయాయో చెప్పడానికి బతుకమ్మ పండుగ వక్కటి చాలు .