అంగట్లో జిగేలున మెరిసే
పసిడి ఆభరణాల జిలుగులు…
పొరుగింటి మీనాక్షి మెడలో
మెరిసే నగలు…
జింగిల్ రంగుల్ జల్లుతుంటే
అస్సలు ఆగలేకపోయా చూస్తూ!
అంగడి వైపు పడుతున్న
అడుగులను ఆపాయి…
పికాసో కళ్ళ ప్రేయసిలా…
దీనంగా చూస్తున్న ఆమె కళ్ళు…
మసకబారిన ఆమె కళ్ళ కాంతి…
విప్పిచెప్తోంది చెప్పుకోలేని
ఆమె వేదనను!
నేలబారున నడిచే నా కోరికను…
తారుమారు చేసింది
ఆమె దైన్యం…
తోచిన సాయం చేయమంటూ…
హితబోధ చేసింది హృది!
అదే గుడిగంటలా వినిపించింది…
విరిసింది మదిలోని ప్రబోధ మందారం…
మనసు మూలల నిదురించిన
మానవతను మేల్కొలిపే ఆధారమై…
ఆమె నిరుపేద జీవితానికి
ఆలంబనగా నిలవమంటూ…
అంతరాత్మ అర్థించింది!
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదని తెలిపింది!
ఆమెకు చేసిన చిరుసాయంతో…
కిట్టీలో కొట్టేసి సొమ్ములు
చేయించుకున్నా
కలగని సంతోషం…
దక్కని సంతృప్తి నాలో!