గతమంతా తలచి తలచి బావురు మన్నది చెట్టు!
గుతుకుల ప్రయాణమైనా…
గగనాన సూర్యుడు మండి పడినా..
నడచీ-నడచీ- రొప్పు కలిగినా, కాసింత సేపు సేదదీరే.. ఏ బాటసారీ నా చేరువ చేరడమే లేదు!
పిల్లల ఆటపాటలన్నీ నా ఒడిలోనే- ఒకప్పుడు…
ప్రేయసీ ప్రేమికుల ఊసులన్నీ
నా నీడలోనే ఎప్పుడూ…
ముదిమి ముసిరినవేళ కసురులే లేని నా కాండమే వారికండై…
గతకాలపు వైభవమంతా ఏకరువు పెట్టే దంతా నా యెదలోనే…
ఏ నాడూ ఒకరి ముచ్చటలొకరికి చెప్పనే లేదు! ఐతేనేం?
ఇపుడెవరూ ఈ ఛాయల రావడానికిష్టపడడమే లేదు!
ఆ మనసుల భారం దింపుకుని వారెళ్ళి పోతే…
ఆ భారమంతా దాచి ఉంచానిన్నాళ్ళూ
నా గుబురులో…
గుట్టు విప్పమంటోంది శిశిరం!
బాటసారులు నచ్చాలనీ,
రంగులెన్నో మార్చాను!
డబ్బు గడించి ఆకుపచ్చగా,
పనులు సక్రమంగా సాగాలని ఎఱుపుగా, ఆనందాల పూలెన్నో పూసాను,
శ్రేయస్సనే పండ్లెన్నో కాసాను,
చేతుల జవ ఉడిగి ఎండి, మరో రంగు సంతరించుకున్నాను!
ఐనా! గుర్తింపేలేని చెట్టును!
విసిగి వేసారి పోయి, గతమెంతో ఘనమనే పాట మొదలెట్టాను!
ఒక్కో బాటసారికీ రాల్చానెన్నో
ముచ్చట్ల పత్రాలు!
భుజాలు కుంగిన ఇంటి పెద్దగా..
చింత జార్చి, మోడై నిలిచాను!
వసంతమొస్తేనే… వసివాడని చెట్టౌతాను! మరుజన్మకే…
పచ్చనూహల పునర్దర్శనమిస్తాను!
రంగరాజు పద్మజ.